Sunday, September 15, 2024

ఆంధ్రమహాభారతం – తృతీయాశ్వాసం – దేవయాని యయాతి ఘట్టం

జలధి విలోల వీచి విలసత్కల కాంచి సమంచితావనీ

తల వహనక్షమం బయిన దక్షిణ హస్తమునం తదున్నమ

ద్గళదురు ఘర్మవారి కణకమ్ర కరాబ్జము వట్టి నూతిలో

వెలువడ కోమలిం తిగిచె విశ్రుతకీర్తి యయాతి ప్రీతితోన్”

నన్నయ భట్టారకుడు

మృగయావినోదియై యయాతి మహారాజు, అరణ్యమంతా కలయతిరిగి, ఎక్కుపెట్టిన వింటితో, అలసటతో, ఒక నూతిగట్టుకు చేరుకుంటాడు. అక్కడే కొంతసేపు విశ్రమించి, దప్పిక తీర్చుకోవడానికై నూతిలోకి తొంగి చూస్తాడు.

Also read: మహాభారతం – తృతీయాశ్వాసం – నూతిలో పడిన దేవయానిని యయాతి పైకి తీసే ఘట్టం

ఆ నూతిలోనే, సఖీజనమంతా  తనను నిర్దాక్షిణ్యంగా వీడి పోగా,  చేసేదేమీ లేక, తనకు కట్టకడపటి ఆధారమై, నిజమైన ఇష్టసఖి వలె మిగిలిన ఒకేవొక పూతీగను పట్టుకొని వ్రేలాడుతూ, ఘనమైన తన కుచద్వయంపై క్రమం తప్పకుండా కన్నీరు కారుస్తున్న దాన్ని, తన  సమీపానికి ఎవరో ఒకరు వచ్చి రక్షించాలని కోరుతున్న దాన్ని,

నిజనాథునిపై మిక్కిలి కోపించి, అతని జలస్థావరాన్ని వీడి, భూస్థావరానికి రావడానికి ఉద్యుక్తమైన వరుణదేవుని దేవేరివంటి దాన్ని, దేవయానిని, యయాతి చూస్తాడు.

చూచి, ఆశ్చర్యంతో, “నీవెవ్వరి దానవు? ఒక్కతెవే, ఏ కారణం చేత ఈ విపినాంతర కూపంలో పడి  యున్నదానవు?” అంటూ   ప్రశ్నిస్తాడు యయాతి.

Also read: మహాభారతం – తృతీయాశ్వాసం – వ్యాసుని జననం

ఒక సందర్భంలో వేటకోసం వచ్చిన యయాతిని ముందెప్పుడో చూచియే యున్నది కనుక, ఆయన్ను గుర్తించిన దేవయాని ఇట్లా తనను తాను పరిచయం చేసుకుంటుంది:

అమర సన్నిభ యేను ఘోర సు

రాసురాహవ భూమి న

య్యమర వీరులచేత మర్దితు

లైన దానవులన్ గత

భ్రములుగా తన విద్యపెంపున

ప్రాప్తజీవుల చేసి య

త్యమిత శక్తి మెయిన్ వెలింగిన

యట్టి భార్గవు కూతురన్!”

“దైవసమానుడవైన మహారాజా!  ఘోరమైన సురాసుర యుద్ధరంగంలో అమరవీరులచే చంపబడిన దానవుల భ్రమను పోగొట్టి తన సంజీవినీ విద్యచే  పునురు జ్జీవింపజేసి, అత్యమిత శక్తితో వెలుగొందిన శుక్రాచార్యుని కుమార్తెను!”

“నా పేరు దేవయాని. ప్రమాదవశాత్తు ఈ నూతిలో పడి బయిటకు రాలేకుండా వున్నాను. నన్ను ఉద్ధరించి రక్షించు!”

ఆ మాటలు విన్న యయాతి  విప్రకన్య పట్ల మిక్కిలి “దయాళువై”,

(నేటి పద్యంతో అనుబంధం)

“వడ్డాణానికి అమర్చిన మువ్వల శబ్దాల వలె  ఘోషిస్తున్న తరంగాలతో, సముద్రమనే  వడ్డాణమును ధరించిన భూదేవినే అవలీలగా పైకి తీయగల యశో విరాజితుడైన యయాతి మహారాజు, బావిలోని నీరు వడ్డాణం వలె తన నడుము చుట్టూ అలుముకున్న దేవయానికి తన కుడిచేతిని ప్రీతితో అందించి, బావిలో ఆ విప్రకన్య నడుము చుట్టూ ఆవరించిన నీటి కెరటాల సవ్వడులే నడుముకు బిగించిన వడ్డాణపు చిరిచిరు మువ్వల మధుర, మంజుల నాదాన్ని స్పురింప జేయగా, స్వేదబిందువులు తొనకే ఆమె కుడిచేతిని పట్టుకొని, తన దక్షిణహస్తంతో దేవయానిని నూతినుండి పైకి లాగినాడు”.

Also read: ఆంధ్రమహాభారతం – తృతీయాశ్వాసం – కచ దేవయాని ఘట్టం – శుక్రాచార్యుడు పునురుజ్జీవితుడు కావడం

నేటి పద్య ప్రాధాన్యత

నూతిలోకి తొంగి చూసిన యయాతి మహారాజు, ఆ నూతిలో దేవయానిని కనుగొన్నాడు. ఏ స్ధితిలో ఆమెను కనుగొన్నాడు?

శర్మిష్ఠ, ఆమెతో బాటు తోడునీడగా వున్న ఇష్టసఖులందరూ దిక్కులేని దానివలె వీడిపోగా, నూతిలో వ్రేలాడే పెద్ద లతయే తనపాలిటి పెద్దదిక్కుగా పట్టుకొని వ్రేలాడుతున్నది దేవయాని. ఆ తీగను రెండు చేతులతో గట్టిగా పట్టుకొని నీటిలో మునిగి పోకుండా తనను తాను కాపాడుకుంటున్నది. ఆపద్బాంధవులెవరైనా వచ్చి తనను కాపాడుతారేమో అని ఆందోళనతో నిరీక్షిస్తున్నది. దుఃఖంతో తన కుచద్వయంపై కన్నీరు కారుస్తూనే ఉన్నది. స్థూలంగా వాగనుశాసనుని పద్యభావమిది.

లోనారయ వలసిన భావం:

శర్మిష్ఠ, తదితర కన్యలందరూ తమతమ వస్త్రాలు ధరించి పోయిన తర్వాత, శర్మిష్ఠ కట్టుబట్టలు తప్ప దేవయానికి కట్టుబట్టయే లేదు. శర్మిష్ఠ అంబరాలు ధరించడానికి నిరాకరించిన దేవయాని కేవలం లోదుస్తులతో వుండగా, అట్టి దుస్థితిలో, శర్మిష్దే దేవయానిని నూతిలో త్రోసిపోయింది. అక్కడే దిక్కులేక, దేవయాని కూపంలో పడి వున్నది.

ఆ నూతిలో నీరున్నది. నీటిలో దేవయాని నడుము వరకు మునిగి వుంది. ఇంకా మునిగి పోకుండా, రెండు చేతులతో, బలిష్టమైన పెద్ద తీగను పట్టుకొని వ్రేలాడుతున్నది.  నీటిలో సగం మునిగి వున్నప్పుడు దేవయాని శరీరం తేలికై, పట్టుకున్న తీగపై బరువు అట్టే సోకడం లేదు.

దేవయాని కారుస్తున్న కన్నీరు బొట్టు బొట్టుగా ఆమె కుచ ద్వయంపై పడుతున్నది. ఒక యువతి నూతిలో పడి రెండు చేతులతో ఒక తీగను గట్టిగా పట్టుకొని వ్రేలాడుతున్నప్పుడు,  ఆమె వక్షస్థలం సైతం ముందుకు చొచ్చుకొని వస్తుంది. అప్పుడా యువతి కార్చిన కన్నీరు ముందుకు చొచ్చుకొని వచ్చిన చనుగుబ్బలపై తొనకడం అత్యంత సహజంగా జరిగేదే. దేవయాని ధరించిన దుస్తుల గూర్చి వాచ్యంగా చెప్పడం నన్నయ భట్టారకుని తత్వం కాదు. కేవలం పొంగిన దేవయాని అశ్రుధార ఆమె వక్షోజాలపై ధారగా పడుతున్నదని మాత్రమే కుదించి చెప్పడం ద్వారా తదితర వివరాలను ఆదికవి పాఠకులచే ఊహింప జేస్తున్నాడు.

మరొక్క విషయం. తన దక్షిణహస్తంతో దేవయాని చేతిని పట్టుకొని పైకి లాగుతున్నాడు యయాతి. అట్లా లాగుతున్నప్పుడు ఆమె చేతిలో స్వేదబిందువులు ప్రభవించి యయాతి కుడిచేతిని సోకుతున్నాయి.

Also read: ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం- ఉపసంహారం

దేవయాని చేతిలో చెమట పోస్తున్న కారణమేమిటి? కొందరు విమర్శకులు దీనిపై ఇట్లా వ్యాఖ్యానిస్తున్నారు:

“ఈ పద్యము నందలి యయాతి దేవయానుల హస్తములకు గల విశేషణములను బట్టియు, పరస్పరపాణి సంసర్గము వలన వారిరువురి యందు ఉద్బుద్ధమైన రతి వ్యక్తమగుచున్నది. “జలధి…క్షమము” అను యయాతి హస్త విశేషణము లను బట్టి పైకి లాగినప్పుడామె దానిని భావించు వైఖరి యిదియని చెప్పనొప్పును. ఇట్లది దేవయాని రతికి ఉద్దీపకము “తదున్న మద్గళదురు ఘర్మవారి కణకమ్ర కరాబ్జము” అను దేవయానీ హస్తవిశేషణము వలన ఆమెకు కలిగిన స్వేదోద్బవమను సాత్వికభావము చెప్పబడినది”

ఇక్కడ ఒక విషయం ఆలోచించవలసి యున్నది. దేవయాని గడుసరి కావచ్చును. కానీ, అందరు సాంప్రదాయకన్యల వలెనే దేవయాని సైతం, మానమే ఆభరణంగా గల లజ్జా సుకుమారమూర్తి. దిక్కులేక నూతిలో పడి వున్న కన్యామణి. దీనస్థితిలో నూతిలో పడి యున్న తాను, తన చేతిని పరపురుషునికి అందించడం, అతడా చేతిని పట్టుకొని, తనను పైకి లాగడం, దేవయాని వంటి కన్యకు అంతులేని లజ్జ కలిగడానికి, ఆమె అరచేతిలో స్వేదబిందువులు ఉద్బవించడానికి కారణం.

మనస్సు ఉద్రిక్తత చెందిన ప్రతివారికీ నొసటిపైనా, అరచేతిలోనూ చెమట పోయడం సాధారణం. అపరిచితునికి, అందునా, సాక్షాత్తూ ఒక మహారాజుకు తన చేతినందించిన కన్యకామణికి, ఆ అరచేతిలో చెమట పొయ్యడం సహజం. దీన్ని రతి పారవశ్యంగా భావింపడం తగదు.  

రెండవవిషయం. దేవయాని విఫలప్రేమికురాలు. తనను తిరస్కరించిన కచుణ్ణి ఉన్నపళంగా విస్మరించి, మరొక అపరిచిత పురుషుని ప్రేమలో ఆ యువతి పడుతున్నదని  చెప్పడానికి వీలు కలగదు.

మూడవ విషయం. శర్మిష్ఠ  దేవయానిని అవమానపరచి నూతిలో త్రోసి వెళ్ళిపోయింది. ఈ కారణంగా శర్మిష్ఠపై దేవయానికి  ప్రతీకారవాంఛ రగులుతున్నది. ఆ స్ధితిలో యయాతి ఆమెను నూతిలో కనుగొన్నాడు. నూతినుండి వెలుపలికి రాగానే దేవయాని ప్రతీకారంతో చేసిన మొట్టమొదటి పని, ఈ సమస్యను తండ్రి శుక్రుని దృష్టికి,  శర్మిష్ఠ తండ్రి వృషపర్వ మహారాజు దగ్గిరికి తీసుకొని వెళ్ళి వారిపై ఒత్తిడి పెట్టి శర్మిష్ఠను తన దాసిగా చేసుకోవడం.

ఇట్లా, అపరిచితునికి చేతినందించే లజ్జతో బాటు, శర్మిష్ఠపై ప్రతీకారవాంఛ పెల్లబుకుతున్న దేవయాని మనోవికారంలో “రతినిర్వేదం” ఊహించడం సరికాదు. ఇతర మనోవికారాలు లేని ప్రశాంత మానసిక స్థితిలోనే శృంగార భావనలు పొడసూపడం సామాన్యం.  ఇతర మనోవికారాలతో సతమతమౌతున్న కాంత మనస్సులో రతినిర్వేదానికి తావెక్కడ?

ఈ పరిణామాన్ని ఆదికవి నన్నయ అత్యంత సున్నితంగా మనకు తెలుపుతున్నాడు. యయాతి రాజ్యాధినేత. దేశపౌరులందరూ అతని బిడ్డలు. ఆపదలో చిక్కుకున్న ఒక అబల అటవీస్థలిలో అతనికి కానవచ్చింది. ముందూ వెనకా చూడకుండా ఆ దీనురాలిని రక్షించడానికి అతడు పూనుకున్నాడు. ఉదాహరణకు ఈ సందర్బంలో ఆదికవి వాడిన పదాలు గమనించండి:

వ. “దేవయాని అనుదాన. ప్రమాదవశంబున ఇన్నూతం బడి వెలువడ నేరకున్నాను. నన్నుద్ధరించి రక్షింపు” మనిన అవ్విప్ర కన్య యందు దద్దయు దయాళుండై” (యయాతి).

ఇక యయాతి దేవయానిని చేయి పట్టి పైకి  లాగు తున్నప్పుడు ఆదికవి పదప్రయోగం గమనించండి: “కోమలిం తిగిచె విశ్రుత కీర్తి యయాతి ప్రీతితోన్”.

ఇక్కడ “ప్రీతితోన్” అనగా ధీరోదాత్తుడైన దేశపాలకుడు సామాన్య పౌరురాలిపై చూపించే వాత్సల్యం. దీన్ని ప్రణయభావనగా ఊహించలేము.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – పరీక్షిత్తు దుర్మరణం చెందడానికి నేపధ్యం

దేవయానికి యయాతిని వివాహమాడాలనే తలంపు ఉత్తరోత్తరా కలిగినది. ఇట్లా కలగడానికి కారణాన్ని మరో ఘట్టంలో చూడగలము. ఈ ఘట్టంలో దేవయాని యయాతిని “మహారాజా! నన్నీ నూతినుండి ఉద్ధరించు!” అని వేడుకొంటుంది. “ఉద్ధరించు” అనగా “నన్నీ నూతినుండి పైకి తియ్యి” అనే సామాన్యార్థం వున్నది. “రాజా! నా దీనస్థితి నుండి కాపాడు” అన్నది గంభీరార్థం. నన్ను “వివాహమాడి ఉద్ధరించు” అన్నది మరో అర్థం. దేవయాని ఉన్న పరిస్థితిలో మొదటి రెండు అర్థాలు పొసగుతాయి.

ఏది ఏమైనా, యయాతి తనను రక్షించడం, నూతినుండి పైకి లాగుతున్నప్పుడు అతని హస్తస్పర్శ తనకు సోకడం, కచుని శాపానుసారం పాణిగ్రహణానికి క్షత్రియుడే తప్ప తనకు వేరే దిక్కు లేకపోవడం, ఈ అంశాలన్నీ దేవయానిపై ఉత్తరోత్తరా ప్రభావం చూపడంలో ఆశ్చర్యం లేదు. ఆ ఉదంతాన్ని నేటి ఘట్టంలో ముడిపెట్టడం సమంజసం కాదు.

నేటి పద్యంలో “జలధి విలోల వీచి విలసత్ కలకాంచి సమంచితావనీ” అనే మనోహర సమాసం సూచిస్తున్నదేమిటి?

నూతిలో దేవయాని నడుము దాకా నీటిలో మునిగి వుంది.  ఆమె నడుమును చుట్టుకొని వున్న నీరు దేవయాని నడుముకు అమర్చిన వడ్డాణం వలె ఉన్నది.  యయాతి దేవయానిని పైకి లాగు తున్నప్పుడు, నీటి నుండి వెలువడుతున్న జలతరంగ ధ్వని, దేవయాని నడుముకు అమరిన నీరనే వడ్డాణం నుండి వెలువడే మువ్వల సవ్వడి వలె ఉన్నది.

దేవయానిని జలకాంత వలె (mermaid) ఆదికవి భావిస్తున్నాడు. దేవయాని కేవలం మామూలు జలకాంత కాదు. ఆమె సాక్షాత్తూ నీటికే అధిపతి యైన వరుణదేవుని పత్ని. కానీ ఇప్పుడామె తన నాథుడైన వరుణదేవుణ్ణి వీడిరావాలని కోరుకుంటున్నది. ఇక్కడ వరుణదేవుడు “కచునికి” ప్రతీక. తనను తిరస్కరించి పోయిన కచునితో తన ప్రేమకు కాలం చెల్లిపోయింది.  తానిక గతాన్ని ప్రక్కకు నెట్టి భవిష్యత్తు గూర్చి ఆలోచించక తప్పదు.

దేవయాని పడిపోయిన నూయి అనే అగాధం, కచుని తిరస్కరణచే ఆ విప్రకన్య మానసికంగా అనుభవిస్తున్న అధోగతికి  (mental depression) ప్రతీక. జ్యోతిష్య శాస్త్రంలో నీరు (జలరాశి) విప్రులకు చిహ్నం. వరుణదేవుడు (నీటి అధిపతి) విప్రుడైన కచునికి చిహ్నం. కచుని శాపంచే దేవయానికి విప్రునితో పెళ్ళి జరగడం అసంభవం. అందుచే, నీటి నుండి భుమిపైకి బయటకు రమ్మని విధియే శుక్రతనయను నిర్దేశిస్తున్నది. ఇట్టి మానసిక స్ధితిలో  దీనరక్షకుడు, క్షత్రియ కులోద్భవుడు, భూపాలకుడు యయాతియే ఆమె చేయి పట్టుకొని నూతి నుండి లాగడం కూడా విధి నిర్దేశమే. ఈ విధి వ్రాత నెరవేరడానికి సమయం పడుతుంది. మరొక్కసారి యయాతి ఇదే అరణ్యంలో ఆమె ముందు సాక్షాత్కరించనున్నాడు. నేటి ఘట్టం కేవలం రాబోయే ఆ సంఘటనకు నాంది (prelude) మాత్రమే. తొందరపడి నేటి ఘట్టంలోనే దేవయాని “రతి నిర్వేదాన్ని” ఊహించడం పొసగదు.

ఇదే దేవయాని భూదేవి యైతే?

దేవయాని నడుమును ఆవరించినది ఒక కూపమైతే, భూదేవిని ఒక పెద్ద సముద్రమే సదా ఆవరించి వుంటుంది. దేవయానిని భూదేవిగా, ఆమె పడిన కూపాన్ని భూదేవిని ఆవరించిన సముద్రంగా నన్నయ భట్టారకుడు భావిస్తున్నాడు. అందుచేతనే, నూతి నుండి యయాతి దేవయానిని పైకి లాగుతు న్నప్పుడు వెలువడే చిన్ని చిన్ని అలల శబ్దమే, సముద్రం నుండి భూదేవిని పైకి లాగు తున్నప్పుడు వెలువడే  మహాతరంగ ఘోషగా వాగనుశాసనుడు వర్ఢిస్తున్నాడు.

దేశపాలకుడు భూభర్తగా వ్యవహరించ బడతాడు. యయాతి మహారాజు భూనాధుడు. భూమాతనే తన దక్షిణహస్తంతో సముద్రం నుండి పైకి లాగగల యయాతికి, చిన్ని నూతిలో పడిన దేవయానిని కుడిచేతితో పైకిలాగి ఆమె మానాన్ని, ప్రాణాన్ని, కాపాడడమొక లెక్కా?

ఈ పద్యంలోని అక్షరరమ్యతను మాటల్లో వర్ణించడం అసాధ్యం. యయాతి ఒక గొప్ప నృపాలుడు. ఒక నృపాలుడు ఠీవిగా వెడలినట్లే ఈ పద్యంలోని నడక కూడా ఠీవిగా నడుస్తుంది.

వృత్యనుప్రాసా శోభితమైన ఈ పద్యాన్ని పఠించినప్పుడు వెలువడే మధుర, మంజుల ధ్వని, దేవయానిని చేయి పట్టి పైకి లాగే టప్పుడు, నూతిలోని నీరనే వడ్డాణపు చిరుచిరు మువ్వలు చేసే శబ్దానికి సంకేతమని అనుకున్నాం.

దేవయానిని నూతినుండి పైకి లాగుతున్నప్పుడు,

సర్వాలంకార భూషితుడైన యయాతి చక్రవర్తి దేహాన గల స్వర్ఢాభరణాల నుండి కమనీయ శబ్దాలు వెలువడతాయి. నేటి పద్యం చదువుతున్నప్పుడు వెలువడే మధుర, మంజుల, నాదాలు, యయాతి స్వర్ఢాభరణాల నుండి వెలువడిన కమనీయ శబ్దాలకు సైతం సంకేతం.

Also read: మహాభారతం – ఆదిపర్వం: ద్వితీయాశ్వాసం – వాసుకి తల్లి శాపానికి వెరచుట

నేటి పద్యంలోని మనోహరాక్షరాలు చేసే రసమయధ్వనులను, ఒక వంక నూతిలోని జలతరంగాలు చేసే మధురమైన నాదానికి, మరొక వంక యయాతి ఆభరణాల కమనీయ ఘోషకు సైతం అన్వయించుకోగల్గడం ఈ పద్యంలోని ప్రత్యేకత.  కారణం? జలతరంగాల ఘోష నీరనే ఆభరణం నుండి వెలువడడమొక అలంకారం.యయాతి దేవ యానిని చేయి పట్టి పైకి లాగుతున్నప్పుడు  యయాతి ఆభరణాలు చేసే మంజుల నాదంగా భావించడం మరొక అలంకారం. రెండూ ఆభరణాలే. మొదటివి జలకాంత యైన దేవయానికి గల సహజ జలాభరణాలు. రెండోవి రాజ్యపాలకుడు కృత్రిమంగా చేయించుకున్న స్వర్ణాభరణాలు.

దేవయాని నీటి వడ్డాణపు ధ్వనులు నన్నయ స్వయంగా చెబుతున్నది. యయాతి ఆభరణాల ధ్వనులు, పాఠకుడే స్వయంగా ఊహించవలసినది.

నూతిలోని దేవయాని దుస్థితిని వర్ణించే సీసపద్యం ఈ పద్యానికి ముందరిది. ఆ పద్యాన్ని పఠించినప్పుడు దేవయాని మనోహరమైన రూపురేఖలు, ఆమె దుఃఖం, పఠిత కట్టెదుట సాక్షాత్కరమై కాలం స్తంభించి పోతుంది. నేటి చంపకమాలావృత్తం పై పద్యానికి భిన్నం. ఇది చదువుతున్నప్పుడు దానిలో గల సమాసకల్పన, దానిలో గల action scene, కాలం వేగంగా పరుగులు తీసినట్లు మనస్సుకు స్ఫురింపజేస్తాయి. మొదటి పద్యం ప్రధానంగా దేశీయ పదగుంఫితం. రెండవది ముఖ్యంగా తత్సమ శబ్దమయం.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles