Saturday, April 20, 2024

ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం- ఉపసంహారం

ఒనర జరత్కారు మునీం

ద్రునకు జరత్కారునకు సుతుండైన మహా

మునివరు నాస్తీకుని ముద

మున తలచిన నురగభయము పొందదు జనులన్

మఱియు నయ్యాస్తీకు చరితంబు విన్నవారికి సర్పపాప క్షయంబగు

నన్నయ భట్టారకుడు

నన్నయభట్ట ప్రణీతమైన ఆంధ్రమహాభారతంలో, పౌష్యోదంక మాహత్త్యం, భృగువంశకీర్తనం, ఆదిపర్వంలో  ప్రథమా శ్వాసంలో గల ఘట్టాలు.  ఇక ఆదిపర్వం ద్వితీయాశ్వాసంలో గల ఘట్టాలివి: నాగ, గరుడోత్పత్తి,  సముద్రమథనం, అమృతోద్భవం, దేవదానవ యుద్ధం, గారుడోపాఖ్యానం, పరీక్షిత్తు దుర్మరణం, జనమేజయుని సర్పయాగం, ఆస్తీకుని చరితం, సర్పయాగనివారణ.

Also read: భారతీయ సాహిత్యంలో ప్రశ్న-జవాబు ప్రక్రియ వైశిష్ట్యం

వీటిల్లో, దేవదానవ యద్ధం, అనూరుని వృత్తాంతం, గారుడోపాఖ్యానం, ఆదిశేషుడు భూభారం వహించే సందర్భం తప్ప మిగిలినవన్నీ జనమేజయుని సర్పయాగంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, సంబంధం వున్నవే.

చరిత్ర క్రమంలో మొట్టమొదటి ఘట్టం భృగుమహర్షి అగ్నిని “సర్వభక్షకుడవు కమ్మ”ని శపించడం. చెకుముకి రాళ్లతో నిప్పు పుట్టించే ఆదిమమానవుడు, రానురాను,  అగ్నిపైనే ప్రధానంగా ఆధారపడి తన నాగరకతను నిర్మించుకోవడాన్ని ఈ  శాపవృత్తాంతం ప్రతీకాత్మకంగా స్ఫురింప జేస్తుంది. హవ్యవాహనుడు ఎంత పూజనీయుడో, అంతటి సర్వభక్షకుడు కూడా కావడం ఈ శాపం యొక్క పరిణామం. ఈ సర్వభక్షకలక్షణం లేనిది సర్పయాగం సంభవం కానేరదు.

కశ్యపప్రజాపతి బ్రహ్మజ్ఞాని. దక్ష ప్రజాపతికి గల యాభై మంది కుమార్తెల్లో పదమూడు మందిని కశ్యపప్రజాపతి వివాహం చేసుకుంటాడు. వారిలో కద్రూ, వినతలు కూడా వున్నారు.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – పరీక్షిత్తు దుర్మరణం చెందడానికి నేపధ్యం

కద్రువ దురాశ గలది. వినతది సంతృప్త మనస్తత్వం. కశ్యపుణ్ణి కద్రూవినతలు కలిసి వేలాది యేండ్లు సేవింపగా, ప్రసన్నుడైన కశ్యపప్రజాపతి  “కోరిన వరాలిస్తాను కోరుకొండి” అని ఇద్దరితో అన్నాడు. వీర్యవంతులైన వేయిమంది కొడుకులను కద్రువ కోరుకున్నది. ” ధీరతనయులు ఇద్దరు కావాలని” వినత కోరుకున్నది.

అనల తేజులు, దీర్ఘదేహులు

నైన యట్టి తనూజులన్

విమల సత్త్వుల కోరె  కద్రువ వేవురం కడు కోర్కెతో;

వినత కోరె సుపుత్రులన్ భుజ

వీర్యవంతుల, వారికం

టెను బలాధికు లైన వారి క

డింది వీరుల నిద్దరన్”

వేయి మంది సర్ప కుమారులను పుత్రులుగా  పొందడం వల్ల, మాతృక్లేశం మినహా, కద్రువ సాధించిందేమీ లేదు. తల్లి మాట జవదాటినందుకు కోపంతో, జనమేజయుని సర్పయాగపు హోమాగ్నిలో పడి మృతి చెందమని  స్వయానా  తన కన్నబిడ్ఠలనే కద్రువ శపిస్తుంది. ఆమె అట్లా శపించకపోతే, హోమాగ్నిలో పడి వేలాదిమంది సర్పరాజులు దగ్ధమై నశించిపోయే అవకాశమే లేదు.

Also read: మహాభారతం – ఆదిపర్వం: ద్వితీయాశ్వాసం – వాసుకి తల్లి శాపానికి వెరచుట

సర్పయాగానికి మరొక కారణం పరీక్షిత్తు దుర్మరణం. అతడు దుర్మరణం చెందడానికి  అతని మృగయావినోదమే కారణం. ఈ మృగయావినోదం ప్రపితామహుడైన పాండురాజు నుండి పరీక్షిత్తుకు అబ్బిన వ్యసనం. తాను ఉబలాటంతో వేటాడుతున్న జింక తననుండి తప్పించుకొని కనపడకుండా పోవడంతో కలిగిన విసుగును, కోపాన్ని, పరీక్షిత్తు, మౌనంగా తపస్సు చేసుకుంటున్న శమీకునిపై ప్రదర్శించడంతో, శృంగి శాపానికి పరీక్షిత్తు గురి కావలసి వస్తుంది.

శాపం – కర్మఫలం

సనాతన భారతీయ తాత్విక దృక్పథంలో కర్మసిద్ధాంతమొక ప్రధానాంశం. ఒకరు మరొకరిని శపించడం కేవలం జరగబోయే కర్మఫలాన్ని సూచించడమే.

కద్రువ వేయిమంది కొడుకలను కోరుకోవడం దురాశ. భూమాతకు భారం. బ్రహ్మదేవుడే ఈ విషయం దేవతలకు చెప్పినట్లుగా సర్పకుమారుడైన ఏలాపుత్రుడు సర్పసోదరులకు వివరిస్తాడు.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం

బ్రహ్మ, దేవతలతో ఏమని అన్నాడో చూడండి:

క్రూరాకారుల జగదప

కారుల, పన్నగుల దాల్పగా నోపని యి

ద్ధారుణికి హితంబుగ దు

ష్టోరుగ సంహార మిప్పు డొడబడ వలసెన్!”

“క్రూరరూపులు, జగదప కారులైన పన్నగకోటిని భరించలేని భూతలం యొక్క హితం కోరి దుష్ట భుజంగ వినాశనానికి అంగీకరింపవలసి వచ్చింది”

కొన్ని వందల యేండ్ల క్రిందట మాల్థస్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించిన ఆర్థికసూత్రాలు మాల్థూసియన్ థియరీ ఆఫ్ పాపులేషన్ అనే పేరుతో ప్రఖ్యాత గొని ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసినవి. “లోకంలో తిండిగింజల ఉత్పత్తి “అరిథ్ మెటిక్” నిష్పత్తిలో (అనగా ఒకటి రెండుగా, రెండు మూడుగా; మూడు నాలుగుగా) విస్తరిస్తున్నదని, అందుకు విరుద్దంగా జనాభా  జ్యామెట్రిక్ నిష్పత్తిలో (అనగా, ఒకటి రెండుగా, రెండు నాలుగుగా, నాలుగు ఎనిమిదిగా) పెంపు వహిస్తున్న”దనీ, మాల్థస్ సిద్ధాంతం. “తద్వారా, రానురాను తిండిగింజల ఉత్పత్తికి, జనాభా పెరుగుదలకు నడుమ పూడ్చలేని వ్యత్యాసం పెరిగి తిండి గింజలకై ప్రజలు ఒకరితో ఒకరు పోరాడుతారనీ, ఈ సమస్యకు యుద్ధాలు, రోగాలు, కరువు కాటకాలు, తరచు సంబంధించి, జనాలు చచ్చిపోవడమే  తిండి గింజల కొరతకు పరిష్కార మార్గమౌతుంద”నీ  ఆయన సూచించినాడు.

 వ్యవసాయ శాస్త్రజ్ఞులు తమ పరిశోధనలచే ఆహారోత్పత్తిని సైతం జ్యామెట్రిక్ రేషియోలో   పెంచడానికి కృషి చెయడం ద్వారా ఆకలి చావులను నిరోధించ గలిగినప్పటికీ, ఈ సమస్యకు శాశ్వతపరిష్కారం  కష్టమనేది నిర్వివాదమైన సత్యం. రెండవ సమస్య, విస్తరిస్తున్న ఆహారోత్పత్తికి సరిపడా పంటనీరు అందించడం. ఇట్లా పొలాలకు నీరు అందించే విషయంలో సైతం పలుదేశాలు వైఫల్యం చెందుతున్నాయి. ఈ నేపధ్యంలో మాల్థస్ ప్రతిపాదించిన మౌలిక సమస్య  మానవాళికొక  సవాలుగానే మిగిలిపోతున్నది. రసాయనిక ఎరువులపై ఆధారపడి అధికమైన దిగుబడినిచ్చే  పంటపొలాల భూసారం క్రమక్రమంగా తరగిపోతుందనీ, అట్లే, చాలినంత జలధార దొరకక నీటి పోరాటాలు సర్వేసర్వత్రా జరిగి తీరుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవాళిని ఎడతెగక పట్టి పీడించే ఈ సమస్యనే మాల్థూసియన్ నైట్ మేర్ అని ఆర్థిక శాస్త్రం వ్యవహరిస్తున్నది.

భారతేతిహాసంలో, బ్రహ్మకే ఆందోళన కలిగిస్తూ అదుపుతప్పి పోయిన సర్పకోటి జనాభా,  అంతులేకుండా విస్తరిస్తూ భూతలం వనరులపై విపరీతమైన భారం మోపే మానవకోటి జనాభాకు సంకేతం.

సనాతన హైందవుల కర్మసిద్ధాంతం ఎటువంటిదో, దాదాపు అటువంటిదే క్రైస్తవ ధర్మావలంబకుల పాప (సిన్) సిద్ధాంతం కూడా. కర్మకు ప్రతిఫలం ఉన్నట్లే, చేసిన తప్పుకు కూడా క్రైస్తవ ధర్మంలో ప్రతిఫలం అనుభవింపవలసి వస్తుంది.

కొన్ని శతాబ్దాల క్రిందట యూరోప్ లో దుర్ఘటన ఒకటి జరిగింది. ఒకానొక దేశంలో ప్రయాణికులు భీకరమైన పర్వతశ్రేణుల గుండా పయనించవలసి వచ్చేది. రెండు పెద్ద కొండల నడుమ  త్రాళ్ళతో నిర్మించిన వంతెన వుండేది. ఒకరోజు వంతెన త్రాళ్ళు తెగిపోయి దానిపై ప్రయాణిస్తున్న వారందరూ దిగువగల అగాధంలో పడి దుర్మరణం చెందినారు. ఈ ఘటనను స్వయంగా వీక్షించిన ఒక క్రైస్తవపూజారికి గాఢక్లేశం కలిగింది. “ఇంతమంది మూకుమ్మడిగా దుర్మరణం చెందడానికి కారణ మేమై వుంటుంది?” అనే ఆలోచన అతనికి కలిగింది. ఈ అంశంపై  సంవత్సరాల తరబడి ఆ పూజారి పరిశోధన సాగింది. దుర్భరణం చెందిన వ్యక్తులందరి వివరాలనూ సేకరించి, వారందరి గ్రామాలకూ ఆయన స్వయంగా వెళ్ళి వారి జీవితగాథలను తెలుసుకొన్నాడు. పర్యవసానంగా ఆయన కనుగొన్నదేమంటే, ఈ వ్యక్తులందరూ తమ జీవితంలో “తప్పులు” చేసిన వారేననీ, ప్రతిఫలంగా ఈ ఘోరమైన చావు వారికి సంభవించిందనీ ఆయన సిద్ధాంతీకరించినాడు. ఆయన గ్రంధం పాశ్చాత్య దేశాల్లో కడు ప్రసిద్ది పొందింది. “కూలిన వంతెన” అనే మకుటంతో ఈ రచన తెలుగులోకి తర్జుమా పొంది దక్షిణభారత పుస్తకసంస్థ (ఫోర్డ్ ఫౌండేషన్) వారిచే దాదాపు అరవై ఏళ్ల క్రిందట ప్రచురింపబడింది.

టాల్ స్టాయ్ ప్రసిద్ధనవల “వార్ అండ్ పీస్”లో ఒక మృగయావినోద ఘట్టమున్నది. ఈ వేటకు వెళ్లిన యువకులందరూ రష్యన్ సైన్యంలో పనిచేసే వారే. ఉన్నత వంశాలకు చెందినవారు వీరందరూ. సెలవుల్లో ఇళ్లకు వచ్చి ఆనందిస్తున్నవారు. ఎన్నో పేజీలలో టాల్ స్టాయ్ వీరి మృగయావినోదాన్ని అద్బుతంగా వర్ణిస్తాడు. వీరు సెలవులో ఉన్న సమయంలోనే నెపోలియన్ రష్యాపై దండయాత్ర చేస్తాడు (1812). అప్పుడీ యువకులందరూ సెలవు మానుకొని యుద్ధరంగానికి వెళ్ళి నెపోలియన్ సైన్యం చేతులో మరణించడమో, వికలాంగులు కావడమో జరుగుతుంది.

టాల్ స్టాయ్ నవలలో సైన్యంలో పనిచేసే యువకులు నిస్సహాయమైన జంతువులను వేటాడినట్లే, నెపోలియన్ సైన్యం ఈ యువకులను యుద్ధంలో వేటాడుతుంది. పరీక్షిత్తు భీతహరిణాన్ని వేటాడినట్లే, మృత్యువు తక్షకుని రూపంలో పరీక్షిత్తును వేటాడి కాటువేసి చంపుతుంది.

హింస విషవలయం. జనమేజయునిలో స్వతస్సిద్ధమైన దయాగుణం ఉన్నది. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆవేశం అతనికి కల్పించిన వాడు ఉదంకమహాముని. ఒకవేళ ఆస్తీక మహాముని యాగప్రదేశానికి రాకపోతే అమానుషమైన సర్పయాగపు  జీవహింస అవిచ్ఛిన్నంగా సాగేదే.

మహాభారతం ఇతిహాసం. అశోకసార్వభౌముడు గౌతమబుద్ధుణ్ణి ప్రేరణగా భావించి వైరత్యాగం చేసి, చరితార్థత గడిస్తే, ఆస్తీకముని చొరవచే జనమేజయుడు మూగజీవాలకు ప్రాణభిక్ష పెట్టి కృతార్థత సంపాదించినాడు.

Also read: మహాభారతం ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – గరుత్మంతునికి తల్లి వినత ఆశీస్సులు

సాధువులపై, పేదవారిపై, హింసకు పాల్పడితే కారణంలేకుండానే ఆపదలు వస్తాయని సరమ అనే కుక్క జనమేజయునికి మహాభారతకథ ప్రారంభంలోనే ఉపదేశిస్తుంది:

తగునిది తగదది యని యెడ

వగవక సాధులకు పేదవారికి నెగ్ఖుల్

మొగిసేయు దుర్వినీతుల

బగి నుండగ వచ్చు ఘోర పాప బయంబుల్”

ఆదిపర్వం ప్రథమాశ్వాసంలో రురుని ఉదంతం ఉన్నది. తన ప్రేయసి ప్రమద్వర పాము కాటుచే మరణిస్తే, తన జీవితాన్ని అర్ధభాగం ధారపోసి ఆమెను బ్రతికించుకుంటాడు రురుడు. సర్పకోటిపై విపరీతమైన ద్వేషం ఏర్పడి కనపడ్డ ప్రతి సర్పాన్నీ కఱ్ఱతో మోది హింసించడం ప్రారంభిస్తాడు. ఒకరోజు తనదారిన తాను పోయే ఒక పాముపై కఱ్ఱనెత్తుతాడు. అప్పుడా పాము అతనితో అంటుంది:

ఏమి కారణమయ్య పాముల

కింత అల్గితి? వీవు తే

జోమయుండవు బ్రాహ్మ ణుండవు?

సువ్రతుండవు?”

దానికతని జవాబు:

పాములెగ్గొనరించె మత్త్ప్రియ

భామకుం ఏను రురుండ ను

ద్దామ సత్త్వుడ! నిన్ను నిప్పుడు

దండితాడుత జేసెదన్!”

అంతట ఆ సర్వం నుండి ఒక ముని ప్రత్యక్షమై, రురునికీ బోధ చేస్తాడు:

భూనుత కీర్తి! బ్రాహ్మణుడు పుట్టుడు తోడన పుట్టు నుత్తమ

జ్ఞానము, సర్వభూత హిత సంహిత బుద్ధియు, చిత్తశాంతియున్

మానహద ప్రహాణము, సమత్వము, సత్యవాక్యము, దృఢత్వముం, కరుణాపరత్వమున్!”

సర్పయాగానికి ముందు జనమేజయుడు ప్రతీకారవాంఛతో రగిలే సాధారణ క్షత్రియుడు. సర్పయాగం తర్వాత అదే జనమేజయుడు సర్వభూత హిత సంహిత బుద్ధిని, చిత్తశాంతిని, మానహదప్రమాణాన్ని, సమత్వాన్ని, సత్యవాక్యాన్ని, దృఢవ్రతాన్ని, కరుణా పరత్వాన్ని అలవర్చుకొన్న రాజర్షి యైనాడు. భారతసంహితకు శ్రోత కావడంచే జనమేజయుడు కీర్తి గడించినట్లే, జనమేజయుడు శ్రోత కావడంచే భారతసంహిత సైతం ధన్యత గడించింది.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – గరుత్మంతుని జననం

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles