Friday, October 4, 2024

మండోదరి విలాపము

రామాయణమ్ 214

రావణుని పట్టపురాణి మండోదరి భర్త మృతకళేబరము నేలపై పడియుండుట చూసి బిగ్గరగా రోదించుచూ, ‘‘ఏమయ్యా, సీతను కోరుకొంటివి. కానీ నీకీనాడు భూదేవీ ఆలింగనసౌఖ్యము సంప్రాప్తించెనే!

‘‘నిన్ను చూసి ఇంద్రుడు వణికిపోయెడివాడే! దిక్పాలకులు దిగులుతో పారి పోయెడి వారె! సకల ముని, దేవగణాలకు నీవు తలపుకు వచ్చిన చాలు ముచ్చెమటలు పట్టి తడిసిపోయెడివారే! ఎవరికీ కనిపించకుండా అదృశ్య రూపములో, నీకు నచ్చిన రూపములో సంచరించు శక్తులు గలవాడవే! నీవా, అటవీ సంచారి అయిన ఒక మానవమాత్రుని చేతిలో మరణించితివా? నమ్మశక్యముగాలేదే!

Also read: రావణుడి అంత్యక్రియలు చేయడానికి విభేషణుడికి రాముని అనుమతి

‘‘ఆతడెవరు?

‘‘జనస్థానములో ఒంటరిగా ఖరదూషణులను, పదునాల్గు వేలమంది సైనికులను ముప్పది నిముషముల వ్యవధిలో మట్టుపెట్టినవాడు. అతడు మామూలు మానవుడా?  కాడు కానేరడు.

‘‘ఆతని సేవకుడు ఒక కోతి! శత్రుదుర్భేద్యమైన లంకానగరిలో ప్రవేశించుటయే కాక నీ ఆధిపత్యమునకే సవాలు విసిరి లంకను తగులపెట్టిన నాడే అనుకొంటిని ఇది మామూలు కోతికాదని, దాని యజమాని సామాన్యమానవుడు కాడని!

‘‘నిలకడలేని కోతిమూకను ఒక్కతాటిపై నడిపించి మహాజలధిపై వారధి కట్టించిననాడే అనుకొంటిని ఆతడు సామాన్యమానవుడు కాడని!

‘‘ఎన్ని చెప్పినాను నేను నీకు? అన్నింటినీ పెడచెవిని పెట్టితివి కదయ్యా!

Also read: రావణ సంహారం, విభీషణుడి విలాపం

‘‘ఆ రాముడు పుణ్యగుణాభిరాముడు! త్రిజగద్రక్షైక  దీక్షాగురుడు! అతడు, సామాన్య క్షితినాధుడా?(మామూలు రాజకుమారుడా?) ఆయన సామర్ధ్యమేపాటిదో తెలియక ఆ జనకరాజసుత జానకీదేవిని బలాత్కారముగా తెచ్చినావుగదా  నేడా మైథిలి నీ మృత్యువాయెగదా నా ప్రాణనాధా! నిన్ను చంపినవాడు ఆ ఇంద్రుడు కాదు కదా! అయినా ఇంద్రునికి నిన్ను తేరిపార చూచు శక్తి ఎక్కడిది?

‘‘హా! తెలిసినది నాకు ఆ రాముడెవరో!

వ్యక్త మేష మహాయోగీ పరమాత్మా సనాతనః

అనాది మధ్యనిధనో మహతః పరమో మహాన్!

‘‘స్పష్టముగా తెలిసినది. ఆ రాముడు గొప్పయోగి. సనాతనుడు. ఆదిమధ్యాంతరహితుడు. మహత్తుకంటే ఉత్తమమైన గొప్పవాడు…’’

(రాముడెవరో తెలిసిన, తెలుసుకొన్న స్త్రీరత్నాలు మువ్వురు …వారు …సుమిత్ర, తార, మండోదరి)

మండోదరీ విలాపమునకు అంతే లేకున్నది.

‘‘ఓ రాజా! ఆ సీత నా కన్నా అందగత్తెయా? కులమున నాకన్నా అధికురాలా?

అసలు నాతో ఆమె ఎందులో సమానము?

Also read: తెగి మొలచిన రావణు శిరస్సులు

‘‘నాకు వైధవ్యమా? ఊహించుటకే శక్యము గాకున్నది!! నాతండ్రి దానవరాజు. నా భర్త రాక్షసేశ్వరుడు. నా కుమారుడు ఇంద్రవిజేత. ఇదియే నాకుగల గర్వము.

‘‘నాధా, రాచమర్యాదలన్ననీకెంతో పట్టింపుగదా! నేడు నీ పట్టపురాణి అంతఃపురమునుండి కాలినడకన వచ్చినదయ్యా! వందిమాగధులు లేరు. ఛత్రము పట్టువారు లేరు. రాజలాంఛనాలేవీ లేవయ్యా. ఇవి ఏవీ లేక వచ్చుచున్న నన్ను చూసి లేచి కోపించవయ్యా!  నీభార్యలెవ్వరికీ నేడు మేలిముసుగులు లేవయ్యా! నీ పరిష్వంగమున యున్నప్పుడు వినిపించు నా కరకంకణముల కింకిణీ ధ్వనులకు చిరుదరహాసముతో మెరిసి మురిసిపోయెడి మోమేనా ఇది?

నేడింత కళా విహీనమైనది! ఈ రణభూమి నీకు ప్రియురాలైనది కదా నేడు అంత గాఢపరిష్వంగమేల?’’

హృదయవిదారకముగా ఏడ్చుచూ రావణ పట్టమహిషి భర్త మృతశరీరముపై బడి మూర్ఛపోయినది.

Also read: రాముడికి ఆదిత్య హృదయం ప్రబోధించిన అగస్త్య మహర్షి

ఆమె పడగానే సవతులందరూ వచ్చి లేవదీసి ఆమెను ఊరడించి, అమ్మా పుట్టినవారు మరణించక తప్పదని తెలియును కదా!  నేడది సంభవించినది! ఒక వీరునికి మరణము ఏ విధముగా కలుగవలెనో ఆ విధముగానే ప్రాప్తించినది. శోకమువలదని ఓదార్చిరి.

అంత రాముని సూచన మేరకు విభీషణుడు స్త్రీలందరినీ అంతఃపురములోనికి తిరిగి పంపివేసెను.

Also read: రామ-రావణ భీకర సమరం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles