Friday, April 26, 2024

మహాభారతం – ఆదిపర్వం – తృతీయాశ్వాసం – కచ దేవయాని వృత్తాంతం

వాడి మయూఖముల్ గలుగు వాడపరాంబుధి గ్రుంకె, ధేనువుల్

నేడిట వచ్చె నేకతమ, నిష్ఠమెయిన్ భవదగ్ని హోత్రముల్

పోడిగ వేల్వగా బడియె, ప్రొద్దును బోయె, కచుండు నేనియున్

రాడు, వనంబులోన మృగ, రాక్షస, పన్నగ బాధనొందెనో!”

నన్నయ భట్టారకుడు

యయాతి ఘట్టంలో భాగంగా, దేవయాని – కచుల గాథను,  జనమేజయునికి ఎరుక పరుస్తున్నాడు వైశంపాయనుడు.

వృషపర్వుడనే రాక్షసరాజుకు శుక్రుడు ఆచార్యుడై పెక్కు విధాలుగా దానవకోటికి సేవ చేసినవాడు. ఆయనకు మృతసంజీవిని అనే విద్య వున్నది. ఆ విద్యచే దేవదానవ యుద్ధంలో మరణించిన దానవులకు పునురుజ్జీవనాన్ని ప్రసాదించేవాడు.

ఇది తెలుసుకున్న దేవతలు మృతసంజీవినీ విద్యను శుక్రుని వద్ద నేర్చుకొనగల సమర్థుని కోసం ఆన్వేషిస్తూ, బృహస్పతి కుమారుడైన కచుని వద్దకు వెళ్ళి ఇట్లా అభ్యర్థిస్తారు: “మృతసంజీవినీ విద్యచే రాక్షసులను చంపినా మళ్ళీ జీవిస్తున్నారు. అపార వీర్యవంతులైన రాక్షసులను జయించడం దుస్సాధ్యంగా వున్నది.  శుక్రుని వద్ద ఈ విద్యను నేర్చుకొనగల సమర్థుడవు నీవే. నీతి నియమాలు కలిగిన ఆదర్శబాలుడవు నీవు. నిన్ను తప్పక భార్గవుడు శిష్యునిగా స్వీకరించి, మృతసంజీవిని విద్యను నీకు ధారాదత్తం చేస్తాడు. అట్లా, మృతసంజీవిని విద్యను నేర్చుకొని దేవతలమైన మాకు సాయం చెయ్యి.

Also read: మహాభారతం – తృతీయాశ్వాసం – వ్యాసుని జననం

“శుక్రునికి తన కూతురు దేవయానిపై వల్లమాలిన ప్రేమ. ఆమె మాటను ఆయన జవదాటడు. ఆమె మనస్సును లోబరచుకొని శుక్రునికి శుశ్రూష చెయ్యి. నీకు కార్యసిద్ధి కలుగుతుంది.”

కచుడు అంగీకరించి, శుక్రుని వద్దకు వెళ్లి తాను కచుణ్ణని, బృహస్పతి పుత్రుణ్ణని, భాను నిభానుడైన శుక్రునికి సేవ చేయడానికై వచ్చినానని చెబుతాడు.

శుక్రుడా ముని కుమారుని సౌకుమార్యానికి, అతని ప్రియవచన మృదు మధురత్వానికి, అతని అనవరత నియమవ్రత ప్రకాశిత ప్రశాంతత్వానికి ముచ్చటపడి, అతణ్ణి పూజిస్తే బృహస్పతిని పూజించినట్లే నని భావించి, అభ్యాగత పూజలతో ఆ బ్రహ్మచారిని సంతృప్తి పరచి తన శిష్యునిగా చేసుకుంటాడు.

కచుడు కూడా తన గురుశుశ్రూషా కౌశలంతో, మనోవాక్కాయ కర్మలతో, శుక్రుణ్ణి సేవించి, అతనికి ప్రియశిష్యుడు కావడమే గాక, ఆయన కూతురు దేవయానికి కూడా విధేయుడై, గురుపుత్రిని కొలుస్తూ, ఆమెకు ప్రీతిపాత్రుడౌతాడు.

Also read: ఆంధ్రమహాభారతం – తృతీయాశ్వాసం – కచ దేవయాని ఘట్టం – శుక్రాచార్యుడు పునురుజ్జీవితుడు కావడం

ఈ సంగతులన్నీ తెలుసుకొన్న రాక్షసులు సహింపలేక దేవగురువు బృహస్పతితో తమకు గల వైరంచే, ఒక రోజు కచుడొక్కడే  అడవులకు హోమధేనువులను మేతకు తీసుకొని పోయి ఒంటరిగా వున్న సమయంలో, అదను చూసి వధించి, కచుని శవాన్ని ఒక  చెట్టు బోదెకు  కట్టివేసి, తమ దారిన వెళ్ళిపోతారు.

సూర్యుడు పడమట అస్తమించడం, కచుడు  తోలుకొని పోయిన ఆలమందలు యజమాని లేకుండానే ఒంటరిగా తిరిగిరావడం, కచుడు మాత్రం ఎంత సేపటికీ రాకపోవడం చూసిన దేవయాని, “మలమల మరుగుతూ”,  తండ్రి వద్దకు వెళ్లి, తన వేదనను, ఆక్రోశాన్ని, ఇట్లా వ్రెళ్ళగ్రక్కుతున్నది (నేటి పద్యంతో అనుబంధం).

“వాడి మయూఖములు గల సూర్యుడు పశ్చిమ సముద్రంలో క్రుంకినాడు. హోమధేనువులు ఒంటరిగా మరలివచ్చినాయి. చీకటి పడడంతో నిష్ఠానుసారంగా  సమిధలను స్వీకరిస్తూ అగ్నిహోత్రాలు చక్కగా వెలుగుతున్నాయి.  ప్రొద్దు పోయింది. కచుడు మాత్రం తిరిగి రానేలేదు. ఏ మృగాల బారినో, సర్పాల బారినో, రాక్షసుల బారినో  పడినాడేమో!”

నన్నయ పద్యరచనా శిల్ప వైభవానికి చిహ్నంగా నిలిచే ఈ పద్యం స్వభావోక్తికి ఉదాహరణగా గోచరిస్తుంది.  “లోనారసినప్పుడు” మాత్రం, గంభీరార్థాలను స్ఫురింపజేస్తుంది.

Also read: ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం- ఉపసంహారం

భారతావతారికలోని “సారమతిం కవీంద్రులు” అనే పద్యంలో పఠితలకు అన్యాపదేశంగా చేయబడిన ఆదికవి ఉపదేశాన్ని  స్మరించు కుందాము:

“పాఠకులారా! ఈ కావ్యంలోని  అక్షర రమ్యతా వ్యామోహానికే పరిమితమై, కావ్యార్థాన్ని విస్మరించకండి. కావ్యార్థాన్ని సంపూర్ణంగా రాబట్టడం కోసం ప్రతి పద్యాన్నీ లోనారసి పఠించండి. బహుముఖీనమైన ఈ కావ్యంలో నానా రుచిరార్థాలను దర్శించడానికి ప్రయత్నించండి!”

ధ్వని పూర్వకమైన నన్నయ కవిత్వ తత్వానికి నేటి పద్యం చక్కని నిదర్శనం. “ధ్వనిః కావ్యజీవితమ్” అంటూ ఆనంద వర్ధనుడు చెబుతున్నాడు కదా!

దేవయాని కచుణ్ణి అమితంగా ప్రేమించింది. ఆమె సాంప్రదాయ బద్ధురాలైన కన్యక.  అమితమైన గారాబంతో శుక్రాచార్యునిచే ఆమె పెంచబడింది. దేవయాని తన మనస్సును చూచాయగా నివేదిస్తే చాలు, ఇట్టే ఆయన గ్రహించగలడు.

ఆమె నిజంగా చెప్పదలచిన దేమిటి?

“తండ్రీ, సూర్యుడు యథావిథిగా అపరదిశలో అస్తమించినట్లే, ఆలమందలు కూడా యథావిధిగా అరణ్యం నుండి విచ్చేసినవి.  మేతకై తమను తీసుకొని వెళ్ళిన కచుడేమైనాడో అన్న  చింత కూడా లేకుండా ఆ ఆలమందలన్నీ ప్రవర్తిస్తున్నాయి. కచుడు నీ ప్రియశిష్యుడు. అతనికేమైనదో అనే చింత నీకు కూడా లేదు. హాయిగా దైనందిన క్రమం ప్రకారం అగ్ని హోత్రానికి దర్భలను ఆహుతి చేస్తూ సమయం వెళ్ళ బుచ్చు తున్నావు. కచుడే మృగాల, విషసర్పాల,  రాక్షసుల బారిన పడి, ప్రమాదంలో చిక్కుకున్నాడో నన్న చింత ఏ మాత్రమూ నీకు లేదు!”

Also read: భారతీయ సాహిత్యంలో ప్రశ్న-జవాబు ప్రక్రియ వైశిష్ట్యం

ఈ పద్యాన్ని లోనారసి పఠించినప్పుడు, దేవయాని యొక్క ఆర్తి, నిర్వేదం, ఆమె మనస్సులో ఘూర్ణిల్లే  అంతులేని భయాందోళనలు పఠిత మనస్సుకు స్ఫురింపక మానదు. “తండ్రి, గోవులు, దైనందిన ఆశ్రమ జీవనం, ఇవన్నీ దేవయానికి తృణప్రాయం. కచుడే ఆమెకు  సర్వస్వం.  భార్గవపుత్రి కచుణ్ణి ప్రాణసమానంగా ప్రేమిస్తున్నది.”  ఈ పద్యంలో అంతర్లీనంగా వెల్లడి కాబడుతున్న విషయాలివి.

కుచుడు కేవలం కార్యార్థియై తన తండ్రికి శుశ్రూష చేస్తున్నాడని, తనను కచుడు ప్రేమించడం లేదని, అర్థం చేసుకుని స్థితిలో దేవయాని లేదు. ఆమెకు కచుడే సమస్తం. ప్రేమించే ప్రతి మహిళ యొక్క జీవన విషాదం ఈ పద్యంలో అణువణువునా ఇమిడి వున్నది.

ఈ పద్యంలోని “వాడి మయూఖములు గలవాడు” అనే పదప్రయోగంలో, ప్రేమించే ప్రతి కన్యకూ, ఆందోళనతో బాటు గుండె దిటవు, ఆశాభావమూ  కూడా వుంటాయని తెలుపుతున్నది.

సూర్యునివి వాడి మయూఖాలు. కచుడు కూడా “వాడి” గలవాడే. పడమట క్రుంకిన సూర్యుడు తూర్పున తొలిప్రొద్దున ఎట్లా మళ్లీ ఉదయిస్తాడో, అట్లే, కచుడు ఉదయమయ్యే సరికి ఇంటికి రాకతప్పడు. దేవయాని ఆశాభావమిది.

ఆమె ఆశాభావం వ్యర్థం కానేరదు. కన్నకూతురే తన సమస్తంగా భావించే శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది గ్రహించి, తన మృతసంజీవినీ విద్యచే కచుణ్ణి పునురుజ్జీవింప జేస్తాడు.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – పరీక్షిత్తు దుర్మరణం చెందడానికి నేపధ్యం

ఈ పద్యం సరళ మనోహరమైనది. కథలో ఆకర్షణ కోసం తత్సమ శబ్దాలను, “అక్షరరమ్యత”ను విరివిగా వాడుకునే మహాకవి నన్నయ భట్టారకుడు సిసలైన కవిత్వధారను కురిపిస్తున్నప్పుడు, బాహ్యాలంకారాలను త్యజించి, తేట తెలుగు పదాలనే విరివిగా ప్రయోగిస్తాడనడానికి నేటి పద్యమొక సాక్ష్యం. ఈ పద్యంతో “కచుడు” అనే పదంలోని “డ” వర్ణాన్ని పాదప్రాసగాను, విరివి గాను వాడుకొని, పద్య సౌందర్యాన్ని నన్నయ మహాకవి ద్విగుణీకృతం చెయ్యడం ముదావహం. తెనుగు శబ్దాలలో “డ” కారం కడు తేలికగా పలుకుతుంది. ఇతర శబ్దాలతో చక్కగా కలిసి పోయి “వెదురు బొంగు లోని మృదుల రసాత్త నాదం” వలె శ్రవణానందంగా మ్రోగుతుంది.

వేయి యేండ్ల నాడే “ధ్వని” కవిత్వాన్ని భారతానువాదంలో విస్తృతంగా వాడుకున్న వాడు నన్నయ భట్టారకుడు.  ఆధునిక పాశ్చాత్య కవితా జగత్తులో “ధ్వని” కవిత్వమొక ప్రత్యేక శాఖ. ఈ శాఖను ఇబ్బడి ముబ్బడిగా పెంచి పోషించిన వారిలో ఒకడు అమెరికన్ కవి అర్ఛిబాల్డ్ మాక్లిష్. “ఆర్స్ పోయెటికా” అనే ఆయన ఖండికలోని తొలి పంక్తులను గమనించండి:

“A poem should be palpable and mute as a globed fruit,

Dumb as old medallions to the thumb,

Silent as the sleeve worn stone

Of casement ledges where the Moss has grown

A poem should be wordless

As the flight of birds

(Ars Poetica by Archibald Macleigh)

బయటికి అయోమయంగా కనబడే యీ పద్యతాత్పర్యాన్ని, అంతరార్థాన్ని, పరికించండి:

“గుండ్రంగా,  గ్లోబ్ ఆకారంలో వుండే ఫలం, చూడడానికి మూగదానివలె వుంటుంది. దాని తొక్కలు తీసినప్పుడు మాత్రమే ఆ ఫల మధుర్యాన్ని ఆస్వాదించగలం. పద్యం మూగదానివలె కనపడి మాధుర్యం పంచే నారింజ ఫలం వంటిది”.

“పాతకాలపు బహూకృతి (మెడల్) బొటనవ్రేలితో తాకినప్పుడు నాలుక లేని దానివలె ఏ సమాధానమూ చెప్పలేదు. మనస్సుతో చూసేవారికి మటుకు ఆ మెడల్ విలువైన అనేక జ్ఞాపకాలను పంచిపెడుతుంది. పద్యం జ్ఞాపకాలను పంచే పాతబడిన మెడల్ వంటిది.”

“శిథిల గవాక్షలకు చట్రంగా వుండి, అంతటా నాచు పేరుకొని, కొసలన్నీ అరిగిపోయిన పురాతన శిలలో నిశ్శబ్దం పేరుకొని వుంటుంది. అదే రాతిలో చింతనాపరుల శ్రవణేంద్రియాలకు గతకాలపు పాదధ్వనులు వినిపిస్తాయి. పద్యం శిథిల గవాక్షాలకు చట్రంగా, అరిగిపోయి, పాత జ్ఞాపకాలు రేపే శిలవంటిది”.

“ఆకాశంలో విహంగాలు నిశ్శబ్దంగా పయనిస్తాయి. పద్యంలో తారసిల్లే శబ్దాలు, గగనతలంలో సాగే పక్షుల నిశ్శబ్దపయనం వంటివి”

ఈ పద్యంలో “వాడి మయూఖములు” అనే శబ్దప్రయోగం కూడా అసాధారణమైనది. ఒక దేశీయపదం, తత్సమ శబ్దంతో మేళవించబడిన ప్రయోగం. దీన్ని గూర్చి విశ్వనాథ వారు ఇట్లా అంటున్నారు: “తెలుగు సంస్కృత పదాలకు సమాసం చేయరాదు. ఈ నన్నయగారి ప్రయోగం వలన కొద్ది అక్షరములు కలిగిన తెలుగు మాటతో సంస్కృత శబ్దమును సమసించవచ్చునని తీర్మానమైనది.”

“ఇది కర్మధారయ సమాసము. తక్కిన సమాసములలో చేయరాదని అర్థము. కానీ పెద్దన్నగారు “కటిక చీకటి తిండి కరముల గిలిగింత” అని ప్రయోగించినారు. ఇచ్చట కరములన్న మాట యొక్కటియే సంస్కృతము.”

ఆంగ్ల సారస్వతంలో “Thank you, William Shakespeare, for saying it first” అనే నానుడి వున్నది. తన నాటకాల్లో, వ్యాకరణ సూత్రాలకు ఎదురీది, షేక్స్పియర్ ప్రవేశపెట్టిన పదజాలము, పంక్తులు, అసంఖ్యాకం. రానురాను ఆయన ప్రవేశపెట్టిన విచిత్ర పదజాలమే ప్రామాణికను సంపాదించింది. ఆంధ్ర సాహిత్యంలో నన్నయ మహాకవి ప్రవేశపెట్టిన వినూత్న పదజాలం సైతం నేడు ప్రామాణికను సంతరించు కోవడం విశేషం.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – పరీక్షిత్తు దుర్మరణం చెందడానికి నేపధ్యం

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles