Friday, June 2, 2023

ఆంధ్రమహాభారతం – తృతీయాశ్వాసం – కచ దేవయాని ఘట్టం – శుక్రాచార్యుడు పునురుజ్జీవితుడు కావడం

విగత జీవుడై పడి యున్న వేదమూర్తి

అతని చేత సంజీవితుడై వెలింగె

దనుజమంత్రి యుచ్ఛారణ దక్షు చేత

నభి హితంబగు శబ్దంబు నట్ల పోలె”

నన్నయ భట్టారకుడు

గురుశుశ్రూషా కౌశలంతో కచుడు శుక్రాచార్యునికి ప్రియశిష్యునిగా మెలుగుతున్న రోజులు. ఒకసారి కచుడు హోమధేనువులను  తోలుకొని అడవికి వెళ్ళగా, దానవులతణ్ణి హతమారుస్తారు. తన మృతసంజీవినీ విద్యచే అతణ్ణి పునురుజ్జీవింప జేస్తాడు శుక్రుడు.

మరొక్కమారు కచుడు అడవికి ఒంటరిగా పోవగా, రాక్షసులతణ్ణి సంహరించి, అతని శవాన్ని భస్మం చేసి, ఆ భస్మం కలిసిన మద్యాన్ని శుక్రునిచే త్రావిస్తారు.

Also read: ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం- ఉపసంహారం

ఎంతకూ కచుడు తిరిగి రాకపోయేసరికి, అతణ్ణి ప్రేమించే శుక్రతనయ దేవయాని “వానిం జూచి గాని కుడువనొల్లనని” దుఃఖాతిశయంతో రోదిస్తుంది. శుక్రుడు కూతురి పట్ల ప్రసన్నుడై, తన యోగదృష్టితో “లోకాలోక పర్యంత భువనాంతరంలో” ఎక్కడా కచుణ్ణి కానక, చివరకు తన ఉదరగర్బంలోనే సురాసమ్మిశ్ర భస్మమయుడై కచుడున్నాడని గ్రహిస్తాడు. జన్మజన్మాలలో చేసుకున్న పుణ్యకృతంగా లభించిన జ్ఞానం మదిర సేవించడంచే ఒక్కక్షణంలో శూన్యం కావడాన్ని అర్థం చేసుకున్న భార్గవుడు, మదిర మహాపాతకమంటూ శపిస్తాడు.

తక్షణమే తన మృతసంజీవినీ విద్యతో కచుణ్ణి పునః  బ్రతికిస్తాడు శుక్రుడు. కడుపులో వున్న కచుడు శుక్రునితో అంటాడు: “నీ ప్రసాదంచే, దేహాన్ని, జీవాన్ని, సత్త్వాన్నీ, మళ్ళీ పొందినాను. నీ ఉదరం నుండి బయటకు వచ్చే మార్గాన్ని, మహాత్మా! ఉపదేశించు!”.

అప్పుడు శుక్రుడు “నా ఉదరం భేదిల్లితే తప్ప యీ మునికుమారుడు బయటకు రాలేడ”ని ఆలోచించి, కడుపులో ఉన్న కచునికి మృతసంజీవినీ విద్యను ఉపదేశిస్తాడు.

Also read: భారతీయ సాహిత్యంలో ప్రశ్న-జవాబు ప్రక్రియ వైశిష్ట్యం

ఉదయగిరి నుండి బయల్వెడలే పూర్ఢచంద్రుని వలె కచుడు శుక్రుని ఉదరగర్భాంతరం నుండి బయటకు వెడలి వస్తాడు.

కచుడు తన కడుపును ఛేదించుకొని బయల్వెడలడంతో కడుపు చీలిన శుక్రుడు మృతి చెందుతాడు. శుక్రుని కడుపులో ఉండగా తనకా మునిపుంగవుడు నేర్పిన మృతసంజీవినీ విద్యను ఉపయోగించి, కచుడు శుక్రుణ్ణి పునురుజ్జీవితుణ్ణి చేస్తాడు. ఆ సందర్బంలోని పద్యమిది:

విగత జీవియై పడియున్న వేదమూర్తి

యతని చేత సంజీవితుడై వెలింగె

దనుజమంత్రి యుచ్ఛారణ దక్షుచేత

నభి హితంబగు శబ్దంబు నట్ల పోలె”

ఈ పద్యతాత్పర్యం:

 “విగతజీవుడై పడియున్న వేదమూర్తి వంటి దనుజమంత్రి శుక్రాచార్యుడు, కచునిచేత (అతనిచేత) సంజీవితుడై (పునురుజ్జీవించబడిన వాడై), ఉచ్ఛరించడంలో దక్షుడైన వాని చేత పలుకబడిన అభిహిత శబ్దం వలె ప్రకాశించినాడు.”

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – పరీక్షిత్తు దుర్మరణం చెందడానికి నేపధ్యం

ఈ నన్నయ పద్యం మూలానికి విధేయం కాదు. వ్యాస మహాభారతంలో ఇట్లా వున్నది:

దృష్ట్వా చ తం పతితం బ్రహ్మరాశిం

ఉత్థాపయామాస మృతం కచోపి”

“ఉచ్ఛారణ దక్షు చేత అభియుతంబగు శబ్దంబు నట్ల పోలె” అనే పంక్తి నన్నయ భట్టారకుని కల్పన. ఈ కల్పన భట్టారకుడు చేయడమెందుచేత?

మృతుడైన వేదమూర్తి శుక్రుడు ఉచ్ఛారణ దక్షుడైన కచుని మృతసంజీవినీ మంత్రోచ్ఛారణచే పోయిన ప్రాణాన్ని తిరిగి పొంది “అభి హితమైన శబ్దం వలె ప్రకాశించినాడు. ఈ విషయాన్నే భంగ్యంతరంగా చెబితే, ఉచ్ఛారణ దక్షుడు కానివాడు ఉచ్ఛరించిన శబ్దం నిష్ప్రయోజనమనీ, అట్టివాడు ఉచ్ఛరించిన శబ్దం మృతప్రాయమైనదనీ, మృతజీవులను పునః జీవింప చేయలేదనీ, చెప్పవలసి వస్తుంది. ఆచార్యులలోనే శిఖరాగ్ర సమానుడైన వాడు శుక్రాచార్యుడు. ఆయన మృతసంజీవినీ మంత్రాన్ని పఠించగా పునరుజ్జీవితుడైన వాడు కచుడు. కచుడు తన ఉదరాన్ని ఛేదించుకొని బయటపడగా మరణించిన వాడు శుక్రాచార్యుడు. అదే శుక్రుని వద్ద మృతసంజీవినీ మంత్రాన్ని సద్యఃస్ఫూర్తితో గ్రహించి, ఆ మంత్రప్రయోగంచే శుక్రుణ్ణి మళ్ళీ బ్రతికించిన వాడు కచుడు. కచుడెవడు? శుక్రాచార్యునికి సాటి రాగల మరొక ఆచార్య మేరు శిఖరమైన బృహస్పతికి సాక్షాత్తు కుమారుడు. అతడు కూడా బృహస్పతి సమానుడే.

నన్నయ శబ్దవేది. నేటి పద్యంలో ఆయన ప్రయోగించిన ఉపమానాన్ని శబ్దరహస్యాలు తెలిసిన వారు అమృతోపమానంగా భావిస్తారు. ఆర్షకవియైన నన్నయ దృక్పథంలో శబ్దరహస్యాన్ని సరిగ్గా తెలిసిన వాడు చిత్తశుద్ధితో ప్రయోగించినదే సిసలైన శబ్దం.

Also read: మహాభారతం – ఆదిపర్వం: ద్వితీయాశ్వాసం – వాసుకి తల్లి శాపానికి వెరచుట

మహాభారతం అవతారికలో నన్నయ భట్టారకుణ్ణి పరిచయం చేసే ఈ పద్యం గమనించండి:

తన కులబ్రాహ్మణు, ననురక్తు, నవిరళ

జపహోమ తత్పరు, విపుల శబ్ద

శాసను, సంహితాభ్యాసు,బ్రహ్మాండాది

నానా పురాణ విజ్ఞాన నిరతు,

పాత్రు, నాపస్తంబ సూత్రు, ముద్గల గోత్రు, జాతు, సద్వినుతావదాత చరితు,

లోకజ్ఞు, నుభయభాషాకావ్య రచనాభి

శోభితు, సత్ప్రతాభాభి యోగ్యు,

నిత్య సత్యవచను, మత్యమరాధిపా

చార్యు, సుజను నన్నపార్యు జూచి

పరమ ధర్మవిదుడు, వర చళుక్యాన్వయా

భరణు డిట్టులనియె కరుణతోడ”

నన్నయ భట్టారకుని అపూర్వమైన గుణగణాలతో బాటు, ఆయన సాక్షాత్తు బృహస్పతి అనీ, “విపుల శబ్దశాసనుడనీ” రాజరాజనరేంద్రుడు ప్రస్తుతిస్తున్నాడు.

రాజరాజు సభలో విపుల శబ్దశాసనుడైన నన్నయ భట్టారకుడే గాక “అపార శబ్దశాస్త్ర పారంగతులైన వైయాకరణులు” కూడా ఉన్నారని భారతావతారిక తెలియజేస్తున్నది.

ఉచ్ఛారణ దక్షుడైన ఆదికవి భారతంలో శబ్దానికి పెద్దపీట వేయడాన్ని నేటి పద్యంలోని “ఉచ్ఛారణ దక్షు చేత నభిమతంబగు శబ్దంబు నట్ల పోలె” అనే పంక్తి స్ఫురింపజేస్తున్నది.

వ్యాసస్తుతి

నేటి పద్యంలోని మొదటి రెండు పాదాలను గమనించండి:

విగతజీవుడై పడియున్న వేదమూర్తి

యతనిచేత సంజీవితుడై వెలింగె”

పై పాదాల్లో “వేదమూర్తి” అనగా వేదవిజ్ఞానం. “అతడు” అనే పదం వ్యాసమహర్షికి వర్తిస్తుంది.

ప్రఖ్యాత విమర్శకులు పింగళి లక్ష్మీకాంతం గారిట్లా అంటున్నారు: “ద్వాపర యుగాంతమున జరిగిన ఉపప్లవములో శ్రుతరూపమైన వేదవిజ్ఞానమంతయు మృగ్యమై, అసద్ధర్మములు, అసత్యసిద్ధాంతములు, తలయెత్తసాగినవి. ఇంచుమించుగా అస్తమించిపోయిన ఆ విజ్ఞానమును పునస్సంస్థాపన చేయుటయే తన జన్మప్రయోజనముగా వ్యాసుడు అవతరించెను. ఆ యుగాంతములో యాదవకృష్ణుడును, కృష్ణద్వైపాయనుడును, పుట్టి యుండక పోయినచో భారతనాగరకత కథావశేషమయ్యెడిది.”

“వ్యాసుడు తద్విజ్ఞాన సంరక్షణకు మొదట జేసిన కార్యము వేదములను విడదీయుట. ఆనాటి వేదములు చిక్కుబడ్డ నూలు గుట్టవలె పోగు తీయుటకు వీలు లేకుండా చేతబట్టినచో తెగిపోయెడు స్ధితిలో నున్నవి. ఆనాటి నూలి రాశి వద్ద కూర్చొని పోగును తెగకుండా ఆ చిక్కు తీసి పడుగుగా దాచిన వాడు వ్యాసుడు. వేదములు విడదీసినంతనే భారతీయ సంస్కృతి భవనమునకు దృఢమైన పునాది ఏర్పడెను. ఆపై ఆయన భారతమును రచించుట, ఆ పునాది మీద విజ్ఞాన సౌధమును నిర్మించుట, కురుపాండవ చరిత్రను నిమిత్తమాత్రముగా గ్రహించి ఆ మహాకవి భారతములో ధర్మశాస్త్ర వాక్యములను, ఆగమ తాత్పర్యములను, ఉపనిషద్రహస్యములను, ఐతిహాసిక గాథలను, పురాణచరిత్రలను, రాజవంశ వర్ణనలను, మన ప్రాచీన సంస్కృతి సారమంతయు రాశీభూతము చేసి ఏకత్ర నిబంధించెను. మీదు మిక్కిలి సర్వోపనిషత్ సారమైన భగవద్గీతను అందు నిబంధించి, ఉపనిషదర్థములకు స్థిరమైన వసతి కల్పించెను. ఇంచుమించు సనత్సుజాతీయము కూడా అట్టిదే”.

ఈ నేపథ్యంతో  నేటి పద్యంలోని మొదటి రెండు పాదాలను పరిశీలించినప్పుడు, వాగనుశాసనుడు అన్యాపదేశంగా వ్యాసభగవానుణ్ణి ప్రస్తుతిస్తున్నాడనీ స్ఫురింపక మానదు.

 “విగతజీవుడై పడియున్న” సనాతన భారతీయ విజ్ఞానకోశమనే “వేదమూర్తి” వ్యాసమహర్షి మృతసంజీవినీ మంత్రోచ్ఛారణచే పునురుజ్జీవితుడై వెలిగినాడు.”

ఈ విషయాన్నే నన్నయ మహాభారతం తృతీయాశ్వాసంలో ఇట్లా పేర్కొంటున్నాడు:

సంచిత పుణ్యుడంబురుహ సంభవు నంశము దాల్చి పుట్టి లో

కాంచితుడైన వాడు నిఖిలాగమ పుంజము లేర్పడన్ విభా

గించి జగంబులందు వెలిగించి సమస్త జగద్ధితంబుగా

పంచమవేదమై పరగు భారత సంహిత జేసె నున్నతిన్!”

“వెలుగు”, “వెలిగించు” అనే పదాలు, నేటి పద్యంలో, పై పద్యంలోనూ ప్రయోగింపబడడం గమనింపదగినది.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం

గ్రహాల అస్తంగత్వం

సౌరకుటుంబంలోని సప్తగ్రహాల్లో రవి, కుజుడు  క్షత్రియ గ్రహాలైతే, శుక్రుడు, బృహస్పతి  బ్రాహ్మణ గ్రహాలు. రెండు క్షత్రియ గ్రహాలూ క్రూరమైనవి. రెండు విప్రగ్రహాలూ సౌమ్యమైనవి. ఈ రెండు బ్రాహ్మణ గ్రహాలు సూర్యునికి చేరువైనప్పుడు, వాటి సహజకాంతిని కోల్పోయి అస్తంగతమౌతాయి. ఆ అస్తంగత స్థితినే శుక్రమౌఢ్యమి, గురు మౌఢ్యమి అంటూ వ్యవహరిస్తాము. ఆ కాలమంతా ఎట్టి శుభకార్యాలనూ తలపెట్టము.

కచ దేవయాని గాథలో కచుడు రాక్షసుల బారినపడి అస్తమించడం గురుమౌఢ్యమికి ప్రతీక. శుక్రుడు కచునికి ప్రాణభిక్ష పెట్టి తానే అస్తంగత్వాన్ని పొందడం శుక్రమౌఢ్యమికి ప్రతీక. కొన్ని సార్లు ఇరుగ్రహాలూ అస్తమిస్తాయి. ఈ అస్తంగత్వం తాత్కాలికం. అట్లా అస్తంగతమైనంత కాలమూ, లోకానికి అరిష్ఠదాయకంగా జ్యోతిష్యవేత్తలు భావిస్తారు.

శుక్రుడు, బృహస్పతి, రాహువు చేత గాని, కేతువు చేతగాని పడినప్పుడు  భ్రష్ఠత సంభవిస్తుంది. గురువు రాహుకేతువులతో సంగమిస్తే గురుచండాల యోగమనే అవయోగం ప్రాప్తిస్తుంది.

శుక్రుడు మ్లేచ్ఛుడైన రాహువు బారిన పడితే మద్యపానాది వ్యసనాలు కలిగే ప్రమాదం వున్నది. నేటి ఘట్టంలో శుక్రాచార్యుడు మద్యపానం చేయడం, తప్పు గ్రహించడం, శుక్ర రాహు యుతికి ప్రతీక.

నేటి పద్యంలో అడుగడుగునా శబ్దం యొక్క విశిష్టతను ఆదికవి ప్రస్తుతిస్తున్నాడు.

సప్తగ్రహాలు, లెక్కించలేనన్ని  నక్షత్రాలు, నిరంతర తపస్సమాధిలో మునిగిన  మునిగణంవలె, అనంత శూన్యంలో సదా తేలియాడుతూ, శాశ్వదానంద మూర్తులై, నిశ్శబ్దంగా, వెలుగులు విరజిమ్ముతూనే వుంటాయి.

విశాల విశ్వాంతరాళాన్ని ఆవరించిన ఈ నిబిడ, నితాంత, నిశ్శబ్దమే “శబ్దానికి”  మాతృక కావడం ఆశ్చర్యకరం.

వేరులో నుండి కొమ్మలు వెలిసినట్లు

అన్ని శబ్దాలు నిశ్శబ్దమందె పుట్టె”

అంటాడు మహాకవి మీర్జా గాలిబ్.

నూతన సంవత్సర శుభాకాంక్షలతో

నివర్తి మోహన్ కుమార్

Also read: మహాభారతం ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – గరుత్మంతునికి తల్లి వినత ఆశీస్సులు

Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles