Saturday, April 20, 2024

మహాభారతం – తృతీయాశ్వాసం – వ్యాసుని జననం

సద్యోగర్బంబున అహి

మద్యుతితేజుండు, వేదమయు డఖిలమునీం

ద్రాద్యుడు వేదవ్యాసుం

డుద్యద్ జ్ఞానంబు తోడ నుదితుండయ్యెన్”

ఆ యమునా ద్వీపంబున న

మేయుడు కృష్ణుడయి లీలమెయిం కృష్ణద్వై

పాయనుడన బరిగి వచ

శ్రీయుతుడు తపంబునంద చిత్తము నిలిపెన్”

పరాశరుండు సత్యవతి కోరిన వరంబు లిచ్చి నిజేచ్ఛ నరిగె;

నంత కృష్ణద్వైపాయనుండును కృష్ణాజిన పరిధాన కపిల జటా కమండలు మండితుండై తల్లి ముందట నిలిచి కరకమలంబులు మొగిచి మ్రొక్కి: “మీకుం పనిగల యప్పుడ నన్నుం తలంచునది, యా క్షణంబ వత్తు” నని లోకపావనుం డఖిల లోక హితార్థంబుగా తపోవనంబునకుం  జని, యందు మహాఘోర తపంబు సేయుచు;”

సంచిత పుణ్యు డంబురుహ సంభవు నంశము దాల్చి పుట్టి లో

కాంచితుడైనవాడు నిఖిలాగమ పుంజము నేర్పడన్ విభా

గించి,జగంబులందు వెలిగించి, సమస్త జగద్ధితంబుగా

పంచమవేదమై పరగు భారత సంహిత జేసి నున్నతిన్”

నన్నయ భట్టారకుడు

“బ్రహ్మ సమానుడైన పరాశరమహర్షి సంగమం చేతను, ఆ ముని మహిమ చేతను, పరమ గుణైకాభరణ, అనవద్య మనోహర మూర్తీ యైన సత్యవతికి సద్యోగర్బంలో, అహిమద్యుతి తేజుడు, వేదమయుడు, ఆదిముని అయినటువంటి వేదవ్యాసుడు ఉద్యత్ జ్ఞానుడై జన్మించినాడు.”

Also read: లోక బాంధవా!

“ఆ యమునా ద్వీపంలో, అమేయుడు, నీలదేహుడు, వచశ్రీయుతుడైన వ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడనే పేరుతో ప్రసిద్ధిని పొంది, తపస్సులోనే తన మనస్సును నిలిపినాడు.”

“పరాశరుడు సత్యవతి కోరుకున్న వరాలను ఆమెకు దయచేసి తన దారిన తాను వెళ్ళి పోయినాడు.”

“కృష్ణద్వైపాయనుడు, కృష్ణాజిన వస్త్రంతో, కపిలవర్ణం గల జటాజూటంతో, దండము, కమండలమూ ధరించిన చేతితో, తల్లి కట్టెదుట నిలిచి, ఆమెకు చేతులు జోడించి మ్రొక్కి అన్నాడు: అమ్మా! మీకు నాతో అవసరం కలిగినప్పుడు నన్ను తలచండి. క్షణంలో మీవద్దకు వచ్చి వ్రాలుతాను.”

ఇట్లా తల్లికి అభయమిచ్చి సకలలోక పావనుడైన వ్యాసముని అఖిలలోక హితార్థుడై తపోవనానికి వెళ్ళి, మహాఘోరమైన తపస్సులో నిమగ్నమైనాడు.”

“సంచిత పుణ్యుడు, బ్రహ్మ అంశచే జన్మించి లోకపూజ్యుడైన కృష్ణద్వైపాయనుడు, వేదాలను విభాగించి, వేదప్రభలను లోకంలో వెలిగించి, సకల జగత్ హితంగా పంచమవేదంగా ఖ్యాతిని గడించిన భారత సంహితను రచించినాడు.”

Also read: ఆంధ్రమహాభారతం – తృతీయాశ్వాసం – కచ దేవయాని ఘట్టం – శుక్రాచార్యుడు పునురుజ్జీవితుడు కావడం

ఉపరిచరవసుమహారాజు గాథలోని ఆరు పద్యాలు, నాలుగు వచనాలు, మత్స్యగంధి వృత్తాంతంలోని ఐదు పద్యాలు, నాలుగు వచనాలు, వ్యాసమునీంద్రుని జననంలోని నాలుగు పద్యాలు, ఒకే వొక్క వచనం, కృష్ణద్వైపాయనుని జననాన్ని, దాని పూర్వరంగాన్నీ తెలుపుతాయి.

భారతసంహిత బహు ముఖీనమైనది. శౌనకాది మునులకు ఉగ్రశ్రవసువు పేర్కొన్నట్లుగా, ధర్మతత్వజ్ఞులకు ధర్మశాస్త్రమీ భారతం. ఆధ్యాత్మవిదులకిది వేదాంతం. నీతివిచక్షణులకిది నీతిశాస్త్రం. మహాకవులకు మహాకావ్యం. లాక్షణికులకు సర్వలక్షణ సంగ్రహం. ఐతిహాసులకు ఇతిహాసం.

ఇన్ని విభిన్న పార్శ్వాలతో, కడు వైవిధ్య భరితమైన మహాభారతగాథను సామాన్యకవులు ఆంధ్రీకరించడం అసాధ్యమైన విషయం.

ఉపరిచరమహారాజు వృత్తాంతంతో మొదలై వ్యాసముని జననం దాకా సాగిన ప్రస్తుత ఘట్టంలో ఆదికవి నన్నయ ప్రధానంగా కథకుని పాత్రను పోషిస్తున్నాడు. ఆ  కథాకథన పాత్రలోనూ  నిత్య సత్యాన్వేషకులు లోనారసి గ్రహింపవలసిన మహత్తర విషయ సంపత్తి కడుంగడు సమృద్ధిగా ఉండడం గమనించదగిన సంగతి.

Also read: ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం- ఉపసంహారం

మహాకవుల రచనల్లో మూడు పద్ధతులు ప్రధానంగా గోచరిస్తాయి: కథాకథన పద్ధతి, వర్ణనా పద్ధతి, నాటకీయ పద్ధతి. నన్నయ రచనలో కథాకథన పద్ధతికే అగ్రతాంబూలం. దీనినే కాబోలు “ప్రసన్న కథా కలితార్థ యుక్తిగా” ఆయన పేర్కొన్నాడు. ఈ కలితార్థ యుక్తికి నేటి ఘట్టం ఒక మచ్చుతునక.

వ్యాసమునిని కీర్తించే నేటి పద్యాన్ని గమనించండి:

అంచిత పుణ్యుడంబురుహ సంభవు నంశము దాల్చి పుట్టి లో

కాంచితుడైన వాడు నిఖిలాగమ పుంజము లేర్పడన్ విభా

గించి, జగంబులందు వెలిగించి, సమస్త జగద్ధితంబుగా

పంచమవేదమై పరగు భారత సంహిత జేసి నున్నతిన్”

కృష్ణద్వైపాయనుడు సనాతన జాతి పునురుజ్జీవానికి చేసిన అనన్యమైన కృషిని ఈ పద్యం పేర్కొంటున్నది. స్థూలదృష్టితో చూస్తే స్వాభావికోక్తితో కూడిన సామాన్య పద్యంగా నేటి ఈ పద్యం స్పురిస్తుంది.

కానీ ఒక విషయం. బిందు పూర్వక “చ”కారం పాదప్రాసగా గల పైపద్యంలో, అంచిత/లోకాంచిత/విభాగించి/పంచమ, అంటూ సాగిన పాద ప్రాసకు, “వెలిగించి” అనే పదప్రయోగమొక్కటే సార్థకమైన ఐదవ ప్రాసగా చెల్లుతుంది. అనగా “వెలిగించు” అనే పదాన్ని లోనారసి పరిశీలించమని ఆదికవి పఠితను నొక్కి వక్కాణిస్తున్నట్లుగా అబిప్రాయం కలుగక మానదు.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – పరీక్షిత్తు దుర్మరణం చెందడానికి నేపధ్యం

 ఒక్కసారి పై పద్యాన్ని వ్యాసమునిని స్తుతించే నన్నయ భారతావతారిక లోని పద్యంతో అనుసంధానించి చూద్దాము:

భారత భారతీ శుభ గభస్తి చయంబుల జేసి, ఘోర సం

సార వికార సంతమసజాల విజృంభము బాచి, సూరి చే

తోరు చిరాబ్జ బోధన రతుండగు దివ్య పరాశరాత్భజుం

డంబోరుహ మిత్రుగొల్చి, మునిపూజితు భూరి యశోవిశారదున్”

“భారతంలోని భారతీ (వాక్కులనే) శుభ గభస్తిచయంబుల (మంగళకరమైన కిరణసమూహాల) చేత, ఘోరసంసార, వికార సంతమసజాల (ఘోరసంసారంలోని వికృతులనే తిమిరాలను) పోగొట్టి, సూరి – చేత – రుచిర – అబ్జ – బోధన రతుండగు (విద్వాంసుల హృదయాలనే పద్మాలను వికసింపజేయ గలవాడగు) దివ్యున్, మునిపూజితున్, పరాశర తనూజుడైన వ్యాసమహర్షిని, భూరి యశోవిరాజితుణ్ణి, అంభోరుహ మిత్రుడైన సూర్యుని వంటి వాణ్ణి సేవించెదను గాక!”

అనగా మహాభారతం –  తృతీయాశ్వాసం – వ్యాసముని జననవృత్తాంతాన్ని  తెలిపే పద్యంలో  గల “వెలిగించు” అనే పదానికి కావలసిన నేపథ్యము, అన్వయమూ, మహాభారతం –  ప్రథమాశ్వాసం – భారతావతారికలో వ్యాసమునిని ప్రస్తుతించే  పద్యంలోనే మనకు లభింప గలవని ఈ రెండు పద్యాల పరిశీలన మనకు విశదం చేస్తున్నది.

Also read: మహాభారతం – ఆదిపర్వం: ద్వితీయాశ్వాసం – వాసుకి తల్లి శాపానికి వెరచుట

నేటి ఘట్టం అన్యాపదేశంగా భారతీయ సాంస్కృతిక మూలాలను తెలియజేస్తుంది. ఆర్యులు శ్వేత వర్ణులు. ద్రావిడులు నీలదేహులు. గంగ తెల్లనిది. యమున నల్లనిది. శంతనుని మొదటి పత్ని గంగానది. ఆమె తనయుడే భీష్ముడు. శంతనుని రెండవ పత్ని యోజనగంధి (సత్యవతి). యమునానదియే యోజనగంధికి  జీవగఱ్ఱ. ఆమెకు పరాశరమునిచే జన్మించిన వాడే  వేదవ్యాసుడు. అతడు కృష్ణవర్ణుడు.  జాహ్నవీనది, యమున, త్రివేణి వద్ద సంగమించినట్లే, భీష్ముడు, వ్యాసుడు, భారతగాథలో సైతం సంగమిస్తారు. తమతమ భిన్న పద్ధతుల్లో భారతకథా స్రవంతి వెళ్లే మార్గాన్ని వారు నిర్దేశిస్తారు. రానురాను దాన్ని అట్లా నిర్దేశించలేక జరిగే కథకు కేవలం సాక్షులుగా మిగులు తారు. ఒకరు అఖండ శౌర్యానికి , త్యాగానికి ప్రతీక. మరొకరు అనంత జ్ఞానానికి, సామాజిక, సాంస్కృతిక పునురుజ్జీవానికి సంకేతం. ఆర్య, ద్రావిడ నాగరకతలు సంగమించిన తరతరాల భారతీయ చరిత్రకు వ్యాసముని విరచితమైన భారతం నిలువెత్తు దర్పణం.

ప్రాచీన భారత చరిత్ర ఆనవాళ్ళు లేకుండా పోయినా,  క్రీస్తు పూర్వమే రచింపబడ్డ  భారతసంహితలో ఆ చరిత్ర జీవిస్తూనే వున్నది. కాకపోతే భారతంలో నిక్షిప్తం చేయబడ్డ యీ దేశచరిత్ర ప్రతీకాత్మకమైనది.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం

కథాకావ్యాలు రచిస్తున్నప్పుడు, కవి, కథకునిగా కూడా అవతారం ధరిస్తాడు. కథకునిగా, కథ పఠితకు చదవడానికి సులభతరంగా ఉండడానికీ, కథ వేగంగా  ముందుకు సాగడానికీ, రచన శ్రవణసుభగంగా ఉండడానికీ, పఠిత మనసుకు హత్తుకొనే విధంగా ఉండడానికీ, నన్నయ అవలంబించే సాంకేతికమైన మెలకువలనేకం. ఆ మెలకువల్లో ఆయన తరుచుగా వాడే వృత్యను ప్రాసాప్రయోగం వొకటి. అట్టి శైలీవిన్యాసానికి నేటి ఘట్టంలోని వచనం ఒక ఉదాహరణ. గమనించండి:

పరాశ”రుండు” సత్యవతి కోరిన వరంబులిచ్చి నిజేచ్ఛ నరిగె;”

నంత కృష్ణద్వైపాయ”నుండు”ను

కృష్ణాజిన పరిధాన కపిల జటామండల” “దండ” “కమండలు” “మండితుండై” తల్లి ముందట నిలిచి”

ఇదే నన్నయ కథకునిగా వేషాన్ని త్యజించి, స్వయంగా తానొక మహర్షియై కవితాసమాధిలో మునిగి ఏకాగ్రతావృత్తితో రచించే విధానమే వేరు. ఉపరిచరునికి రేతస్యందమయ్యే ఘట్టంలో నన్నయ లేఖిని నుండి జాల్వారిన పద్యమే ఇందుకు ఉదాహరణ. చూడండి:

Also read: మహాభారతం ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – గరుత్మంతునికి తల్లి వినత ఆశీస్సులు

పలుకుల ముద్దును, కలికి క్రాల్కన్నుల తెలివును, వలద చన్నుల బెడంగు

అలఘ కాంచీపదమ్ముల యొప్పును, లలితాననేందు మండలము రుచియు

అళినీల కుటిల కుంతలముల కాంతియు

నెలజవ్వనంబున విలసనమును

అలస భావంబున పొలుపును, మెలుపును,

కలుగు నగ్గరికను తలచి తలచి”

పద్యపాదాలన్నింటినీ సంపూర్ణంగా ఆవరించి, ఉపరిచరుని ఏకగ్రతావృత్తికి సంకేతంగా సాక్షాత్కరించే “ల” కార ప్రాస  మినహా, ఎట్టి భాషాడంబరమూ ఈ పద్యంలో కానరాదు. భావమెంత సాత్వికమైనదో, భాష కూడా అంత మృదువుగా, సుకుమారంగా కొనసాగే అరుదైన పద్యరత్నమిది. మానవులకు దైనందిన జీవితంలో వ్యక్తిగతంగా అనుభవైకవేద్యమైన ఈ పద్యంలో ప్రతి పఠితా అప్రయత్న పూర్వకంగా తనను ఊహించుకొని, పద్యభావంలో మమేకం చెందే రచన యిది. దీన్ని పఠించడంలో పఠిత ఒకానొక అనిర్వచనీయమైన మధురరక్తిని, రసానుభూతిని అనుభవిస్తాడు. ఇట్టి  రచనలు ప్రపంచసాహిత్యంలో చాల అరుదుగా  లభిస్తాయి.

ఇట్టి పద్యాలను రచించే వేళ కవి అనుభవించే స్థితిని లాక్షణికులు “సారస్వత సమాధి”గా పేర్కొంటారు. కధాకథనంలో కాలం పరిగెడుతుంది. సారస్వత సమాధి దశలో కాలం స్తంభించి పోతుంది.

పద్యనిర్మాణము, పద్యంలోని భావము, సరిసమానంగా తులతూగడానికి, ఏకాగ్రతావృత్తి గల కవితాసమాధి ఆవశ్యకం. కవితాసమాధిలో ఏకాగ్రత లోపించినప్పుడు, భావం నిసర్గ రమణీయమైనప్పటికీ, నిర్మాణం అసమగ్రమై, పఠితకు ఆనందానుభూతిని కలిగించదన్నదే పాశ్చాత్య లాక్షణికుడైన క్లైవ్ బెల్ సిద్ధాంతం.

 పైన పేర్కొన్న పద్యంలో నన్నయను ఆవరించిన కవితా సమాధిలోని ఏకాగ్రత ఋషితుల్యులకే సాధ్యం. ఆ కారణం చేతనే నన్నయ పద్యరచనలో పద్య నిర్మాణము, అందులోని గంభీరమైన భావమూ, సమతుల్యంగా వుండి “హ్లాదైక మయీమ్, అనన్య పరతంత్రామ్, హే భారతీ కవేః “ అనే పలుకును సార్థకం చేస్తాయి.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – గరుత్మంతుని జననం

ఆదిముని వేదవ్యాసుని జన్మకు కారకుడైన పరాశర మహర్షిని

బ్రహ్మ సమానునిగా నన్నయ భట్టారకుడు ప్రస్తుతిస్తున్నాడు. అదే సమయంలో సత్యవతిని ఆ మహాముని తాత్కాలిక ప్రయోజనానికి వాడుకోవడాన్ని ఆయన నిరసిస్తున్నాడు. “పరాశరుండు సత్యవతి కోరిన వరంబులిచ్చి నిజేచ్ఛ నరిగె” అని నన్నయ పేర్కొనడంలో  దుఃఖం దాగి వున్నది.

ఇందుకు భిన్నంగా, కృష్ణద్వైపాయనుడు, సద్యోయవ్వనుడై తల్లి ముందు నిలిచి రెండు చేతులనూ జోడించి మొక్కి, “అమ్మా! మీకు నాతో పనిబడినప్పుడు పిలవండి. మీ సమక్షంలో వచ్చి వ్రాలుతాను” అనే వాగ్దానంలో సభ్యమానవజాతి గౌరవించే మాతృధర్మం ఇమిడి వున్నది. ఒక తనయునికి స్తన్యమిచ్చి రక్షించే తల్లి మరొక పురుషునికి భోగవస్తువు కావడమే ఈ సృష్టి లోని ఒక క్రూరమైన సత్యం.

అపరిచిత పురుషులకు తమ శీలాన్ని బలి కావించిన అభాగినులు ఈ  కర్మధాత్రిపై అనేకులు.  నిర్భయ, బిల్కిస్ బానోల వృత్తాంతాలు హైందవజాతికి గర్వకారణం కానేరవు.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – కద్రూవినతల వృత్తాంతం

పురుషుల్లో గల ఈ ద్వంద్వ మనస్తత్వాన్ని దుఃఖ పరవశంతో ఏకరువు పెట్టే కవిత, ఒక తనయునిగా, గతించిన తన తల్లిని ఉద్దేశిస్తూ జాన్ మేస్ ఫీల్డ్ రచించినది. చిత్తగించండి:

“In the dark womb where I began

My mother’s life made me a man

Through all the months of human birth

Her beauty fed my common earth

I cannot see, nor breathe nor stir

But for the death of some of her;”

“Down in the darkness of the grave

She cannot see the life she gave

For all her love she cannot tell

Whether I use it I’ll or well

Nor knock at dusty doors to find

Her beauty dusty in the mind”

“If the grave’s gates could be undone

She would not know her little son

I am so grown. If we could meet

She would pass by me in the street

Unless my soul’s face let her see

My sense of what she did for me”

“What have I done to keep in mind

My debt to her and womankind

What woman’s happier life repays

Her for those months of wretched days?

For all my mouthless body leeched

Ere Birth’s releasing he’ll was reached?”

“What have I done; or tried, or said

In thanks to that dear woman dead

Men trample women’s rights at will

And man’s lust roves the world untamed!”

“O Grave, keep shut, lest thou be ashamed!

Also read: మహాభారతం – ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – కద్రూవనితల సముద్ర తీర విహారం

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles