Friday, April 26, 2024

మహాభారతం – ద్వితీయాశ్వాసం – పరీక్షిత్తు దుర్మరణం చెందడానికి నేపధ్యం

మధ్యాక్కర

ధరణి చరాచర భూతసంఘంబు తమ విషవహ్ని

నురగంబులేర్చుచు నునికి గలిగి, పయోరుహ గర్భు

డురగ విషాపేతజీవ సంజీవనోపదేశంబు

కరుణ కశ్యపునకు నిచ్చె నఖిల లోకహితంబు పొంటె”

నన్నయ భట్టారకుడు

పద్యార్థం:

“భూతలంపై గల పన్నగకోటి తమ విషవహ్నిచే చరాచర భూతసముదాయాన్ని కాల్చి వైచడం చూసి అలిగిన సృష్టికర్త అట్లా ఉరగవిషం వల్ల మృతిచెందిన వారిని పునురుజ్జీవింప జేసే మంత్రోపదేశాన్ని దయతో కశ్యపమునికి ప్రసాదించినాడు”

జరిగిన కథ

తల్లి కద్రువ శాపప్రభావంచే జనమేజయుడు నిర్వహింపబోయే సర్ప యాగంలో సమస్త సర్పకులం నాశనం కాక తప్పదని సర్పశ్రేష్ఠుడైన వాసుకి కద్రూతనయుల ఎదుట  భయాందోళనను  వ్యక్తం చేసినప్పుడు, సర్పకుమారుల్లో ఒకడైన ఏలాపుత్రుడు ఇట్లా అంటాడు: “తల్లి కద్రువ శాపమిచ్చే వేళ, నిద్రపోతున్నట్లు నటిస్తూ, బ్రహ్మకు, దేవతలకు, మధ్య సంభాషణను విన్నాను. బ్రహ్మ దేవతలతో ఇట్లా అన్నాడు: కద్రువ శాపం ఘోరమైనప్పటికీ, క్రూరరూపులు, లోకహాని కలిగించే వారు గనుక సర్పజాతి వినాశనానికి ఒప్పు కోవలసి వచ్చింది. కానీ, జరత్కారుడనే మహామునికి, జరత్కారువుకు జన్మించబోయే ఆస్తీకుడనే మహాముని జనమేజయుని సర్పయాగప్రళయం నుండి సర్పజాతిని కాపాడతాడు”.

ఈ మాటలు విన్న సర్పకుమారులకు సంతోషం కలుగుతుంది. జరత్కారుడు, జరత్కారువును పాణిగ్రహణం ఎప్పుడు చేస్తాడా అని సర్పకుమారులందరూ ఎదురుచూడడం మొదలుపెడతారు. వాసుకి చెల్లెలి పేరు జరత్కారువు.

Also read: మహాభారతం – ఆదిపర్వం: ద్వితీయాశ్వాసం – వాసుకి తల్లి శాపానికి వెరచుట

జరత్కారుని వృత్తాంతం

యాయావర వంశోత్తముడు, పరమతపోనిధి, నియమవంతుడు, లోకోత్తరుడైన జగత్కారుడనే మహాముని ఘోరవ్రతాలను ఆచరిస్తూ, వివాహానికి విముఖుడై కాలం వెళ్ళబుచ్చుతుంటాడు. అడవిలో చరిస్తూ, ఒకసారి, నీటిపడియలో, ఎలుకలచే కొరకబడి, ఒక్క వేరు మాత్రమే మిగిలి వున్న ఔరుగడ్డి దిబ్బను పట్టుకొని ఆదిత్యకిరణాలే ఆహారంగా తలక్రిందుగా వ్రేలాడుతున్న మునిగణాన్ని చూస్తాడు. “భయంకరమైన ఈ తలక్రిందుల తపస్సు ఎందుకు చేస్తున్నారు?” అని అతడడుగగా, వారంటారు: “మా వంశంలో జరత్కారుడనే పాపాత్ముడు పెళ్ళి చేసుకోవడానికి, సంతానం కలిగి వుండడానికీ విముఖుడు. మేమతని పితలం, పితామహులం. అతడు పెళ్ళి చేసుకుంటేనే మాకు విముక్తి. లేకపోతే అధఃపాతాళమే మాకు గతి.”

ఈ మాటలు విన్న జరత్కారుడు అతి కారుణ్యచిత్తుడై, వివాహం చేసుకోవాలని నిశ్చయించు కుంటాడు. కానీ తాను చేసుకోబోయే కన్యపేరు, తన పేరు, ఒకటే వుండాలని నియమం పెట్టుకుంటాడు. ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న వాసుకి తన చెల్లెలు జరత్కారువును, జరత్కారుని వద్దకు పిలుచుకొని వెళ్ళి, ఆ మహామునితో అంటాడు:

ధన్యంబయ్యె భవత్కులంబు, అతి కృతార్థంబయ్యె నస్మత్కులంబు,

అన్యోన్యాను గుణాభిధానముల చిత్తానంద మొందెన్ వివే

కన్యాయాన్విత భూసురోత్తమ! జరత్కారూ! జగన్మాన్య! యి

క్కన్యాభిక్ష పరిగ్రహింపుము జరత్కారున్ మదీయానుజన్!”

వాసుకి చెల్లెలు జరత్కారువుకు, మహాముని జరత్కారునికి నామసామ్యం కలగడంచే జరత్కారుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. కానీ ప్రథమ సమాగమంలోనే ఆమెతో ఇట్లా అంటాడు: “నాకు నీవెన్నడైనా అవమానం చేస్తే నిన్ను విడిచిపెట్టి పోతాను!”.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం

జరత్కారువు అత్యంత భక్తిశ్రద్ధలతో పతిసేవ చేస్తుంది. అనురక్తితో గర్భం పొంది సాక్షాత్తు సూర్యుడే గర్భంలో వున్న తూర్పుదిక్కు వలె ప్రకాశిస్తుంది.

ఒకనాడు భార్య తొడపై పడుకొని జరత్కారుడు నిద్రపోతున్న సమయంలో, సంధ్యాకాలం సమీపిస్తుంది. మహామునులు సాంధ్యవేళ ఆచరించవలసిన కర్తవ్యం జ్ఞాపకం వచ్చి “భర్తను మేలుకొలపాలా వద్దా” అనే ధర్మ సంఘర్షణ జరత్కారువు మనస్సులో చెలరేగుతుంది. చివరకు లేపాలనే నిర్ణయించుకొని భర్తను తట్టి లేపుతుంది. “అనఘా! సాంధ్యకృత్యాలకు లోపం కలగగూడదని నిన్ను మేల్కొల్పవలసి వచ్చింది” అన్న జరత్కారువుపై భర్త జరత్కారునికి కోపం వస్తుంది.

“నేను మేల్కొనేవరకు సూర్యుణ్ణి అస్తమించవద్దని చెప్పలేవా? నీవు నాకు అవమానాన్ని తలబెట్టినావు. నీవద్ద నేనుండలేను. ఈ విషయం నీకు ముందే చెప్పినాను” అంటూ జరత్కారుడు నిజపత్నిని వీడి వెళ్ళిపోతాడు.

వెళ్ళేముందు అంటాడు: “నీ కడుపులో వున్న కొడుకు సూర్యునితో, అగ్నితో, సమానమైనవాడు. నీవు విచారం వీడి నీ అన్న వద్ద వుండు!”. 

Also read: మహాభారతం ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – గరుత్మంతునికి తల్లి వినత ఆశీస్సులు

అపూర్వతేజుడు, సంసారబంధాలను తిరస్కరించిన ఆస్తీకుడు అపూర్వకాంతితో జరత్కారువుకు జన్మిస్తాడు. పెరిగి, చ్యవనమహర్షి కుమారుడైన ప్రమతి వద్ద సకల వేదవేదాంగాలను, శాస్త్రాలను అధ్యయనం చేస్తాడు.

Story of Raja Parikshit and snake sacrifice by Janmejaya – freeflow
ముని మెడలో చచ్చిన పామును వేస్తున్న పరీక్షిత్తు

పరీక్షిత్తు – ముని శాపం

అభిమన్యునికి, విరాటరాజు ఉత్తరకు జన్మించిన వాడు పరీక్షిత్తు. పవిత్రచరిత్రుడై భూతలాన్ని కాపాడుతూ అరవై ఏండ్లు రాజ్యమేలిన రాజశ్రేష్ఠుడు. ఒకనాడు మృగయావినోదియై అనేక జంతువులను సంహరించి, చివరకొక లేడివెంట పడతాడు. పరీక్షిత్తు బాణం తగిలిన లేడి తప్పించుకొని పోతుంది. వ్యాకులచిత్తుడై వెదకుతూ, ఎదుట “సంతత క్షమదమా సమన్వితుడై” తపస్సులో మునిగిన శమీకుడనే మునిని చూసి “లేడి ఏ వైపుకు పోయింది?” అని పరీక్షిత్తు ప్రశ్నిస్తాడు. మౌనవ్రతుడైన శమీకుడు ప్రత్యుత్తరం ఇవ్వకపోయేసరికి కోపంతో దగ్గరనే కనబడ్డ ఒక చచ్చిపోయిన పామును ముని మెడలో వేసి పరీక్షిత్తు తన రాజధాని హస్తినాపురికి వెళ్ళిపోతాడు.

శమీకమహాముని కొడుకు శృంగి.  మహామునియై బ్రహ్మను గూర్చి పరమభక్తితో ఘోరతపస్సులో మునిగి వున్న శృంగికి తన తండ్రి మెడలో పరీక్షిత్తు చచ్చిన పామును దండగా వేసిపోయిన విషయం తెలుస్తుంది. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో శృంగి, శాపజలాన్ని చేతిలోకి తీసుకొని: “నిర్జనారణ్యంలో ఇంద్రియాలను నిగ్రహించి మౌనవ్రతం పూని తపస్సు చేసే సమ్యమీంద్రుణ్ణి,  దూడలు పాలుత్రాగేటప్పుడు,  ఆవుల పొదుగుల నుండి వెలువడే క్షీరఫేనమే ఆహారంగా స్వీకరించే మహావృద్ధుడైన నా తండ్రిని అవమానించిన పరీక్షిత్తు, నేటి నుండి ఏడురోజుల్లో, తక్షకుడనే సర్పరాజు యొక్క విషాగ్ని దగ్ధుడై యమసదనానికి అరుగును గాక” అంటూ జలాన్ని వదలి పెడతాడు.

తక్షణమే శృంగి తండ్రి వద్దకు వెళ్ళి ఆయన మెడలో వున్న పాము శవాన్ని తీసిపారవేస్తాడు. సమస్తం మరచి పరమాత్మ ధ్యానంలో నిమగ్నమైన శమీకునికి నమస్కరించి కన్నీరు నిండిన నేత్రాలతో ఆయనకు జరిగిన సంగతిని విన్నవిస్తాడు.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – గరుత్మంతుని జననం

కుమారుని ద్వారా శాప విధానాన్ని తెలుసుకున్న శమీకుడు మిగుల దుఃఖించి, ఇట్లా అంటాడు:

క్రోధము తపముం చెఱచును

క్రోధమ అణిమాదులైన గుణముల బాపుం

క్రోధమ ధర్మక్రియలకు

బాధ యగుం క్రోధిగా తపస్వికి జన్నే?”

“క్షమాగుణాన్ని వీడి నీవు దృష్టాదృష్ట విరుద్ధమైనదీ, మునులకు తగనిదీ ఐన క్రోధంతో సమస్త భూతలాన్నీ రక్షించే పరీక్షిన్మహారాజుకు శాపమిచ్చి చెడు చేసినావు. ఈ రాజులు రక్షింపబట్టే కదా మహామునులు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ, వేదవిహితమైన కర్మలు నిర్వహిస్తూ శక్తిమంతులై జీవిస్తున్నారు. ఈ పరీక్షిత్తు సామాన్యమైన రాజనుకున్నావా? నీ శాపాన్ని పరిహరించుకొ!”

సమాధానంగా శృంగి “కోపంతో శాపం ఇచ్చినాను. ఈ పాటికి దాని ప్రభావం తక్షకునికి ప్రాకి వుంటుంది. నా శాపం అమోఘమైనది” అంటూ శాపాన్ని వెనక్కు తీసుకోవడానికి నిరాకరిస్తాడు. దానితో చేసేది లేక, శోకాకులచిత్తుడై, శమీకమహాముని తన శిష్యుడైన గౌరముఖుణ్ణి పిలిచి  పరీక్షిత్తు వద్దకు వెంటనే వెళ్ళిరమ్మని, వెళ్ళి ఆయనకు జరిగిన వృత్తాంతాన్ని, శాపవిధానాన్ని తెలియజేయమని, “తక్షకుడు తన్ను కాటు వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా”  చెప్పమనీ ఆదేశిస్తాడు.

గౌరముఖుడు పరీక్షిత్తు చెంతకు వెళ్ళి జరిగిన విషయం నివేదించి వెళ్ళిపోతాడు. కలత చెందిన హృదయంతో పరీక్షిత్తు తన ఆప్తులను, మంత్రులను, సేవకులను, పిలిపించుకొని, వారి సలహా మేరకు ఒంటిస్తంభం మేడ కట్టుకొని దానిలోనే  పటిష్టమైన రక్షణతో నివసించడం ప్రారంభిస్తాడు.

సర్పరాజైన తక్షకుడు శృంగి శాపవచనంచే ప్రేరేపింపబడి, పరీక్షిత్తు వద్దకు చేరుకొనే ఉపాయాన్ని, అతణ్ణి కాటువేసే మార్గాన్నీ ఆన్వేషిస్తుంటాడు.

పాముల విషంచే మరణించిన వారిని పునురుజ్జీవింపజేసే మంత్రోపదేశాన్ని బ్రహ్మచే ప్రసాదింప జేసుకున్న కశ్యపుడు (నేటి పద్యం) ఇట్లా ఆలోచిస్తాడు: “వారం దినాలలోగా తక్షకుని విషంచే మృత్యువాత పడమని పరీక్షిత్తుకు శృంగి శాపమని తెలిసింది. ఇప్పటికి ఏడు దినాలైనది. నేను వెళ్ళి విగతజీవి యైన పరీక్షిత్తును మళ్లీ జీవింపజేసి నా విద్యను ప్రదర్శింపడమే గాక, కీర్తిని, ధనాన్ని, అతని నుండి పొందుతాను”.

ఇట్లా ఆలోచించి, కశ్యపుడు, పరీక్షిత్తును కలవడానికి వెళుతుండగా, ముసలి బ్రాహ్మణుని వేషంలో తక్షకుడు మార్గమధ్యంలో ఎదురుపడి “మునీంద్రా! ఎక్కడకు వెళుతున్నారు?” అని ప్రశ్నిస్తాడు. కవ్యపుడతనికి జరిగిన విషయం చెబుతాడు.

అతని సమాధానం విని తక్షకుడు: “మునీంద్రా! నేనే తక్షకుణ్ణి. నీ మందులు, మంత్రాలు నా యందు పనిచేయవు.”ఈ మాట చెప్పి తక్షకుడు, కట్టెదుట గల పెద్ద వటవృక్షాన్ని కాటు వెయగానే ఆ చెట్టు కాలి భస్మమై పోతుంది.

“వీలైతే ఈ చెట్టును బ్రతికించు! చూద్దాం” అని తక్షకుడు సవాలు విసురుతాడు. కశ్యపుడు కాలిపోయిన మఱ్ఱిచెట్టు బూడిదను ప్రోగుచేసి తన మంత్రప్రభావంతో అ చెట్టు ఎప్పటివలె ప్రత్యక్షమయ్యేట్లు చేస్తాడు. అదిచూసి తక్షకుడు “మునివర్యా! నీ విద్యాబలంతో ఈ చెట్టు సంజీవితం కావచ్చు. కానీ అతికుపితుడైన శృంగిచే శపింపబడి చచ్చిపోయిన పరీక్షిత్తు మళ్లీ బ్రతికే అవకాశమే లేదు. రాజుకన్న ఎక్కువ ధనాన్ని ఇస్తాను. అది తీసుకొని వెళ్లి పో” అంటాడు. తన దివ్యజ్ఞానంతో విషయం గ్రహించిన కశ్యపుడు తక్షకుని వద్దనుండి అపారమైన సంపదను గ్రహించి తిరిగి పోతాడు.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – కద్రూవినతల వృత్తాంతం

పరీక్షిత్తు దుర్మరణం

కశ్యపమహర్షిని వెనక్కు మరలింపజేసి, తక్షకుడు సర్పకుమారులను పిలిచి: “మీరు బ్రాహ్మణరూపం ధరించి, సువాసన గల పుష్పాలను, రుచికరమైన ఫలాలను, ఆకుల్లోనూ, బుట్టల్లోనూ పెట్టుకొని పరీక్షిత్తు వద్దకు వెళ్ళండి. నేను అదృశ్యరూపంలో మీ వెంటే వస్తాను” అని పురమాయిస్తాడు. శృంగి విధించిన ఏడు దినాల గడువు ముగిసే కాలం సమీపిస్తుంది. వేదపాఠాలు మనోహరంగా వల్లె వేస్తూ వచ్చే కుహనా విప్రకుమారులను పరీక్షిన్మహారాజు ఆనందంతో దగ్గరకు ఆహ్వానించి, వారు తెచ్చిన పూలు, పండ్లు స్వీకరిస్తాడు. వారందరినీ తగిన కానుకలతో వీడ్కొల్పి, “శృంగి పెట్టిన గడువు ముగుస్తున్నది. అస్తాద్రిలో సూర్యుడు అస్తమిస్తున్నాడు” అంటూ అందరికీ పళ్ళు పంచిపెట్టి, తానూ ఒక పండును తినబోతాడు. ఆ పండులోకి నల్లని పురుగై ప్రవేశించిన తక్షకుడు, ఎఱ్ఱని పామై, తన విషాగ్నితో పరీక్షిత్తును కాటు వేస్తాడు. అక్కడి వారందరూ భయభ్రాంతులతో బైటికి పరుగెత్తి పోగా, పరీక్షిత్తుతో బాటు ఒంటిస్తంభం మేడ కూడా తక్షకుని విషానలంలో దగ్ధమై పోతుంది.

పరీక్షిత్తు మృతికి కారకులు

పాండవ వంశంలో మణిదీపం వంటి వాడు పరీక్షిత్తు. పాండవ వంశాన్నే నాశనం చేయడానికై అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం ఉత్తర గర్భస్థ శిశువును కూడా తాకింది. తత్ఫలితంగా ఉత్తర మృతశిశువుకు జన్మనిచ్చింది. శ్రీకృష్ణుడు తన దివ్యశక్తితో బ్రతికించిన శిశువే పరీక్షిత్తు. జగజ్జనానురంజకంగా భూతలాన్ని పాలించిన పరీక్షిన్మహారాజు తన మెడలో చచ్చిన పామును వేసినందుకు శమీక మహామునికి ఆగ్రహం కలుగదు. “మృగయావినోదియై ఆకలిచే, దప్పికచే, అలసటచే చేసిన అవమానమిది. ఆ అవమానాన్ని నేనే సహించినప్పుడు నీకెందుకు అభ్యంతరం? పరీక్షిత్తు మహాత్ముడు. అతనిపై నీ శాపాన్ని మరల్చు” అని తన కుమారుడైన శృంగిని శమీకుడు ఎంతో బ్రతిమలాడతాడు. కొడుకు వినడు. “నా వచనంబు అమోఘ”మని చెబుతూ శాపాన్ని మరల్చడానికి శృంగి నిరాకరిస్తాడు.

పరీక్షిత్తు చావుకు మరొక కారకుడు కశ్యపమహర్షి. పాము విషంచే మరణించిన వారిని పునురుజ్జీవింపజేసే మృతసంజీవినీ విద్య బ్రహ్మ దేవునిచే ఇతనికి ప్రసాదింపబడింది. ఆ విద్యను వాడి తక్షకుని విషాగ్నిచే దగ్ధమై పోయిన వటవృక్షాన్ని పునురుజ్జీవింపజేసిన కశ్యపుడు, సమస్త హస్తిన రాజ్యానికే మహావటవృక్షం వంటి వాడైన పరీక్షిత్తును బ్రతికించే బదులు, మాయావి తక్షకుని వద్ద అపారసంపద గ్రహించి కర్తవ్యవిమూఢుఢై తన దారిన తాను పోతాడు. ఇక ప్రత్యక్షంగా చంపిన తక్షకుడు జగన్నాటకంలో పాత్రధారి. ఇతరులే ఈ నాటకంలో సూత్రధారులు.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – కద్రూవనితల సముద్ర తీర విహారం

ధర్మసంఘర్షణ

విధి బలీయమా లేక మానవ సంకల్పం బలీయమైనదా? అన్న సంఘర్షణ తరతరాలుగా ప్రపంచపు తత్త్వవేత్తల మనస్సులను కలుస్తూనే వున్నది. పరీక్షిత్తు వృత్తాంతంలోనూ ఈ ధర్మసంఘర్షణ వున్నది.

శృంగి శాపమే బలీయమైతే, కశ్యపమహర్షి చేసినది న్యాయసమ్మతం అనక తప్పదు. పరీక్షిత్తు పాము కాటుకు గురయ్యే సమస్త మానవకోటికీ ప్రతీక. పరీక్షిత్తు శాపగ్రస్థుడైతే, పాము కాటుకు గురైన ప్రతి మనిషీ శాపగ్రస్థుడే. పాముకాటుకు గురైన ప్రతి బాధితునికీ వైద్యసహాయం అందగలిగినప్పుడు, పరీక్షిత్తుకు సైతం బ్రహ్మచే కశ్యపమహర్షి పొందిన మృతసంజీవిని వైద్యఫలాలు అందవలసిన అగత్యం వున్నది. అట్లా అందకపోవడం సృష్టికే అపచారం. కాసులకు ఆశపడి తమకు జన్మతహః అలవడిన అమూల్య విద్యా ఫలాలను సమాజ శ్రేయస్సుకై వెచ్చించని వారిలో ఒకరిగా కశ్యప పాత్రను వ్యాసమహర్షి సృజించినట్లుగా అభిప్రాయం కలుగుతుంది.

మానవసంకల్పం – జరత్కారుడు

జరత్కార మునీంద్రుడు పత్ని తొడపై తల పెట్టుకొని  పడుకొని వుండగా, “సూర్యుడు అస్తమిస్తున్నాడు. సాంధ్యకృత్యాలకు సమయం ఆసన్నమైంది” అని ఆమె ఆయనను తట్టి లేపుతుంది. కోపంతో అతడంటాడు: “సూర్యుణ్ఢి నేను లేచేవరకు అస్తమించవద్దని చెప్పలేవా?”  ఆయన అట్లా అనడం యోగసిద్ధి సాధించిన మానవుడు ప్రకృతిని శాసింపగలడనే దృక్పథానికి ప్రతీక. ఆయన కొడుకు ఆస్తీక మహాముని సైతం ఇదే విశ్వాసం కలవాడు. కద్రువ శాపానికి విరుద్దంగా జనమేజయుని సర్పయాగాన్ని ఆపు చేయిస్తాడు. మానవప్రయత్నం యొక్క ప్రాముఖ్యత గూర్చి, సంకల్పబలాన్ని గూర్చీ,  ఎల్లా వీలర్ విల్కాక్స్ అనే ఆంగ్లకవి ఏమంటాడో చూద్దాం:

“There is no chance, no destiny, no fate

Can circumvent, or hinder, or control

The firm resolve of determined soul.

Gifts count for nothing; will alone is great;

All things give way before it soon or late.

What obstacle can stay the mighty force

Of the sea-seeking river in its course,

Or cause the ascending orb of the day to wait?

Each well-born soul must win what it deserves.

Let the fool prank of luck. The fortunate

Is he whose earnest purpose never swerves

Whose slight action or inaction serves

The one great aim. Why even death stands still

And waits an hour sometimes for such a will!”

 అన్ని దేశాల న్యాయశాస్త్రాల్లోనూ ఒకటే సూత్రం. హంతకులు శిక్షార్హులు. కానీ యజ్ఞకుండలిలో పడకుండా తక్షకుణ్ణి ఆస్తీకుడు రక్షిస్తాడు. దీని అంతరార్థం నేరస్థుణ్ణి శిక్షించడం కన్న క్షమాభిక్ష ప్రసాదించడమే ఉదాత్త మానవుని కర్తవ్యం.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం – దేవదానవ యుద్ధం

గాడి తప్పిన ధర్మం

నిస్సహాయుడై మానవోత్తముడైన పరీక్షిత్తు దుర్మరణం చెందడం గాడి తప్పిన యుగధర్మానికి సంకేతం. ఈ ధర్మసంఘర్షణ ఆదికవి నన్నయ భట్టారకుని హృదయాన్ని కలచివేసిందనే అభిప్రాయం కలుగుతున్నది.

జరత్కారుని వృత్తాంతంలో ఆదికవి పద్యమొకటి “తరువోజ” లో వున్నది. రెండు ద్విపద పాదాలు కలిస్తే “తరువోజ” అవుతుంది. అనగా “ద్విపద” “చతుష్పాద” గా మారుతుంది. ధర్మం కూడా నాలుగు పాదాలపై నడుస్తుంది. తెలుగులో కావ్యాలు వెలువడని కాలంలో  ఆనాటి ఒకానొక రాజశాసనం “తరువోజ” లో వున్నది.

జరత్కారుని పిత, పితామహుడు, ప్రపితామహులందరూ అంగుష్ఠమాత్రపు దేహంతో తమ వారసుడు వివాహమాడి వంశాన్ని ఉద్ధరించాలని చేస్తున్న ఘోరతపస్సు చూసి చలించిపోయిన జరత్కారుడు కన్యాన్వేషణలో పడడాన్ని వర్ణించే పద్యమిది. జరత్కారుని సున్నితమైన మనస్సును, ధర్మనిష్ఠను, పాపరాహిత్యాన్ని ఈ పద్యం తెలుపుతుంది.

అనవరతప్రయాస ఖేదమున అతికృశంబగుచున్న అంగంబు నందు

తనరి యేర్పడ సిరల్, దద్ధయు ముదిమి తల వడంకుచు నుండ, తన పితృవరుల

ఘనముగా ఊర్థ్వాభిగమనుల జేయగడగి వివాహంబుగా జరత్కారు

డనఘుండు తనకోర్కి కనురూప యైనయట్టి కన్యక కానడయ్యె మర్త్యమున”

ఇదే నన్నయ భట్టారకుడు (నేటి పద్యం) బ్రహ్మచే మృతసంజీవిని విద్యపొందిన కశ్యపమహర్షిని పరిచయం చేసేటప్పుడు “మధ్యాక్కర” వృత్తాన్ని ఉపయోగిస్తాడు. మధ్యాక్కరలో కూడా రెండు ద్విపదలు కలిసి ఒకపాదం ఏర్పడుతుంది. కాకపోతే మూడు ఇంద్రగణాలకు బదులు రెండు ఇంద్రగణాలే ఒక్కొక్క ద్విపదలోనూ వుంటాయి. అనగా నాలుగు పాదాల ధర్మంలో “కుంటిదనం” ఏర్పడిందనే భావం కలిగిస్తుంది.

రెండవ విషయం, కశ్యపుణ్ణి పరిచయం చేసే పద్యం స్ధూలదృష్టికి సమగ్ర భావవిలసితమైన మధ్యాక్కర. కానీ సూక్ష్మంగా చూస్తే అసంపూర్ణ సీసపద్యం ఈ పద్యంలో “గర్భితమై” వున్నది. ఈ సీసపద్యం ఏర్పడడానికి బ్రాకెట్లలో వున్న అక్షరాలను తొలగించవలసివస్తుంది. అవి తొలగించకపోతే సీసపద్యం ఏర్పడదు. తొలగిస్తే పద్యంలో వాక్యనిర్మాణం జరగదు. సంపూర్ణ వాక్యనిర్మాణం లేనిదే  చెప్పదలచిన భావం వ్యక్తీకరించబడదు. పద్యం చదవండి:

ధరణి చరాచర భూత సంఘంబు త(మ విషవహ్ని)

ఉరగంబు రేర్చుచు నునికి కలిగి (పయోరుహగర్బు)

డురగవిషాపేతజీవ సంజీవనో (ప దేశంబు)

కరుణ కశ్యపునకు నిచ్చె నఖిల (లోక హితంబు పొంటె)

ధర్మం చతుష్పాది. “తరువోజ” కూడా (రెండు ద్విపదలచే) నాలుగు పాదాలపై ఏర్పడింది. ఈ నాలుగు పాదాలను చెరోవైపు ఖండిస్తే తప్ప “మధ్యాక్కర” ఏర్పడదు. నేటి మధ్యాక్కరలో కేవలం రెండు పాదాల సీసపద్యమున్నది. ఈ సీసపద్యం కూడా అసంపూర్ణం. బ్రాకెట్లలో గల అక్షరాలను జతచేయకపోతే ఈ సీస పద్యంలో అర్థం దొరకదు. అనగా చర్మచక్షువులకు సమగ్రసుందరంగా కనబడే సృష్టి ఒక అసంపూర్ణ ముఖచిత్రం. దీనిలో అనేక లోపాలున్నాయి. బ్రహ్మ లోకహితార్థమై తమకు ప్రసాదించిన విద్యకు జ్ఞానులనబడే వారు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ లోకంలో ధర్మము, సత్యము, మానవత్వము, రానురాను నశించిపోతున్నాయనీ, ఆ క్లేశాన్ని నిగూఢంగా ఆదికవి వ్యక్తపరుస్తున్నాడనీ అవగతం కాగలదు.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – దేవదానవులు క్షీరసముద్రాన్ని మధించడం

మరొక్కవిషయం:  లాక్షణికుల నిర్వచనం ప్రకారం మధ్యాక్కర వృత్తంలో యతిస్థానం ప్రతిపాదపు నట్టనడుమ వుంటుంది. కానీ నన్నయ పద్యంలో మాత్రం చిట్టచివరి ఇంద్రగణం మొదటి అక్షరంపై యతి వుంటుంది.

 ప్రాచీనకవుల్లో “మధ్యాక్కరను” వాడుకున్న వారు నన్నయ, ఎఱ్ఱాప్రగడ మాత్రమే. ఎఱ్ఱాప్రగడ కూడా అరణ్యపర్వశేషంలో ఒకేవొక మధ్యాక్కరతో సరిపెట్టుకున్నాడు. ఇతర ప్రాచీనకవులెవ్వరూ మధ్యాక్కరను ముట్టుకోలేదు.  ఆధునికయుగంలో ఈ ఛందోవిశేషాన్ని పునురుజ్జీవింప జేసిన వాడొక విశ్వనాథ మాత్రమే. మధ్యాక్కరలతో ఏకంగా ఒక కావ్యాన్నే అల్లినవాడు.

పరీక్షిత్తు గాథలో కశ్యపమహర్షి అధర్మంతో రాజీ పడినట్లే, మహాభారతగాథలో భీష్మ, ద్రోణ, కృపాదులు సైతం అధర్మంతో రాజీపడడం సర్వవిదితమే.

సత్యము, ధర్మము, పాపము చేత, బొంకు చేత చెడబారినప్పుడు దక్షులైన వారు ఉపేక్షించకూడదని భారతసంహిత బోధిస్తున్నది. ప్రతి తత్వవేత్తా, ప్రతి మహాకవీ, ఇదే బోధిస్తున్నాడు.

అధర్మం లోకమంతా వ్యాపించినప్పుడు, సత్యం,ధర్మం, చితికి చితికి చనిపోయినప్పుడు మళ్ళీ బ్రతికించడం ఎంత కష్టమో, పెరూదేశపు మహాకవి సేజర్ వల్లేజో చెబుతున్నాడు. స్పానిష్ భాషలో ఆయన రచనకు మహాకవి శ్రీశ్రీ తెనుగుసేత చిత్తగించ గలరు:

ఎక్కడ సత్యం

సత్యం శవాన్ని చూదామని

వచ్చాడొక మనిషి

చచ్చిపోకు నేస్తం” అన్నాడు

వొస్తున్నా” నన్నాడు

నిన్ను ప్రేమిస్తున్నా” నన్నాడు

కానీ పాపం శవం

కదల్లేదు నిజం

ఇద్దరు మనుష్యులు వచ్చారు

ఏదో అర్జీ తెచ్చారు

వదలొద్దు మమ్ము” ల్నన్నారు

వదలొద్దు ధైర్యం” అన్నారు

మళ్లీ రమ్మన్నాను

కానీ పాపం శవం

కదల్లేదు నిజం

ఇరవై, ముప్పై, వందా, వెయ్యి,

యాభై లక్షల మంది వచ్చారు

ప్రేమ బావుటా తెచ్చారు

ప్రాధేయపడ్డారు, బతిమ లాడారు

ఇంత ప్రేమ కూడా

ఏమీ చెయ్యలేదా మృత్యువుని?”

అని ప్రశ్నించారు

కన్నీరు వర్షించారు

కానీ పాపం శవం

కదల్లేదు నిజం

లక్షలు పెరిగాయి కోట్లుగా

శవం చుట్టూ జనం

అందరిదీ ఒకటే మననం

అందరికీ శత్రువు మరణం

అందరిదీ ఒకే కీర్తన

అందరిదీ ఒకే ప్రార్థన

అన్నయ్యా బ్రతికి రావయ్యా” అని

కానీ పాపం శవం

కదల్లేదు నిజం

ప్రపంచ ప్రజలంతా

బయటికొచ్చి నిలబడ్డారు

అబద్ధంతో కలబడ్ఠారు

శవం ఒళ్లు కదిలింది

జనం కళ్లు తెరిచింది

శవం నడిచింది

తొలిమనిషిని పిలిచింది

అసత్యం చితికింది

సత్యం బతికింది

(సేజర్ వల్లేజో స్పానిష్ కవితకు శ్రీశ్రీ అనువాదం. మరోప్రపంచం కవితాసంపుటి నుండి)

Also read: మహాభారతం – ఆదిపర్వము – ప్రథమాశ్వాసము – 6

-నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles