Tuesday, September 10, 2024

మహాభారతం – ఆదిపర్వం: ద్వితీయాశ్వాసం – వాసుకి తల్లి శాపానికి వెరచుట

చిరముగ బ్రహ్మకున్ తపము సేసి, అనంతు డనంత ధారుణీ

భర గురుకార్య యుక్తుడయి, పన్నగ ముఖ్యుల పొత్తు వాసి, చె

చ్చెర తనయంత నుండి, మది జేర్చ తలంపడ యొక్కనాడు దు

ర్భరతర దందశూకకుల భావి భయప్రవిఘాత కృత్యముల్!”

నన్నయ భట్టారకుడు

నేపథ్యం

గరుత్మంతుడు అమృతాన్ని స్వర్గం నుండి భూలోకానికి తీసుకొని వచ్చి, కద్రూ తనయులైన సర్పాల ఎదుట అమృతపాత్రను పెట్టి ఇట్లా అంటాడు: “మీరు కోరిన అమృతాన్ని తెచ్చి మీకిచ్చి వేస్తున్నాను. దీనితో సూర్యచంద్రులు, అగ్ని, వాయువు సాక్షిగా నా తల్లి దాస్యం తీరిపోయింది”. ఈ విషయం చెప్పి గరుత్మంతుడు తల్లి వినతను తన వీపుపై ఎక్కించుకొని వెళ్ళిపోతాడు.

ఉత్సాహంతో, అమృతం సేవించేముందు, స్నానం చేసి పరిశుభ్రం కావడానికి, అలంకరించుకొని రావటానికి, సర్పకుమారులందరూ వెళతారు. అక్కడే దాక్కొని సమయం కోసం ఎదురు చూస్తున్న ఇంద్రుడు ఇదే సమయమనుకొని, అమృతాన్ని తస్కరించి, స్వర్గానికి తీసుకొని పోతాడు. స్నానం చేసి వచ్చిన సర్పాలకు అమృతం కనిపించక ఆశాభంగం చెందుతారు.

Also read:మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం

ఆదిశేషుడి క్లేశం

తల్లి కద్రువ,  తన సర్పసోదరులు, వినత పట్ల, గరుడుని పట్ల నీచంగా, ధర్మవిరుద్ధంగా ప్రవర్తించడం సమస్తం చూసిన ఆదిశేషుడు అసహ్యంతో, క్లేశంతో, వారిని వదలి వెళ్ళిపోతాడు. పలు పుణ్యక్షేత్రాలలో వేలాది ఏండ్లు బ్రహ్మను గూర్చి ఘోరతపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై, “నీవెల్లప్పుడు సత్యనిష్ఠ కలవాడవు. ధర్మం తప్పని వాడవు. ధైర్యం కలవాడవు. ఈ భూభారాన్ని నీవే నియమంతో భరించు” అని ఆజ్ఞాపిస్తాడు. బ్రహ్మ ఇంకా అంటాడు: “వైనతేయుడైన గరుత్మంతుడు పరాక్రమశాలి. ఇంద్రుణ్ణే ఓడించిన వాడు. సజ్జనుడు. అతనితో స్నేహం చెయ్యి!”.

బ్రహ్మ ఆజ్ఞానుసారం ఆదిశేషుడు భూభారాన్ని వహిస్తాడు. గరుత్మంతునితో చెలిమి చేస్తాడు. అతని సోదరుడైన వాసుకి మాత్రం రాబోయే కాలంలో జరిగే జనమేజయుని సర్పయాగంలో తల్లి కద్రువ శాపం ప్రకారం తన సోదరులైన సర్పరాజులందరు నశించిపోతారనే దుఃఖంతో, అనుగు తమ్ముళ్ళను, చుట్టాలను, దగ్గరకు పిలిపించుకొని శోకపరవశుడై తన అవేదననిట్లా వ్రెళ్ళ గ్రక్కుతున్నాడు. నేటి పద్యసారాంశమిదే:

“ఆదిశేషుడు బ్రహ్మను గూర్చి చిరతపస్సు చేసి ఆయన అనుజ్ఞ మేరకు ధారుణీ భారాన్ని వహిస్తున్నాడు. పన్నగ సోదరుల పొత్తును వదలి, తనంతట తానున్నాడు. సర్ప జాతికి జరగబోయే భయాన్ని అడ్డుకునే ప్రయత్నాలేవీ శేషుడు మనస్సులో  తలపెట్టడం లేదు”.

Also read: మహాభారతం ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – గరుత్మంతునికి తల్లి వినత ఆశీస్సులు

సర్పజాతి యెడల వాసుకి అభిమానం

ఈ పద్యం వాసుకికి సర్పజాతి యెడల గల అభిమానాన్ని సూచిస్తున్నది. వాసుకి ఇంకా చెబుతున్నాడు: “క్షీరసాగర మధనం జరిగే వేళ కవ్వపు త్రాడుగా నేను పడిన శ్రమను గుర్తించిన దేవతలందరు బ్రహ్మను వేడి, నాకు నాశనం లేకుండా వుండేటట్లు, శాశ్వత భయవిముక్తి కలిగేటట్లు, ఆయనచే వరం ప్రసాదింప జేసినారు. నా సంగతి విడిచి పడితే, సర్పకులంలోని ఇతరులకందరికీ కలగబోయే ఘోరనాశనాన్ని గూర్చి సహింపరాని దుఃఖం నాకు కలుగుతున్నది. ఈ ప్రమాదం నుండి ఎట్లా బయట పడడం?”

గర్వితులైన అనేకమంది సర్పకుమారులు: “సర్పయాగానికి బ్రాహ్మణుల వేషాల్లో వెళ్ళి భయభ్రాంతి సృష్టించి యాగం జరగకుండా అడ్డు పడదాం” అంటారు. ఈ  సలహా బుద్ధిమంతులైన సర్పాలకు రుచించదు. ఆ సమయంలో ఏలాపుత్రుడనే సర్పకుమారుడిట్లా అంటాడు:

“తల్లి కద్రువ తనయులకు శాపమిచ్చే వేళ, నేనామె ఒడిలో నిదురిస్తున్నట్లుగా నటించి, బ్రహ్మకు, దేవతలకు మధ్య జరిగిన సంభాషణ విన్నాను”.

“కద్రువ ఇచ్చిన ఘోరమైన శాపానికి విరుగుడు వున్నదా?” అని దేవతలడినారు.

దానికి బ్రహ్మ సమాధానమిది:  “క్రూర రూపాలు కలిగిన సర్పాలు లోకహాని చేసేవారు కనుక వారి వినాశనానికి అంగీకరించవలసి వచ్చింది. కాకపోతే, వాసుకి చెల్లెలైన జరత్కారువుకు, జరత్కారుడనే మహామునికీ, జనింపబోయే ఆస్తీక మహాముని సర్పముఖ్యుల నందరినీ సర్పయాగమనే మహాప్రళయం నుండి రక్షిస్తాడు!”.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – గరుత్మంతుని జననం

ఏలాపుత్రుడు చెప్పిన మాటలు విన్న సర్ప కుమారులందరూ ఊరట చెందుతారు. ఈ మాటలు విన్న వాసుకి, తన చెల్లెలైన జరత్కారువును, జరత్కారుడనే మహాముని పత్నిగా ఎప్పుడు స్వీకరిస్తాడా అని ఎదురుతెన్నులు చూడడం ప్రారంభిస్తాడు.

నేటి పద్యసౌందర్యం

నేటి పద్యం వాసుకి దుఃఖ తీవ్రతను తెలుపుతున్నది. ఈ పద్యానికన్న ముందుగల వచనంలో వాసుకి దుఃఖాన్ని వాగనుశాసనుడు “వాచ్యంగా” తెలిపే పద్ధతి చూడగలరు:

అని బ్రహ్మ నియోగించిన, శేషుండశేష మహీభారంబు దాల్చి గరుడునితో బధ్ధసఖ్యుండై యుండె. నిట వాసుకియుం తల్లి శాపంబున జనమేజయు చేయు సర్పయాగంబునం దయ్యెడు సర్పకుల ప్రళయంబునకు వెఱచి, తన బంధువుల నైరావతాది సహోదరుల రావించి “విషణ్ణ హృదయుండై యిట్లనియె”.

నేటి పద్యం తర్వాత గల వచనంలోనూ వాసుకి దుర్బరశోకం  “వాచ్యంగా”నే చెప్పబడిన విధం వీక్షింపగలరు:

మఱి అమృతమథనంబు నాడు మంధర మహా నగంబునకు నేత్రంబ నయిన నా క్లేశంబునకు మెచ్చి అమరులెల్ల పితామహుం ప్రార్థించి నాకు నవ్యయత్వంబును, సకలభయ విమోక్షణంబునుగా వరంబిప్పించిరి; ఐనను జననీ శాపంబున నురగ కులప్రళయం బగుటకు మనోదుఃఖంబు దుస్సహంబై యుండు; దాని నుడిగించు నుపాయంబెద్ది? యేమి సేయువారము?”

నేటి పద్యంలోని నాలుగు పాదాల్లో గల మొదటి మూడు పాదాల్లోనూ పొడిమాటలే వున్నాయి.

“చిరముగ బ్రహ్మకున్ తపము సేసి”

“అనంతుడు అనంత ధారుణీ భర గురుకార్య యుక్తుడయి”

“పన్నగ ముఖ్యల పొత్తువాసి”

“చెచ్చెర తనయంత నుండి”

అతి పెద్ద బాధ్యత చేపట్టిన అనంతుడు

“మన అన్న అనంతుడు చిరకాలం బ్రహ్మను గూర్చి తపస్సు చేసి, అనంతమైన భూభారాన్ని మోసే “అతిపెద్ద” బాధ్యత చేపట్టి, తనంతట తానుంటూ” అని  అంటున్నప్పుడు, వాసుకి  సోదరుడైన ఆదిశేషుని నిరాసక్తతను దుఃఖంతో  సోదరులైన సర్ప కుమారులందరికీ వివరిస్తున్నాడు.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – కద్రూవినతల వృత్తాంతం

ఇంతదాకా వాసుకి  దుఃఖాన్ని అణచుకొని, ఆత్మ నిగ్రహంతో వ్యవహరిస్తున్నాడు. అంతలో అతని ఆత్మనిగ్రహం సడలింది. ఒక్క సారిగా దుఃఖావేశం పొంగి పొరలింది. ఇంతదాకా పొడిపొడి మాటల్లో దాగిన అతని శోకం, దీర్ఘ సమాసంలో వెలువడే బరువైన మాటలతో హృదయంలో నిస్సహాయత  ప్రతిబింబించే తీరు చూడండి:

దుర్భరతర (5)

దందశూకకుల (8)

భావిభయ (6)

ప్రవిఘాత (5)

కృత్యముల్” (5)

దుఃఖావేశం పెల్లుబికి నప్పుడు నాలుక తడబడతుంది. పెద్దపెద్ద మాటలు, శాపనార్థాలు, గొంతు వెడల గ్రక్కుతుంది. పద్యంలోని మూడు పాదాలు పొడి మాటలతో సాగి, నాలుగవ పాదం మొత్తంగా ఒక దీర్ఘ సమాసంతో సాగడం పెల్లుబికిన శోకాన్ని తెలుపుతుంది. నాలుగవ పాదాన్ని ఉచ్ఛరిస్తున్నప్పుడు వాసుకి ఏడుస్తున్నాడు. అతని ఏడుపును ఆదికవి ధ్వనిపూర్వకంగా పాఠకులకు తెలియజేస్తున్నాడు. నాలుగవ పాదం ఈ పద్యపు “పతాకస్థాయిని” తెలుపుతుంది. “దుర్భరతర”, “దందశూకకుల” అనడంలో తడబాటు, లోకం భరించలేని “దుర్భర రాక్షస జన్మ”గా తన వంశాన్ని తానే తిట్టి పోసుకోవడంలో, పెను నిస్సహాయత స్ఫురిస్తాయి.

నన్నయ భట్టారకుడు తెలుగునాట ఆదికవి కావడంచే, తెలుగు పద్యాల్లో నేడు మనకు తటస్థపడే అనేక సంప్రదాయాలు, కవిత్వపు మెలకువలు, మహాకవి నన్నయ రచనలో ప్రతి పుటకూ గోచరిస్తాయి.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – కద్రూవనితల సముద్ర తీర విహారం

కనుగొని కోపవేగమున

తెలుగు పద్యంలో తరతరాలుగా గోచరించే సాంకేతిక పద్ధతుల్లో ఒకటి, పద్యంలోని మూడు పాదాలు పొడిగా సాగి నాలుగవ పాదం అవిచ్ఛిన్న సమాస బంధురమై కొనసాగడం. ఇటువంటి అసంఖ్యాక ప్రయోగాలు నన్నయతో ప్రారంభమైనవని వేరే చెప్పవలసిన అవసరం లేదు. నన్నయ తత్సమ శబ్ద ప్రయోగాలతో  ధ్వని కోసం వాడిన ఈ పద్ధతిని (టెక్నిక్) తర్వాతి కాలంలో కవులందరూ రసపోషణకో,  శబ్దాలంకార నిమిత్తమో వాడుకున్నారు.అట్టి ప్రసిద్ధ పద్యాల్లో తిక్కన సోమయాజి “కనుగొని కోపవేగమున” అనేది ఒకటి.

వాసుకి ఏడుస్తున్నట్లు నన్నయ ఎక్కడా “వాచ్యంగా” తెలపడం లేదు.  కేవలం ధ్వని పూర్వకంగా తెలుసుకునే విషయమిది.

మ్యూజిక్ అట్ నైట్

దాదాపు యాభై ఏళ్ళ క్రిందట మా ఊరి ప్రజాగ్రంధాలయంలో చదివిన పుస్తకాల్లో ప్రసిద్ధ సాహితీవేత్త, రచయిత, ఆల్డస్ హక్స్ లీ రచించిన “మ్యూజిక్ అట్ నైట్” అనే వ్యాససంపుటి వొకటి. అందులో మహాకవులు తమ రచనల్లో, ధ్వనిని, ఆత్మసంయనాన్ని, ఎట్లా పోషిస్తారో తెలిపే వ్యాసమొకటున్నది. దానిలో హక్స్ లీ మహాకవి హోమర్ రచించిన “ఇలియడ్” కావ్యంలోని ఒక ఘట్టాన్ని పేర్కొన్నాడు.

ఇలియడ్ కావ్యంలో ఒక సైన్యం యుద్ధంలో పరాజయం పొందడమే గాక, పలువురు యోధాగ్రేసరులను రణరంగంలో పోగొట్టు కుంటుంది. ప్రాణాలు దక్కించుకున్న పరాజిత వీరులు నౌకలో జన్మభూమికి వెళ్ళిపోతుంటారు. యుద్ధంలో చనిపోయిన సాటి సైనికులు జ్ఞాపకం వచ్చినప్నుడల్లా వారు దుఃఖం చెందుతారు. కొన్ని సార్లు ఆ దుఃఖాన్ని వారు నిగ్రహించుకుంటారు. కొన్ని సార్లు మాత్రం వారి క్లేశం ఉప్పెనవలె పొంగుతుంటుంది. మిగిలిన సమయాల్లో అవి ఇవీ మాట్లాడుకుంటూనే వుంటారు. రాత్రి నౌకలో వంట చేసుకొని భుజించి, భౌతికంగా, మానసికంగా, అలసిపోయిన ఆ జీవులందరూ ఆదమరచి నిదరపోతారు. మధ్యరాత్రి ఒకరిద్దరు లేచి బిగ్గరగా రోదిస్తుంటారు. హక్స్ లీ ఇట్లా అంటాడు: “దుఃఖావేశాన్ని వర్ణించడం అనుకున్నంత సులువుకాదు. రమారమి రచయితలైతే, “ఆ వీరులందరూ, అన్నపానాలు మరచి, ఆది, అంతూ లేక బిగ్గరగా ఏడుస్తూనే వున్నారనీ, రాత్రంతా నిద్రపోలేదని” వర్ణిస్తారు. మహాకవులు దుఃఖాన్ని వర్ణించడంలో సంయమనం, గుంభన చోటుచేసుకుంటాయి.”

Also read: మహాభారతం – ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం – దేవదానవ యుద్ధం

నేటి పద్యము, దానికి ముందూ వెనకా గల పద్యాలు, వచనాలు, సర్పజాతిని ఆవరించిన నిస్సహాయతను, భావి భయాందోళనను తెలుపుతాయి. ఆస్తీక మహాముని అనే శాంతిదూత ఈ మారణకాండకు అడ్డకట్ట వేయగలడనే సమాచారం సర్పకోటికి ఊరట కలిగిస్తుంది.

వ్యాసమహర్షి క్రాంతదర్శి. ఈ సర్పయాగగాథ భారత సంహితలో జరగబోయే కురుక్షేత్ర సంగ్రామానికే గాక,  భవిష్యత్తులో మానవజాతి మీదమీద ఎదుర్కొనబోయే ఘోరసంగ్రామాలకు సైతం సంకేతం. సర్పకోటి ఒక ఆస్తీక ముని కోసం తపించి పోయినట్లే, నేటి మానవసమాజం సైతం  యుథ్ధగుంజన్మృదంగాల నుండి ప్రపంచాన్ని రక్షించగల గాంధీజీ వంటి శాంతిదూతలకై ఎదురుతెన్నులు చూస్తున్నది. “Blessed are the peace makers for they shall inherit the kingdom of heaven” అని సెర్మన్ ఆఫ్ ది మౌంట్ పేర్కొంటున్నది.

నేటి కథలో వాసుకి ఒక శాంతిదూత. సర్పకోటి లోని మరొక అగ్రగణ్యుడు ఆదిశేషుడు. గరుత్మంతుని వలె ఇతడు సైతం ఆదివిష్ఢువు వద్ద శరణాగతి పొంది, ఆ అహిపతికి పాయని శయ్య యైనవాడు. చుట్ట చుట్టుకొని ఉన్న సర్పం వలె మానవునిలో “కుండలినీ శక్తి” నిద్రాణమై వుంటుంది. ఆదిశేషుని శయ్య కావడం, వేయిపడగలతో అతనికి గొడుగు పట్టడం, మానవ మస్తిష్కంలోని  షట్చక్రాలను చైతన్యపరచే కుండలినీశక్తికి ప్రతీక.

బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ

సహిత మహామహీబర మజస్ర

సహస్ర ఫణాళి దాల్చి” అంటూ  ఉదంకమహామునిచే ఆది శేషుణ్ణి నన్నయ మహాకవి స్తుతింపజేస్తాడు.

చంద్రునిపై తొలిసారి కాలుమోపిన మానవునికి దూరంగా వున్న భూగోళం శూన్యంలో ఎటువంటి బరువూ లేకుండా తేలుతున్న చిన్న బంతివలె గోచరించింది.

 “ఈ విశ్వాన్ని అనంతమైన శూన్యం ఆవరించిందనీ, ఆ శూన్యంలోనే గ్రహ తారకా కులం తేలుతున్నదనీ” సర్ ఐజాక్ న్యూటన్ కాలం నాటి శాస్త్త్రజ్ఞుల విశ్వాసం. ఈ విశ్వాసం నిజం కాదనే విషయం తర్వాతి కాలంలో తేలిపోయిందని ప్రముఖ శాస్త్రవేత్త ఫ్రిట్జోఫ్ కాప్రా అంటారు.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – దేవదానవులు క్షీరసముద్రాన్ని మధించడం

“ఈ సమస్త విశ్వాన్నీ కంటికి కానరాని ఒక విద్యుదయస్కాంత శక్తి ఆవహించి వున్నదని” ఆధునిక శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు.  అగోచరమై, సమస్త సృష్టినీ తన భుజస్కంధాలపై నిలిపే విద్యుదయస్కాంత శక్తియే ఆదిశేషుడు.

చంద్రునిపై కాలు మోపిన మానవునికి శూన్యంలో ఎట్టి బరువూ లేని కాలిబంతి వలె తేలుతున్న భూగోళం ప్రఖ్యాత అమెరికన్ కవి ఆర్చిబాల్డ్ మాక్లిష్ మనస్సుకు ఇట్లా తోచింది:

“To see the earth as it truly is, small and blue in that eternal silence where it floats, is to see riders on the earth together, brothers on that bright loveliness in the eternal cold – brothers who know now they are truly brothers”.

Also read: మహాభారతం – ఆదిపర్వము – ప్రథమాశ్వాసము – 6

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles