Sunday, May 5, 2024

కీలకమైన మోదీ అమెరికా పర్యటన

మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘అమెరికా పర్యటన’ ఆసక్తిదాయకంగా మారింది. గతంలో అనేకసార్లు పర్యటించినా, నేటి సమావేశం ఎంతో ప్రత్యేకమైనది. జో బైడెన్ అధ్యక్షుడు అయిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యక్షంగా కలవడం ఇదే ప్రథమం.  అంతే కాదు, రెండు దేశాలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అనేక సవాళ్ల మధ్య ప్రయాణం సాగుతోంది. ఈ రోజు వేసే ప్రతి అడుగూ అత్యంత కీలకం. తాలిబాన్ చేతుల్లోకి అఫ్ఘానిస్థాన్ పూర్తిగా వెళ్లిపోయింది. అమెరికా ప్రధాన శత్రువైన చైనా… తాలిబాన్ ముఠాకు బాగా దగ్గరయ్యింది. తను కావడమే కాక,రష్యాను కూడా దగ్గరకు చేర్చింది. ఇస్లామిక్ దేశాలన్నింటితో బంధాలను మరింతగా బలోపేతం చేసుకొంటూ,  అమెరికాను ఇబ్బందులు పాలు చేయడానికి చైనా అన్ని ప్రయత్నాలూ మొదలు పెట్టింది.

Also read: అమరశిల్పి అక్కినేని

చైనా అక్కసూ, అధిక్యం

అగ్రరాజ్యానికి దగ్గరగా జరుగుతున్న భారత్ వంటి దేశాలకు గుణపాఠాలు చెప్పాలని ఆ దేశం చూస్తోంది. ఈ ప్రయాణంలో, ఇప్పటికే చైనా చాలా దూరం వచ్చేసింది. క్రిస్టియన్ – ఇస్లామిక్ దేశాలు, ఇస్లామిక్ – పాశ్చాత్య సంస్కృతిని పాటించే దేశాల మధ్య సమీప భవిష్యత్తులో ఎన్నో యుద్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు జోశ్యం చెబుతున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదం తీవ్రతరమైతే, బాగా ఇబ్బందిపడే దేశాలలో భారతదేశం ప్రధానంగా ఉంటుంది. ప్రపంచంలో క్రిస్టియానిటీ (31 శాతం), ఇస్లాం (24.9శాతం), హిందూత్వం (15.16 శాతం), బుద్ధిజం (5.06శాతం), చైనీస్ సంప్రదాయ మతం (5 శాతం)  ప్రధానంగా ఉన్నాయి. ఇస్లాం, బుద్ధిజం, చైనీస్ మతాలను పాటించే దేశాలన్నింటినీ ఒకతాటిపైకి తేవాలన్నది చైనా మొదటి వ్యూహం.  అమెరికా శత్రువులన్నింటినీ కలుపుకెళ్లడం మరోక పథకం. సరిహద్దు దేశాలన్నింటినీ తన కబంధ హస్తాల్లోకి తెచ్చుకోవడం మూడో ప్రణాళిక. మొత్తంగా,సామ దాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి అగ్రరాజ్యంగా శాశ్వత స్థానాన్ని దక్కించుకోవాలన్నది చైనా ప్రధాన ఉద్దేశ్యం.  దానిని సాధించడానికి నిర్విరామంగా పని చేస్తోంది. కరోనా వైరస్ సృష్టి కూడా అందులో భాగమేనని కొన్ని దేశాలు అనుమానిస్తున్నాయి. తాలిబాన్ మూకకు సర్వ సహాయాలు అందించడం, తద్వారా ఉగ్రవాదులను ప్రోత్సహించడం అందులో భాగమే అని ఎన్నో దేశాలు కోడై కూస్తున్నాయి. అఫ్ఘాన్ లో సైన్యాన్ని విరమించుకున్నందుకు అమెరికాకు గతంలో ఎన్నడూ లేనంత చెడ్డపేరు వచ్చింది. అమెరికాతో ఎక్కువగా ప్రయాణం చేస్తే భారత్ కు మరిన్ని కష్టాలు వస్తాయనే మాటలు ఎక్కువగా వినపడుతున్న వేళ.. భారత్ -అమెరికా అధినేతల మధ్య సమావేశాలు జరుగుతున్నాయి. సామ్రాజ్య విస్తరణ కాంక్షతో పాటు అమెరికాకు మనం దగ్గరవుతున్నామనే ఏడుపు చైనాకు బాగా పెరిగిపోయింది. కశ్మీర్ అంశంలో చైనా, పాకిస్తాన్ తోడుదొంగలుగా వ్యవహరిస్తున్నాయి. అటు పాకిస్తాన్ తో – ఇటు ఇండియాతో అమెరికా చాలా తెలివిగా నడుచుకుంటోంది. ఎవరి స్వార్ధం వారిది. పాకిస్తాన్ కూడా అంతే.. ఇటు చైనాతోనూ- అటు అమెరికాతోనూ ద్వంద్వ విధానాన్ని అమలుపరుస్తోంది.

Also read: అమరేంద్రుడి నిష్క్రమణ

భారత్ ను అభిమానించే అధ్యక్షుడూ, ఉపాధ్యక్షురాలూ

ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, మన విదేశాంగ విధానాన్ని మరింత పదును పెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. నరేంద్రమోదీ -జో బైడెన్ మధ్య సాగే ప్రతి అంశమూ భవిష్యత్ పరిణామాలకు మూలాధారాలు అవుతాయి. డోనాల్డ్ ట్రంప్ పదవీకాలంలో భారత్ తో బంధాలు బాగా పెరిగాయి. చైనా – అమెరికా – భారత్ మధ్య దూరం కూడా అంతే పెరిగింది. జో బైడెన్ మొదటి నుంచీ భారతదేశం పట్ల ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అధ్యక్షుడిగా సర్వ అధికారాలతో ఉన్నాడు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ భారత్ మూలాలు ఉన్న వ్యక్తి. అటు అధ్యక్షుడు, ఇటు ఉపాధ్యక్షురాలు ఇద్దరూ భారతదేశం పట్ల ప్రత్యేకమైన అభిమానం కలిగివున్నవారు కావడం విశేషం. ఇటువంటి పాలనా కాలంలో  అమెరికా – భారత్ బంధాలలో ఉభయతారకమైన ఒప్పందాలు కుదరాలి, నిర్ణయాలు జరగాలి. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు మొదలైన అంశాలపై గుణాత్మకమైన చర్చలు జరగడం ఎంతో అవసరం. ఉగ్రవాద నిర్మూలనపై పెద్దఎత్తున పోరాటం చేయడం, ఆ దిశగా భావసారూప్య దేశాలన్నింటినీ ఒక గొడుగు కిందకు తేవడం అత్యంత ముఖ్యం. కరోనా కష్టాల నుంచి మన దేశాన్ని బయటపడేయడానికి అమెరికా నుంచి అందినంత సాయాన్ని పొందడం చాలా అవసరం. అత్యంత సమర్ధవంతమైన వ్యాక్సిన్లు అమెరికా నుంచి మన దేశానికి వచ్చేట్లు చూసుకోవాలి. మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ప్రతి అంశమూ కీలకమైందే. శతృదేశాలు సునిశితంగా రెండు దేశాలను పరిశీలిస్తున్నాయి.పర్యటన ముగిసిన తర్వాత చిత్రం మరికొంత విపులంగా అర్ధమవుతుంది. అమెరికా -ఇండియా మధ్య స్నేహం ఉభయ ప్రమోదంగా ఉండాలని ఆశిద్దాం.

Also read: యూపీలో ప్రియాంక మహాప్రయత్నం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles