Wednesday, May 1, 2024

అమరేంద్రుడి నిష్క్రమణ

పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా తప్పుకున్నారు. తప్పించే వేళ దగ్గరపడిందని ఊహించి, ముందుగానే వైదొలగి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకొనే ప్రయత్నం చేశారని అర్ధం చేసుకోవాలి. కాంగ్రెస్ అధిష్టానం కూడా పంజాబ్ విషయంలో సీరియస్ గానే వుంది. రేపటి ఎన్నికల్లో మళ్ళీ గెలవాలంటే, కెప్టెన్ ను తప్పించడమే సరియైన చర్య అని భావించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలు అమరీందర్ సారథ్యంలోనే జరుగుతాయాని ఇటీవలే ప్రకటించిన దిల్లీ పెద్దలు మనసు మార్చుకున్నారు. నవ్ జోత్ సింగ్ సిద్ధూ ను రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించినప్పుడే, కెప్టెన్ ప్రాముఖ్యత తగ్గిపోయింది. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ముఖ్యమంత్రికి సిద్ధూ చెవిలో జోరీగలా, గుండెపై కుంపటిలా తయారయ్యారు. అదే సమయంలో అధిష్టానానికి బాగా దగ్గరయ్యారు. రేపటి ఎన్నికల్లో గెలవాలంటే సిద్ధూ సహాయ సహకారాలు తప్పవని కాంగ్రెస్ పెద్దలు భావించారు. అమరీందర్ సింగ్ 80 ఏళ్ళకు చేరువయ్యారు.వృద్ధ నాయకత్వానికి చరమగీతంపాడి, కొత్త తరానికి స్వాగతం పలకాలన్నది రాహుల్ గాంధీ అంతరంగం. దానికి తగ్గట్టుగానే పంజాబ్ కాంగ్రెస్ లో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో రాహుల్ కీలక భూమిక పోషించారు. పంజాబ్ లోని సంక్లిష్ట సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని రాహుల్ కనుక్కున్నారని, ఆయనను అలెగ్జాండర్ తో పోలుస్తూ, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు జాఖడ్ ట్వీట్ చేశారు. అమరీందర్ సింగ్ స్థానంలో ఎంపిక చేయబోయే పేర్లల్లో సునీల్ జాఖడ్ పేరు కూడా వినిపించడం గమనార్హం. మిగిలిన పేర్లలో ప్రతాప్ సింగ్ బజ్వా, రవ్ నీత్ సింగ్ ఉన్నారు. సిద్ధూను కూడా విస్మరించ లేము. ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక జరగాల్సి వుంది. ఈ ఎంపిక బాధ్యతను సోనియాగాంధీకి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు రాష్ట్ర ఇంచార్జి హరీష్ రావత్ మీడియాకు వివరించారు. నిన్న మొన్నటి వరకూ అమరీందర్ సింగ్ కు మంచిపేరే వుంది. ఈ నాలుగున్నరేళ్ళలో వరుసగా చెడ్డపేరు రావడం ప్రారంభమైంది. అసమర్ధ నాయకుడనే ముద్ర కూడా పెరుగుతూ వచ్చింది.

Also read: యూపీలో ప్రియాంక మహాప్రయత్నం

అంతర్గత కలహాలు

పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, నవ్ జోత్ సింగ్ సిద్ధూ వర్గం నుంచి తలనొప్పులు పెరగడంతో,  వయసురీత్యా కూడా కెప్టెన్ కు తట్టుకొనే శక్తి సన్నగిల్లింది. దానికి తోడు అధిష్టానంతోనూ ఆయనకు పెద్దగా సఖ్యత లేదు.మిగిలిన కాంగ్రెస్  ముఖ్యమంత్రుల వలె గాక, కెప్టెన్ స్వతంత్రంగానే వ్యవహరించేవారు. రాష్ట్రంలో అతనికి తిరుగులేని బలముండేది. పార్టీ పెద్దలకు ఈ తరహా వైఖరులు నచ్చేవి కాదు. బలమైన నాయకుడు కాబట్టి చేసేది లేక సర్దుబాటు ధోరణితో కాలక్షేపం చేశారు. రాష్ట్రంలో కాస్త బలం,ఆకర్షణ ఉన్న సిద్ధూ వంటివారు దొరకగానే  కెప్టెన్ కు ప్రత్యామ్నాయం దొరికినట్లు అధిష్టానం భావించింది. కొంతకాలం నుంచి పార్టీలో గందరగోళం పెరిగింది. అమరీందర్ ను తప్పించాలనే నినాదాలు ఊపందుకున్నాయి. అందులో ఎమ్మెల్యేలతో పాటు కొందరు మంత్రులు కూడా ఉన్నారు. కెప్టెన్ ను వెంటనే తప్పించండని తాజాగా శుక్రవారం రాత్రి 50మంది ఎమ్మెల్యేలు సోనియాగాంధీకి లేఖాస్త్రం సంధించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పుకు రంగం సిద్ధమైంది. ఈ తరుణంలో, కెప్టెన్ ను తప్పిస్తే, పార్టీకి నష్టం జరుగుతుందని అలోచించిన అధిష్టానం..కనీసం రేపు జరుగబోయే ఎన్నికల దాకానైనా ఆగుదామని మొన్నటి వరకూ అనుకుంది. ఆ నష్టంతో పోల్చుకుంటే జరుగబోయే నష్టం ఎక్కువని భావించిన దిల్లీ పెద్దలు ఇప్పుడు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమరీందర్ వెళ్లిపోవడం వల్ల పార్టీకి కొంత నష్టం జరగడం తప్పదు. ఆది ఏ మేరకు అన్నది ఇప్పుడు అంచనా వేయలేం. ఆయన రాజకీయాల నుంచి విరమిస్తారా? బిజెపి వంటి ఏదైనా పార్టీలో చేరుతారా ఇంకా తెలియదు. దానిని బట్టి కూడా కాంగ్రెస్ లాభనష్టాలను అంచనా వేయవచ్చు.

Also read: గుజరాత్ లోనూ గెలుపుగుర్రం ఎంపిక

రాజీవ్ కు ఆత్మీయుడు అమరీందర్ సింగ్

నిజం చెప్పాలంటే, అమరీందర్ సింగ్ ఇందిరాగాంధీ కుటుంబానికి చాలా దగ్గరివాడు. రాజీవ్ గాంధీకి చిన్ననాటి స్నేహితుడు, డూన్ స్కూల్ విద్యార్థి. రాజీవ్ ద్వారానే ఆయన కాంగ్రెస్ లో చేరాడు. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో పార్టీతో విభేదించి బయటకు వచ్చాడు. కొంతకాలం శిరోమణి అకాలీ దళ్ లో మంత్రి హోదాలోనూ పనిచేశారు.ఆ పార్టీతో కూడా విభేదించి, అకాలీ దళ్ పబ్లిక్ అంటూ ఇంకొక గ్రూప్ ను తయారుచేశాడు. 1998లో దానిని కాంగ్రెస్ లో విలీనం చేసి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం మొదలు పెట్టారు. పార్టీలో ముఖ్యమైన పదవులన్నీ చేశారు. 2002లో మొట్టమొదటగా ముఖ్యమంత్రి కూడా అయ్యారు. మళ్ళీ 2017 నుంచి ఇప్పటి వరకూ ఆ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పంజాబ్ లో పార్టీని నిలబెట్టడంలో కెప్టెన్ పాత్ర ఎన్నదగినది.అవినీతి మరకలు లేనివాడు.నిజాయితీపరుడు. రాజవంశీకుడు. మిలటరీలోనూ పనిచేసిన దేశభక్తుడు. సహజంగానే స్వతంత్ర భావాలు కలిగినవాడు.తండ్రి రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్ లో చేరి,తనయుడు రాహుల్ గాంధీ చేతిలో పదవీభ్రష్టుడవ్వడం విధి నిర్ణయం.కెప్టెన్ కు ప్రత్యర్థియైన  నవ్ జోత్ సింగ్ సిద్ధూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే బలమైన కోరికలో ఉన్నారు. ఇప్పుడే ఇస్తారా? రేపటి ఎన్నికల్లో ఫలితల తర్వాత ఇస్తారా? అన్నది కాంగ్రెస్ పెద్దలకే తెలియాలి. రాహుల్ గాంధీ మద్దతు సిద్ధూకు సంపూర్ణంగా ఉందని తెలుస్తూనే ఉంది. సిద్ధూకు పాకిస్తాన్ తో గట్టి సంబంధాలు ఉన్నాయని, అతనిని ముఖ్యమంత్రిని చేస్తే, దేశానికే ప్రమాదమని అమరీందర్ సింగ్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. మొత్తంమీద ఇటు కాంగ్రెస్ పార్టీలో -అటు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వేడి ప్రారంభమైంది. సరికొత్త ఆట ఆరంభమైంది. పంజాబ్ కు కెప్టెన్ ఎవరో.. కొన్ని గంటల్లో తేలనుంది.

Also read: వీగిపోయిన అగ్రరాజ్యహంకారం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles