Saturday, April 27, 2024

గణతంత్రం మరణించింది, గణతంత్రం జయహో!

రిపబ్లిక్ పరమపదించింది. ఇందుకు బీజేపీ-ఆర్ఎస్ఎస్ ని నిందించి ప్రయోజనం లేదు. మనకు కొత్త రాజకీయ భాష అవసరం

భారత దేశానికి ఇప్పుడు కొత్త రాజ్యాంగం ఉంది. అది అధికసంఖ్యాకుల అభీష్టానికి అనుగుణంగా ఉంటుంది. దాని నిర్ణయాలను ప్రభుత్వంలోని ఏ అంగమూ నిరోధించలేదు.

బ్రిటిష్ వారు చెప్పుకునే ‘‘ద కింగ్ ఈజ్ డెడ్. లాంగ్ లివ్ ద కింగ్’’ అనే దేశభక్తి నానుడి కొద్దిగా మార్చి జనవరి 26న మన జాతీయ నినాదం కావాలి.

26 జనవరి 1950న ఏర్పడిన భారత గణతంత్రాన్ని 22 జనవరి 2024నాడు విధ్వంసం చేశారు. ఈ ప్రక్రియ చాలాకాలంగా కొనసాగుతూ వచ్చింది. ‘రిపబ్లిక్ అంతం’ గురించి కొంతకాలంగా నేను మాట్లాడుతూ వస్తున్నాను. ఇప్పుడు ఫలానా తేదీనాడు విధ్వంసం జరిగిందని చెప్పవచ్చు. మనం ఇకమీదట కొత్త గణతంత్ర వ్యవస్థలో జీవిస్తాం. కొత్త వ్యవస్థలో అవకాశాలు వెతుక్కునేవారు కొత్త ఆట నిబంధనలను ఇప్పటి వరకూ తెలుసుకోకపోతే ఇకపైన తెలుసుకుంటారు. పాత రిపబ్లిక్ ను పునరుత్థానం చేయాలనుకునే మనబోటివాళ్ళం మన రాజకీయాల గురించి మౌలికంగా తిరిగి ఆలోచించాలి. మన గణతంత్ర విలువలకు స్ఫూర్తినిచ్చే పటిష్ఠమైన రాజకీయ భాషను సిద్ధం చేసుకోవడం వినా మనకు మరో మార్గం లేదు. మనం మన రాజకీయ వ్యూహాలు మార్చుకోవాలి. రాజకీయ స్నేహాలలో మార్పు చేసుకోవాలి. పాత పార్లమెంటరీ ప్రతిపక్ష వైఖరిని విరమించి ప్రతిఘటన రాజకీయాల గురించి ఆలోచించాలి.

Also read: బీజేపీని ఓడించేందుకు ‘ఇండియా’ కు మూడు రణక్షేత్రాలలో మూడు వ్యూహాలు

ప్రతిష్ఠ విషయంలో పొరపాటు పడవద్దు. అయోధ్యలో జరిగిన ప్రతిష్ఠాపన ఒక విగ్రహానికో, రాముడికో, రామాలయానికో సంబంధించింది మాత్రం కాదు. అది మర్యాద (నియమాలు), అస్థ (విశ్వాసం) లేదా ధర్మం గురించి కాదు. అది  రాజ్యాంగ, రాజకీయ, ధార్మిక మర్యాదలను అతిక్రమించిన ఘట్టం. కోట్లమంది ప్రజల విశ్వాసానికి సంబంధించింది. ప్రజల దృష్టిని మళ్ళించడం అనే ఒకే ఒక లక్ష్యంతో చేసిన పని. ఇది ధర్మానికి, రాజ్యాధికారానికీ సంబంధించిన విషయం. నిజానికి ఇది హిందూమత రాజకీయ వలస ధోరణికి ప్రతీక. 22 జనవరి 2024 నాటి రాజకీయ కార్యక్రమం నేపథ్యం, వ్యూహం, సభికులను సమీకరించిన విధానం వెనుక రాజకీయ విజయాన్ని సంఘటితం చేసుకోవాలనీ, నిగ్గుతేల్చాలనే సంకల్పం ఉంది. ఒక రకంగా అది హిందూరాష్ట్ర ప్రతిష్ఠాపన. భారత జాతీయవాదం నిర్వచించిన రాష్ట్రకు కానీ హిందూ ధర్మానికి కానీ అనువైనది కాదు.

నూతన వ్యవస్థ ఆగమనం

మనకు ఇప్పుడు కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. కొత్త రాజ్యాంగ గ్రంథం కాదు. కడచిన పదేళ్ళుగా మనం చూస్తూ వచ్చిన రాజకీయ పరిణామక్రమం సంఘటితమైన తీరుకు అది నిదర్శనం. అసలు రాజ్యాంగం అల్పసంఖ్యాకవర్గాల హక్కులను పరిధిలుగా నిర్దేశించింది. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఏమి చేయజాలవో స్పష్టంగా చెప్పింది. కొత్త రాజ్యాంగం అధికసంఖ్యాకుల అభీష్టం మేరకు కొత్త సరిహద్దును గీస్తున్నది. ప్రభుత్వంలోని ఏ శాఖ కూడా  ఆ సరిహద్దును మీరడానికి సాహసించదు. అసలు రాజ్యాంగంలో ఏమున్నా పర్వాలేదు. ఇప్పుడు మనకు రెండంచల పౌరసత్వం ఉంది. హిందువులూ, వారి అనుయాయులూ నూతన వ్యవస్థలో యజమానులు. ముస్లింలూ, ఇతర మైనారిటీ మతస్థులూ కిరాయదారులు. ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’ (రాష్ట్రాల సమాఖ్య)అనే మాట బదులు యూనిటరీ ప్రభుత్వం (ఏకధ్రువ ప్రభుత్వం) వచ్చింది. ఈ యూనిటరీ ప్రభుత్వం రాష్ట్రాలకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తుంది. ప్రభుత్వం, శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థకు మధ్య అధికారాల విభజన గొడవ ఇక లేదు. అధికారాల విభజన వివాదం సమస్తం ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయించబడింది. అత్యంత శక్తిమంతమైన ప్రభుత్వమే అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. శాసన వ్యవస్థ పరిమితులనూ, న్యాయవ్యవస్థ పరిధులనూ పాలక వ్యవస్థ నిర్దేశిస్తుంది. శాసన వ్యవస్థ ఏయే అంశాలపైన చర్చించవచ్చునో, న్యాయవ్యవస్థ విచారించదగిన అంశాలు ఏమిటో పాలకవ్యవస్థ నిర్ణయిస్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అధ్యక్ష పాలనకు దారి తీయలేదు. ఏకవ్యక్తి పాలన, ఒక ఎన్నికైన రాజు పాలన తెచ్చింది. ప్రజలు తమ ఏకైక నాయకుడిని ఎన్నుకొని అన్నీ ఆయనకే వదిలివేస్తారన్నమాట.

ఈ కొత్త రాజ్యాంగాన్ని ఏ రాజ్యాంగ నిర్మాణ సభా ఆమోదించలేదు. భారతీయ ఆత్మకు 22 జనవరి 2024న విమోచన లభించిందంటూ మంత్రిమండలి తీర్మానం ప్రశంసించవచ్చు. కానీ రెండో భారత గణతంత్ర వ్యవస్థ పుట్టిన తేదీ అది కాజాలదు. రాజ్యాంగాన్ని తమ అధీనంలోకి తీసుకోవడాన్ని నిరోధించేందుకు మనం చేయవలసిన పోరాటం అట్లాగే ఉన్నది. ఈ పోరాటంలో ప్రథమ ఘట్టం రాబోయే పార్లమెంటు ఎన్నికలు. ఎన్నికల ఫలితం ఎట్లా ఉన్నప్పటికీ రాజకీయ వాస్తవ చిత్రాన్ని మనం కాదనలేము. మౌలికంగా ఆలోచించవలసిన సవాలును మనం వాయిదా వేయజాలము.

Also read: రాజ్యం-జాతీయత నమూనా ఇప్పటికీ ఆదర్శప్రాయమే 

ప్రథమ గణతంత్రవ్యవస్థ కుప్పకూలడంలో మన బాధ్యత కూడా ఉన్నదని గమనించాలి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ఏది చేయాలనుకున్నాయో అది చేసినందుకు వాటిని నిందించడంలో అర్థం లేదు. మొదటి రిపబ్లిక్ రాజ్యాంగం పట్ల విధేయత ప్రకటించుకున్నవారిదే అసలు బాధ్యత. లౌకికవ్యవస్థ క్రమంగా క్షీణించడం, భావజాల నిబద్ధత నుంచి అవకాశవాద రాజకీయాలకు దారి ఇవ్వడంతో రాజ్యాంగ వ్యవస్థ భ్రష్టుపట్టింది. లౌకిక భావజాలం మితిమీరిన విశ్వాసం, ప్రజలతో సంబంధాలు లేకపోవడం, ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడటానికి నాయకులు నిరాకరించడం లౌకిక విధానాలను బలహీనపరిచింది. ముప్పయ్ ఏళ్ళ కిందట బాబరీ మసీదు విధ్వంసం ద్వారా వచ్చిన  హెచ్చరికను పట్టించుకోలేదు. కడచిన ముప్పయ్ సంవత్సరాలపాటు లౌకిక రాజకీయం ఊగిసలాడుతూ ఉంది. లౌకిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న రోగం తనంతట అదే తగ్గిపోతుందనీ లేదా కులవ్యవస్థ దానిని ఎదుర్కొంటుందనే గుడ్డినమ్మకంతో కాలం బద్ధకంగా గడిపాం. లౌకిక రాజకీయం ఈ రోజు  కుప్పకూలిందంటే అందుకు దాని అత్యాచారాలూ, చేతగానితనమూ ప్రధానంగా కారణం.

రాజకీయాల ద్వారా పోగొట్టుకున్నదాన్ని మళ్ళీ రాజకీయాల ద్వారానే తిరిగి రాబట్టుకోగలం. ఈ రోజున మన ఎదుట ఎక్కువ ప్రత్యామ్నాయాలు లేవు. అసలైన రాజ్యాంగాన్ని విశ్వసించే మనం అల్పసంఖ్యాకవర్గంగానే ఉంటాం. మెజారిటీ రాజకీయాలలో కలవకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూనే అప్పుడప్పుడు ఆ రాజకీయాలను ప్రతిఘటిస్తూ ఉండవచ్చు. లేదా మనం సాహసోపేతమైన,  శక్తిమంతమైన గణతంత్ర రాజకీయాలను అమలు చేయవచ్చు.

రెండు మార్గాల వ్యవహారం

ఈ గణతంత్ర రాజకీయాలలో (రిపబ్లికన్ పోలిటిక్స్) రెండు పార్శ్వాలు ఉంటాయి. వచ్చే కొన్ని దశాబ్దాలపాటు చేయవలసిన సాంస్కృతిక-భావజాల పోరాటం. భారత జాతీయవాదాన్నీ, మన సాంస్కృతిక వారసత్వాన్నీ, మన భాషలనూ, మన మత సంప్రదాయాలనూ (హిందూయిజంతో కలిపి) తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాలి. భారతదేశం అంటే ఏమిటో చెబుతూ కొత్త దార్శనికత గురించి మాట్లాడగలగాలి. కొత్త ఆదర్శాలను నిర్వచించగలగాలి. ఇది పిరమిడ్ వ్యవస్థ అట్టడుగున ఉన్న ప్రజల అభిలాషలకు అనుగుణంగా ఉండాలి. ఇరవయ్యో శతాబ్దంలో కమ్యూనిస్టులకీ, సోషలిస్టులకూ, గాంధేయవాదులకూ మధ్య జరిగిన ఘర్షణలకు ఈ రోజున ప్రాసంగికత లేదు.  మన కాలానికీ, పరిస్థితులకీ తగినట్టు స్వరాజ్ 2.0 వంటి ఒక భావజాలం కావాలి. అన్ని  ఉదారవాదాల నుంచీ, సమసమాజవాదం నుంచీ, వలస వ్యతిరేకవాదం నుంచీ పనికి వచ్చే అంశాలను ఏరికోరి స్వీకరించి సరికొత్త భావజాలాన్ని నిర్మించుకోవాలి.

Also read: హిందూమతవాదానికీ, బహుజనవాదానికీ మౌలికమైన తేడా ఉంది

దీంతోపాటు కొత్త రకం రాజకీయాలు కూడా అవసరం. ప్రతిపక్ష రాజకీయాల బదులు ఆధిక్యవాదాన్ని వ్యతిరేకించే రాజకీయ ప్రతిఘటన కావాలి. ఈ రాజకీయానికి ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందడం ప్రధానం కాదు. రిపబ్లికన్ పోలిటిక్స్ తన వ్యూహాన్ని మళ్ళీ ఆలోచించుకోవాలి. ఈ కొత్త రాజకీయ ప్రపంచంలో పాత విభజన రేఖలు తమ విలువ కోల్పోతాయి. రిపబ్లిక్ పునరుత్థానం కోరుకునేవారంతా ఒకే పార్టీలో ఉండాలి. ముందే ఊహించిన వ్యక్తిని ఎన్నుకోవడానికి ప్లెబిసైట్ తరహాలో జరుగుతున్న ప్రస్తుత ఎన్నికలకు అంత ప్రాధాన్యం ఇవ్వకూడదు. కొత్త పరిస్థితులలో ఉద్యమ రాజకీయాలూ, వీధిపోరాటాలు ప్రధానం. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు అవకాశాలు తగ్గుతూ వస్తాయి కనుక వీధిపోరాటాలపైన కూడా పరిమితులు ఉండవచ్చు. ప్రతిఘటన రాజకీయం ప్రజాస్వామ్యబద్ధంగా, అహింసాత్మకంగా ఉంటూనే కొత్త పుంతలు తొక్కాలి.

ఇది  చివరి రిపబ్లిక్ డే కావచ్చుననీ, అందుకోసం ఈ రిపబ్లిక్ పండుగలో అందరూ పాల్గొనాలనీ సోషల్ మీడియాలో ఒక జోక్ వైరల్ అవుతోంది. ఆ మెసేజ్ షేర్ చేయడానికి ముందే డేట్ వేసేశారు. ఇప్పటికే మృతి చెందిన రిపబ్లిక్ ను జ్ఞాపకం చేసుకునే రోజు ఇది కావచ్చు లేదా రిపబ్లిక్ ను పునరుద్ధరించేందుకు కంకణబద్ధులం కావాలని ప్రతిజ్ఞ చేసే రోజూ కావచ్చు.

రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు.

Also read: బీహార్ కులజనగణన బృహత్తరమైన ముందడుగు

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles