Monday, November 11, 2024

అలనాటి లవ్ స్టోరీ ‘ప్రేమ్ నగర్’

  • నటిగా వాణిశ్రీనీ, నిర్మాతగా రామానాయుడినీ నిలబెట్టిన చిత్రం
  • తొలి పంచరంగుల తెలుగు చిత్రాలలో ఒకటి
  • కలెక్షన్లలో రికార్డు సృష్టించిన సినిమా
  • నాటి పాటలు ఇప్పటికీ ప్రజలనోట పలుకుతున్న వైనం

అక్కినేని నాగేశ్వరరావు మనుమడు అక్కినేని నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరీ‘ విడుదలైన 24 సెప్టెంబర్ 2021నాటికి సరిగ్గా అర్ధశతాబ్దం కిందట అక్కినేని నటించిన పాత ప్రేమకథ ‘ప్రేమ్ నగర్’ విడుదలై చరిత్ర సృష్టించింది. ప్రేమ్ నగర్ కోడూరి కౌశల్యాదేవి రచించిన నవలకు సినిమా రూపం. నిరుడు ఇందుకు ఒక్క రోజు ముందే (23 సెప్టెంబర్ 2020) గంధర్వలోకానికి వెళ్ళిపోయిన గానగంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గుర్తుకు రాకమానడు. శ్రీరమణ రచించిన మిథునం కథను తనికెళ్ళ భరణి సినిమా తీస్తే దాన్ని సజీవచిత్రంగా నిలిపిన ఘనత బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మిలది.

నాకు 23 ఏళ్ళప్పుడు ప్రమ్ నగర్ విడుదలయింది. అప్పటికే తెలుగులో వచ్చిన నవలలూ, సీరియళ్ళూ, ఇంగ్లీషులో అయిన్ రాండ్, హెరాల్డ్ రాబిన్స్, ఇర్వింగ్ వాలెస్ నవలలు ఒక్కటి కూడా వదలకుండా చదివిన నాకు నవలల ఆధారంగా నిర్మించిన చిత్రాలు చూడటం ఒక సరదా, ఒక అధ్యయనం, ఒక పరిశీలన. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నేను సినిమాలు చూడటం తక్కువే అయినా నవలలను చిత్రాలుగా మలచిన సందర్భాలను విడిచిపెట్టలేదు.

నవలా చిత్రాల నాయకుడుగా మొదట అక్కినేని నాగేశ్వరరావుని చెప్పుకోవాలి. ఆయన నటించినన్ని నవలాచిత్రాలలో మరో నటుడు ఎవ్వరూ నటించలేదు. తర్వాత స్థానం చిరంజీవిది. శోభన్ బాబు, ఎన్ టి రామారావు, కృష్ణ, రాజేంద్రప్రసాద్, రాజశేఖర్, తదితర నటులు కూడా నటించారు. నవలాచిత్రాలలో హీరోయిన్ పాత్రలో సావిత్రి తర్వాత వాణిశ్రీని చెప్పుకోవాలి. తెలుగులో వచ్చిన నవలను చిత్రాలుగా మలచడమే కాకుండా బెంగాలీ, హిందీ నవలలను ఆధారం చేసుకొని చిత్రాలు తెలుగులో నిర్మించారు. నాకు ఇష్టమైన రచయిత్రి అయిన్ ర్యాండ్ నవలపైన, ఆమె తత్త్వం ప్రాతిపదికపైన ఆధారపడి తీసిన చిత్రం మరోప్రపంచం. ఇందులో కూడా అక్కినేని కథానాయకుడు. గుల్షన్ నందా అనే హిందీ నవలాకారుడు రచించిన పత్థర్ కే హాంత్ ను ‘పునర్జన్మ’ సినిమాగా తీశారు. ఇందులోనూ అక్కినేనే కథానాయకుడు. మణిలాల్ బెనర్జీ రాసిన ‘స్వయంసిద్ధ’ నవలను ‘అర్ధాంగి’ సినిమాగా నిర్మించారు. ఇందులో కూడా అక్కినేని, సావిత్రి ప్రధాన పాత్రలు పోషించారు. ఆశా పూర్ణాదేవి రచించిన ‘అగ్నిపరీక్ష’ను ‘మాంగల్యబలం’ సినిమాగా రూపొందించారు. ఇందులోనూ అక్కినేని, సావిత్రి జంటే.

రచయిత్రుల ఆధిపత్యం

తెలుగులో యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌశల్యాదేవి తర్వాత చిత్రీకరణ జరిగిన ఎక్కువ నవలల రచయిత యండమూరి వీరేంద్రనాథ్. ఆ తర్వాత బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ. సులోచనారాణివి సెక్రటరీ, జీవనతరంగాలు, మీనా నవలలు ఆధారంగా నిర్మించిన చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. యాభై ఏళ్ళ కిందట ఈ రోజు విడుదలైన ప్రేమ్ నగర్ రచయిత్రి కోడూరి కౌశల్యాదేవి. ఆమె రచించిన మరో నవల ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాగా విడుదలై సంచలనం సృష్టించింది. ‘చక్రభ్రమణం’ కూడా ఆమె రచనే. నవలగా ప్రసిద్ధమై సినిమాగా విజయవంతమైంది ముప్పాళ రంగనాయకమ్మ రచించిన ‘బలిపీఠం.’ అందులో శోభన్ బాబు, శారద నటించారు. సులోచనారాణి ‘మీనా’ నవల కృష్ణ, విజయనిర్మలను తెరపైన జంటగా నిలపటమే కాకుండా నిజజీవితంలోనూ జంటగా మార్చింది. పొత్తూరి విజయలక్ష్మి రాసిన శ్రీవారికి ప్రేమలేఖను జంధ్యాల హాస్యవల్లరిగా నిర్మించారు. నరేష్, పూర్ణిమ నటించారు.  

యండమూరి వీరేంద్రనాథ్ రచనల సినిమా రూపాలలో కథానాయకుడు చిరంజీవి. దర్శకత్వం కోదండరామరెడ్డి నుంచి రాఘవేంద్రరావుకు మారింది. ‘కాష్మోరా’లో మాత్రం డాక్టర్ రాజశేఖర్, జయచిత్ర నటించారు. ‘చాలెంజ్,’ ‘అభిలాష,’ ‘రుద్రవీణ’ సినిమాలలో చిరంజీవి కథానాయకుడు. ‘అఖరిపోరాటం’లో అక్కినేని నాగార్జున, శ్రీదేవి. ‘ముత్యమంతముద్దు’లో రాజేంద్రప్రసాద్, సీత నటించారు. యండమూడి వీరేంద్రనాథ్ తో పోటీపడి, అతడి కంటే ఎక్కువ నవలలు రచించిన మల్లాది వేంకటకృష్ణమూర్తి నవలలు కూడా సినిమాలుగా వచ్చాయి. జంధ్యాల దర్శకత్వం వహించి, చిరంజీవి నటించిన ‘చంటబ్బాయ్’ వాటిలో ఒకటి. ‘ఆంధ్రభూమి’ సంపాదకుడు గోరాశాస్త్రి శిష్యురాలు డాక్టర్ శ్రీదేవి రచించిన నవల కాలాతీతవ్యక్తులు  చదువుకున్ అమ్మాయిలుగా చిత్రరూపం ధరించింది. ఇందులోనూ అక్కినేని, సావిత్రి ప్రధాన పాత్రలు పోషించారు.

వసంత మలిగైలో వాణిశ్రీ,శివాజీ గణేశన్

దేవదాసు, కన్యాశుల్కం, చింతామణి

ఎన్ టి రామారావు కథానాయకుడుగా నటించిన నవలాచిత్రాలు గురజాడ అప్పారావు కన్యాశుల్కం, కాళ్ళకూరి నారాయణరావు రచించిన  చింతామణి.  కన్యాశుల్కంలో సావిత్ర, చింతామణిలో భానుమతి ఎన్ టీఆర్ సరసన నటించారు.

నవలలు సినిమాలుగా నిర్మించే వరవడిని పెట్టింది ‘దేవదాసు.’ ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ రచించిన ఈ నవల సినిమాగా వచ్చి ప్రకంపనలు సృష్టించింది. ఇందులోనూ నాయకానాయికలుగా అక్కినేని, సావిత్రి నటించారు. అక్కినేని, భానుమంతి జంటగా వచ్చిన ‘బాటసారి’ కూడా శరత్ చంద్ర ఛటోపాధ్యాయ నవలపైన ఆదారపడి తీసిందే.  ఫ్రెంచి రచయిత విక్టర్ హ్యూగో రచించిన లే మిజరబ్లే ఆధారంగా నిర్మించిన ‘బీదలపాట్లు’ కూడా మంచి సినిమా. ఆదివిష్ణు రాసిన సత్యంగారి ఇల్లును జంధ్యాల సినిమాగా నిర్మించిన ‘అహనా పెల్లంట’ లో రాజేంద్రప్రసాద్ హీరో. ఈ చిత్రాలు విడుదలైన పాతికేళ్ళ తర్వాత అవే నవలల ఆధారంగా కొత్త సినిమాలు వచ్చాయి.

ప్రేమ్ నగర్ నిర్మాత డి. రామానాయుడూ, హీరో అక్కినేని నాగేశ్వరరావు కాలం చేశారు. ఆ చిత్రానికి సంబంధించిన ముగ్గురు ముఖ్యులలో మన మధ్య మిగిలింది కథానాయిక వాణిశ్రీ ఒక్కరే. ఆమెతో ‘ద హిందూ’ ప్రతినిధి ఎస్ బి విజయ మేరీ మాట్లాడారు. సావిత్రి, జమున, కృష్ణకుమారి తర్వాత తరానికి చెందిన తారామణి వాణిశ్రీ. హీరో అక్కినేని నాగేశ్వరరావుతోనూ, మరో హీరో నందమూరి తారకరామారావుతోనూ నటించిన విదుషీమణి. వారిద్దరూ తనకంటే వయస్సులోనూ, యశస్సులోనూ పెద్దవారైనప్పటికీ వారి సరసన ధైర్యంగా నటించి రాణించారు. ‘‘నా పాత్ర నాకు ముఖ్యం. అటువంటి మేటి నటులతో నటించడం గర్వంగా ఉండేది,’’ అని అన్నారు వాణిశ్రీ పాత రోజులు గుర్తు తెచ్చుకుంటూ.

హిందీ ప్రేమ్ నగర్ లో రాజేశ్ ఖన్నా, హేమమాలిని, చోప్డా

తలకట్టు పెద్ద హిట్టు

‘ప్రేమ్ నగర్’ లో వాణిశ్రీది ఏయిర్ హోస్టెస్ పాత్ర. తలకట్టు విపరీతమైన ఆకర్షణ. చీరకట్టు, మోచేతులు దాటేవారకూ జాకెట్టు ఆ రోజుల్లో తెలుగువారిని ఫ్యాషన్ ను శాసించేవి. ఆస్పీ అనే హెయిర్ డ్రస్సెర్ ఇంగ్లండ్ నుంచి తిరిగి రాగానే ఈ సినిమాకోసం పట్టుకొచ్చారు. ఆ రోజుల్లో ఎయిర్ హోస్టస్ కు నెత్తిమీద గోపురంలాగా జుట్టుముడి వేసుకోవడం ఆచారం. అట్లా కనిపించేందుకు వాణిశ్రీ జట్టును వెనక్కిదువ్వీదువ్వీ నానా హైరాణ పెడుంతుంటే ఆమె తల్లి అభ్యంతరం చెప్పేదట. ఆ జుట్టుముడే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సినిమాలో. ఆత్మవిశ్వాసం కలిగిన యువతి లతగా వాణిశ్రీ రాణించారు. ‘‘ఈ సినిమాకి పని చేసిన పాటల రచయిత ఆచార్య ఆత్రేయ, దర్శకుడు ప్రకాశరావు అనుభవజ్ఞులు. వారు నిరూపించుకోవలసింది ఏమీ లేదు. అప్పటికే తమ ప్రతిభను నిరూపించుకున్నవాళ్ళు. తాము చేసే పనిపైన పూర్తి విశ్వాసం ఉన్నవారు. కానీ అప్పటికే కొన్ని ఫ్లాప్ చిత్రాలు నిర్మించి విపరీతంగా నష్టబోయిన రామానాయుడుకీ, కెమెరామన్ గా అంతగా రాణించలేకపోయిన వెంకటరత్నంకీ, పెద్ద సినిమాలో, కలర్ సినిమాలో అప్పుడే అడుగుపెట్టిన నాకూ ఆ సినిమా పరీక్షే. అది మాకు చాలెంజ్. మమ్మల్ని మేము నిరూపించుకోవలసిన సమయం. ఆ చిత్రం విజయవంతం కావడంతో మాకు పీహెచ్ డీ పట్టాలు వచ్చినంత ఆనందించాం,’’ అని వాణిశ్రీ గుర్తు చేసుకున్నారు.  

తనకు బాగా నచ్చిన దృశ్యం గురించి వాణిశ్రీ ఫోన్ లో విజయమేరీతో మాట్లాడారు. వాణిశ్రీ (లత)ను అక్కినేని (కల్యాణ్) ఇంట్లో నగలు అపహరించినట్టు అపవాదు వేస్తారు. నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. నగలు తనవద్దే ఉన్నాయని దబాయించి అక్కినేని వాణిశ్రీని తీసుకొని కారుదగ్గరికి వెడతాడు. కారు సమీపిస్తుండా ‘ఎందుకు చేశావు లతా ఆ పని?’ అని అడుగుతాడు. దాంతో హతాశురాలైన వాణిశ్రీ మొహంలో దుఃఖం, విషాదం, ఆగ్రహం, ఆవేదన, అవమానభారం, ఆవేశం, ఆశాభంగం, దిగ్భ్రాంతి, నిరసన కనిపించాలి. ఇన్ని హావభావాలనూ అద్భుతంగా పండించిన ఆ సన్నివేశం తనకు అత్యంత ఇష్టమైదని వాణిశ్రీ ఇప్పటికీ భావిస్తున్నారు. ఆ సన్నివేశంలో నటించే ఘట్టం పూర్తయిన తర్వాత కూడా వాణిశ్రీ కంటతడి ఆరలేదు.

తమిళంలో శివాజీ గణేశన్, హిందీలో రాజేశ్ ఖన్నా

అదే ప్రేమ్ నగర్ కు  తమిళ రూపం అయిన ‘వసంత మలిగై’ సినిమాలో అక్కినేని స్థానంలో శివాజీ గణేశన్ తో నటించినప్పుడు కంట నీరు నటనే. తెలుగు సినిమాలో నటించిన రోజు ఉన్న ఆవేశం, ఆవేదన తమిళ సినిమా నాటికి లేవు. అయితే తెలుగు సినిమా కంటే తమిళ సినిమా నాటికి రంగుల చిత్రాలు నిర్మించే సాంకేతిక పరిజ్ఞానం పెంపొందడంతో తమిళ సినిమా  బాగా వచ్చింది. హిందీలో రాజేశ్ ఖన్నా, హేమమాలినితో ఇదే సినిమాని అదే ప్రమ్ నగర్ పేరుతో అదే నిర్మాత రామానాయుడు నిర్మించి కరువుతీరా లాభాలు దండుకున్నారు. మూడు భాషలలో ఒకే సినిమా తీసి అంతగా సంపాదించుకున్న నిర్మాత అప్పట్లో ఎవ్వరూ లేరు. తెలుగు ప్రేమ్ నగర్ విడులైన తర్వాత 750 రోజులు నిరవధికంగా ప్రదర్శించారు. తాగుతూ, ఆడుతూ జీవితాన్ని పైలాపచ్చీసుగా గడిపేస్తున్న కల్యాణ్ ని లత ఒక విమాన ప్రయాణంలో కలుసుకుంటుంది. ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కల్యాణ్ సెక్రటరీగా చేరుతుంది. కల్యాణ్ చేత తాగుడు మానిపిస్తుంది. వారిద్దరి మధ్యా ప్రేమ అంకురిస్తుంది. అది కల్యాణ్ జమీందారీ కుటుంబ సభ్యులకు నచ్చదు. అనేక అపార్థాలూ, ఆరోపణలూ, కష్టాల తర్వాత కథ సుఖాంతం అవుతుంది. నిజానికి సుఖాంతంగా, దుఃఖాంతంగా రెండు విధాలుగా సినిమా ముగింపు చిత్రించారు. సుఖాంతాన్ని ప్రేక్షకులు హర్షించకపోతే చివరి రీలు మార్చి దుఃఖాంతం చేయాలని అనుకున్నారు. సుఖాంతాన్ని ప్రజలు స్వాగతించడంతో దుఃఖాంతం చేసే ప్రయత్నం విరమించుకున్నారు. ‘‘నాకూ, అక్కినేనికీ, రామానాయుడికీ, శివాజీకీ ప్రేమ్ నగర్ మైలు రాయి అయినందుకు సంతోషంగా ఉంది,’’ అని వాణిశ్రీ వ్యాఖ్యానించారు.

విషాదకరమైన పాత్రలు అక్కినేనికి అలవాటే

అక్కినేనికి విషాదాంత సినిమాలలో నటించడం అలవాటే. ప్రేమికుడిగా, విఫలమనోరథుడిగా తెరపై కనిపించడం మామూలే. దేవదాసు నుంచీ అటువంటి అనేక పాత్రలలో అక్కినేని అద్భుతంగా రాణించారు. ‘సెక్రటరీ’లో జయంతి ( ఆ పాత్ర కూడా వాణిశ్రీ చేశారు) నుంచి లత వరకూ రచయిత ఎవరైనా ఆత్మాభిమానం కలిగిన తెలుగు యువతిని కథానాయికగా చిత్రించడం, ఆరాధించడం తెలుగువారికి ఇష్టమైన విషయం. రామానాయుడు నిర్మాతగా అవతారం చాలించి బిస్తరు సర్దుకొని కారంచేడుకు మకాం మార్చేద్దాం అని అనుకుంటున్న తరుణంలో ‘ప్రేమ్ నగర్’ ఆయనను ఆదుకుంది. ‘ద్రోహి’ చిత్రం విఫలం కావడంతో 12 లక్షల రూపాయల నష్టం నెత్తిమీద కూర్చున్న దశలో నిజామాబాద్ కు చెందిన శ్రీధర్ రెడ్డి దగ్గర ఉన్న కథను రూ. 60 వేలు చెల్లించి కొనుగోలు చేశారు. ఆంధ్రప్రభలో సీరియల్ గా వచ్చిన ‘ప్రేమ్ నగర్’ ను అక్కినేని హీరోగా, కెఆర్ విజయ హీరోయిన్ గా నిర్మించాలని తలపెట్టిన శ్రీధర్ రెడ్డి పాలగుమ్మి పద్మరాజు వంటి నిష్ణాతులచేత స్క్రిప్టు రాయించి సిద్ధం చేసుకున్నారు. కారణాంతరాల వల్ల సినిమా నిర్మాణం మొదలు పెట్టలేకపోయారు. అది రామానాయుడికి కలసి వచ్చింది.  అప్పటికే అక్కినేని నటించిన ‘‘దసరాబుల్లోడు’’ బాక్సాఫీసును బద్దలు కొట్టి రికార్డు సృష్టించింది. 34 సెంటర్లలో విడుదలైన ప్రేమ్ నగర్ 31 కేంద్రాలలో 50 రోజులు ఆడింది. 13 కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకుంది. హైదరాబాద్ లో సిల్వర్ జూబిలీ చేసుకుంది. దసరా బుల్లోడు రికార్డు ను అధిగమించి రూ. 33 లక్షలు వసూలు చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. ‘‘కడవెత్తుకొచ్చిదీ కన్నె పిల్లా….,’’ ‘‘నేను పుట్టాను ఈ లోకం నవ్వింది….’’ అనే సాధారణ ప్రేక్షకులను ఆకర్షించిన పాటలూ, ‘‘తేటతేట తెలుగులా…’’ ‘‘నీకోసం వెలసిందీ ప్రమేమందిరం…’’ వంటి ఉత్తమాభిరుచి కలిగిన ప్రేక్షకులను అలరించిన పాటలూ ఆ సినిమాలో ప్రత్యేక ఆకర్షణ. నవల ఆధారంగా రామానాయుడి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన తొలిచిత్రం ప్రేమ్ నగర్ కావడం విశేషం. ఆ తర్వాత చాలా నవలాచిత్రాలను సురేష్ ప్రొడక్షన్ నిర్మించింది. రామానాయుడిని నిర్మాతగా, వాణిశ్రీని కథానాయకిగా నలిబెట్టిన మైలురాయి వంటి చిత్రం ప్రేమ్ నగర్. తర్వాత వచ్చిన  ప్రేమకథా చిత్రాలకు నమూనా. శుక్రవారం విడులైన ‘లవ్ స్టోరీ‘కి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకుడు. ఈ సినిమాని యాభై ఏళ్ళ కిందట ప్రమ్ నగర్ విడులైన రోజునే తెలుగు ప్రేక్షకులకు అందించడం చరిత్రాత్మకం. అక్కినేని మనుమడి చిత్రం ఎట్లా ఆడుతుందో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles