Sunday, April 28, 2024

వాల్మీకి రామాయణంలో రాముడు దేవుడు కాదు

ఫొటో రైటప్: అజీజ్, లివింగ్ రామాయణ

వాల్మీకి రామాయణంలో రాముడు దేవుడు-అనే మాట ఎక్కడా కనిపించదు. రామాయణం అసలు పేరు ‘పౌలస్య ముని వ్యధ’ లేదా ‘సీత చరితం.’ ఈ రెండు పేర్లు కాకుండా అందులోని రాముడి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి తర్వాత కాలంలో వచ్చిన రచయితలు ఆ పాత్రను దేవుడిగా మార్చారు. కల్పనలు జోడించి, మహిమాన్వితుణ్ణి చేశారు. వాస్తవాలు తెలుసుకోవడం కోసం – వాల్మీకి రామాయణంలోకి తొంగి చూస్తే, అసలు విషయం బయటపడుతుంది! వాల్మీకి రాముణ్ణి దేవుడిగా వర్ణించలేదు. పైగా అత్యంత సాధారణ మానవుడిగా చిత్రించాడు. వాల్మీకి రామాయణంలో రాముడి మాటల్ని, చేష్టల్ని వాల్మీకి ఎలా రాశాడో, ఆ పాత్రను ఎలా చిత్రించాడో ఒక సారి గమనించండి. నిశితంగా ఆలోచించండి. విషయాలు చెక్ చేసుకోండి. అంతేగాని, దయచేసి మనోభావాలు దెబ్బతీసుకోవద్దు-

Also read: నాస్తికోద్యమ విప్లవ వీరుడు-పెరియార్

సీతను వెతుకుతూ రాముడు అరణ్యంలో వెళుతున్నప్పుడు కనిపించిన వృక్షాలతో, జంతువులతో ఇలా మాట్లాడతాడు. సీత ఆచూకీ చెప్పండని బతిమాలుతాడు. వాల్మీకి రామాయణం అరణ్యకాండలోని కొన్ని విషయాలు ఇక్కడ ఉదహరిస్తున్నాను-

  1. ఓ బిల్వ వృక్షమా! బిల్వ ఫలముల వంటి స్తనములు గల నా ప్రియురాలిని చూచినచో చెప్పుము (అరణ్యకాండ 60-13)
  2. ఓ కుభ వృక్షమా! నీ కాండము వంటి తొడలు గల సీతను గూర్చి నీకు తప్పక తెలిసి ఉండును (అరణ్యకాండ 60-15)
  3. ఓ తాళవృక్షమా! పక్వమైన ఫలముల వంటి స్తనములు గల సీతను నీవు చూచితివా? నీకు నాపై దయ ఉన్నచో అందమైన కటిప్రదేశం గల సీతజాడ తెలుపుము (అరణ్యకాండ – 18)
  4. ఓ గజమా! నీ తొండము వంటి తొడలు గల సీతను నీవు చూచి ఉండవచ్చు. అందుచేత చెప్పుము (అరణ్యకాండ 60-25)
  5. మన్మథ పీడితుడైన రాముడు – ఓ సీతా! అరటి స్తంభాలతో సమానమైన నీ రెండు తొడలను అరటి ఆకులు కప్పివేయనట్లు చేసినావు కానీ, అవి నాకు కనబడినవి. వాటిని దాచలేకపోయినావు (అరణ్యకాండ 62-4)
  6. గుండ్రటి నా సీత స్తనములు ఎల్లప్పుడు చూచుటకు అందముగా ఉండి ఎర్రని మంచి గంధము పూసుకొనుటకు అలవాటుపడినవి. అట్టి స్తనములు – రక్తపు బురద పూయబడి, కాంతి హీనములై ఉండి యుండును. ఇది సత్యము (వాల్మీకి రామాయణం: అరణ్యకాండ (63-8)
  7. బంధువులెవరూ దగ్గర లేని నాకు, సీత కూడా లేకపోవుటచే రాత్రులందు నిద్రపట్టక – ఆ రాత్రులు చాలా దీర్ఘములుగా కనబడుచున్నవి. (అరణ్యకాండ 64-13)
  8. Also read: దేశాన్నిఅబద్ధాల ప్రచార కేంద్రంగా మార్చకండి!

ఇక రాముడి ఆలోచనల స్థాయి గురించి చూడండి. సీత కనబడకుండా పోయిందన్న బాధగానీ, ఆమె ఎక్కడ ఏ బాధలు పడుతున్నదో అనే వ్యధగానీ రాముడిలో కనిపించడం లేదు. ఎంత సేపూ ఆమె అవయవాలు మాత్రమే గుర్తుచేసుకుంటున్నాడు. ఇక్కడ రాముడు ఒక కావ్యంలో సృష్టించబడ్డ పాత్ర. తప్పు ఏదైనా ఉంటే ఆ పాత్రను ఆ విధంగా సృష్టించిన రచయిత అయిన వాల్మీకిది తప్పు. సహచరి అయిన  సీత బాధలు అర్థం చేసుకునే స్థాయిలో రాముడి పాత్ర చిత్రణ చేయలేదు. కలిసి గడిపిన రోజులలో కష్టసుఖాలు కూడా రాముడనే పాత్రకు గుర్తురానీయలేదు. రామాయణం రాయబడ్డ కాలం నాటికి వాల్మీకి ఎదగని మానవ ప్రవృత్తితో ఉన్నవాడే – సున్నితమైన ప్రేమ భావన, లాలిత్యం, విరహవేదన వర్ణించలేకపోయాడు. మనిషి మనిషిని ప్రేమించినట్లు, మనిషి మనిషిని గౌరవించినట్లు, మనిసి, మనిషి తోడుకోసం తపించినట్లు వాల్మీకి రామాయణంలో ఎక్కడైనా కనిపిస్తుందా? ముడివడి పెనవేసుకుపోయిన రెండు జీవితాల మమతానురాగాలు, దూరం పెరగడం వల్ల కలిగే లోతైన వెలితి, చెలరేగిన ప్రేమ తుపానులు ఏమైనా కనిపించాయా? లేదు- ఎందుకంటే అది ఎదగని కాలం, ఎదగని మనుషులు, అనాగరిక ఆటవిక జీవితాలు, స్త్రీపురుషుల మధ్య ఉండే లైంగిక సంబంధాన్ని అధిగమించి హుందాగా, ప్రేమికుడిగా, జీవిత భాగస్వామిగా చేసిన ఉన్నతమైన ఆలోచనలు ఏవీ? 1950-60లలో వెలువడ్డ ఏ పాత బాలివుడ్ సినిమా విరహగీతం విన్నా హృదయం ద్రవించిపోతుందే? వాల్మీకి వర్ణించిన రాముడి బాధ – విరహంలో ఏ పరిపక్వతా లేదే?

అలాంటి రచనకు ఒక మహాకావ్యమని పేరా? అందులోని ఎదగని మనస్తత్వమున్న కథానాయకుడు దేవుడా? పోనీ మనిషిగా ఆదర్శప్రాయుడా? అలా ఓ కల్పిత పాత్రకు కోట్లు ఖర్చు చేసి ఆలయం కట్టేవారిది ఎంత విజ్ఞత? ఒక రకంగా వాల్మీకి, రాముడి పాత్రే – నయం! ఎందుకంటే ఆ రచయితా, ఆ పాత్రా వారి కాలానికి సరిపోయే విధంగా ఆలోచించారు. అందువల్ల వారి స్థాయి అప్పటికి అంతే అని మనం సరిపెట్టుకోవచ్చు. కానీ, ఇప్పుడు అత్యాధునిక యుగంలో జీవిస్తూ, మూడు వేల ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఆలోచించేవారిని ఏమందాం? ఈ కాలానికి సరిపడని అనాగరిక ముర్ఖత్వాన్ని బలవంతంగా ప్రచారం చేస్తున్న అవివేకుల్ని ఏమందాం? ఆనాడు వాల్మీకి ఆలోచనలు స్త్రీ అవయవాల దగ్గరే ఆగిపోయినట్టు- నేటి బూర్జువా రాజకీయ నాయకుల రాజుకీయాలు కూడా అక్కడే ఆగిపొయ్యాయి. స్త్రీ శరీరాలు నేటి రాజకీయాలకు యుద్ధభూములు ఎందుకవుతున్నాయీ? మణిపూర్ లో జాతుల మధ్య చిచ్చులేపి, మహిళల్ని నగ్నంగా ఊరేగించడం, బహిరంగంగా సామూహికంగా రేప్ చేయడం దేనికి సంకేతం? సమకాలీన సమాజం ఇలా తగలబడిందంటే- తరతరాలుగా ఇలాంటి అశ్లీల ఘట్టాలు, అశ్లీల కావ్యాలు చదివినందువల్ల కాదంటారా? సంస్కృతీ సంప్రదాయాల పేరుతో అశ్లీల భావజాలాన్ని వ్యాప్తి చేసినందు వల్ల కాదంటారా? స్త్రీ భోగ వస్తువు కాదు. మనసూ, శరీరం, వ్యక్తిత్వం గల ఒక మనిసి అని ఏ పురాణమైనా, ఏ కావ్యమైనా చెప్పిందా?

Also read: ప్రపంచ నాస్తిక సభలు జరిపిన – గోరా

సంస్కృతి అనే ముసుగులో ఈ కాలానికి పనికిరాని భావజాలం ప్రచారం చేస్తారా? తమ స్వార్థ చింతనతో యువతరాన్ని వెనక్కి నడిపించడమెందుకూ?  జైశ్రీరామ్ – నినాదాలు నేర్పించి వారి భవిష్యత్తును అంధకారంలోకి తోసెయ్యడమెందుకూ? హిందూ సంప్రదాయం ప్రకారం వివాహితుడైనవాడు ఏ పూజ అయినా భార్యతో కలిసి చేయాలి. భార్యను తన్నితగలేసి, అధికారికంగా విడాకులివ్వకుండా, ఒక మహిళ జీవితాన్ని నాశనం చేసిన ఆ పెద్ద మనిషి, ఒంటిలింగంలాగా ప్రతిచోటా, ప్రతిపూజ ఒంటరిగానే చేస్తుంటాడు. దానితో దేశ ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నట్టూ? – మీరు కూడా మీ భార్యల్ని తన్ని తగలేయండి. విడాకులు కూడా తీసుకోకండి. దేశాల మీద పడి  ప్రజల సొమ్ముతో బలాదూరు తిరుగుతూ ఉండండి. చదువుకోకండి. ఎప్పుడు మాట్లాడినా, మనసులో లేని మాటలు – మంకీ బాత్ తో మాట్లాడండి అనా? అదానీ, అంబానీల దగ్గర పెదపాలేరుగా పడి ఉండండనా? ఏం సందేశం ఇస్తున్నట్టూ?

సరే, రామాయణం గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి, శ్రీరాముడి భక్తులకు, రామాయణ కావ్యాన్ని చదివేవారికి నేను మరొక రామాయణం చదవమని సూచిస్తాను. అది లివింగ్ రామాయణ (LIVING RAMAYANA). రచయిత అజీజ్ తరువాన. ఇది ఒక పరిశోధనాత్మక గ్రంథం. కేరళలో ముఖ్యంగా వయనాడ్ ప్రాంతంలో జనం నాలుకల మీద ఉన్న అనేక కథలు సేకరించి, ఈయన గ్రంథస్థం చేశారు. రామాయణం అక్కడే తమ ప్రాంతంలోనే జరిగిందని అక్కడి జనం గట్టిగా విశ్వసిస్తున్నారు. పుల్ పల్లి దగ్గర ఆశ్రమ్ కొల్లి అనే చోట వాల్మీకి ఆశ్రమం ఉండేదని నమ్ముతున్నారు. అలాగే జడయట్టకవు అనే చోట సీత భూమిలోకి వెళ్ళిపోయిందనీ…అక్కడ భూమి చీలిపోయినట్టు ఉన్న చోటును చూపిస్తారు. అంతే కాదు. హనుమంతుడి తోక రాసుకుపోయిన మరకను కూడా అక్కడి గ్రామీణులు చూపెడతారు. అలాంటి గుర్తులు మనకిక్కడ భద్రాచలంలో కూడా చూపెడతారు. ప్రతిచోటా స్థల పురాణాలు ఉండడం మనకు కొత్తేమీ కాదు. అంటే వైదిక బ్రాహ్మణార్యులు జనాన్ని ఎంతగా ప్రభావితం చేశారన్నది మనం గ్రహించుకోవాలి. అందుకే తరచూ చెపుతుంటాను. బ్రాహ్మణిజాన్ని మోసుకు తిరిగేది ప్రస్తుతం బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణేతరులే!

Also read: దేశాన్ని నగ్నంగా నడిపించినవారు మన పాలకులా?

రచయిత అజీజ్ తరువాన కాలికట్ లోని ఫారూఖ్ కాలేజిలో మళయాళ విభాగానికి అధిపతి. కేరళ భాషా ఇనిస్టిట్యూట్ లో సంపాదకుడిగా, ట్రైబల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు. అంబేడ్కర్ నేషనల్ ఎక్స్ లెన్సీ అవార్డు పొందిన వీరి ‘వాయనదన్ రామాయణ’ గ్రంథానికి ఇంగ్లీషు అనువాదమే ఈ ‘లివింగ్ రామాయణ.’ ఈ పుస్తకం ఆన్ లైన్ లో దొరుకుతుంది. ఇది కాక, మరో ఐదు గ్రంథాలు కూడా ఈ రచయిత ప్రకటించారు. కేరళలోని  ‘ఆదియ రామాయణం’లో కొన్ని హేతుబద్ధమైన అంశాలున్నాయి. కేరళ, వేనాడు జిల్లా త్రిసెల్లరీలో గల ఆదియ అదివాసీ తెగలవారు చెప్పుకునే కథలో – కడుపుతో ఉన్న సీతను వదిలేయడాన్ని భరించలేక రాముణ్ణి దూషిస్తూ ప్రశ్నిస్తారు. అలాగే మాతంగ చెట్టి జాతి వారి కథలో లవకుశుల గురించి భిన్నమైన కథ ఉంది. ఈ కథ ప్రకారం సీతకు ఒక్కడే కొడుకు. ఆమె వాణ్ణి వాల్మీకి దగ్గర ఉంచి, స్నానంకోసం నదీ తీరానికి వెళుతుంది. స్నానం చేసి వచ్చి కొడుకును తీసుకుని మళ్ళీ బయటకు వెళుతుంది. వాల్మీకి అది గమనించడు. తనకు అప్పగించిన పిల్లవాడు తప్పిపోయాడని అనుకుంటాడు. సీతకు ఏం సమాధానం చెప్పాలో అని భయపడి, కుశగడ్డి పరకతో ఒక పిల్లవాణ్ణి సృష్టిస్తాడు. వాడే కుశుడవుతాడు. సీతకుపుట్టినవాడు లవుడు. ఆ రకంగా లవకుశులవుతారు. వాల్మీకి సర్ది చెప్పిన మాటలకు సమ్మతించి సీత కుశుణ్ణి కూడా స్వీకరిస్తుంది.

ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమంటే – కుశగడ్డితో పిల్లవాణ్ణి సృష్టించగలిగిన వాల్మీకి తన దివ్యదృష్టితో లవుడి ఆచూకి తెలుసుకోలేడా? ఇవన్నీ అభూత కల్పనలు,కట్టుకథలు అనేది ఎందుకంటే – పురాణ పాత్రలు ఒక్కోసారి మానవాతీత శక్తులు ప్రదర్శిస్తాయి. మరోసారి కనీసం మనిషికుండే అవగాహన కూడా లేకుండా వ్యవహరిస్తాయి. ఇండొనేషియా, థాయ్ ల్యాండ్ లలో రామాయణం జనపద గీతాలుగా ప్రాచుర్యం పొందింది. ‘‘హికాయత్ సెరిరామ’- ‘శ్రీరామ పతయాని రామాయణం’ – ‘రామ్ కె లింగ’ వంటివి జానపద సాహిత్యంగా గుర్తించబడ్డాయి. టిబెట్ లోని రామాయణాన్ని ‘వనవాసం’ అని పిలుస్తారు. ఇందులో సీత, రావణాసురుడి కుమార్తె- అని రాసుకున్నారు. రచయిత అజీజ్ తరువాన ప్రపంచంలోని వివిధ రామాయణాలలోని కథల్లో, పాత్ర చిత్రణల్లో ఉన్న వైవిధ్యం గురించి విశ్లేషించారు. ఇంత వైవిధ్యమున్న రామాయణాన్ని ఒక సృజనాత్మక రచనగా స్వీకరిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఇంత విస్తృతంగా పరిశోధించిన ఈ రచయిత దీన్ని ఒక సామాజికపరమైన కథగానే  పరిచయం చేశారు. దేవుడు, భక్తి అనే మాటలు అసలు ఆయన పరిచయంలో ఎక్కడా కనిపించవు. రచయిత ముస్లిం అయి ఉండి, ఒక హిందూ పురాణంపై విశేషంగా కృషి చేయడం అభినందించదగ్గ విషయం! పరమత సహనానికి, ప్రజాస్వామ్య విలువలకూ ఒక గొప్ప ఉదాహరణ!!

Also read: వాస్తవిక సృజనకారుడు మున్షీ ప్రేమ్ చంద్

(రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles