Monday, November 28, 2022

ఎవరు చరిత్ర హీనులు?

రెండో భాగం                                  

పౌర హక్కుల ప్రజా సంఘం – తెలంగాణ రాష్ట్రం,  ప్రతినిధులమైన మేము – జయ వింధ్యాల, ఇక్బాల్ ఖాన్, సలీం, ఉస్మాన్, ఆరీఫ్ మరియు రాజేంద్ర ప్రసాద్ లు నిజ నిర్ధారణ కమిటీ గా ఏర్పడి 14-07-2021 నాడు .. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 ఏళ్ళ పాప అపహరణకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన పరిస్థితిపై క్షేత్ర స్థాయిలో తగిన  సమాచారం కోసం ప్రయత్నించాము. మీరూ మాతో భాగస్వాములు కండీ, చదవండి ఆ విషయాలను  …   

రాచకొండ పోలీస్ కమిషనెరేట్ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం లోని వెంకటేశ్వర నగర్ కాలనీ, దమ్మాయిగూడ, కీసర మండలం నివాసితులైన  శ్రీమతి  స్వరూప, శ్రావణ్ కుమార్ ల  4 ఏళ్ళ బాలిక (అమ్ములు)  04-07-2021 నాడు మధ్యాహ్నం 3. 30 / 4 గంటల ప్రాంతంలో ఇంటి నుండి షాప్ కు వెళుతుండగా మార్గం మధ్యలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని 04-07-2021 నాడే రాత్రి 8 గంటల సమయం లో బాలిక తండ్రి ఫిర్యాదు చేసారు ( క్రైమ్ నంబర్ 515/2021).

ఆరేళ్ళ పాప తెలిపిన ఆచూకీ 

అమ్ములు తల్లి తండ్రి, ఆ ప్రాంతపు నివాసితులు కలిసి వెతుకుతున్న సమయంలో ఆరేళ్ళ బాలిక  ఇద్దరు అంకుల్స్ స్కూటర్ మీద అమ్ములును తీసుక వెళ్లారని చెప్పిన తరువాతనే అపహరణకు గురైనట్లుగా తల్లి తండ్రులు భావించారు. ఆ వెంటనే  పోలీసులకు తెలియపరిచారు. పోలీసుల సహాయంతో కూడా అమ్ములు కోసం వెతికారు. ప్రయత్నం ఫలించలేదు. మరుసటి దినం ఉదయం గం.7. 30ల ప్రాంతంలో అర్బన్ అడవికి దగ్గరలో వున్న వాటర్ ట్యాంక్ (వికాస్ నగర్) దగ్గెర అపస్మారక స్థితిలో పడివున్న బాలికను వాటర్ ట్యాంక్ కాపలాదారు చూసినాడు. ఆ బాలికకు ఫస్ట్ ఎయిడ్ చేసిన తరువాత  పోలీసులకు, ఇతరులకు తెలియ పరిచాడు. ఈ పరిస్థితులలో అమ్ములు విషయం అమ్ములు తల్లి తండ్రులకు తెలిసినది. హుటాహుటిన వెళ్లి చూడగా అమ్ములుగా గుర్తించారు. ఆసుపత్రికి తరలించారు. అమ్ములును మానభంగం చేసారని డాక్టర్స్ నిర్ధారించారు. రేప్ చేసిన నిందుతులకోసం పోలీసులు గాలించారు.

09-07-2021 నాడు 9 ఏళ్ళ బాలికను ఒక వ్యక్తి  అపహరించే ప్రయత్నం చేశాడు. కీసర మండలం, దమ్మాయి గూడ, ప్రగతి నగర్, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి నివాసితురాలైన ఒక  మహిళ కిరాణా షాప్ నడిపిస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయం లో 40 ఏళ్ళ వయసు, ఎరుపు టి షర్ట్, ఎరుపు రంగు నైట్ ప్యాంటు ధరించి ఉన్న అతడు  కిరాణా షాప్ కు వచ్చాడు. ఒక సిగరెట్ ఇవ్వమని అడుగగా కిరాణా షాప్ యజమానురాలు తన 9 ఏళ్ళ బిడ్డ కు సిగరెట్ అడిగిన అతడికి ఇవ్వమని సిగరెట్ అందించినది.  ఆ సిగరెట్ అందుకున్న  అతడు ఆ అమ్మాయిని షాప్ బయటికి రమ్మని అడుగగా, ఆ పాప బయటకు వెళ్ళినది. ఆ సిగరెట్ అతను పాప యొక్క  ప్రయివేట్ పార్ట్శ్ ను పట్టుకొనగా ఆ పాప గట్టిగా ఏడ్చింది. తల్లి వెంటనే బయటకు పరుగెత్తుకొని వచ్చి ఆ సిగరెట్ వ్యక్తిని పట్టుకొనే ప్రయత్నం చేయగా ఆ వ్యక్తి పారిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియ పరిచారు( క్రైమ్ నంబర్ 539/2021)

సీసీటీవీలో నమోదు  

09-07-2021 నాడు జరిగిన సంఘటన అక్కడ ఉన్న సీసీటీవీ లో నమోదు అయ్యింది. ఈ సీసీటీవీ ని ఆధారం చేసుకొని పోలీసులు10-07-2021 నాడు ఆ ఆగంతకుడిని ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కార్మికుడు అభిరాం దాస్ గా గుర్తించారు. పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ పరిస్థితులలో 04-06-2021 నాడు అమ్ములు పై చేసిన అఘాయిత్యం కూడా అభిరాం దాస్ చేసినట్లు ఒప్పుకున్నాడు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 324/2021తో 31-05-2021 నాడు ఉదయం 11.00 / 11. 30 మధ్య  ఇంటి ముందు ఆడుకుంటున్న 4 ఏళ్ళ పాప అపహరణకు గురైనది. ఈ అపహరణ చేసినది కూడా అభిరాం దాస్ గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.  

 రాచకొండ కమిషనరేట్ – మల్కాజిగిరి జోన్ , ఎల్. బి . నగర్ జోన్, భువనగిరి జోన్ లు గా విస్తరించి ఉన్నది  (లా & ఆర్డర్ జోన్స్ – 3, సెంట్రల్ క్రైమ్ స్టేషన్స్ -3, సైబర్ క్రైమ్ సెల్ -1, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ – 9 ఉన్నాయి).  ఈ కమిషనరేట్ ను గతం లో సైబరాబాద్ కమిషనరేట్ ఈస్ట్ గా పిలవబడేది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వలస కార్మికులకు, వలస వచ్చిన వారికి మంచి అనువైన ప్రాంతం. అన్ని రకాల సంస్కృతులకు ఇక్కడ స్థానం ఉన్నది. మన దేశమే భిన్న సంస్కృతులకు నిలయం

ఒరిస్సా నుంచి వచ్చిన వలస కూలీ 

04-07-2021 నాడు 4 ఏళ్ళ పాప అపహరణకు గురైన కేసు విషయం గురించి కుషాయిగూడ ఏసీపీ గారిని విచారణ అధికారిగా నియమించారు. అభిరామ్ దాస్ ఒరిస్సా నుండి వలస కూలీగా వచ్చి దమ్మాయిగూడ ప్రాంతంలో ఉంటున్నట్లు కమిటీ దృష్టికి వచ్చింది. భార్య,  ఇద్దరు పిల్లలు, అభిరాం దాస్ ను వదిలి వేసినట్లు తెలిసింది. స్నేహితులతో కలిసి ఉంటున్నాడు అని తెలిసింది.04-07-2021 అమ్ములు అపహరణకు గురై, మరుసటి దినం వికాసనగర్ వాటర్ ట్యాంక్ దగ్గెర అపస్మారక స్థితిలో ఉన్న పాపను వాటర్ ట్యాంక్  కాపలాదారు చూసి సమాచారం ఇచ్చే వరకు పోలీసులు అమ్ములును కనిపెట్టలేక పోయారు. 09-07-2021 నాడు ప్రగతి నగర్ లోని పాపతో చేసిన పాడుపనిపై అతన్ని10-07-2021 నాడు అరెస్ట్ చేయగా, ఆ నిందితుడు చేసిన నేరాలను చెప్పగా 04-07-2021 నాటి నేరం తెలిసినది. 31-05-2021 నాటి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరం నిందితుడి సమాచారం బయటికి వచ్చింది. 

రాచకొండ కమిషనర్ గారు ఆధునిక వైజ్ఞానం తో క్రైమ్ ను ఛేదిస్తున్నాము అని పత్రికా ముఖంగా పలు దఫాలు చెప్పారు. పిల్లల అపహరణలను ఆధునిక వైజ్ఞానంతో అరికడుతున్నాము అని కూడా చెప్పారు. పై మూడు కేసులు చాలా మామూలు సాధారణ కుటుంబాల పిల్లలు. కీసర పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేయబడిన కేసు వలస వచ్చి, కూలి పని  చేసి బ్రతికే “ఓసి” కుటుంబానికి చెందిన పాప. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయబడి అమ్ములు కేసు పేద మధ్య తరగతి “బీసీ” కుటుంబానికి చెందిన వారు. మరో కేసుకు చెందిన వారు “ఎస్సి” కుటుంబానికి చెందిన వారు. సమస్య ఎక్కడ ఉన్నది? 

ఈ మూడు కేసులను క్షేత్ర స్థాయిలో తిరిగి సమాచారం సేకరిస్తున్నప్పుడు కమిటీ గమనించిన విషయం — పోలీసులు బాధితులతో కలిసి నిందితుడి కోసం వెతికారు. బాధితులు పోలీసుల గురించి ఒక్క మాట వ్యతిరేకంగా కమిటీకి చెప్పలేదు. రాత్రి పగలు పోలీసులు బాధితులతో పాటు కష్టపడ్డారు అని చెపుతున్నారు. మరి లోపం ఎక్కడ?

పరిశీలించవలసిన అంశాలు

ఇలాంటి  కేసులను డీల్ చేస్తున్న అధికారుల నుండి ఎక్కువగా విన్న విషయాలు ::- 

గతంలో (1). ఆడవాళ్ళను ను ఎత్తుకవెళ్లి రేప్ చేస్తున్నారు అన్నప్పుడు — వారి డ్రెస్ కోడ్ సరిగ్గా ఉండటం లేదన్నారు / ఇప్పటికీ వింటున్నాము,

(2). ఎత్తుక వెళ్లి రేప్ చేసి చంపేస్తున్నారు అని చర్చ జరిగినప్పుడు — బ్రతికి ఉంటే సాక్ష్యం ఉంటుంది కాబట్టి చంపుతున్నారు అన్నారు / అంటున్నారు,

(3). చిన్న ఆడ పిల్లలను ఎత్తుక వెళ్ళుతున్నారు, రేప్ చేస్తున్నారు అన్నప్పుడు – ఆ చిన్న పిల్లలు, ఏం తెలియదు, కేసులు బలంగా ఉండవు, సాక్ష్యం బలంగా ఉండదు,  కాబట్టి ఎత్తుక వెళుతున్నారు, రేప్ చేస్తున్నారు, చంపబడుతున్నారు  అన్నారు / అంటున్నారు . 

(4). ఒక్కడే ఉంటున్నాడు, భార్య పిల్లలు వదిలి వేసారు, పెళ్లి కాలేదు, పిల్లను ఎవ్వరూ ఇచ్చేటందుకు ముందుకు రావట్లేదు, మరో దారి లేక ఆ పాడు పని చేస్తున్నారు అని నేడు ఎక్కువగా వింటున్న విషయం / జస్టిఫికేషన్ కోసం ఒక ప్లాన్ ప్రకారం ఈ వాదనను చాలా తెలివిగా కొంత మంది అధికారులు, కొంత మంది సంస్కర్తలు చర్చ పెడుతున్నారు. 

ఆడవాళ్లపై బలవంతంగా అత్యాచారాలు జరుగుతున్న / అత్యాచారాలు చేస్తున్న దానికి, చిన్న పిల్లలను అపహరించి రేప్ చేస్తున్న దానికి పై కారణాలతో  సరిపెట్టుకోవచ్చా ?

క్రైమ్ ను అరికట్టేటందుకు నిరంతరం ప్రజల మధ్యనే నిఘా విభాగాలు ఉంటున్నాయి. వీరి పని ఏమిటి? అసాంఘిక కార్యకలాపాలకు పూనుకొనే వారిని నిలువరించేటందుకు ఈ నిఘా విభాగాల పని అనేది పోలీసుల విధి – విధానాలలో చూపబడుతుంది. “అసాంఘిక కార్యకలాపాలు” గురించి పోలీసులు ఇచ్చే అర్ధం ఏమిటో వివరిస్తే ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతారు. అసాంఘిక కార్యకలాపాలు అంటే మేము భావిస్తున్నది – దారి దోపుడులు చేసే వారు, శారీరక – మానసిక హింసలకు ప్రేరిపించే వారు, లంచగొండిలకు పాలుపడే వారు, బలాత్కారాలు చేసేవారు, బందు ప్రీతికి – ఆశకు లోనయ్యే వారు, .. వగైరా , వగైరాలు అని. 

కీసర పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయ్యిన కేసు 31-05-2021. దీనిలో నిందితుడు 09-07-2021 వరకు పోలీసులకు దొరకలేదు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో 04-07-2021 నాడు రిజిస్టర్ అయ్యిన కేసులోని నిందితుడు 09-07-2021 వరకు దొరక లేదు. తేదీ : 09-07-2021 నాడు రిజిస్టర్ అయ్యిన కేసులో 10-07-2021 నాడు అరెస్ట్ అయ్యిన వ్యక్తి చేసిన నేరాలను ఒప్పుకున్నప్పుడు మొదటి రెండు కేసులలోకూడా ఈ నిందితుడే అని  పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇందులో పోలీసుల డొల్లతనం కనిపించటం లేదా? మొదటి కేసులోనే సమర్ధవంతంగా పోలీసులు పనిచేసి ఉండి ఉంటే రెండు నేరాలను అరికట్టే అవకాశం ఉన్నది. రెండు కుటుంబాల పై జరుగబోయే “హింసను ” అరికట్టే అవకాశం కూడా ఉంది. కీసర పోలీస్ స్టేషన్ లో తన బిడ్డ గతి ఏంటని రోదిస్తున్న బాధను ఎవరు పరిష్కారం చేస్తారు ? అమ్ములు జీవితం ఏంటని బాధపడుతున్న తల్లి తండ్రుల ఘోషను ఎవరు తీరుస్తారు ? కిరాణ షాప్ మహిళ తన 9 ఏళ్ళ బిడ్డ గురించి భయపడుతున్న భయాన్ని ఎవ్వరు దూరం చేస్తారు ? 

ప్రజలకు రక్షకులుగా ఉండవలసిన పోలీసులు మరి దేనికోసం పనిచేస్తున్నట్లు. ప్రభుత్వమేమో,   పోలీసులు “మంచి పనిమంతులుగా” పనిచేస్తారు అని పోలీస్ స్టేషన్స్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భవంతులను, ఆధునిక వాహనాలను ఇస్తున్నది. ఇవి ఎవరి కోసం? వీటితో పోలీసులు ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు .  నేరస్థుల నుండి / నేరాల నుండి  ప్రజలను కాపాడుతారా? ప్రజల   పరిస్థితి ఏంటి ? 

ప్రజలు “పోలీస్ డ్రెస్” లేని పోలీసులుగా మారాలనా? మానసికంగా గాయపడిన కుటుంబాలను వేధిస్తున్న “గాయాలకు”  పరిష్కారం ? ఎక్కడ, ఎప్పుడు?  

Also read: ఎవరు చరిత్ర హీనులు?

(జయ వింధ్యాల, అడ్వకేట్  & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల ప్రజా సంఘం – తెలంగాణ స్టేట్ # మలక్పేట్ ఎక్స్ రోడ్, హైదరాబాద్, మొబైల్ :  9440430263)    

Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles