Thursday, May 2, 2024

వాస్తవిక సృజనకారుడు మున్షీ ప్రేమ్ చంద్

31 జులై వచ్చిందంటే భారతీయ మహారచయిత మున్షీ ప్రేమ్ చంద్ గుర్తుకు వస్తారు. కేవలం ఉరుదూ, హిందీ భాషలవారికే కాదు. అన్ని భారతీయ భాషల వారికీ ఆయన గుర్తుకొస్తారు. ఎందుకంటే వారి వారి భాషల్లో ఆయన నవలో, కథో చదివే ఉంటారు. 1936లో ఏర్పడ్డ భారతీయ అభ్యుదయ రచయితల సంఘానికి తొలి అధ్యక్షులయినందుకు ఆయనను గుర్తుంచుకోవాలా? లేక అతి కష్టంగా రోజులు గడుస్తున్న కాలంలో గాంధీజీ పిలుపు విని, సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా స్కూలు ఇనిస్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర్య పోరాటంలోకి దూకినందుకా?గర్భిణి అయిన భార్యను, ఇద్దరు చిన్న పిల్లల్ని, తనను, తన అనారోగ్యాన్నీ మొత్తానికి మొత్తంగా రోడ్డు మీది కీడ్చుకున్నందుకా? ఎందుకు? ఎందుకాయనను గుర్తుంచుకోవాలి? పుట్టినప్పటి నుండి ప్రతి అడుగులో ముళ్ళమీద అడుగులేస్తూ కూడా మొక్కవోని ధైర్యంతో నిలబడినందుకా? – ఇలా ఏ ఒక్క కారణానికో కాదు, అన్ని కారణాల్ని కలిపి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది మున్షీ ప్రేమ్ చంద్ ను. ‘మున్షీ’ –అంటే గౌరవ సూచనగా వాడే పదం. అంతే, ఆయన కలం పేరులోని భాగం కాదు.

మున్షీ ప్రేమ్ చంద్

ఒక రకంగా చెప్పాలంటే మా తరం ప్రేమ్ చంద్ రచనలు చదువుతూ పెరిగాం. ఆయన ఎవరూ? ఏ భాషా రచయితా? చదివేది మూలమా? అనువాదమా? అనే స్పృహ కూడా ఆ రోజుల్లో మాకుండేది కాదు. నేనైతే 1970లలో ఆయన తెలుగు రచయిత అనుకుంటూ ఉండేవాణ్ణి. ఆ రోజుల్లో రష్యన్ సాహిత్యం విరివిగా తెలుగులోకి వచ్చేది. అలాగే ప్రేమ్ చంద్ సాహిత్యం కూడా! రష్యన్ల పేర్లు వేరుగా ఉంటాయి గనక, గుర్తు పట్టే వాళ్ళం. కానీ ప్రేమ్ చంద్ పేరు మన తెలుగు రచయిత గోపీచంద్  లాగా ఉండటం వల్ల, ఈయన మరో తెలుగు రచయిత అనుకునేవాళ్ళం. అయితే కాలక్రమంలో  విషయం అర్థమవుతూ వచ్చింది. చదువుకునే రోజుల్లో ప్రేమ్ చంద్ నవల ‘నిర్మల’ తెలుగు అనువాదం కొని చదివాను. ఎంత బాధ పడ్డానో చెప్పలేను. లోకం రీతీ వాయి ఇట్లా  ఉంటుందా? అనిపించింది.

Also read: దేవనూరు మహదేవ: దేశంలో ఒక  సంచలనం!

రచనలు ఊహల్లోంచి, భ్రమల్లోంచి కాదు – వాస్తవాల్లోంచి, నిజాల్లోంచి వెలువడాలన్నది ఆయన రచనలు చదివిన వారికి అప్రయత్నంగానే అర్థమౌతుంది. గొప్ప గొప్ప చదువులు చదవక పోయినా, భాషాపాండిత్యం సంపాదించకపోయినా, జీవిత పాఠాల్ని క్షుణ్ణంగా నేర్చుకుంటే మహారచయితలు కాగలరన్న విషయాన్ని ప్రేమ్ చంద్ చెప్పకనే చెప్పారు. తల్లిప్రమేను పొందలేక, తండ్రి నిరాదరణకు గురై, తన బాహ్య, అంతర్ ప్రపంచాలలో పెనుభూతంలా పెరిగిన ‘ఒంటరితనాన్ని’ పుస్తకాలతో దెబ్బకొట్టారాయన. చిన్నప్పుడు పుస్తకాల షాపులో పని చేయాల్సి వచ్చినా,  ట్యూషన్లు చెప్పినా, ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేసినా – ఎన్ని ఊర్లు మారినా, ఎక్కడ ఉన్నా పుస్తక పఠనం… ముఖ్యంగా సృజనాత్మక సాహిత్యం చదువుతూ గడిపేవారు. తన ఒంటరితనాన్ని సాహిత్య పఠనంతో నింపుకునేవారు. తర్వాత కాలంలో మెల్లమెల్లగా తనూ రాయడం ప్రారంభించారు.

Also read: మ్యాన్ వర్సెస్ వైల్డ్

ప్రేమ్ చంద్ (31 జులై 1880-8 అక్టోబర్ 1936) వారణాసి దగ్గర ‘లంహి’ అనే గ్రామంలో అజైబ్ రాయ్, ఆనందీ దేవి దంపతులకు పుట్టారు. పుట్టినప్పుడు పెట్టిన పేరు ధనపత్ రాయ్. చిన్నప్పుడు ఊళ్ళోని మందసాలో ఉరుదూ, పర్షియన్ నేర్చుకున్నారు. చిన్నతనంలోనే తల్లి చనిపోయినందువల్ల అమ్మమ్మ సంరక్షణలో పెరిగారు. వీరి మామ ఒకాయన సరదాగా ధన్ పత్ రాయ్ ని ‘నవాబ్’ అని ముద్దుగా పిలుస్తుండేవాడు. అదే పేరుతో ఆ యువకుడు చిన్న చిన్న కథలురాయడం ప్రారంభించాడు. మొదట ‘నవాబ్ రాయ్’ అనే కలంపేరుతో కొంత కాలం రాసి, తర్వాత ‘బాబూ నవాబ్  రాయ్ బన్సారీ’ పేరుతో రాసి, చివరికి 1909లో ‘ప్రేమ్ చంద్’ అనే కలం పేరు స్థిరపరచుకున్నారు. వంశపారంపర్యంగా వచ్చిన సాహిత్య వారసత్వమేదీ లేదు. తాత పట్వారి. తండ్రి పోస్టాఫీసు క్లర్క్. అంతే! కాని, పుస్తకాల్లోంచి ప్రపంచాన్ని చదవగలిగిన నైజం, నేర్పు ప్రేమ్ చంద్ కు చిన్నతనంలోనే అబ్బింది. అందుకే ఆయనలో ఒక గొప్ప పాఠకుడితో పాటు, ఒక గొప్ప రచయిత కూడా క్రమక్రమంగా ఎదిగాడు. చిన్నప్పుడు తన తల్లిని చూసిన అనుభవం, ఆమె మాట, నడవడి, దయాగుణం ఆయన తర్వాతి కాలంలో ‘బడే ఘర్ కి బేటీ’ నవలలో చిత్రంచాడని అంటారు. అలాగే, ఏ పనీ నేర్చుకోకుండా పుస్తకాల పురుగులా ఎప్పుడూ చదువుతూ కూర్చుంటాడని ఆయన చిన్నాన్న కోపగిస్తుండేవాడట. ఆ చిన్నాన్న ఒక తక్కువ జాతి యువతితో చేసే ప్రేమవ్యవహారం తన రచనలో పొందుపరిచాడనీ..ఆ రకంగా ఆయనపై కసి తీర్చుకున్నాడనీ విమర్శకులంటారు. ఏది ఏమైనా జీవితాన్ని సాహిత్యీకరించడం ఎలాగో ప్రేమ్ చంద్ కు తెలిసినట్టుగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. తర్వాత కాలంలో రాసిన దేవస్థాన్ రహస్య, దునియా క సబ్ సె అన్ మోల్ రతన్, ప్రేమాశ్రమ్ (1922), రంగభూమి(1924), నిర్మల (1925), కర్మభూమి (1931) వంటి రచనలు పుంఖాను పుంఖంగా వందల సంఖ్యలో వెలువడ్డాయి. కొన్ని ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువాదమవుతూ వచ్చాయి.

ప్రేమ్ చంద్, భార్య శివరాణిదేవి

తన ఎనిమిదో ఏటనే తల్లి చనిపోతే, తన తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. ప్రేమ్ చంద్ కు సవతి తల్లి వచ్చింది. ఆమె అజమాయిషీతో ఇంట్లో ప్రశాంతత కరువైంది. అప్పటికీ ఆయన అక్క పెండ్లయి అత్తవారింటికి వెళ్ళిపోయింది. తండ్రి ఆయన పనుల్లో ఆయన తిరుగుతుండేవాడు. ఈ బాల ధనపతితో గడిపేవారే లేరు. ఆ సమయంలో ఆయనను పుస్తకాలు ఆకర్షించాయి. అవే ఓదార్చాయి. పుస్తకాల్లోనే ఆదరణని, ప్రేమని, వాత్సల్యాన్ని, అనురాగాన్ని, స్నేహాన్ని వెతుక్కోసాగాడు. వాటితో ఉపశమనం పొందసాగాడు. అప్పుడే మరో సంఘటన జరిగింది. తన సవతి తల్లివైపు ధనికులైన బంధువులు వచ్చి, తమ కూతురినిచ్చి ధనపత్ రాజ్ కి పెండ్లి చేశారు. అది 1985. అప్పుడాయన తొమ్మిదో తరగతి విద్యార్థి. వయసు 15. తీరా చూస్తే అమ్మాయి ఈయనకన్నా వయసులో పెద్దది. పైగా ధనవంతుల బిడ్డ గనక చాలా పొగరుగా ఉండేది. సవతి తల్లి ఒక వైపైతే, ఆమెతో పొట్లాడేందుకు తన భార్య రూపంలో మరో అమ్మాయి రావడంతో ఆ పసి హృదయం చాలా దెబ్బతింది. ఇంట్లో జరిగే గొడవలవల్ల ప్రేమ్ చంద్ మానసికంగా కృంగిపోయాడు. తెలివైన కుర్రాడై ఉండి కూడా, మెట్రిక్యులేషన్ ద్వితీయ శ్రేణిలో (1897) లో ఉత్తీర్ణుడయ్యాడు. మార్కులు సరిగా లేవని మంచి కళాశాలల్లో ఎక్కడా సీటు దొరకలేదు. ట్యూషన్లు చెపుతూ, దొరికిన పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తున్న రోజుల్లో నెలకు అయిదు రూపాయల వేతనంతో ఒక పాఠశాలలో టీచర్ ఉద్యోగం దొరికింది. తర్వాతి కాలంలో అలహాబాదులో ట్రయినింగ్ పూర్తి చేసుకొని, 1905లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాడు.

Also read: రామాయణంలో బుద్ధుణ్ణి ఎందుకు తిట్టారు?

స్వంత ఊరు వెళ్ళి హాయిగా సెలవులు గడుపుదామనుకున్న ప్రేమ్ చంద్ కు అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి. తన  సవతి తల్లికీ, తన భార్యకూ ఏదో విషయంలో పెద్ద గొడవ జరిగింది. చికాకుపడి ప్రేమ్ చంద్ భార్యను గట్టిగా కోపగించుకున్నాడు. అంతే. ఆమె ఆత్మహత్యాప్రయత్నం చేసింది. ప్రయత్నం విఫలమైందన్న ఉక్రోషంతో కోపంగా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమె తిరిగి రాలేదు. ఈయనా రమ్మనలేదు. బాల్యవివాహాల దుష్పరిణామాలు, దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో ఆయన స్వయంగా అనుభవించారు. బొమ్మల పెళ్ళిళ్ళు చేసినట్టు బాల్యవివాహాలు చేసే పద్ధతి మారాలని ఆయన కోరుకున్నారు. అప్పటికి ఆయన వయసు ఇరవై అయిదు. తర్వాత కాలంలో చాలా చోట్ల ఆయన బాల్య వివాహాల గూర్చి, వితంతు వివాహాల గూర్చి రాస్తూ వచ్చారు. సంస్కరణోద్యమంలో భాగంగా ఆయన 1906లో ఒక వితంతువును మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. ఆమె పేరు శివరాణిదేవి. ఆమె జీవితాంతం ఆయనకు తోడుగా నిలిచారు. ఎన్ని ఒడుదుడుకులొచ్చినా ఆవిడ ఆయనను జాగ్రత్తగా చూసుకున్నారు. ప్రేమ్ చంద్ మరణానంతరం ఆమె తన అనుభవాలు ‘‘ప్రేమ్ చంద్ ఘర్ మె’’ అనే పుస్తకం ప్రకటించారు. అతి సామాన్యమైన జీవితం గడుపుతూ, ఉన్నతాశయాల కోసం, విలువల కోసం, దేశం కోసం ఆయన చేస్తూ వచ్చిన కార్యక్రమాలన్నీ అందులోఆమె నమోదు చేశారు.

ప్రభుత్వ విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా ఉంటూ 1919లో ప్రేమ్ చంద్ అలహాబాదు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. పట్టా పొందారు. 1921లో ప్రమోషన్ పై స్కూలు ఇనిస్పెక్టరయ్యారు. ఫరవాలేదు  జీవితం కాస్త సాఫీగా సాగుతోందని అనుకుంటున్న సమయంలో ‘ఉద్యోగాలు వదిలి స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకోవాలని’- గాంధీజీ నుండి పిలుపు వచ్చింది. అంతే. ఉద్యోగం వదిలేసి ఉద్యమంలో చేరారు. చాలా ఇబ్బందులు పడ్డారు. గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్ లను అభిమానించేవారు. కాన్ పూర్, గోరఖ్ పూర్ లలో పని చేసిన ఆయన బతుకుదెరువుకోసం బాంబాయి వెళ్ళారు. ‘మజ్దూర్’ సినిమా స్క్రిప్టు రాశారు. కార్మిక  నాయకుడిగా సినిమాలో  కూడా కనిపించారు. ఆ సినిమా విడుదలకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. చివరకు ఢిల్లీ, లాహోర్ లలో విడుదలైంది. కొద్ది కాలమే నడిచినా కార్మికలోకాన్నికదిలించింది. కార్మికలోకం ఐకమత్యంగా కదిలిరావడం బ్రిటీష్ పాలకులకు నచ్చలేదు. వెంటనే ఆ చిత్రాన్ని నిషేధించారు. దేశంలో ఆ సినిమా ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. రచయితే ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయాడు. అక్కడి పరిస్థితులకు విసిగి, ముంబైలోని దాదర్ లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉండగా, బాంబే టాకీస్ అధినేత హిమాంశురాయ్ ఎన్నో విధాల నచ్చజెప్పాడు. అయినా ప్రేమ్ చంద్ వినలేదు. హిందీ పరిశ్రమకు వీడ్కోలు చెప్పారు.

Also read: జూన్ 21ని ‘హ్యూమనిస్ట్ డే’ గా గుర్తుంచుకుందాం!

రచనలు చేయడం, పత్రికలు నిర్వహించడం ముఖ్యమైన పనిగా పెట్టుకున్నారు. బాలసాహిత్యం, అనువాదాలు, జీవిత చరిత్రలు, కథలు, నవలలు ‘‘జమానా,’’ ‘‘సరస్వతి’’ వంటి పత్రికల్లో విరివిగా రాస్తూ గడిపారు. ఇన్ని ప్రక్రియల్లో కృషి చేసేవారు చాలా అరుదుగా ఉంటారు. ఆస్కార్ వైల్డ్, గైడి మపాసా, లియో టాల్ స్టాయ్, చార్లెస్ డికెన్స్ వంటి పదిమంది విదేశీ సాహితీ దిగ్గజాల రచనలు హిందీలోకి అనువదించారు. వీరి రచనల ఆధారంగా ఆ రోజుల్లో ఎన్నో చెప్పుకోదగ్గ సినిమాలు రూపొందాయి. దేశం గర్వించదగ్గ చలన చిత్ర దర్శకుడు సత్యజిత్ రాయ్ ప్రేమ్ చంద్ కథ ఆధారంగా ‘సద్గతి,’ ‘షత్రంజ్ కి కిలాడీ’ అనే సినిమాలు తీశారు. షత్రంజ్ కి కిలాడీ లో మిర్జా సజ్జాద్ అలీ, మీర్ రోషన్ అలీ అనే నవాబులు అవధ్ లో ఉంటారు. వారికి చదరంగం ఆడడం ఎంతో ఇష్టం. రాత్రింబవళ్ళు ఆడుతుంటారు. బ్రిటిష్ వారు అవధ్ ని ఆక్రమించుకుంటున్నారన్న వార్త అందినా వారిలో చలనం ఉండదు. అయితే ఆటలో ఓ చోట తేడా వచ్చి, మాటా మాటా పెరిగి, కోపోద్రిక్తులై ఒకరినొకరు కత్తులతో పొడుచుకుని చనిపోతారు. రాజులు, సంస్థానాధీశులు ఏకమై బ్రిటిష్ వారిని తన్ని తగిలేయాల్సిన సమయంలో కొందరు ఎంత మూర్ఖంగా ప్రవర్తించారో ప్రేమ్ చంద్ ఇందులో వ్యంగ్యంగా చిత్రించారు. సత్యజిత్ రాయ్ దాన్నే మరింత అద్భుతంగా చిత్రీకరించారు. ప్రేమ్ చంద్ ‘కఫన్’ కథను మృణాల్ సేన్ ‘ఒక ఊరి కథ’గా తెలుగు సినిమా తీశారు. ఇది పొగరుపోతులు, తాగుబోతులూ అయిన తండ్రీకొడుకుల కథ! కొడుకు భార్య పోతుంది. శవసంస్కారానికి కూడా డబ్బులుండవు. శవం మీద గుడ్డ (కఫన్) కప్పి అందరినీ డబ్బులడుగుతారు. కొంత డబ్బు సమకూరుతుంది. అ డబ్బు తీసుకుని మందు తాగడం కోసమని ఆ తండ్రీకొడుకులు మళ్ళీ పాకకు వెళతారు. మానవ విలువలు నశించిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పిన కథ. ‘సేవాసదన్’ సినిమా కూడా ప్రేమ్ చంద్ రచనే. అందులో యం.యస్. సుబ్బులక్ష్మి ముఖ్య భూమికను పోషించారు. ఆమె పోషించిన పాత్ర పేరు సుమన్. ఆ పాత్రకు వయసులో చాలా పెద్దవాడైన వాడితో పెళ్ళవుతుంది. తండ్రి వయసున్నఅతణ్ణి చూస్తే, ఆమెకు భర్త అనే భావన కలగదు. ఎదురింట్లో భోలి అనే వేశ్య ఉంటుంది. ఆమెకూ, తనకూ తేడా ఏమిటీ? అనే ప్రశ్న వేసుకుంటుంది సుమన్. ఆమెకు రోజూ విటులు మారతారు. తనకు ఒక్కడే విటుడు! ప్రేమ లేని పెళ్ళి వ్యభిచారం కాదా? అని బాధపడుతుంది. చివరికి ఆ బంధంలోంచి బయట పడి, ‘సేవాసదన్’ ఏర్పాటు చేసి, అనాధ యువతులకు ఆశ్రయం కల్పిస్తూ జీవిస్తుంది. అలాగే ‘గబన్’ కూడా విజయవంతమైన హిందీ చిత్రం. ఇందులో సునీల్ దత్త్, సాధన, కన్హయ్యలాల్, లీలామిశ్రా  నటించారు.

వాస్తవ జీవితాన్ని చిత్రించిన తొలి హిందీ రచయితగా ప్రేమ్ చంద్ కు పేరుంది. పట్టణాల్లోని మధ్య తరగతి సమస్యల్ని బాగా ఎత్తి చూపుతూ, అవినీతి, బాల్యవివాహాలు, వ్యభిచారం, ఫ్యూడల్ దుర్మార్గాలు, పేదరికం, కొలోనియాలిజంలపైన బలమైన రచనలు చేశారు. అందుకే వాస్తవిక సృజనకారుడయ్యారు. ప్రఖ్యాత పరిశోధకుడు డేవిడ్ రూబిన్ ప్రేమ్ చంద్ జీవితంపై ‘ ద వరల్డ్ ఆఫ్ ప్రేమ్ చంద్’ అనే గ్రంథం రాశారు. దాన్ని 2001లో ఆక్స్ ఫర్డ్ వారు ప్రచురించారు. అందులో ఆయన ప్రేమ్ చంద్ గురించి ఇలా అంటారు – ‘‘భక్తి, మూఢనమ్మకాలపై వచ్చే సాహిత్యం నుంచి, ప్రేమకథా సాహిత్యంనుంచి ప్రేమ్ చంద్ భారతీయసాహిత్యానికి విముక్తి కలిగించారు. జనజీవన సమస్యల్ని వాస్తవిక దృక్కోణంలోంచి చిత్రించి, ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు. అంతే కాదు, యూరీపియన్ మహారచయితల స్థాయికి ఎదిగారు’’ అని కొనియాడారు డేవిడ్ రూబిన్.

Also read: మూఢనమ్మకాలపై కందుకూరి పోరాటం

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త)   

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles