Monday, March 20, 2023

విశాఖ వైశిష్ట్యం

  • వెలుగులు పరచిన శిఖరాగ్ర సదస్సు
  • 13 లక్షల కోట్ల పెట్టుబడులకు హామీ అసాధారణం
  • పారిశ్రామికవేత్తలకు అనువైన వాతావరణం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విశాఖపట్నంలో చేపట్టిన  ‘గ్లోబల్ ఐన్వెస్టర్స్ సమిట్-2023’ గొప్పగా జరిగింది. అనుకున్నదాని కంటే కూడా ఎక్కువ విజయవంతంగా జరిగింది, ఫలవంతంగా ముగిసింది. జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన పెద్ద కార్యక్రమాల్లో  దీని స్థానం ప్రత్యేకమైంది, విశిష్టమైంది కూడా. విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంకు మించిన మహానగరం ఇంకొకటి లేదు. సహజసిద్ధమైన ప్రాకృతిక సౌందర్యంతో పాటు అభివృద్ధి కూడా సహజంగానే జరుగుతూ వచ్చింది. దేశంలోని తీర ప్రాంతాలలో వున్న నగరాలలోనూ విశాఖపట్నం తీరు విభిన్నమైంది. ఒకప్పుడు చిన్న మత్స్యకార గ్రామం నేడు మహానగరంగా విరాజిల్లుతోంది. ఉత్తరాంధ్రకు వెనుకబడిన ప్రాంతంగా పేరున్నప్పటికీ, విశాఖ వంటి మహానగరం అందుబాటులోకి రావడం గొప్ప వరం. అన్ని హంగులున్న ఈ మహానగరంపై మంచి దృష్టి పెడితే భవిష్యత్తులో ఇంకా గొప్ప నగరంగా రూపాంతరం చెందుతుందనేది నిర్వివాదాంశం. ఆ దార్శనికత  ఏలికలకు అవసరం. రాజకీయ కారణాలతో, వ్యక్తిగత, ఆర్ధిక స్వార్ధాలతో అభివృద్ధికి అడ్డుపడే ఏ నాయకుడైనా దేశద్రోహిగానే మిగులుతాడు. ఉత్తరాంధ్రపై ఇప్పటి వరకూ పాలకులు పూర్తి హృదయాన్ని పెట్టి పనిచేయలేదన్నది వాస్తవం.చేసి వుంటే, విశాఖతో పాటు మిగిలిన ఉత్తరాంధ్ర ప్రాంతమంతా అభివృద్ధి చెంది వుండేది. ఆ మాటకు వస్తే విజయవాడ, గుంటూరు, నెల్లూరు వంటి నగరాలది కూడా అదే పరిస్థితి.

Also read: సమరస సేనాని సంజీవయ్య

విశాఖపైన ముఖ్యమంత్రి దృష్టి శుభపరిణామం

ఇక ప్రకాశం, అనంతపురం జిల్లాల గురించి చెప్పక్కర్లేదు. ఈ పాపంలో అందరికీ వాటా ఉంది. గత పాలనలలో నగరీకరణ, అభివృద్ధి హైదరాబాద్ కే పరిమితమై పోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల అభివృద్ధి పడకేసింది. విజయవాడతో పోల్చుకుంటే విశాఖపట్నం కాస్త నయం. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళల్లోనే విశాఖ వైపు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. కాలక్రమంలో అది పెరుగుతూ వచ్చింది. తర్వాత తర్వాత అది ఇంకా పెరిగింది. రాజకీయ కారణాలను పక్కనపెట్టి చూస్తే అది మంచి ఆలోచన, మంచి వ్యూహం కూడా. రెడీమేడ్ ఫుడ్ లాగా అందుబాటులో వున్న విశాఖపట్నంపై ప్రత్యేకమైన శ్రద్ధను చూపించడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు, ఉత్తరాంధ్రకు మంచే జరుగుతుంది. త్వరలో విశాఖపట్నం నుంచే తన పని, పరిపాలన ఉంటాయని ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ చాలా గట్టిగా చెప్పారు. నిన్న జరిగిన సదస్సులోనూ పునరుద్ఘాటించారు. పెట్టుబడిదారులకు కావాల్సింది కేవలం రాయితీలు, ప్రోత్సాహకాలు కాదు, వసతులు, వనరులు. విశాఖలో అవి పుష్కలంగా వున్నాయి. పైపెచ్చు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈ ప్రాంతంపై ప్రత్యేక ప్రేమ చూపిస్తున్నారు కదా! ఈ నేపథ్యంలో, అన్ని మర్మములు తెలిసిన పారిశ్రామిక వేత్తలు సదస్సుకు తండోపతండాలుగా తరలి వచ్చారు. రావడమే కాక, తమ పెట్టుబడులు, ప్రణాళికలు పెద్దస్థాయిలో ప్రకటించారు. విశాఖలో జరిగిన సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదిరాయి. ఆరు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు.

Also read: భూప్రకంపనలు, ప్రజల భయాందోళనలు

దిగ్గజాలు కదిలి వచ్చిన వేళ

ఇది గొప్పపారిశ్రామిక, ఆర్ధిక పరిణామం. అంబానీ, అదానీ, మిట్టల్ వంటి బడా పారిశ్రామిక వేత్తలు కదిలి రావడం శుభశకునం. అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగాలు, విద్య, జీవన ప్రమాణాలలో గొప్ప ప్రగతికి ఈ సదస్సు మూల స్థంభంగా నిలుస్తుందని భావించవచ్చు. ఏ స్థాయిలో, ఏ వేగంలో ప్రకటనలు జరిగాయో అంతకు మించిన స్థాయిలో ఆచరణకు నోచుకోవాలి. 30కి పైగా ప్రముఖ కార్పొరేట్ సంస్థలు, 25 దేశాల నుంచి 45మందికి పైగా రాయబారులు, 15 రంగాలు, 378 ఒప్పందాలతో సదస్సు సుసంపన్నమైంది. ముగ్గురు కేంద్ర మంత్రులు సైతం పాల్గొని కీలక ప్రసంగాలు అందించడంతో పాటు వరాల జల్లులు కురిపిస్తూ ఆంధ్రప్రదేశ్ కు బాసటగా నిలుస్తామని చెప్పడం శుభసూచకం. ఒప్పందాలకే పరిమితం కాకుండా చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం మంచి చర్యగా, మంచి అడుగుగా భావించాలి.ఈ సదస్సుకు ‘అడ్వాంటేజ్ ఏపీ’ అని పెట్టడం కూడా తెలివైన మాట. ఈ సదస్సు వల్ల కేవలం విశాఖపట్నం, ఉత్తరాంధ్రే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మంచి జరుగుతుంది, ప్రగతి ఎదురవుతుందని చెప్పినట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు,ఉత్తరాంధ్ర వాసులకు భరోసా ఇచ్చినట్లు. విదేశీ ప్రతినిధులు కూడా మంచి సంఖ్యలో హాజరవ్వడం మంచి పరిణామం.ముఖ్యమంత్రితో అందరూ దగ్గరగా సమాలోచనలు జరపడం కూడా బాగుంది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ వైపు అందరూ ఆకర్షణకు గురయ్యారని చెప్పాలి. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యకలాపాలు విశాఖ నుంచి ఇక లాంఛనమే అని అర్ధం చేసుకోవాలి.ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలోకి పయనించడం కంటే కావాల్సింది ఏముంది? ఆల్ ది బెస్ట్!

Also read: మరుపేలరా ఓ మానవా!

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles