Thursday, March 28, 2024

కొత్త సంవత్సరంలో వాడిగా, వేడిగా రాజకీయం

  • పది రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు
  • ఇది సెమీఫైనల్స్ కింద లెక్క
  • దారీ, తెన్నూ లేని ప్రతిపక్షాలు

 కొత్త సంవత్సరం వచ్చేసింది. పండగల సీజన్ కూడా నడుస్తోంది. ఇది ఇలా ఉండగా దేశ వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొత్త పార్టీలు, కొత్త పొత్తులు, నేతల్లో కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి.ఈ కోలాహలం తెలుగు రాష్ట్రాల్లోనూ ఊపందుకుంటోంది. తెలంగాణలో మళ్ళీ అలజడి చేయడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖమ్మంలో మొన్న కాలుమోపారు. జనం బాగా రావడంతో కొత్త నెత్తురు ఎక్కినట్లు బాబులో కొత్త హుషారు కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగా మిగిలిన రాష్ట్రాలలో విస్తరణకు నడుం కడుతున్నారు. ఈపాటికే కర్ణాటక, ఉత్తరప్రదేశ్ లోని ప్రతిపక్షనేతలతో జతకట్టారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మొదలైనవారితో కలిసి నడుస్తున్నారు. రైతు సంఘాల నేతలతోనూ మిలాఖత్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టడానికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. విజయవాడలో త్వరలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారని వార్తలు వస్తున్నాయి. వివిధ పార్టీల్లో వివిధ హోదాల్లో పనిచేసిన, పనిచేస్తున్న కొందరు నేతలు బీఆర్ఎస్ లో చేరడానికి మొగ్గుచూపిస్తున్నట్లు వినపడుతోంది. ముందుగా తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు, పార్ధసారథి మొదలైనవారు కెసీఆర్ సమక్షంలో ఈరోజో రేపో బీఆర్ఎస్ తీర్ధం తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.ఈ ముగ్గురిలో రావెల కిషోర్ బాబు ఒక్కరే గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం వుంది. ఇప్పటికే ఆయన  తెలుగుదేశం, జనసేన, బిజెపి చొప్పున వరుసగా మూడు పార్టీలు మారారు. చింతల పార్ధసారథి జనసేన, బిజెపిని చుట్టివచ్చారు. తోట చంద్రశేఖర్ కు కూడా మూడు పార్టీలు మారిన చరిత్ర ఉంది. మొదట్లో ప్రజారాజ్యం, తర్వాత వైసీపీ, ఆ తర్వాత జనసేన పార్టీలో పనిచేశారు. వీరిద్దరూ ఎన్నికల్లో నిలబడ్డారు కానీ, అన్నీ వరుస పరాజయాలే. మొత్తంగా చూస్తే ఈ ముగ్గురు  ప్రభావవంతులైన నాయకులుగా ప్రజాభిమానాన్ని  చూరగొన్న దాఖలాలు పెద్దగా ఎక్కడా లేవు. రాజకీయాల్లో కొనసాగడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నవారే. ఆంధ్రప్రదేశ్ లో విస్తరణలో భాగంగా బలమైన నేతలు ఎవరైనా చేరితేనే బీఆర్ఎస్ కు బలం వస్తుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కేసీఆర్ తనయుడు,మంత్రి కేటీఆర్ కు మంచి స్నేహమే ఉంది.

Also read: కొత్త సంవత్సరం – కొత్త వెలుగులు

జనసేన బీజేపీతో కొనసాగుతుందా?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జనసేన -బిజెపి పొత్తు నడుస్తోంది. బిజెపి దిల్లీ పెద్దల వ్యవహారాలు నచ్చకనే బిఆర్ఎస్ పేరుతో కెసీఆర్ కొత్త జాతీయ పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ -జనసేన పొత్తు దాదాపు అసాధ్యమేనని చెప్పాలి. వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచీ చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షాతోనూ ఇప్పటి వరకూ మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ తరుణంలో నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నడుస్తున్న కెసీఆర్ తో జగన్ ఎలా జతకడతారు? ప్రస్తుతానికి వైసీపీ బలంగానే ఉంది. ఓటుబ్యాంక్, కేడర్ ప్రకారం చూస్తే తెలుగుదేశం పార్టీ రెండో స్థానంలో ఉంది. మళ్ళీ తెలంగాణలో జాతకం చూసుకోవడం కోసం చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఆయన వైఖరి ఎంటో ఇంకా తేలాల్సి వుంది. దానిని బట్టి కేసీఆర్ -చంద్రబాబు బంధాన్ని అంచనా వేయాల్సి వుంటుంది. పోయినసారి ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తో జతకట్టి ఎన్నికల్లో నిలిచి ఘోరంగా ఓడిపోవడమే కాక, తెలుగు రాష్ట్రాల్లో చాలా చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఆ దెబ్బతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు పూర్తిగా కనుమరుగైపోయింది. ఇటీవలే కాసాని జ్ఞానేశ్వర్ ను తెలంగాణ రాష్ట్ర అధినేతగా నియమించి హడావిడి చేస్తున్నారు. ఎంతో దెబ్బతిన్న పార్టీని మళ్ళీ పైకి లేపడం సామాన్యమైన విషయం కాదు. మాది జాతీయ పార్టీ అని కూడా చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం, నెల్లూరు, కందుకూరు మొదలైన ప్రాంతాల్లో  వరుసగా సభలు పెట్టి కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. తాజాగా కందుకూరులో జరిగిన దుర్ఘటన టిడిపికి పెద్ద చేదు అనుభవాన్ని మిగిల్చింది. మాచర్లలో వైసీపీ -టిడిపి మధ్య జరిగిన ఘర్షణలు సంచలనం సృష్టించాయి.

Also read: దిల్లీకి రాజైనా తల్లికి బిడ్డడే!

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏమి చేస్తారు?

పవన్ కల్యాణ్ – చంద్రబాబు మధ్య  స్నేహపూర్వక సమావేశాలు జరుగుతున్నాయి. ఇంకొక పక్కన మళ్ళీ నరేంద్రమోదీకి దగ్గరవడానికి చంద్రబాబు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయక్షేత్రాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. మొత్తంగా చూస్తే తెలుగుదేశం పార్టీ బలం, చంద్రబాబు వైఖరిపై ఇంతవరకూ స్పష్టమైన సమాచారం లేదు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో కాస్తో కూస్తో బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ కంటే బిజెపి మరింత బలంగా కనిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీల పరిస్థితి దొందూదొందే అన్నట్లుగా ఉంది. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇటీవలే గిడుగు రుద్రరాజు బాధ్యతలు తీసుకున్నారు. ఏం చేస్తారో చూడాలి. ప్రధాని నరేంద్రమోదీకి విశ్వాసపాత్రుడు, రాజ్యసభ ఎంపీ జివిఎల్ నరసింహారావు విశాఖపట్నం కేంద్రంగా బిజెపీని బలోపేతం చేస్తామంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధిపతి సోము వీర్రాజు ఆధ్వర్యంలో గతంలో కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతలోనూ పార్టీ పుంజుకున్న దాఖలాలు పెద్దగా లేవు. రాష్ట్ర విభజనతో 2014లో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింది. 2019లో ప్రత్యేక హోదా అంశంతో బిజెపి మూల్యం చెల్లించింది. తెలంగాణలో వై ఎస్ షర్నిల దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమె క్షేమసమాచారాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ అంశం కొత్త అలజడి సృష్టించింది. రాష్ట్రాల్లో వరుస విజయాలతో దేశ వ్యాప్తంగా బిజెపి మంచి ఊపు మీద వుంది. రాహుల్ గాంధీ జోడో యాత్ర, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో దేశంలో కాంగ్రెస్ కాస్త శక్తిని కూడగట్టుకుంది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ హడావిడి చేస్తున్నారు. ఇక బెంగాలీ సిఎం మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆవేశం తెలిసిందే. 2023లో 10 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అందులో కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ వంటి కీలక రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్ వంటి ముఖ్య రాష్ట్రాలు ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలను కాపాడుకోవడం అధికారపార్టీకి కీలకం. ప్రతిపక్షపార్టీలకు మరింత అవసరం. షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు 2024లో జరగాల్సివుంది. జమిలి ఎన్నికలకు  జైకొడితే 2023 వేదిక కానుంది.

Also read: జమిలి ఎన్నికలు అభిలషణీయమా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles