Friday, September 20, 2024

మహాభారతం ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – గరుత్మంతునికి తల్లి వినత ఆశీస్సులు

అనిలుడు పక్షయుగ్మ మమృతాంశుడు వీ, పనలుండు మస్తకం,

బినుడు సమస్త దేహమును, నెప్పుడు కాచుచు నీ కభీష్టముల్

ఘనముగ చేయుచుండెడు జగన్నుత! యున్నతియున్ జయంబు జే

కొను” మని యిచ్చె దీవెనలు గోరి ఖగేంద్రునకున్ ప్రియంబునన్

నన్నయ భట్టారకుడు

నేపథ్యం

వినత పెట్టిన రెండవ గ్రుడ్డు పగిలి, దానినుండి ఉదయించిన గరుత్మంతుడు, వెనువెంటనే గగనంలోకి దూసుకొని పోయినాడు. ఆ దూసుకొని పోవడం, “దారుణ కల్పాంత మరుత్ ప్రేరిత హవ్యశిఖా సముదాయం” వలె  దేవతలకు, మునిగణానికి  గోచరించినది. అగ్నిని స్తుతించే దేవతా, ముని సముహముల వేదమంత్రాలతో భూనభోంతరాళములు అతిశయిల్లినవి.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – గరుత్మంతుని జననం

ఒకప్పుడు ఇంద్రుని వజ్రాయుధంచే పర్వతాల రెక్కలు ఖండింపబడినవి. రెక్కలు కలిగిన ఒకేవొక కులపర్వతం వలె “ఆతత పక్షమారుత రయప్రవికంపిత గూర్ణితాచల వ్రాత మహార్ణవుడై” గగనంలోకి దూసుకొని పోయిన గరుత్మంతుడు అదే ఆకాశమార్గాన మరలి వచ్చి, తల్లికి నమస్కరించినాడు. అక్కడ నుండి పెదతల్లి కద్రువకు కూడా మ్రొక్కినాడు.

గరుత్మంతుడికి కద్రువ ఆజ్ఞ

మనస్సులో రగిలే పెను అసూయతో “నీ వీపుపై నా కొడుకులనందరినీ ఎత్తుకొని తిరుగుతూ వుండు!” అని కద్రువ గరుత్మంతుణ్ణి ఆజ్ఞాపించింది.

Also read: వంతెనపై పొద్దుపొడుపు

గరుత్మంతుడు కద్రువ ఆజ్ఞమేరకు పుత్రులైన సర్పాలను వీపుపై త్రిప్పుతూ వుండేవాడు. అట్లా తిరుగుతూ వుండగా, ఒకరోజు విపరీతమైన గాలి తాకిడికి, భరింపరాని సూర్యుని వేడికి,తాళలేక, గరుడుని వీపున గల సర్పాలన్నీ జారి, నేలపై బడి, మూర్ఛిల్లినాయి. కద్రువ గరుత్మంతుణ్ణి నిందించి, ఇంద్రుణ్ణి భక్తితో ప్రార్థించింది. ఇంద్రుని అనుగ్రహంతో కద్రూతనయులపై కుండపోత వాన కురిసి, వారు సూర్యాతప బాధావిముక్తులైనారు. కద్రువ ఎప్పటివలెనే గరుత్మంతునిచే అన్ని పనులు చేయించుకో సాగింది.

ఒకనాడు గరుత్మంతుడు తల్లిని ప్రశ్నించినాడు: “అమ్మా! ఇంత బలశాలిని, పరాక్రమశాలిని, నేను. కద్రువ కొడుకులను మోసే నీచవృత్తి నాకెందుకు కలిగింది?” జవాబుగా, తానెందుకు కద్రువకు దాసి కావలసి వచ్చిందో వినత కొడుకుకు వివరించి చెప్పింది. అంతేకాక, శక్తిమంతుడైన  గరుత్మంతుని వంటి తనయుని ఆవిర్భావంతో తన కష్టాలిక గట్టెక్కగలవని, గరుత్మంతుడే తనకు శాపవిమోచనం కలిగించగల సమర్థుడనీ అన్నది.

Also read: నీ పదములు

కద్రువ దాస్యం నుండి విముక్తి పొందే మార్గం చెప్పమని గరుత్మంతుడు ఒకరోజు కద్రువ పుత్రులను అడిగినాడు. “నన్ను ఆజ్ఞాపించండి. నేనేదైనా చేయగలను. దేవతలనైనా లోబరచుకొని విజయం సాధించగలను”.

 గరుత్మంతునిపై జాలితో సర్పాలు ఇట్లా అన్నవి:

అమిత పరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో

త్తముడవు నీవు; నీదయిన దాస్యము పాచికొనంగ నీకు చి

త్తము కలదేని, భూరి భుజదర్పము, శక్తియు నేర్పడంగ మా

కమృతము తెచ్చి యి”మ్మనిన నవ్వి హగేంద్రుడు సంతసంబునన్”

సంతోషంతో కద్రూతనయులకు అమృతం తెచ్చి యివ్వడానికి వైనతేయుడు ఒప్పుకున్నాడు. తల్లి దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పి అమృతం సాధించి తెచ్చి కద్రూతనయులకిచ్చి, తద్వారా, తాను, తల్లి, దాస్యవిముక్తి పొందేటందుకు ఆమె అనుమతిని కోరినాడు. వినత సంతోషించి, పుత్రుణ్ణి కౌగిలించుకొని, అతణ్ణి ఆశీర్వదించింది.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – కద్రూవినతల వృత్తాంతం

వినత ఆశీర్వాదం

వినత ఏమని కొడుకును ఆశీర్వదించిందో నేటి పద్యం వివరిస్తుంది.

జగన్నుతా! వాయువు నీ రెక్కల జంటను, అమృతాంశుడైన చంద్రుడు నీ వీపును, అగ్ని నీ శిరస్సును, సూర్యుడు నీ సమస్త దేహాన్ని, సదా రక్షిస్తూ, నీ అభీష్టాలను నెరవేర్చెదరు గాక! ఉన్నతిని, జయమును పొందుము!”

నేటి పద్యం యొక్క తాత్పర్యమిది.

గంభీరార్థములు

స్థూలంగా చూస్తే; వినత తన చిన్న కొడుకు సర్వాంగాలకూ దైవరక్షలు పెట్టి వాత్సల్యాన్ని ప్రకటిస్తున్నట్లుగా గోచరిస్తుంది. కానీ లోతుగా ఆలోచించవలసిన వాగనుశాసనుని పద్యాల్లో ఇదొకటి.

భారతీయ సనాతన నాగరకత ఋగ్వేదంతో మొదలైంది. ఋగ్వేదంలోని మొట్టమొదటి శ్లోకాలు అగ్నిని, వాయువును, వరుణదేవుణ్ణి యజ్ఞవేదికకు రమ్మని ఆహ్వానం పలుకుతాయి. వేదాంగమైన జ్యోతిష్యంలో ద్వాదశరాశులు, అగ్ని, వాయు, జల, భూరాశులుగా విభజింపబడినాయి.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – కద్రూవనితల సముద్ర తీర విహారం

నీ మస్తకాన్ని అగ్ని రక్షించుగాక

నేటి పద్యంలో వినత “నీ మస్తకాన్ని అగ్ని రక్షించుగాక” అని ఆశీర్వదిస్తుంది. మస్తకమనగా శీర్షోదయం. శీర్షోదయరాశి అగ్నిచే రక్షింపబడడమంటే, అది అగ్నిరాశి అని అర్థం. వినత యొక్క మరొక్క ఆశీస్సు “రెక్కల జంటను వాయువు ఆశీర్వదించడం”. కుడి చేయి లేదా కుడి రెక్క తృతీయస్థానానికి చెందుతాయి. తృతీయస్థానం కుడి చేతిని, పరాక్రమాన్ని, ఔదార్యాన్ని తెలుపుతుంది. అట్లే ఏకాదశస్థానం ఎడమచేతిని, లేదా ఏడమరెక్కను, చేసే పనిలో లాభాన్ని తెలుపుతుంది. అగ్నిరాశికి, తృతీయ, ఏకాదశస్థానాలు రెండు వాయుస్థానాలే.

ఆమె మరొక ఆశీస్సు “అమృతాంశుడైన చంద్రుడు వీపును, సూర్యుడు, సమస్త దేహాన్ని రక్షించుగాక” అన్నది. జాతకచక్రంలో సూర్యచంద్రులు బొమ్మ బొరుసు వంటి వారు. జాతకచక్రంలో మూడు అగ్నిరాశులు వుంటాయి: మేషము, సింహము, ధనస్సు. వీటి అధిపతులు వరుసగా అంగారకుడు, రవి, బృహస్పతి. జలరాశులు కూడా మూడు. వాటి అధిపతులు: అంగారకుడు, చంద్రుడు, బృహస్పతి. అనగా అగ్నిరాశి యొక్క అధిపతియే, జలరాశికి కూడా అధిపతి. అగ్నిరాశులు క్షత్రియులను పాలిస్తే, జలరాశులు విప్రులను నిర్దేశిస్తాయి. శీర్షోదయరాశి అగ్నిరాశి కావడం చేత గరుత్మంతునికి భారతసంహిత క్షత్రియత్వాన్ని ప్రసాదిస్తున్నది.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం – దేవదానవ యుద్ధం

డేగకూ, గరుత్మంతుడికీ సామ్యాలు

భారతకథలో వినత ఇద్దరు పుత్రులను కోరుకుంటుంది. రెండు గ్రుడ్లు పెడుతుంది. ఒకటి పరిపక్వం కాకమునుపే పగలగొడుతుంది. పరిపక్వమైన రెండవ గ్రుడ్డు నుండి గరుత్మంతుడు జన్మిస్తాడు. సృష్టిలో తల్లి డేగ కూడా రెండు గ్రుడ్లే పెడుతుంది. పొదిగిన మొదటి గ్రుడ్డు నుండి వెలువడిన పక్షి రెండవ గ్రుడ్డును స్వయానా ధ్వంసం చేస్తుంది. తల్లితండ్రీ దీనికి అడ్డుపడరు. డేగ సర్పాలను తింటుంది. గరుత్మంతుడు కూడా సర్పాలను తినే వరాన్ని పొందుతాడు. డేగకు, గరుత్మంతునికి సామ్యములివి.

డేగ కడు బలిష్టమైనది. బలానికి తగిన ఆహారం కోరుకుంటుంది. గ్రద్ద కళేబరాలను కోరుకుంటుంది. డేగ సజీవమాంసం కోరుకుంటుంది. బలిష్టమైన తన కాళ్లతో పెద్ద  జంతువులను సైతం గాలిలోకి పైకెత్తి క్రిందపడవేయగలదు. అట్లా పడిపోయి, మృతి చెందిన జీవిని తన కత్తి వంటి ముక్కుతో ముక్కలుగా చేసి భుజిస్తుంది. ఈ భుజించే ఆహారమే దానికి అమితమైన శక్తిని ప్రసాదిస్తుంది. అమృత సాధనకు వెళ్లే గరుత్మంతుడు కూడా ఆహారం గూర్చి తల్లిని ప్రశ్నిస్తాడు. అమె అంటుంది: “సముద్ర గర్భంలో ప్రజాకంటకులైన నిషాదులున్నారు. వారందరినీ భుజించు.” త్రోవలో  గరుత్మంతుడు శాపగ్రస్తులైన గజ, కచ్ఛపములను కూడా తింటాడు.

“అనిలుడు పక్షయుగ్మము” అని వినత ఆశీర్వదించి నప్నుడు డేగకు లేదా గరుత్మంతునికి పక్షయుగ్మం ఎంత అవసరమో వినత తెలుపుతుంది. పెద్దపెద్ద డేగలకు దాదాపు ఏడడుగుల పొడవు గల రెక్కలు వుంటాయి. వర్షం పడినా, పిడుగు పడినా భయపడక అవి ఎగురుతాయి. గాలి భయంకరంగా వీచినప్పుడు భయం చెందక గాలివాలుతో బాటు పయనిస్తూ తమ రెక్కల శక్తిని ఆదా చేసుకుంటాయి. డేగలు ఏకపత్నీవ్రతాన్ని అవలంబిస్తాయి. కుటుంబాన్ని జాగ్రత్తగా సంరక్షించు కుంటాయి. కన్నపిల్లలు బాధపడుతున్నప్నుడు విలవిలలాడుతాయి.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – దేవదానవులు క్షీరసముద్రాన్ని మధించడం

కంటి చూపుకూ, పరాక్రమానికీ చిహ్నం డేగ

వాయువేగానికి, మేధస్సుకు, బలమైన కంటిచూపుకు, పరాక్రమానికి  డేగ చిహ్నం. ఏదైనా తినబోతున్నప్పుడు, ప్రతి పక్షి శత్రువులు గమనిస్తున్నారా అనే అనుమానంతో వెనకా, ముందూ చూస్తుంది. భయమే లేని పరాక్రమశాలి డేగ అట్లా చూడదు.

గరుత్మంతునిగా వర్ణింపబడిన డేగ అగ్నికి ప్రతీక. అది మామూలు అగ్ని కాదు. గరుత్మంతుడు మొట్టమొదటి సారి ఆకాశమార్గంలో నిప్పులు చిమ్ముతున్నట్లు దూసుకొని పోయేవేళ “దారుణ కల్పాంత మరుత్ ప్రేరిత హవ్యవహశిఖగా” దేవతలకు, మునిగణానికీ, పులకింత కలిగింది. గరుత్మంతుడొక ప్రత్యేక సృష్టిగా వారికి గోచరించినాడు. ఆకాశంలో ఎగరలేని మనిషికన్న ఊర్థ్వముఖుడై ఉత్తుంగపథాలవైపు దూసుకొని పోగల శక్తి, సాహసంతో పరమాత్మను చేరగల శక్తీ, ఒక్క గరుత్మంతునికే వున్నాయి. సావిత్రి కావ్యంలో అరవిందయోగి ఇట్లా అంటారు:

“His soul breaks out to join the oversoul;

His life is overtaken by that super life”

రష్యన్ కవి అలెగ్జాండర్ పుష్కిన్ తన ఖండిక The old eagle లో అంటాడు:

“He then rose into the air, gained altitude, on and on,

He reached his own abode, passed even that,

To the abode of light, where the firmament is

He became a point that had existed awhile

Then turned into a dot that was not servile”

మృగరాజు అరణ్యానికి రాజైనట్లే, ఖగరాజు అనంత వియత్పధానికే రాజు. రైట్ సోదరులు విమాన యంత్రాన్ని  కనుక్కొనే దాకా, యావత్ మానవకోటినీ నిబిడాశ్చర్యంలో ముంచి తేల్చిన జీవి ఆకాశంలో వేగంగా ఎగిరిపోయే శ్యేనమొక్కటే.

1927 సంవత్సరంలో మొట్టమొదటి సారి ఛార్లెస్ లిండ్ బర్గ్ అనే సాహసికుడు అమెరికా నుండి పారిస్ నగరానికి స్వయంగా తయారుచేసుకున్న చిన్న విమానాన్ని 33 గంటలు నిరాఘాటంగా నడిపినప్పుడు ప్రపంచం అతణ్ణి సూపర్ హీరోగా భావించింది. తర్వాతి కాలంలో ఇట్టి సాహసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో ఒక కొరియన్ యువతి కూడా వున్నది. 1958 సంవత్సరం రష్యన్ ఆర్మీకి చెందిన యురీ గెగారిన్ మొట్టమొదటి సారి అంతరిక్షంలో విహరించినప్పుడు ప్రపంచం మరొక్కమారు ఆశ్చర్యంలో మునిగింది. 1970లో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రునిపై పాదం మోపినప్పుడూ ఇదే ఆశ్చర్యం.

ఈ సాహసాలన్నింటికీ ప్రేరణ, ఆదర్శం, డేగయే. డేగను గరుత్మంతునిగా రూపకల్పన చేసి ఆ ఖగరాజు గొప్పతనాన్ని అజరామరం చేసిన గౌరవం భారతేతిహాసానికే దక్కుతుంది. ఇండోనేషియా దేశపు విమానయాన సంస్థ పేరు “గ రు డ”.

Also read: మహాభారతం – ఆదిపర్వము – ప్రథమాశ్వాసము – 6

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles