Friday, July 19, 2024

ద్రౌపదిని జుట్టుపట్టి ఈడ్చిన కీచకుడు

మహాభారతం: శ్రీమద్విరాటపర్వం-7

ఎవరయినా మాట్లాడుతుంటే పట్టించుకోక వేరేమాట మాట్లాడటం, అసలు మొదటి విషయం విననట్లుగా నటించడం, మనం చాలా సందర్భాలలో చూసేఉంటాం.

ఎందుకని?

మాట్లాడే వ్యక్తి ఆ విషయం మరచిపోయి వేరే విషయంలోకి వస్తాడని. దానిని “ఉపేక్ష చేయటం“ అని అంటారు. ఇది రాక్షసగురువు శుక్రాచార్యులవారి నీతిలో భాగం. కానీ కొందరి విషయంలో ఇది పనిచేయదు. వారు 1) పసిపిల్లలు 2) ఉన్మాది 3) పిశాచి.

వీడు కీచకుడు. వీడికి  కామోన్మాదం పట్టింది. అక్కను అడుగుతూనే ఉన్నాడు. ఆవిడ మాట మారుస్తున్నా పట్టించుకోవడం లేదు. సుధేష్ణ చాలా రకాలుగా ప్రయత్నించినా వినిపించుకోక చివరకు  వాడు సైరంధ్రినే అడిగేశాడు.

Also read: సైరంధ్రి సందర్శనతో వివసుడైన కీచకుడు

‘‘నీ కనులు కాస్త విచ్చిచూస్తే నీ సొమ్మేమయినా పోయిందా? కాస్త నవ్వితే ఏమయినా కందిపోతావా? నీ ముత్యాల పలువరుస కనపడితే ఏం ఒలుకుతుంది?’’ అని ప్రలాపిస్తూ ఆమె చేయి తన చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నం చేసి తన కోరిక ద్రౌపదికి తెలియచేశాడు.

అప్పుడు ద్రౌపదీదేవి ఇలా అన్నది. ‘‘ఓ అన్నా! నా కట్టు, బొట్టు తీరు ఎంత అసహ్యంగా ఉన్నాయో చూడు. ఇలాంటి పరిస్థితులలో కూడా నా మీద నీకు మదన వికారం ఎలా కలిగింది? నీకు అక్కచెల్లెళ్ళు ఉన్నారుకదా నన్ను వారిలా భావించలేవా? అయినా తక్కువ కులంలో పుట్టినదానను నా మీద నీకు ఎందుకు మోజు“ అని ఎంతో సుతి మెత్తగా తన అభిప్రాయం చెప్పింది.

అయినా వాడి తలకెక్క లేదు. ఇక లాభం లేదనుకొని ద్రౌపది వాడిని తీవ్రంగా మందలించింది. ఈ సందర్బంలో తిక్కన గారు చెప్పిన పద్యం.

దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర

ద్గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్

గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసంగిట్టి గం

ధర్వుల్ మానముబ్రాణముంగొనుట తధ్యం బెమ్మెయింగీచకా!”

“వారింపశక్యంకాని భుజబలపరాక్రమం కలిగిన గంధర్వులు నా భర్తలు, వారు నీతాట వలుస్తారు జాగ్రత్త.  నీ ధన, మాన, ప్రాణాలన్నీ హరించి వేస్తారు“ అని హెచ్చరించింది ద్రౌపది.

Also read: పశుపాలకుడుగా సహదేవుడు

గమనిక:

ఇలాంటి హెచ్చరికలు చెప్పేటప్పుడు వాడే భాష ఎంత పదునుగా ఉంటే పద్యం అంత రక్తి కడుతుంది. తిక్కన గారి కవిత్వంలో నాటకీయత పాలు ఎక్కువ. వ్యాసభగవానుడు సూటిగా చెపితే, ఈయన భాషకు ఆభరణాలు తొడుగుతాడు. పదాలతో పదనిసలు పాడిస్తాడు. వాటితో నాట్యం చేయిస్తాడు.

అలంకారాలులేని, ఛందస్సులేని భాష కావాలనుకొని, అదే శాస్త్రీయ మనుకొని, మన భాషలో కొన్ని అక్షరాలుకూడా తీసేసి, భాషలోని జీవాన్ని చిదిమివేసి, నిర్జీవం చేసి, మళ్ళా నా భాష తేనె వంటిది తియ్యనయినది. బ్రతికించండి మహాప్రభో అని భాషోద్యమాలు చేస్తున్నాం.

కవిత్రయ భారతం లేదు. పోతన ఎవరో తెలువదు. ఒకడు నాచన సోమన్న అని విశ్వనాధ వారిచే పొగడబడ్డ నాచన సోముడు తెలువదు. శ్రీనాధుడు, అల్లసాని పెద్దన, ధూర్జటి ఇలా ఎందరో తేజోమూర్తులు వీరెవ్వరి గురించీ పాఠాలలో చెప్పం. కానీ నా భాష తియ్యనిది దానిని బ్రతికించండి అని వేడుకుంటున్నాం.

`కామాతురాణాం న భయమ్ న లజ్జ…!` శరీరాన్ని కోరిక దహించివేస్తుంటే మనిషి ఉచ్ఛనీచాలు చూడడు, వావివరుసలుపట్టించుకోడు, సిగ్గు, భయం, గౌరవమర్యాదలు ఇవేవీ వాడు లెక్కించడు. వాడి లక్ష్యం కోరుకున్న స్త్రీ మాత్రమే. ఆమె పొందుకోసం ఎంతకయినా తెగిస్తాడు.

కీచకుడు ద్రౌపది చేత తిరస్కరింపబడి అవమానభారంతో అక్కనుచేరి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్ధించాడు, తన భుజబలం గుర్తుచేసి బెదిరించాడు. అక్క చెప్పే నీతివాక్యాలు చెవికెక్కించుకోలేదు వాడు. పైగా సైరంధ్రి భర్తలు తనకొక లెక్కకాదు. అడ్డం వచ్చిన వారిని అడ్డంగా నరికేస్తానని ఆవేశపడ్డాడు. ఎలాగయినా ద్రౌపదిని ఒప్పించమని మంకుపట్టు పట్టి అక్కడే కూర్చుని కదలనన్నాడు.

సుధేష్ణ ఆలోచిస్తున్నది. పరిస్థితి చేయిదాటకుండా జాగ్రత్త పడటం మంచిదనుకుని అందుకు ముందుగా వాడిని అక్కడినుంచి పంపే ఉపాయం ఆలోచించింది. “సరే! నేను ఏదో విధంగా ఆవిడను నీ మందిరానికి పంపుతాను. లొంగితే లొంగదీసుకో“ అని చెప్పింది. వాడు సమాధాన పడి అక్కడనుండి వెళ్ళిపోయాడు.

అప్పుడు సుధేష్ణ సైరంధ్రిని పిలిచి తన తమ్ముడి మందిరంలో శ్రేష్ఠమైన మధువు దొరుకుతుంది తీసుకు రమ్మని పురమాయించింది. `వేరెవరినయినా అందుకు నియోగించమన్నది` ద్రౌపది. `ఏం నీకేమయ్యింది. చెప్పిన పని చేయలేవా?` అని దర్పం ప్రదర్శించింది మహారాణి సుధేష్ణ. తప్పనిసరి పరిస్థితులలో కీచక మందిరానికి బయలుదేరింది ద్రౌపదీదేవి.

బయలుదేరేముందు సూర్యభగవానుడిని ప్రార్థించి ప్రసన్నుడిని చేసుకొన్నది. ఆయన వర ప్రభావంవల్ల వాడి మందిరంలో ప్రవేశించినపుడు వాడు బలాత్కరించబోతే వాడిని విదిల్చికొట్టి క్రింద పడవేసి పరుగు పరుగున విరాట సభలో ప్రవేశించింది  ద్రౌపది. ఆవిడను వెంటాడుతూ కీచకుడు కూడా సభలో ప్రవేశించి ఆవిడ మీద చేయి చేసుకుని, జుట్టుపట్టి ఈడ్చినేలమీద పడవేసి ఒక్కతన్ను తన్నాడు.

ఏదో పనిమీద సభకు వచ్చిన భీమసేనుడు అది చూసి పట్టరాని క్రోధంతో ఊగిపోయి సభాప్రాంగణంలోని చెట్టు పీకి వాడిని చావమోదుదామని లేచాడు. అది గ్రహించిన ధర్మరాజు… “వలలా! !వంటచెరుకు కోసం ఈ చెట్టు కాదు బయట ఉన్న చెట్టు చూసుకో“ అని నర్మగర్భంగా వారించాడు. (వాడిని విరిచివేసి మంటల్లో కాల్చడానికి ఇది తగిన ప్రదేశంకాదు. బయట చూసుకుందాం అని స్పష్టమైన సందేశమిచ్చాడు)

ఇది చూసి ద్రౌపది కోపం తారస్థాయికి చేరింది. ప్రతిజ్ఞాభంగమవుతుందన్న భయం, అవమానం అనే రెండుభావనలు కలగలసి రోదించడం మొదలుపెట్టి రాజును తీవ్రమయిన పదజాలంతో నిందించసాగింది.

అదివిన్న విరటుడు `మీ ఇద్దరి మధ్య వివాదానికి కారణం తెలుసుకోకుండా నేనెలా కల్పించుకొంటాను` అని లౌక్యాన్ని ప్రదర్శించాడు. అప్పుడు ధర్మరాజు కల్పించుకొని సైరంధ్రిని అక్కడనుండి సుధేష్ణాదేవి మందిరానికి వెళ్ళమని చెపుతూ బహుశా ఇది సరైన సమయంకాదని నీ భర్తలు అనుకుంటున్నారేమో అని చెప్పాడు.

గమనిక:

పొట్టకూటి కోసం పరుల పంచనచేరే పడతి తన శీలసంరక్షణ కొరకు ఎన్ని పాట్లు పడాలో ఆ భగవంతుడికే ఎరుక. కాస్త రాజీపడితే పోలా. శీలమేమిటి అదెట్లా ఉంటుంది అని అనుకునేవారికి ఫరవాలేదు. కానీ తన భర్తను మనసా, వాచా, కర్మణా మోసం చేయరాదు అని దృఢసంకల్పంతో ఉన్న స్త్రీకి మాత్రం అది ప్రత్యక్ష నరకమే.

యజమాని ఉన్నత భావాలు కలవాడయితే అదృష్టం. లేకపోతేనే వచ్చిన చిక్కల్లా. వ్యక్తులు ఉన్నత భావాలు కలవారు ఎప్పుడవుతారు? మరల ఇదొక పెద్ద ప్రశ్న. ఉత్తమ కుల సంజాత, వీర పత్ని అయినా పరిస్థితుల ప్రభావం వల్ల రెండుసార్లు జుట్టుపట్టి ఈడ్వబడ్డది, ఒకసారి దుశ్శాసనుడి చేతిలో రెండవ సారి కీచకుడి చేతులలో. ఆ రెండు సందర్భాలలో భర్తలు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు.

Also read: బృహన్నల రంగప్రవేశం

(సశేషం)

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles