Saturday, April 27, 2024

మోడీ-జగన్ లను దాటి మరీ చూడగలిగితే…

జాన్ సన్ చోరగుడి

రెండూ సముద్ర జలాలే.

కానీ ఒక కదలికను ‘వేవ్’ అంటాము, మరొక కదలికను ‘టైడ్’ అంటాము.

మొదటిది కనిపిస్తుంది, రెండవది కనిపించకుండా తాకుతుంది!

రిగ్గా ఏడాది తర్వాత జరిగింది. దాన్ని ఎలా చూస్తారు అనేది ఇక మీ ఇష్టం. గత ఏడాది జూన్ లో ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ (ఏ.ఓ.బి.) లో కీలక నాయకులు ఆరుగురు పోలీస్ కాల్పుల్లో మరణించారు. అది జరిగిన ఏడాది తర్వాత జూన్ 28 న 33 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు, 27 మంది కీలకమైన మిలీషియా సభ్యులు మొత్తం 60 మంది అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో జిల్లా పోలీస్ అధికారుల ముందు లొంగిపోయారు.  

Also read: జగన్ దావోస్ తనతో తీసుకెళ్ళింది ఏమిటి?

రాష్ట్రంలో మరో పదమూడు కొత్త జిల్లాలు ఏర్పడ్డాక, ఈ ఏడాది ఏప్రెల్ 11 న జరిగింది ఇది. అల్లూరి సీతారామ రాజు జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ పాడేరు నుంచి 200 కి.మీ. ప్రయాణం చేసి, రంపచోడవరంలో జరిగే- ‘స్పందన’ ప్రజా పిర్యాదుల పరిష్కారం కార్యక్రమానికి హాజరయ్యారు. ఒకప్పుడు పోలీస్ శాఖ ఈ రోడ్డులో ఐ.ఏ.ఎస్. అధికారుల ప్రయాణాన్ని మావోయిస్టుల కారణంగా అనుమతిచ్చేది కాదు.

ఎం.కెే. నారాయణన్

తూర్పు కనుమలలో నుంచి  జాతీయ రహదారుల శాఖ నిర్మిస్తున్న- ’హైవే’ చెన్నై-కలకత్తా గ్రాండ్ ట్రంక్ రోడ్డుతో సమాంతరంగా రాజమండ్రి నుంచి మన్యసీమ మీదుగా రాయపూర్ చేరుతుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ‘రాజ్యాన్ని’ ప్రజలకు దగ్గరగా తీసుకువెళ్ళడం అంటే ఇదే! ‘నాయకులు ఎవ్వరూ లేకపోవడంతో ఏ.ఒ.బి.లో నక్సల్ ఉద్యమానికి తెర పడ్డట్టు అయింది’ అని అక్కడ ఆపరేషన్స్ లో ఉన్న ఒక పోలీస్ అధికారి చెప్పినట్టుగా ఆంగ్ల పత్రిక ‘ది హిందూ’ రాసింది.

“మావోయిస్టుల విషయంలో మారవలసిన- ‘రాజనీతి’ (స్టేట్ క్రాఫ్ట్) పాఠాలు కోసం ఇంకా మనం అడవుల్లోకి వెళ్ళవలసిన పనిలేదు- నగరాలలోని మేధావుల అభిప్రాయాలు, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదల జీవితచిత్రాలే ఇప్పటికీ అక్కడ ప్రతిబింబిస్తున్నాయి. అయినా బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కేరళలో 60-70 దశకాల నాటి  చారుమజుందార్ సిద్దాంత ఆచరణ స్ఫూర్తి కాలక్రమంలో సన్నగిల్లింది” అంటున్నారు మాజీ ఐ.పి.ఎస్. అధికారి, మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఎం.కే. నారాయణన్.

Also read: ‘దావోస్’లో ఈ రోజు మనం ఎందుకున్నామంటే…

 ‘దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు -నివారణ చర్యలు’ అంశంపై ఇటీవల ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక కోసం రాసిన వ్యాసంలో ప్రస్తావించిన పలు కల్లోల ప్రాంతాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రస్తావన లేకపోవడం, మనకు ఊరట కలిగిస్తున్న అంశం. ఉత్తర సరిహద్దున జమ్మూ-కాశ్మీర్ తో తన జాబితాను మొదలుపెట్టిన నారాయణన్ దేశం దక్షణ సరిహద్దు వరకు ఈ వెతుకులాట కోసం జల్లెడ పట్టారు. ఆయన మాటల్లోనే- “పంజాబ్ ఖలిస్తాన్ వేర్పాటు ఉద్యమం పక్కనున్న హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లకు విస్తరించి ఇక్కడ స్తబ్దుగా ఉన్నప్పటికీ, యూరోపియన్ దేశాల్లో వాటి- ‘స్లీపర్ సెల్స్’ చురుగ్గా ఉన్నాయి. ఇప్పటికీ పంజాబ్ సంఘటనల్లో వాటి ప్రభావం చూస్తున్నాము.

అస్సాంలోని- ‘ఉల్ఫా’ వేర్పాటు ఉద్యమం కనుమరుగైనట్లు అనిపించినా, ఇప్పటికీ అది మయన్మార్ కేంద్రంగా సజీవంగా ఉంటూ, ఈశాన్య రాష్ట్రాల్లో సమస్యలు సృష్టిస్తూనే ఉంది. ఇక దక్షణాదిన ఇటీవలి శ్రీలంక ఆర్ధిక సంక్షోభం తర్వాత, మళ్ళీ అక్కడ- ‘ఎల్.టి.టి.ఇ.’ కదలికలుతో తమిళనాడుపై వాటి ప్రభావం దృష్ట్యా అప్రమత్తత అవసరం.” అని నారాయణన్ అంటున్నారు.

Also read: కొత్త సామాజిక శ్రేణులకు ఊతంగా ఆంధ్రప్రదేశ్

అయితే ఉత్తరాదికి దక్షణాదికి మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అమలు చేస్తున్న- ‘రాజనీతి’ (స్టేట్ క్రాఫ్ట్) ఎటువంటిది అనే సమీక్ష ఈ సందర్భంగా ఇక్కడ అవసరం అవుతున్నది. గత మూడేళ్ళుగా అన్ని రంగాలను ప్రక్షాళన చేస్తున్న ఆంధ్రప్రదేశ్, మారుతున్న భారత దౌత్య విధానానికి, ఆగ్నేయ తీరాన ఆధారపడదగిన భాగస్వామిగా కనిపిస్తున్నదా? సీనియర్ ‘బ్యూరోక్రాట్ల’ అభిప్రాయాలు చూస్తున్నప్పుడు, అందుకు- ‘అవును’ అనే సమాధానం దొరుకుతున్నది. వీరికి రాజకీయాలు పట్టవు కనుక, విషయం ఏదైనప్పటికీ అందరి మేలు, దేశ సమగ్రత, దృష్టి నుంచి వీరు మాట్లాడతారు,

భౌగోళికంగా సముద్రతీర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, ఇండియా- ‘ఆగ్నేయ ఆసియా విధానం’ అమలుకు, దేశ ‘జియో-పొలిటికల్’ వ్యూహాల దృష్ట్యా కేంద్రానికి ఇది ప్రత్యేకం. నలభై ఏళ్ల తెలంగాణ ఉద్యమ తీవ్రత విభజన చట్టంతో ముగిశాక, గత మూడేళ్ళలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఇక్కడ మావోయిస్టుల చర్యలు లేవు. అయితే, గత మూడు దశాబ్దాల్లో కేంద్ర ప్రభుత్వాలకు కంటి క్రింద కునుకు లేకుండా చేసిన- ‘విభజన’ పోరాటాలు కొన్ని ఇప్పటికీ నివురు కప్పిన నిప్పులా నిద్రాణంగా ఉంటూ, సందు దొరికితే తలలు ఎగరేయడానికి సిద్దంగా ఉన్నాయని; భద్రతా చర్యలతో కంటే, ప్రభుత్వాలు అనుసరించవలసిన- ‘రాజనీతి’ (స్టేట్ క్రాఫ్ట్) తో మాత్రమే వాటిని పరిష్కరించుకోవలసి ఉంటుందని నారాయణన్ అంటున్నారు.

జపాన్ ప్రధాని సుగా, అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత ప్రధాని నరేంద్రమోదీ

          పి.వి. నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మొదలైన మన- ‘లుక్ ఈస్ట్’దౌత్య విధానం, ప్రధానిగా నరేంద్ర మోడీ ఎనిమిదో ఏటకు- ‘యాక్ట్ ఈస్ట్’ గా పరిణామం చెందింది. మే 23న జపాన్ రాజధాని టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జోసఫ్ బైడెన్ మన ప్రధాని నరేంద్ర మోడి సమక్షంలో 12 దేశాలు- ‘ఇండో-పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేం వర్క్ ఫర్ ప్రాస్పరిటీ’ ఒప్పదం చేసుకున్నాయి. సరిగ్గా అదే సమయానికి రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా దేశానికి ఆగ్నేయ తీరాన సుదీర్ఘ సముద్ర తీరంతో ఆంధ్రప్రదేశ్- దేశానికి ‘గేట్ వే’ గా పరిణమించింది. బైడెన్ ఈ ఒప్పందాన్ని- ‘రైటింగ్ న్యూ రూల్స్ ఫర్ 21 సెంచరీ ఎకానమీ’ అంటూ అభివర్ణించారు.

భారత విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్

 

ఇది జరిగి నెల కూడా కాకుండానే, జూన్ 12 న మన విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఏ.పి. ప్రతిపాదిత రాజధాని విశాఖపట్టణంలో జరిపిన మేధావుల సదస్సులో- ‘ఈస్ట్రన్ ఇండియా నీడ్స్ ఎవల్యూషన్’ అన్నారు. ‘జియో-పొలిటికల్’ వ్యూహాల దృష్ట్యా కేంద్రానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం అంటున్నది అందుకే. “తూర్పు తీరంలోని పోర్టులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయవలసి ఉందని, అప్పుడే ప్రపంచ మార్కెట్ తో మన వాణిజ్యం అభివృద్ధి చెందుతుంది” అని ఆ సదస్సులో జై శంకర్ అన్నారు.

Also read: కల్లోల సమయాల్లో..సాంత్వనగీతం-‘ఎబైడ్ విత్ మీ’

కనిపించే సముద్ర అలలు గురించి అందరూ మాట్లాడతారు. కానీ, కనిపించని సముద్ర గర్భజలాల కదలికలు అవి మనల్ని తాకేంతవరకు కారణాలు బోధపడవు. పశ్చిమాన గుజరాత్ తీరం (1214.7 కి.మీ.) తర్వాత తూర్పున ఆంధ్రప్రదేశ్ (973.7 కి.మీ.) తీరం పెద్దది. మన తర్వాతే తమిళనాడు( 906.9 కి.మీ.) గత రెండేళ్లుగా ఇక్కడ పెద్ద ఎత్తున పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, కోస్తా తీరానికి సమాంతరంగా నిర్మాణం అవుతున్న హైవేలు, వైమానిక దళం విమానాలు అత్యవసర పరిస్థితుల్లో దిగడానికి అనువైన ‘హేలీఫ్యాడ్’  నిర్మాణాలు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సిద్దం కావడం తెలిసిందే.

గత మూడేళ్ళుగా అన్ని రంగాలను ప్రక్షాళన చేస్తున్న ఆంధ్రప్రదేశ్, మారుతున్న భారత దౌత్య విధానానికి, ఆగ్నేయ తీరాన ఆధారపడదగిన భాగస్వామిగా కనిపిస్తున్నదా? కావొచ్చు. అయినా ఈ ప్రశ్నకు జవాబు- వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీలకు అతీతంగా దేశాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తే… దొరికితే దొరకవచ్చు.

Also read: మూడవ ఏట అయినా అక్కడ దృష్టి మారుతుందా?

రచయిత: అభివృద్ధి-సామాజిక అంశాల వ్యాఖ్యాత

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles