Wednesday, April 24, 2024

మూడవ ఏట అయినా అక్కడ దృష్టి మారుతుందా?

జాన్ సన్ చోరగుడి

 ర్ధిక సంస్కరణలు అమలు అవుతున్న ప్రపంచీకరణ కాలం మీదుగా నడుచుకుంటూ వచ్చిన ఒక యువకుడు రాజకీయాల్లోకి ప్రవేశించి, ఆ సంస్కరణల ప్రతిఫలనాలు గాఢంగా కాలూనుకున్న- కోస్తాంధ్ర పట్టణం రాజధానిగా వున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయితే- అప్పుడు అతని రాజకీయ-పరిపాలనా వ్యూహాల చతురత ఎలా వుంటుంది?

Also read: రాష్ట్ర విభజన నేపథ్యంలో… వొక దార్శనిక దృష్టిలో నుండి విజయవాడ

‘పాన్ ఇండియా’ భవిష్యత్ రాజకీయ అవసరాలకు సరిపోయే, ‘21 వ శతాబ్ది పబ్లిక్ పాలసీ’ నమూనా కోసం, దేశంలో రాజకీయ రంగంపై ఆసక్తి వున్న యువ ఔత్సాహికులు అందుకు ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి. అయితే, అదేమంత తేలిక మాత్రం కాదు. అక్కడ- పాతతరం రాజకీయుల అంచనాలకు అందని రీతిలో ఉంటున్న- వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పరిపాలనా కౌశలాన్ని, కేవలం- ‘అకడమిక్’ దృష్టితో చూడాల్సిఉంటుది, అనే షరతులు మాత్రం వర్తిస్తాయి. అందుకు కారణాలు తర్వాత చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఒకప్పుడు అంటే, సోనియా గాంధీ కూర్చున్న వేదిక మీదనుంచి వై.ఎస్. రాజశేఖర రెడ్డిని ఉద్దేశ్యించి అప్పటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ నిర్భీతిగా- ‘ఏ.పి. మోడల్’ అని అనగలిగేవారు. కానీ జగన్ మోహన్ రెడ్డికి అటువంటి కితాబు ఇచ్చేంత పెద్ద మనస్సు వున్న ’సీనియర్లు’ ఇప్పుడు దేశంలో ఎవరూ లేరు.

అయితే, ‘నీతి ఆయోగ్’ వంటి- ‘నాన్-పొలిటికల్’ సంస్థలు ఆ పని చేయడం లేదా? అంటే, చేస్తున్నాయి. అయినప్పటికీ అది- ప్రతి రోజు ఏదో ఒక వేదిక మీద కనిపించే ‘సోషల్ మీడియా’ విశ్లేషకులకు పట్టని- ‘అకడమిక్’ అంశం అవుతుంది! ఇలా తెలుగునాట ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే, దాని గురించి ఒక- ‘న్యూట్రల్ ఫ్లాట్ ఫాం’ మీది నుంచి, ప్రభుత్వ అధినేత అయిన ముఖ్యమంత్రి గురించి ఒక మంచిమాట అనడం చూస్తూ చూస్తూనే పెద్ద ‘లగ్జరీ’గా మారింది!

Also read: ఆచార్య ఏ.బి.మాసిలామణి పేరుతో పోస్టల్ కవర్, నవంబర్ 30 న విశాఖపట్టణంలో….

తెలుసు, కానీ పైకి మాట్లాడరు!

 ‘పప్పు బెల్లాల్లా పంచుతున్నారు…’ అని ఆంధ్రప్రదేశ్ లో విమర్శకులు అంటూ ఉండగానే, మాజీ ఐ.ఆర్.ఎస్. అధికారి కూడా అయిన డిల్లీ సి.ఎం. అరవింద్ కేజ్రీవాల్ ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ పంజాబ్ రాష్ట్ర ఎన్నికలకు తన పార్టీ ప్రణాళికలో- 18 ఏళ్ళు దాటిన యువతికి ‘నగదు బదిలీ’ పధకం అమలు చేస్తాను, అని ప్రకటించాడు. వీటిని ఇక్కడ తప్పు పడుతున్న వీళ్లెవరికీ ‘ప్రపంచ ప్రజలకు కనీస ఆదాయం’ ఉండాలి, అనే లక్ష్యంగా ‘రాజ్యం’ (‘స్టేట్’) సంక్షేమ చొరవతో అన్నిదేశాల్లో ‘యూనివర్సల్ బేసిక్ ఇన్ కం’ (UBI) అనే ‘పాలసీ’ ఒకటి ఇప్పటికే అమల్లో ఉందనే విషయం తెలియదని కాదు, వారిలో కొందరికైనా అది తెలుసు. కానీ దాన్ని వాళ్ళు పైకి మాట్లాడరు!

ఇక్కడ విషయం ఏమంటే, ఎక్కడైనా ప్రతిదీ అవసరాన్ని మించి ‘పొలిటిసైజ్’ చేస్తే, అక్కడ ‘అకడమిక్స్’కు, ఆలోచనాపరులకు మిగిలే జాగా పూర్తిగా తగ్గిపోతుంది. మనం ‘రాజ్యం’ (‘స్టేట్’) అంటున్నాము, దాని ప్రతినిధి గవర్నర్. కానీ అక్కడ ప్రజల చేత ఎన్నికయిన ముఖ్యమంత్రి అతని మంత్రిమండలి, ‘బ్యూరోక్రసీ’ బృందం సంయుక్తంగా ప్రభుత్వ పరిపాలనకు బాధ్యులు, అనే సోయలేని దశకు జనాన్ని చేర్చడం ఒక లోతైన వ్యూహం! అందుకు మనవద్ద గడచిన నాలుగు దశాబ్దాలుగా సినిమా-రాజకీయాలు ‘మిక్స్’ ను పనిమాలా ఒక పద్దతి ప్రకారం ప్రజలకు అలవాటు చేసారు. విషయం ఏదైనా అది రెండు పార్టీలు కూడా కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యవహారం అన్నట్టుగా చేసి, ‘రాజ్యం’లో ఉపాంగాలు అయిన- లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీని ఇక్కడ సున్నా చేస్తున్నారు. 

Also read: సమఉజ్జీ ప్రతిపక్షం అవసరతలో… ఏ.పి. ప్రభుత్వం!

దాంతో- ‘అకడమిక్స్’లో- అతి ప్రాచీనమైన రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్) ‘రాజ్యం’లో కాలానుగుణంగా అమలులో ఉండవలసిన- ‘పబ్లిక్ పాలసీ’లు గురించిన  స్పృహ, ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా అమలుచేస్తున్న దృష్టి మళ్లింపు వ్యూహాల కారణంగా, ఇక్కడి పౌరసమాజంలో ఉండవలసిన స్పృహ సైతం అడుగంటి పోయింది.

అయితే, తొలుత ఇటువంటి- వ్యూహాల ‘ఫార్ములా’ తయారీలోనూ, ఆ తదనంతర కాలంలో దాని ఫలాలు కోసుకున్న వారిలోనూ ఎటువంటి మినహాయింపు లేకుండా అన్ని సిద్దాంతాలు చెప్పే రాజకీయ పార్టీలు ఉండడం అది మరొక వైపరీత్యం! ఇటువంటి పరిస్థితిని దేశంలో మరే రాష్ట్రంలోనూ మనం చూడం. దాంతో- ఇక్కడ ఎన్నికయి సుదీర్ఘ కాలం అధికారంలో వున్న పార్టీల ప్రభుత్వాలు, పరిపాలనను- ‘ఈవెంట్ మేనేజ్మెంట్’ స్థాయికి చేర్చడం సుళువు అయింది.

Also read: కనుమరుగై … రెండైన వై.ఎస్.ఆర్!

కొత్త సహస్రాబ్దిలో 2000 తర్వాత మరోసారి పెద్ద రాష్ట్రాలను చిన్నవి చేయడం దేశంలో మొదలయింది. దాంతో తెలంగాణ ప్రజలలో 1969 నుండి నిద్రాణంగా వున్న స్వంత రాష్ట్ర కాంక్ష మళ్ళీ చిగురించింది, 2014 నాటికి ఎట్టకేలకు అది ఫలించింది. అయితే, అందువల్ల తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు కొంతమేర నష్టమున్నా, ఇప్పుడు దీర్ఘకాలంగా వెలుగు చూడని పార్శ్వాలు- నూతన ప్రాంతీయ పార్టీ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో- ‘అడ్రెస్’ చేయబడుతున్నాయి. తొలుత, కనీసం అటువంటి చొరవ మొదలైతే, కొంత ఆలస్యంగా అయినా ప్రతిదానికీ పరిష్కారం వుంటుంది. అదే రాష్ట్ర విభజన కనుక జరిగి ఉండకపోతే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, అన్న చందంగా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగి ఉండేది.

‘మ్యాపింగ్’ మొదలయింది

విభజనను ఇంతలా సమర్ధించాలా అనేవారి కోసం ఈ ప్రస్తావన తప్పడం లేదు. అది సెప్టెంబర్ 2012 అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి- ‘ఇందిరమ్మ బాట’ కార్యక్రమంలో భాగంగా కర్నూల్ లో వున్నారు. ఆ రోజు మద్యాహ్నం కలెక్టర్ ఆఫీస్ లో జిల్లాకు సంబంధించిన అంశాల మీద సమీక్ష మొదలయింది. వచ్చింది సి.ఎం. కనుక, అక్కడ కాక మరెక్కడ వాటికి పరిష్కారం దొరుకుతుంది, అనుకొని మీటింగ్ ఎజెండా ప్రకారం సిద్దపడి వచ్చిన ఇరిగేషన్ శాఖ సీనియర్ అధికారులు, సందర్భం రాగానే- కృష్ణానదికి ఎగువన కర్ణాటక సరిహద్దుల్లోని మన ప్రాజెక్టులు వద్ద, కర్ణాటక ఇరిగేషన్ అధికారులతో తాము ఎదుర్కొంటున్న కష్టాలను అక్కడ ఏకరువు పెట్టారు.

Also read: సైరా… ఉయ్యాలవాడనూ యాది చేసినోడా!

వాటిని అక్కడ వున్న సెక్రటరీ స్థాయి సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారులు ‘నోట్’ చేసుకుని ఉండొచ్చు కానీ, ముఖ్యమంత్రి మాత్రం వారు చెబుతున్నది వింటూ మౌనంగా వుండిపోయారు. మరొక రాష్ట్ర సరిహద్దు శ్రీకాకుళం జిల్లాలో ‘ఇందిరమ్మ బాట’ సందర్భంగా కూడా ఇదే దృశ్యం ఆవిష్కృతం అయింది. ఇది జరిగిన కొద్ది కాలానికి రాష్ట్ర విభజన ప్రక్రియ దిల్లీలో వేగం కావడంతో ఇటువంటి సరిహద్దు వివాదాల్ని పట్టించుకునే స్థిమితం అప్పట్లో ముఖ్యమంత్రిగా ఆయనకు కూడా లేకపోయింది.

ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దులోని కొటియా గ్రామం

అయితే రాష్ట్రం చిన్నది అయ్యాక, ప్రభుత్వం- ‘ఫోకస్’ ఆంధ్ర-ఒడిస్సా సరిహద్దు మధ్య ఉన్న ఒక గ్రామం స్థాయి వరకు వెళ్ళింది. కోరాపుట్ జిల్లాలో వున్న కొటియా గ్రామం ఎవరిది అనే సందిగ్ధత 1956 నుంచి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉండిపోయింది. అదొక్కటే కాదు, దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల మధ్య- వంశధార, రెండు రాష్ట్రాల విద్యుత్ ప్రాజెక్టు మాచ్ ఖండ్, జోలాఫుట్ మొదలైన ప్రాజెక్టులు, సరిహద్దు రహదారులు, విద్యాసంస్థల్లో తెలుగు-ఒడియా మీడియం వంటి అంశాలన్నీ ఒడిస్సాతో మనం శాశ్వితంగా ‘సెటిల్’ చేసుకోవలసి ఉంది.

Also read: ఆసియా దేశాల్లో క్రీ.పూ. 600 నాటికే భూమి స్థిరాస్తి లావాదేవీలు!

ఈ నేపధ్యంలో మునుపటికి భిన్నంగా గత ఏడాది నవంబర్ 8 న సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి తన అధికారుల బృందంతో భువనేశ్వర్ వెళ్లి ఒడిస్సా సి.ఎం. నవీన్ పట్నాయక్ ను కలిసి సరిహద్దు రాష్ట్రంతో ‘పెండింగ్’ వున్న సమస్యల పరిష్కారానికి చొరవ చేసారు. మరోసారి సంక్రాంతికి ముందు జనవరి 11 న ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, ఒడిస్సా చీఫ్ సెక్రటరీ సురేష్ చంద్ర మహాపాత్ర రెండు రాష్ట్రాల సీనియర్ కార్యదర్శులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మునుపటి సి.ఎం. ల సమావేశానికి కొనసాగింపుగా తదుపరి చర్యలు మొదలుపెట్టారు. తొలి ఐదేళ్లలోనే, కే.సి.ఆర్. కూడా మహారాష్ట్రతో ఇలాగే సరిహద్దు వివాదాలు సరిచేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ సి.ఎస్., సి.ఎం.

చెప్పుకోవడం ఇష్టం

‘విభజన జరిగాక, ఇదంతా మొదటి ఐదేళ్ళలో జరగవలసింది కదా?’ అనడం గానీ, ఈ పని అప్పుడే ఎందుకు చేయలేదు అనడం గానీ ఎవరికైనా తేలికే, అయితే విషయం అది కాదు. ఒక కొత్త రాష్ట్ర ప్రయోజనాల్ని భౌగోళికంగా నలుచెరగుల నుంచి కాపాడడం ఎలా అనే దృష్టి ప్రభుత్వానికి వున్నప్పుడు, నేత దృష్టి రాష్ట్రం అంచుల వరకు విస్తరిస్తుంది.

కర్ణాటక సరిహద్దున చిత్తూరు జిల్లాలో మదనపల్లి రెవెన్యూ డివిజన్ లో వుండే హార్స్లీ హిల్స్ ను రాష్ట్రంలో ఒబెరాయ్ గ్రూప్ 2,800 కోట్లతో నిర్మించనున్న పది టూరిస్టు రిసార్ట్స్ ప్రాజెక్టులో ఒకటిగా అబివృద్ది చేయాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకోవడం అటువంటిదే. అయితే, ఇదేమీ పట్టకుండా- అభివృద్ధిని గాలికి వదిలిపెట్టి, ప్రభుత్వ సొమ్మును జనానికి ‘పప్పు బెల్లాల్లా పంచుతున్నారు…’ అంటున్నవారి బాధ ఏమిటో, వీటన్నిటి కంటే ముందుగా స్పష్టం కావలసి వుంది.

Also read: ఆ నాలుగు పత్రికల నిష్క్రమణ మిగిల్చిన ప్రశ్నలు!

పొట్ట చేతపట్టుకుని దేశం నలుమూలలకు ఉపాధి కోసం వెళ్ళిన వారి పరిస్థితి ఏమిటో ‘కోవిడ్’ తొలి దశలో వలస కార్మికుల తిరుగుప్రయాణం సందర్భంగా చూసాము. ఇవన్నీ చూసాక కూడా అర్హత మేరకు పేదలకు ‘రాజ్యం’ నగదు బదిలీ పధకాలు అందిస్తుంటే, వీరికి కష్టం ఎందుకు అనేది ఇప్పుడు స్పష్టం కావలిసివుంది. ఇది చాలా తీవ్రమైన అంశం. పైగా అటువంటి అభిప్రాయం ఎవరిలో ఉన్నప్పటికీ, అస్సలు దాన్ని అలా చూడడం తప్పు అని, ఆలోచనాపరులు ఎవ్వరూ ఖండించకపోవడం; ఈ పరిస్థితి కూడా పురోగామి దృక్పధానికి కేంద్రమని చెప్పుకోవడానికి ఇష్టపడే కోస్తాంధ్ర నుంచి కావడం మరింత ఆందోళన కలిగిస్తున్నది.  

గుంటూరులో ఐ.టి.సి. హోటల్ ప్రారంభోత్సవ చిత్రం

‘గోల్’ పడిందా?   

‘గోల్ఫ్’ ఆటగాడికి ఎప్పుడు ఎక్కణ్ణించి బంతిని ఎంత వేగంగా ‘స్ట్రోక్’ కొడితే, బంతి మరెక్కడో కనిపించకుండా వున్న ‘గోల్ పోస్టు’లో పడుతుందో దానికి ఒక లెక్క వుంటుంది. ‘స్టిక్’తో (గోల్ఫ్ క్లబ్) దాన్ని కొట్టే సమయానికి బంతి వెళ్ళవలసిన దిశలో గాలి వేగం అంచనా కూడా అందుకు అవసరం. సంక్రాంతి ముందు గుంటూరులో సరిగ్గా అటువంటి ‘పొలిటికల్ ఫీట్’ జరిగింది. ఈ ప్రభుత్వంలో ‘అభివృద్ధి’ ఇక్కడ పడక ఎక్కింది అని పాట పాడుతున్న చోటనే ఐ.టి.సి. నిర్మించిన ఫై స్టార్ హోటల్- ‘వెల్కం హోటల్’ ను ప్రారంభించి, జగన్మోహన్ రెడ్డి అందుకు జవాబు చెప్పాడు. అక్కడ ‘ప్లాటినం సర్టిఫైడ్’ స్టార్ హోటల్ ప్రారంభిస్తూ, తమ ప్రభుత్వం- గ్రామీణ ముఖచిత్రంలో మార్పు కోసం- విద్య, వైద్యం, వ్యవసాయ రంగంలో తెచ్చిన సంస్కరణల గురించి ప్రస్తావించారు.

గోల్ఫ్ ఆడుతున్న సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి

ఈ రాష్ట్రంలో ఇక్కడి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేకపోవడంతో ఆ సభలో ఐ.టి.సి. చైర్మన్ సంజయ్ పూరి వ్యాసం మొదట్లో మనం అనుకున్నట్టుగా పూర్తిగా  ‘అకడమిక్’ గా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్- కలుపుగోలు వృద్ది (ఇంక్లూజివ్ గ్రోత్) ‘గుడ్ గవర్నెస్’లో దేశానికి మార్గదర్శిగా వుంది అని అన్నారు. ఆయన అక్కడ ఆగలేదు, వ్యవసాయ సంస్కరణలతో ఈ ప్రభుత్వం రాష్ట్రంలో సాంఘిక-ఆర్ధిక రంగాల్లో తెస్తున్న మార్పులో ఐ.టి.సి. భాగస్వామ్యం తీసుకుంటుందని, అందుకు ఇక్కడ- ఆహార తయారీ రంగ పరిశ్రమల్లో తాము 400 కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నామని అన్నారు.

మొదటిసారి అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గత మూడేళ్ళలో ఏమి చేస్తే- ఐ.టి.సి. నుంచి ఇటువంటి ప్రకటన వెలువడిందో, అంచనా వేయడం కూడా ‘అకడమిక్’ అవుతుందేమో చూడాలి?!

Also read: ఈ హ్రస్వ దృష్టి రాజకీయానికి అంతం ఎప్పుడు?

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles