Friday, June 9, 2023

జగన్ దావోస్ తనతో తీసుకెళ్ళింది ఏమిటి?

జాన్ సన్ చోరగుడి

రాజకీయ నాయకులకు ఐదేళ్లకు పరీక్ష ఉంటుంది. కానీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ళకే కీలకమైన పరీక్ష ఎదుర్కొంటున్నారు. ఐదేళ్ళ క్రితం ఏర్పడిన రాష్ట్రానికి, మూడేళ్ళ క్రితం ముఖ్యమంత్రిగా పని మొదలుపెట్టి, కరోనా కాలంలో తనది- ప్రజా ’సంక్షేమ’ ప్రభుత్వంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. పధకాలు సరే, అభివృద్ధి ఏది? అంటున్న విమర్శకులకు జవాబుగా- ‘పెట్టుబడుల సదస్సు’గా పిలుచుకునే- ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ (WEF)లో పాల్గొనేందుకు, ఆయన ఇప్పుడు ‘దావోస్’లో ఉన్నారు.

‘కర్బన రహిత అర్ధికత’ సదస్సులో నీతి ఆయోగ్ సి.యి.ఓ. అమితాబ్ కాంత్, ఆదిత్య మిట్టల్ తో
ఏ.పి. సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి 

ఈ వేదిక కొన్నేళ్లుగా ప్రపంచ దేశాలు నుంచి కేవలం- ‘ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్’ (4IR) పరిధిలోకి వచ్చే ప్రతిపాదనలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం తెలిసిందే. అయితే, ఈ నూతన- ‘పారిశ్రామిక విప్లవ’ నమూనాలోని అంతర్లీనమైన అంశం- ‘బ్లర్రింగ్ ఆఫ్ బౌండ్రీస్’ (హద్దులు చెరిపేయడం) ఏమిటిది? ‘ప్రపంచీకరణ’ మొదలైన 90’ దశకంలో ఇక్కడ మనమూ- ‘వరల్డ్ ఈజ్ ఫ్లాట్’, ఇంకా ‘లెవెల్ ప్లే గ్రౌండ్’ వంటి కొత్త పదప్రయోగాలు వినేవాళ్ళం!

అయితే, అది ఎలా సాధ్యం, అనేది అప్పట్లో మనకు స్పష్టత ఉండేది కాదు. కానీ రాష్ట్ర విభజన తర్వాత, ఒకప్పడు బ్రిటిష్ వారి- ‘పోర్టు కేంద్రిత’ 200 ఏళ్ల పరిపాలనలో- ‘సర్కార్ జిల్లాలు’గా పిలువబడిన, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ అందుకు సరికొత్త- ‘సామాజిక ప్రయోగశాల’ అయింది. ఇప్పటి WEF దృష్టి నుంచి కనుక చూస్తే, ‘ఏ.పి. నమూనా’లో- ‘బ్లర్రింగ్ ఆఫ్ బౌండ్రీస్’ (హద్దులు చెరిపేయడం) అంటే ఏమిటో అర్ధమవుతున్నది. ఇన్నాళ్ళూ ‘ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్’ నుంచి లాభాలు తప్ప, దాని ‘తత్త్వం’ లోతుల్లోకి గత ప్రభుత్వాలు, ‘ట్రేడ్’ వర్గాలు కూడా అస్సలు దృష్టి పెట్టలేదు. ఏదో  వేలంవెర్రిగా- ‘దావోస్ సదస్సు’ను ఒక పెట్టుబడుల సదస్సు స్థాయికి కుదించారు.  

‘తదుపరి దశ’ తయారీరంగం

పారిశ్రామిక ప్రతిపాదనలు ఒక రాష్ట్రం నుంచి వచ్చినా, లేక ఒక దేశం నుంచి వచ్చినా; తయారీరంగ పరిశ్రమలు విషయంలో గతానికి భిన్నంగా- WEF వైఖిరి ఇప్పుడు దృఢంగా ఉంది. ఇప్పటి పరిశ్రమలు- ‘తదుపరి దశ’ (Advanced Manufacturing and Value Chains) శ్రేణిలోనే ఉండాలనేది- ‘ఫోరం’ ఆంక్షలు. ఇప్పటి పరిశ్రమలకు- ‘గ్లోబల్ నెట్ వర్క్’ తప్పనిసరి. ఆయా దేశాల్లో లేదా రాష్ట్రాల్లో ప్రధాన పరిశ్రమ రంగంతో పోటీపడేలా- ‘ఎం.ఎస్.ఎం.ఇ.’ల సామర్ధ్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. తయారీ రంగంలో పనిచేసే ఉద్యోగులు కార్మికులకు- ‘అప్ స్కిల్’, ‘రీ స్కిల్’ పెంపొందే చర్యలు తప్పనిసరి.

ఇందులో ఇంకా- ‘నెట్ జీరో మాన్యుఫ్యాక్చరింగ్’, ‘పోర్టు’లను అభివృద్ధి చేయడం ద్వారా ‘గ్లోబల్ వాల్యు చైన్’ వసతి కల్పించడం, ప్రధానమైన అంశాలుగా ఉన్నాయి. అయితే, ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటువంటి ప్రపంచ స్థాయి ప్రమాణాలు తయారీరంగ పరిశ్రమల్లో పాటించడానికి తాము సిద్దమని అందుకోసం WEF ఆంక్షలు అమలు చేస్తామని ముందుకొచ్చింది. అలా అది మొట్ట మొదటిసారి ‘ఫోరం’- నూతన భాగస్వామిగా (Forum Member Associate) తనని తాను ‘దావోస్’ లో చూపించుకునే ప్రయత్నాన్ని పూర్తి చేసింది.

‘నెట్ జీరో మాన్యుఫ్యాక్చరింగ్’

‘కర్బన రహిత పారిశ్రామీకరణ మనవంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కీలకమైన అంశం. ఇందుకోసం WEF ఆంక్షల్లో- ‘నెట్ జీరో మాన్యుఫ్యాక్చరింగ్’ కొరకు- ESG (Environmental, Social, and Governance) ఆంక్షలు పూర్తిచేయడం తప్పనిసరి. ఇటువంటి ఆంక్షలు పూర్తి చేయడానికి ముందుకువచ్చిన పరిశ్రమలను మాత్రమే, ఇప్పుడు ప్రభుత్వం అనుమతి ఇస్తున్నది. ఏమిటివి అనే సందేహానికి- విశాఖపట్టణంలో 7 మే 2020 న 12 మంది మరణానికి కారణమైన ఎల్.జి. పాలిమర్స్ గ్యాస్ లీక్, ఈ ఏడాది ఏప్రెల్ లో ఏలూరు వద్ద కెమికల్ ఫ్యాక్టరీ జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించిన సంఘటన మనం ఇంకా మర్చిపోని తాజా ఉదాహరణలు.

అయితే, వెంటనే మృత్యువుకు దారి తీయకుండా, నెమ్మదిగా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపించే పరిశ్రమలు మన ఇంటి సమీపాన ఉన్నప్పటికీ, మనం గుర్తించలేని పరిస్థితి. తణుకు పట్టణం పరిసరాల్లోని కోళ్ళ ఫారాలు, రాజమండ్రిలోని పేపర్ మిల్లు. మనం బస్సులో కళ్ళు మూసుకుని ప్రయాణం చేస్తున్నా- ఈ రెండు ఊళ్లు రాగానే, కేవలం వాసన బట్టి అర్ధమవుతుంది, మనం ఎక్కడ వున్నది!

విజయవాడ సమీపంలోని గంగూరు గ్రామంలోని పరిశ్రమలు నుంచి వచ్చే వ్యర్ధాలు సమస్య, ఒకప్పుడు పరిసర గ్రామాల్లో జరిగే- ‘జన్మభూమి’ గ్రామ సభల్లో తరుచూ స్థానికుల పిర్యాదుగా వచ్చేది. అయితే, అవేవీ ఆ స్థాయిలో పరిష్కారం అయ్యేవి కావు అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు ప్రభుత్వం వీటికి అనుమతులు ఇచ్చే విషయంలో- పారిశ్రామిక అభివృద్ధి పేరుతో- ‘కాలుష్యం’ పట్టించుకునే అంశం కాలేదు.

ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు బెర్జ్ బ్రెండే

ప్రసిడెంట్ మాటల్లో…

సదస్సు ప్రారంభానికి ముందు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రసిడెంట్ బెర్జే బ్రెండే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపిన సందేశంలో- “మీరు ఆంధ్రప్రదేశ్ ను పారదర్శకత పునాదులుపై నిర్మించడం గమనించాల్సిన అంశం. అధికార కేంద్రాల్ని వికేంద్రీకరించడం, టెక్నాలజీలో వినూత్న విధానాలను ప్రవేశపెట్టడంలో మీ నిబద్దత ప్రసంసనీయం” (Mr.Berge Brende  President of WEF said- “YOUR commitment to building Andhra Pradesh on the foundations of transparency, the decentralization of power, and technological innovation is noteworthy”)

‘ఫోరం థీమ్’ తో సారూప్యంగా ఏ.పి. కూడా…

‘సమష్టిగా కలిసి పనిచేద్దాం – నమ్మకాన్ని నిలబెడదాం’ (Working Together, Restoring Trust) అనేది ఈ ఏడాది ‘ఫోరం’ ప్రకటించిన లక్ష్యం. దానికి అనుగుణంగానే- 2022 ‘దావోస్ పెవిలియన్’ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ‘థీమ్’ను- People, Progress & Possibilities (ప్రజలు-పురోగతి-అవకాశాలు) అని ప్రకటించింది. ప్రజలు కేంద్రంగా ప్రస్తుత ప్రభుత్వం తన ‘మ్యాపింగ్’ ను మలుచుకోవడం పైన- ‘ఫోరం’ తన దృష్టిని పెట్టింది.

గుర్తించబడిన వికేంద్రీకరణ

వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రసిడెంట్ బెర్జే బ్రెండే- ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న‘అధికార వికేంద్రీకరణ’ గురించి మాట్లాడడం, విశేషమైన పరిశీలన. గత ఏడాది మూడు రాజధానులు ప్రకటించిన ప్రభుత్వం, ఈ ఏడాది మరో 13 కొత్త జిల్లాలను ప్రకటించింది. ‘వీడియో కాన్ఫరెన్స్’ ద్వారా జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో- మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖాధికారులు, జిల్లా కలక్టర్లు, ఎస్పీలుతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ- ‘సస్టెయిన్ బుల్ డెవలప్మెంట్ గోల్స్’ (SDG) సాధించే దిశలో- ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ (SOP) పాటించి తీరాల్సిందే, అని కొత్తగా జిల్లా కలెక్టర్లుగా బాధ్యతలు తీసుకున్న అధికారులకు స్పష్టం చేసారు. కేంద్రంలో- ‘నీతి అయోగ్’ దీన్ని మదింపు చేస్తుంది.

 బహిరంగంగా- ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ పాటించి తీరాలని ఇలా ఒక సి.ఎం. చెప్పడం చిన్న విషయం కాదు, అంత తేలిక అంతకంటే కాదు. పైగా- “కలెక్టర్లును జాగ్రత్తగా చూసుకోండి” అని మంత్రులతో సి.ఎం. చెప్పడం ఆసక్తికరమైన అంశం. ఒక పక్క అధికారులతో మీరు నిబంధనలకు లోబడి పనిచేయండి అని చెబుతూ, మరో పక్క మంత్రులతో- అధికారులను జాగ్రత్తగా చూడండి, అంటే విషయం స్పష్టమే! వాళ్ళ మీద- ‘అవుటాఫ్ ది వే’ చేయమని మీరు ఒత్తిడి పెట్టొద్దు, వాళ్ళు నిబంధనలకు లోబడి పనిచేస్తే, రేపు రాజకీయంగా ప్రయోజనం పొందేది మనమే, అనేది నర్మగర్భం!

ఇందుకు నమ్మాలి…

రాజకీయాలతో ప్రభావితం అవుతూ ప్రతిదీ చూసే వర్గం మొదటి నుంచి ఉన్నదే. వాళ్ళు ఏదో ఒక వైపుకు- ‘కమిట్’ అయ్యి ఉంటారు. ఇక ప్రభుత్వం నుంచి నేరుగా ప్రయోజనాలు పొందే- ‘లబ్దిదారులు’ వేసుకునే తూకం సంగతి తెలిసిందే, అందులో రహస్యం ఏమీ లేదు. కానీ, విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్ లో- ‘ఆలోచనాపరులు’ గతంలో ఎలా వారి రాజకీయ ప్రాధాన్యతలు ఎలా ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధినేత అయ్యాక- ‘మనం ఎందుకు ఇతన్ని నమ్మాలి?’ అనే డోలాయమానంలో ఇప్పటికీ ఉన్నది నిజం. అందుకు వారికున్న కారణాలు వారివి కావొచ్చు. కానీ, ఒక ప్రపంచ వేదిక మీద, మన రాష్ట్రాన్ని- జగన్ ‘ప్రజెంట్’ చేసిన వైనం చూసినప్పుడు, ‘దావోస్’కు అతడు తనతో- ‘నమ్మకాన్ని’ వెంట తీసుకెళ్ళాడు, అని మాత్రం రూఢిగా అనిపిస్తున్నది.

Also read: ‘దావోస్’లో ఈ రోజు మనం ఎందుకున్నామంటే…

(రచయిత: అభివృద్ధి-సామాజిక అంశాల వ్యాఖ్యాత)

Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles