Friday, April 26, 2024

కొత్త సామాజిక శ్రేణులకు ఊతంగా ఆంధ్రప్రదేశ్

జాన్ సన్ చోరగుడి

గోదావరి మండలంలో- ‘కాటన్ తర్వాత భూమి’ చుట్టూనే తెలుగు ప్రజల అభివృద్ధి, సాంస్కృతిక జీవన పరిణామాలు ఇప్పటికీ పరిభ్రమించడం ఆసక్తికరమైన అంశం. ఇదే గోదావరి తెలంగాణాలో నుంచే ఆంధ్రప్రదేశ్ లోకి వస్తున్నప్పటికీ, ఈ ప్రాంత ప్రజల ఆర్ధిక సాంఘిక వికాసంలో- ‘గోదావరి వ్యాలీ’ ప్రభావం, గత ఐదు దశాబ్దాలలో తెలంగాణ ప్రజలలో  విభజన కాంక్షకు దారితీసిన పలు కారణాల్లో ఒకటి కావడం కాదనలేని అంశం. అదేదో ఈ వ్యాసం కోసం- ‘ఫ్రీలాన్స్ జర్నలిజం’ వ్యాఖ్యగా ఈ మాట అనడం కాదు. ఈ ప్రాంతం గురించిన నిర్ధారణలను సమకాలీన అధ్యయనాలతో పోల్చినప్పుడు, అవి సమాంతరంగా కనిపిస్తున్నాయి.

Also read: కల్లోల సమయాల్లో..సాంత్వనగీతం-‘ఎబైడ్ విత్ మీ’

ఇప్పటికి 60 ఏళ్ళ క్రితమే, చరిత్రకారుడు, కేంబ్రిడ్జి యూనివర్సిటీ విజిటింగ్ ఫ్రొఫెసర్ బి.బి. మిశ్రా పరిశోధనా గ్రంధం- ‘ది ఇండియన్ మిడిల్ క్లాస్-దెయిర్ గ్రోత్ ఇన్ మోడరన్ టైమ్స్’లో (1962) ఒక మానవ సమూహాన్ని ‘మధ్య తరగతి’ అని అనడానికి వర్గీకరించిన పదకొండు అంశాల్లో ఆరు అంశాలు గోదావరి మండలంలో ఉన్నాయి. వాటిలో ఐదవది- “గుర్తింపు పొందిన వృత్తులైన- డాక్టర్లు, లాయర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, ఉన్నతస్థాయి, మధ్యస్థాయి రచయితలు, పాత్రికేయులు, సంగీత విద్వాంసులు, కళాకారులు, మత ప్రబోధకులు, మతాధికారులు ఈ ప్రాంతం నుంచి ఉంటారు” ఇక్కడ ప్రొ. మిశ్రా చేసింది ఆసక్తికరమైన పోలిక.   

Also read: మూడవ ఏట అయినా అక్కడ దృష్టి మారుతుందా?

ఈ దృష్టి నుంచి చూసినప్పుడు, మనది వ్యవసాయ ప్రధాన సమాజం కనుక, ఇక్కడ జరిగిన సాంఘిక మార్పుకు- ‘కాటన్ తర్వాత భూమి’ (1852) ప్రాతిపదిక అయింది. అది- ఆర్ధిక పరిస్థితులపై మాత్రమే కాకుండా, ఇక్కడి- ‘సోషల్ ఎకో సిస్టం’ మీద ప్రభావం చూపి, కొన్నితరాలు పాటుగా కదలికలు లేకుండా చట్టుకట్టిన సామాజిక దొంతర్లను (‘సోషల్ ఫ్యాబ్రిక్’) గుల్లబార్చింది. ఈ పరిస్థితి వందేళ్ళు పూర్తి అయ్యేనాటికే ఇక్కడి భావప్రపంచాన్ని మిగతా ప్రాంతం నుంచి వేరుచేసింది. ఈ ప్రాంత సామాజిక చైతన్య సూచికగా 1940 నాటికే బోయి భీమన్న- ‘పాలేరు’ నాటకం ఇక్కడి నుంచి వచ్చింది.

సినిమా షూటింగ్

రాయలసీమ తెలంగాణలో నేలలు నెర్రలు బారి ఉన్నప్పుడు, గోదావరితీర ‘ఈస్థటిక్స్’కు ప్రతీకగా- ‘గోరువెచ్చని సూరీడమ్మా…’ (1980) అంటూ ఇక్కడ సినిమా పాటల షూటింగులు జరిగాయి! అయితే, వికాస విస్తరణ వొక- ‘క్యూ’! విభజన తర్వాత రాష్ట్రమంతా అన్ని నదీపరివాహక ప్రాంతాల్లో జలకళ మొదలయింది. అయితే మరి ఈ ప్రాంతాల్లో ప్రొ. మిశ్రా చెబుతున్న మధ్యతరగతి ఏది? ఎవరు వాళ్ళు? మరి భూములున్న ఆధిపత్య వర్గాలదే ఇక్కడా తొలి విస్తరి అయితే, ఇన్నేళ్ళ ‘సరళీకరణ’ తర్వాత కూడా- ‘వెనుకబడిన వర్గాలు వెనుకే…’ అనే పాత సూత్రమేనా?

Also read: రాష్ట్ర విభజన నేపథ్యంలో… వొక దార్శనిక దృష్టిలో నుండి విజయవాడ

ఈ ప్రశ్నకు జవాబు వెతికే ముందు, ఈ పరిస్థితికి నేపధ్యం ఒకసారి చూడాలి. ఇరవై ఏళ్ల క్రితం- ఇక ముందు వ్యవసాయం సాగదేమో? అనే అనుమానాన్ని స్వయంగా సర్కారులోని పెద్దలే వ్యక్తం చేయడం మనం చూశాం. అప్పటికే కౌలు రైతుల వెతలు పెరిగి సాగుబడి భారమయింది. భూముల స్వంతదారులు ఊళ్ళను వదిలిపెట్టి, నగరాలలోనో విదేశాలలోనో ఉంటూ రాష్ట్రమంతా- ‘ఆబ్సెంట్ ల్యాండ్ లార్దిజం’ ఎక్కువయింది.

ప్రముఖ ఆర్థికవేత్త జయతి ఘోష్

అయితే, ‘ఇకముందు వ్యవసాయం సాగదేమో…?’ పాలకులకే అనిపించినప్పుడు; దీనికి తదుపరి దశ గురించి యోచన సాగాలి. కానీ అటువంటిది జరగలేదు సరికదా, అప్పటి పాలకులు దీన్ని మధ్యలోనే ఒదిలేసి- ‘మూడవ పారిశ్రామిక విప్లవం’ అంటున్న-‘డిజిటిలైజేషన్’ వైపు వారి చూపు మళ్ళింది. అందుకే, ఇటువంటి అలిమి కాని ఈ స్థితిని, మళ్ళీ పట్టాలు ఎక్కించడానికి- 2004 నాటికి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం డిల్లీ జే.ఎన్.యూ. ఆర్ధికశాస్త్రం ప్రొఫెసర్ జయతీ ఘోష్ ను, అప్పట్లో మా రాష్ట్రానికి ఒక ‘రోడ్ మ్యాప్’ ఇవ్వమని కోరింది.

ఆ తర్వాత- ‘జలయజ్ఞం’ మొదలై సాగునీటి వసతి పెరుగుతున్న దశలో- డా. వై.ఎస్. తాత్కాలిక ఉపశమనంగా చిన్నసన్నకారు రైతులు- పాడి, మేకలు, గొర్రెలు, కోళ్ళు, కూరగాయల పెంపకం వంటివాటితో అదనపు ఆదాయం పెంచుకోవాలని బహిరంగ సభల్లోనే కోరేవారు. రాష్ట్ర విభజన తర్వాత తన తండ్రి ఆలోచన నుంచి- ఆ ‘లైన్’ స్పూర్తిగా తీసుకుని, గత ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో కొత్తగా- ‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ’ శాఖను ప్రారంభించారు.

ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తులు

అయితే ఈ ప్రాంతంలో ఇదేమీ కొత్తకాదు. గోదావరి మండలంలోని రెండు జిల్లాల్లోని ప్రముఖ ‘ఆగ్రో-ఇండస్ట్రీస్’ కంపెనీల కారణంగా, ఇప్పటికంటే మరింత మేలైన మానవీయ కేంద్రిత స్థిమిత స్థితిని సామాజిక పర్యావరణంగా (‘సోషల్ ఎకో సిస్టం’) ఒకప్పుడు ఇక్కడ ఉండేది. అయితే, ‘అటోమెషన్’ ‘కంప్యూటర్ల’ ప్రవేశం తర్వాత, ఉద్యోగులు/కార్మికుల సంఖ్య నియంత్రణతో, ఉపాధి వెతుకులాట కోసం మొదలైన పట్టణాల వలసలు ప్రభావం, తొలుత పంటలు పైన, ఆ తర్వాత ఈ పరిశ్రమలకు ముడిసరుకు కొరతపై కనిపించింది. ఆర్ధిక సంస్కరణలు తర్వాత, ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తుల దిగుమతుల్లో కేంద్రం తీసుకున్న వైఖరితో, మన ఆగ్రో పరిశ్రమల్లో సంక్షోభం చూసాం. సహకార చెక్కర మిల్లులు మూత ఈ పరిస్థితుల పర్యవసానమే!

Also read: సమఉజ్జీ ప్రతిపక్షం అవసరతలో… ఏ.పి. ప్రభుత్వం!

‘గోదావరి నమూనా’కు డెబ్భై దశకం తర్వాత ‘కృష్ణా మండలం’ ఆధునికత-వాణిజ్య విలువలు జోడించి కొన్ని ప్రయోగాలు విజయవంతంగా చేసింది. విజయవాడ సమీపంలో పోరంకి వద్ద ప్రియా ఫుడ్స్ సంస్థ పచ్చళ్ళు తయారీ ఒక విజయవంతమైన ప్రయోగం. అయితే, అదే సంస్థ నూజివీడు వద్ద ప్రారంభించిన ‘సోమా’ ఫ్రూట్ జ్యూస్ మార్కెట్ వద్ద విఫలమైంది. ‘మొబిలిటీ’లో ఉంటూ ‘టెట్రాప్యాక్’ లో డ్రింక్ తాగి దాన్ని అవతల పడేసే ‘ట్రెండ్’ రాని కాలమది! గత రెండు దశాబ్దాలలో పలు బ్రాండ్ల ‘ఫ్రూట్ జ్యూస్’ మార్కెట్లో నిలబడ్డాయి. అయితే, ఒక కొత్త ప్రయోగంతో ముందే మార్కెట్లోకి రావడంగానీ, పరిస్థితి గమనించి ఉత్పత్తి ఆపడం గానీ దాని యాజమాన్యపు ముందు చూపు అవుతుంది!   అయితే ఇప్పుడు సాగుబడి అంటే కేవలం ‘భూమి-నీళ్ళు’ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే చాలదని, అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున- ‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ’ని అభివృద్ధి చేయాలని ఏ.పి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మారిన ‘వర్క్ ఫ్రం హోం’ సౌలభ్యం నేపధ్యంలో యువ ఔత్సాహికుల దృష్టిని ఇది ఆకర్షిస్తూ ఆశాజనకంగా కనిపిస్తున్నది. గత మూడు  దశాబ్దాలలో మెరుగైన రవాణా, కమ్యునికేషన్స్, బ్యాంకింగ్, నైపుణ్య అభివృద్ధి, ఇతర మౌలిక వసతులకు చిన్నకమతాల సాగుబడికి అనుసంధానం (ఇంటిగ్రేడ్) చేయడం కొత్త అంశం.

Also read: ఆసియా దేశాల్లో క్రీ.పూ. 600 నాటికే భూమి స్థిరాస్తి లావాదేవీలు!

చంద్రభానుప్రసాద్

మారిన అంతర్జాతీయ విపణి అవసరాలు ఇందులో కీలకం. వెనుకబడిన సామాజికవర్గాల నుంచి కొత్తగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులుగా మారిన- ‘ఎంటర్ ఫ్రెన్యూర్’ యువతకు ఈ ప్రభుత్వం ఇలా కొత్త అభివృద్ధి- ‘ఫ్లాట్ ఫార్మ్’ ప్లాన్ చేసింది. సహజంగానే వీరిలో బహుజన-దళిత-మైనారిటీ సామాజిక శ్రేణులు వారి వారి దామాషా మేరకు ఎటూ ఉంటారు. ఇరవై ఏళ్ల క్రితం తన ‘దళిత్ డైరీ’లో చంద్రభాను ప్రసాద్ వంటి ఆలోచనాపరులు ప్రతిపాదించిన- ‘దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (డిక్కీ) విస్తరణ ఇకముందు వేగంవంతం అవుతుంది.

అమెరికన్ ఉదారవాద రాజకీయ తత్వవేత్త జాన్ రాల్స్- ‘థియరీ ఆఫ్ జస్టిస్’ గ్రంధంలో మూడు అంశాలు కీలకం అని చెబుతారు. సమానత్వం ఉండాల్సింది- 1. హక్కుల్లో… 2. అవకాశాల్లో… 3. ఎక్కువమందికి ప్రయోజనం కలిగించడంలో (బెనిఫిట్ ఆఫ్ మాగ్జిమైజేషన్) అంటారు. ఈ శాఖను కొత్త రాష్ట్రంలో ప్రారంభించడంలో జాన్ రాల్స్ సిద్దాంత స్ఫూర్తి కనిపిస్తున్నది. ఇందుకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ నిర్మాణకాలంలో రెండేళ్లపాటు- ‘వ్యాట్’, ‘సి.ఎస్.టి’., ‘జి.ఎస్.టి’.ల్లో రూ. రెండు కోట్లు మించకుండా- ‘ఎంటర్ ఫ్రెన్యూర్’కు తిరిగి చెల్లిస్తున్నారు. కోల్డ్ చైన్స్, కోల్డ్ స్టోరేజి, కాయలు పండ్లుగా మార్చే ‘రైపెనింగ్ యూనిట్స్’ అవి పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఐదేళ్లుపాటు యూనిట్ రూ.1.50. విద్యుత్తు సబ్సిడీ ఇస్తారు.

పరిశ్రమ ఆర్థికతకు ప్రతీక చిత్రం

కొత్త యూనిట్లకు- ప్లాంట్, మెషినరీ, టెక్నికల్ సివిల్ వర్క్స్, ప్రాజెక్టు వ్యయంలో ‘క్యాపిటల్ సబ్సిడీ’ 25 శాతం ఇస్తున్నారు. అలాగే, కొత్త టెక్నాలజీతో యూనిట్లను అప్ గ్రేడ్ చేస్తే ఒక కోటి మించకుండా 25 శాతం ఇస్తారు. రైతుల నుంచి ఆహార పంటల సేకరణ, తొలి దశ ప్రాసెసింగ్ చేసే యూనిట్లకు రూ. 2.5 కోట్లు మించకుండా యాభై శాతం వరకు ‘కేపిటల్ సబ్సిడీ’ ఇస్తున్నారు. వ్యవసాయ, హార్టికల్చర్, డైరీ, మీట్ ఉత్పత్తుల ‘కోల్డ్ చైన్’కు 35 శాతం క్యాపిటల్ సబ్సిడీ’ ఇస్తున్నారు. రెండు స్లాబుల్లో కేపిటల్ పెట్టుబడి మీద ఐదేళ్ళ పాటు వడ్డీ మీద సబ్సిడీ 7 శాతం ఇస్తున్నారు.

Also read: కనుమరుగై … రెండైన వై.ఎస్.ఆర్!

ఇటువంటి చొరవ, కేవలం పరిశ్రమ-వాణిజ్య రంగాలకు పరిమితం అయ్యేది కాదు. గడచిన మూడు దశాబ్దాలలో మధ్య తరగతి కుటుంబ నేపధ్యం నుంచి బయటకు వెళ్లి, ప్రపంచ మార్కెట్లో పనిచేస్తున్న మన యువత సంపాదన నిల్వలు, వారి స్వంత ప్రాంతంలో  పెట్టుబడులుగా పెట్టడం వల్ల- ‘మైక్రో స్మాల్ అండ్ మీడియం’ యూనిట్లు రాష్ట్రంలో బాగా పెరుగుతాయి. ఈ ఆహార పరిశ్రమలకు కావలసిన పంటలు పెంపకం సమీప రైతులకు లాభదాయకం అవుతుంది. ‘డైరీ’ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. రైతు కూలీకి ఏడాది పొడవునా ఉపాధి దొరుకుతుంది. రవాణాకు చిన్న ట్రక్కులు, శీతల గిడ్డంగులు, ప్యాకింగ్ యూనిట్లు, సివిల్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సర్వీస్లు, స్టేషనరీ, బ్యాంకింగ్, లీగల్ సర్వీస్లు, హోటళ్ళు, పెట్రోల్ బంకులు, కిరాణా స్టోర్లు, ఇలా ఒక్కొక్కటిగా విస్తరించి చిన్న పట్టణాలలో ఉపాధి పెరుగుతుంది. దీంతో ఇప్పటికీ భూమిపై జీవిక వెతుకుంటున్న వర్గాలకు మరో కొత్త ఆశ కనిపిస్తున్నది.

Also read: సైరా… ఉయ్యాలవాడనూ యాది చేసినోడా!

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles