Monday, April 29, 2024

పాతవి మూసింది ఎన్ని? కొత్తగా తెరిచింది ఎన్ని?

జాన్ సన్ చోరగుడి

రేపు ఎన్నికల ఫలితాలు వెలువడడానికి రెండు రోజులు ముందు జూన్ 2 నాటికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పై ఉన్న హక్కును ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోతారు. ఆ తర్వాత రెండు రోజులకు జూన్ 4న ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అ వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. అప్పుడు ఏర్పడేది, విభజన చట్టంలోని- ‘ఉమ్మడి రాజధాని’ క్లాజుకు బయట ఏర్పడే మొదటి ప్రభుత్వం అవుతుంది.

అ కాలానికి ముందు పదేళ్ళ పాటు ఉన్నది, చట్టం ప్రకారం హైదరాబాద్ రాజధానిగా పనిచేయవలసిన కాలం. మరి ఈ పదేళ్ళ పాటు ప్రభుత్వ కార్యాలయాల అద్దెల కోసం మనం చెల్లించినది ఎంత? ప్రభుత్వ వాహనాలు విజయవాడ లేదా గుంటూరు – హైదరాబాద్ మధ్య ఈ పదేళ్ళు తిరగడానికి చేసిన ఇంధన వ్యయం ఎంత? అని ఇప్పుడు మనం ఎవరినీ లెక్కలు అడగడం లేదు. ఇక్కడ ఒక్కటే ప్రశ్న.

ఎలా అర్ధమయింది?

భారత ప్రభుత్వం తాత్కాలికంగా మనకు హైదరాబాద్ లో కేటాయించిన రాజధాని వొద్దు అనుకుని అప్పటి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో పదేళ్ళు శాశ్వత రాజధాని లేకుండా  గడిపాము. అయితే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ‘రాజధాని’ విషయంలో వున్న వైఖరి బాబుకు భిన్నమైనది. ఆయన ప్రభుత్వం 2019-2024 మధ్య ఐదేళ్ళ కాలంలో ‘ప్రజలు’ – ‘రాజ్యము’ మధ్య ఒక బంధం (‘బాండ్’) ఏర్పడేలా పనిచేయ గలిగినప్పుడు, మరి ఇందులో ‘రాజధాని’ పాత్ర ఏమిటి ? అది ఎంత? అనే ప్రశ్న వస్తున్నది.  

ఈ ఐదేళ్ళలోనే ‘కోవిడ్’ విపత్తును ఎదుర్కోవడంలో జాతీయ స్థాయిలో ఏ.పి. ‘మోడల్’ ఒక రికార్డు. ఇక సుస్థిరంగా స్థిరపడ్డ తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల మాదిరిగానే కేంద్రము-రాష్ట్రాలు మధ్య సాగే ప్రభుత్వ శాఖల పనులు అన్నీ ఎప్పటిలా ఇక్కడ కూడా సక్రమంగా జరిగాయి. కేంద్రానికి చెల్లించే పన్నుల విషయంలోనూ పలు ‘నీతి ఆయోగ్’ లక్ష్యాల సాధనలోనూ ఏ.పి. ముందుంది.  

కేంద్రం ప్రత్యేకంగా రాష్ట్రానికి అప్పగించిన- ‘జి-20’ ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్’  మీటింగ్ వంటి అంతర్జాతీయ ‘ఈవెంట్’ నిర్వహణ ప్రతిష్ఠాత్మక బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో విజయవంతంగా నిర్వహించింది. మరి ఇది జరిగింది ఎక్కడ? సాంప్రదాయ విమర్శకులు తరుచు – ‘రాజధాని లేని రాష్ట్రం’ అని తేలిగ్గా దీని గురించి మాట్లాడే చోట.

కేంద్ర రక్షణ శాఖ, రైల్వే, ఉపరితల రవాణా, వాణిజ్యం, ఆర్ధిక మంత్రిత్వ శాఖలకు అవసరమైన భూసేకరణ విషయంలోనూ ఈ ఐదేళ్ళలో ఇక్కడ జాప్యం జరగ లేదు. టి.డి.పి. ప్రభుత్వం ‘ఎన్డీఏ’లో ఉన్నప్పటి కంటే, జగన్ ‘టర్మ్’లో పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో తరుచు పర్యటించారు. ఇక్కడ అమలవుతున్న వారి శాఖల పనులను సందర్శించి సమీక్షించారు. కొత్తవాటిని ప్రారంభించారు.  

ఇవన్నీ చెప్పడంలో ఇక్కడ ఉద్దేశ్యం ఏమంటే, వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం తప్ప, ఒక శాశ్వత రాజధాని ‘బిల్డింగ్ కాంప్లెక్స్’ అంటూ ఏ.పి.కి లేకపోయినప్పటికీ, పరిపాలన విషయంగా ఇక్కడ ఆగింది ఏమీ లేదు. మరి ‘బిల్డింగ్ కాంప్లెక్స్’ నిర్మాణం ఎప్పుడు? అంటే, కోర్టు కేసులు ‘సెటిల్’ అయితే. అదేమీ ఆగేది కాదు.

మరి రాజధాని నుంచి జరగాల్సిన ప్రభుత్వ కార్యకలాపాలు అన్నీవీళ్ళు అంటున్న- ‘రాజధాని’ లేకుండా అన్నీ సజావుగా సాగుతున్నప్పుడు, ‘రాజధాని అమరావతి’ అనేది ఒక భౌగొళిక భావన (‘జియోగ్రాఫికల్ ఎక్స్ప్రెషన్’) అవుతుందా? అనే సందేహం కూడా కలగక మానదు. ఇక్కడే విజయవాడ-గుంటూరుల్లోని రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఆఫీసుల్లో- ‘అమరావతి ఆగిపోవడం…’ అనే మాట రోజుకు ఒకసారి అయినా వినపడడం అనేది కూడా అనివార్యం ప్రస్తావించాలి.

విస్తరణ లక్ష్యాలు?

రెండవ విమర్శ- ‘అభివృద్ధి’ ఏదీ? ఇప్పుడు దీనికి జవాబు వెతకడం అంటే అది ఎక్కడ మొదలేట్టాలి? అయినా రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ‘అభివృద్ధి’ కోసం ప్రత్యెక యంత్రాంగం ఏమైనా ఉండేదా? అది ఎటువంటిది? అనే ప్రశ్న వద్ద నుంచి దాన్ని చూడాలి. హైదరాబాద్ అభివృద్ధి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు కాలంలోనే మొదలయింది.

రీజినల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబోరేటరీల స్థాపన దేశంలో మొదలయినప్పుడు,  హైదరాబాద్ నగరం వేటికి అనుకూలం అనుకొంటే, అవి ఇక్కడ పెట్టారు. ఎన్.ఎస్.టి.ఎల్. వచ్చాయి అంటే, విశాఖపట్నం విషయంలో కూడా అదే జరిగింది. దేశ సమగ్ర అభివృద్దికి అప్పట్లో ఆదొక చారిత్రిక వైభవ కాలం.

హైదరాబాద్ ఓల్డ్ సిటి ఏరియాలో ఇప్పటికీ పనిచేస్తున్న అటువంటి జాతీయ సంస్థలు ఎన్నో మనకు కనిపిస్తాయి. వీటిలో అప్పట్లో మొదలై దీర్ఘకాలం పనిచేసి కాలక్రమంలో మూడు దశాబ్దాలు క్రితమే మూతపడ్డవి కొన్ని ఉన్నాయి. ‘ఐ.డి.పి.ఎల్.’ ‘ప్రాగాటూల్స్’ ‘ఆల్విన్’, అటువంటివే. అంటే, పలు దశల్లో అభివృద్ధి ఎత్తు పల్లాలను ఇప్పటికే మన ఉమ్మడి రాజధాని నగరం చూసింది. 

అయితే మారుతున్న మన అవసరాలకు తగిన కొత్తవి కూడా అలాగే ఇక్కడికి వచ్చాయి. అప్పుడు హైదరాబాద్ నగరం పడమర వైపుకు విస్తరించింది. అటువైపుగా- ‘ఇక్రిశాట్’ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చాక, వైజ్ఞానిక రంగంలో జరగాల్సిన కొత్త పరిశోధనల కోసం- ‘సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలెక్యులర్ బయాలజీ’ సంస్థ వచ్చింది.

ప్రొఫెసర్ మహేంద్రదేవ్

అభివృద్ధి గురించి మాట్లాడేవాళ్ళు అభివృద్ధి విస్తరణ లక్ష్యాలు ఏమిటి? అనే దృష్టితో దాన్ని చూడాలి, మాట్లాడాలి. నెహ్రూ కాలంలో అభివృద్ధి మొదటి దశ నుంచి రెండవ దశలోకి జరిగిన విస్తరణ వివరం పైన మనం చూసాం. ఒక చోట ఒక ‘యూనిట్’ వస్తే, దాని చుట్టూ ఒక ఆవాసం ఏర్పడేది.  కాలక్రమంలో దాని చుట్టూ కూరగాయలు, పండ్లు, పాలు అమ్మే వాళ్ళు వస్తే, కొన్నాళ్ళకు ఆ ‘యూనిట్’ పేరుతొ అదొక సిటీ బస్ స్టాప్ అయ్యేది. వాటికంటే విలువైనది ఆ ‘యూనిట్’ లో పనిచేసే ‘సబ్జెక్ట్ స్పెషలిస్ట్స్’ అవసరమైనప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సాంకేతిక సలహాదారులుగా సహకరించేవారు. అభివృద్ధి విస్తరణ అంటున్నది దీన్నే.  

ఒక కంపెనీ వస్తే    

అయితే ఇప్పుడు ‘అభివృద్ధి’ అంటున్నవారికి తెలిసిన అభివృద్ధి వేరు. ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చే ఒక కంపెనీ వస్తే, అది అభివృద్ధి అనే వాణిజ్య దృష్టికి అందరం వచ్చాము.  పాటశాల స్థాయిలో ఆంగ్ల విద్య, నైపుణ్య అభివృద్ధి వంటి మానవ వనరుల అభివృద్ధిని ‘ప్రయివేట్’ రంగం తప్పు పట్టదు సరికదా ప్రోత్సహిస్తుంది. మరి అటువంటప్పుడు కొత్త రాష్ట్రంలో ‘పునాదుల’ వద్ద మొదలయిన సంస్కరణలను ప్రోత్సహించకపోగా దాన్ని ‘సంక్షేమం’ అంటూ తప్పుపట్టడం ఏమిటి?   

మ్యాప్ ఉన్నది

ఇటీవల విజయవాడలో ‘సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ’ నిర్వహించిన- ‘గుడ్ గవర్నెన్స్ అమలుకు ఎదురవుతున్న సవాళ్లు’ సదస్సులో ప్రొ. ఎస్. మహేంద్ర దేవ్ పాల్గొన్నారు. అందులో ఆయన మాట్లాడుతూ- “అభివృద్ధి జరిగినప్పుడే సంక్షేమం సాధ్యమవుతుంది. దానికి భిన్నంగా కేవలం ఎన్నికల్లో ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ఉచిత పధకాలు పంపిణీ చేయడం తప్పు. అది ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీస్తుంది” అన్నారు. “డైరక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయడాన్ని బ్రెజిల్ ముందుగా నిషేధించిదని ఇప్పుడు ఏ దేశం దాన్ని అనుసరించడం లేదని అన్నారు” 

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రొ. ఎస్. మహేంద్ర దేవ్ నిజానికి ఆయన ఇంతకంటే గౌరవప్రదమైన రీతిలో ఏనాడో మన ప్రభుత్వ అతిధిగా తాడేపల్లిలో ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్దికి ఒక ‘బ్లూ ప్రింట్’ ఇచ్చే స్థాయి ఉన్న వ్యక్తి. డా. వై.ఎస్.ఆర్. మహేద్ర దేవ్ ను 2008లో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖలోని- ‘కమీషన్ ఫర్ ఎగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్’ చైర్మన్ గా మన రాష్ట్రం నుంచి ప్రతిపాదించారు. అ పోస్టులో రెండు ఏళ్ళు ఈయన పనిచేసారు. అప్పట్లో నేను ‘సాక్షి’ పత్రికలో వారంవారం రాసిన ‘బ్లాక్ అండ్ వైట్’ కాలమ్ లో మహేద్ర దేవ్ గురించి ఒక వారం- ‘అతడి వెనుక ఒక మ్యాప్ ఉంది’ అంటూ రాసాను.

ఎందుకంటే, 2000 తర్వాత రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయాన్ని గాడిన పడేయడానికి 2004లో ముఖ్యమంత్రి అయిన వైఎస్సార్ అప్పట్లో జే.ఎన్.యూ. ఎకనామిక్స్ ప్రొఫెసర్ జయతీ ఘోష్ ను మన ప్రభుత్వానికి ఒక ‘రోడ్ మ్యాప్’ ఇవ్వమని కోరారు. ఆ కాలంలో ఆయన ‘స్టేట్ క్రాఫ్ట్’ అంత ‘ప్రొఫెషనల్’గా ఉండేది. అందుకే ‘మ్యాప్ ఉన్నది’ అని రాసింది.  

పనేముంది?

అయినా ప్రాంతీయ పార్టీల రాజకీయాలతో ‘అకడమీషియన్ల’కు పనేముంది? ఈ ప్రాంతానికి చెందిన ఒక అర్దికవేత్తగా ప్రొ. మహేంద్ర దేవ్ విభజనతో విపత్తులో చిక్కుకున్న రాష్ట్రానికి తన విధ్వత్తుతో తోడ్పాటు ఎందుకు అందించరు? గత పదేళ్ళు రాష్ట్రానికి ‘సివిల్ సొసైటీ’ పక్షంగా ఒక ‘రోడ్ మ్యాప్’ అవసరమైన కాలంలో ఎక్కడ కనిపించకుండా, ఎన్నికల ముందు జరిగే ఇలాంటి ‘సెమి పొలిటికల్’ వేదికలపై కనిపిస్తే ప్రజలు ఏమనుకుంటారో ఆ మాత్రం మీకు తెలియదా?

విషయం చాలా ‘సింపుల్’. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎన్ని ప్రభుత్వ శాఖలు ఉన్నాయో ఇప్పుడు కూడా అన్నీ వున్నాయి. ఏటా అవి పెరిగిన బడ్జెట్ తో పనిచేస్తున్నాయి. ఒకప్పుడు ‘అభివృద్ధి’ని అమలు చేసిన శాఖలను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూసివేసింది ఏమీ లేదు. నిజానికి ‘ఏపి మారిటైం బోర్డ్’, ‘ఏపి ఫుడ్ ప్రోసెసింగ్ సొసైటీ’ వంటివి మునుపటికంటే సమర్ధవంతంగా పనిచేస్తూ గడచిన ఐదేళ్లలోనే ఫలితాలను చూపించాయి.

ఇక సంక్షేమ శాఖల విషయానికొస్తే, అన్ని సంక్షేమ శాఖల నిధులు ‘సంక్షేమ పధకాల ఖాతా’ లోకి మళ్ళించి అర్హులు అందరికీ ఒకే మొత్తం ఒకే రోజు నేరుగా లబ్దిదారుకు అందే విధంగా వాటికి మార్పు చేసారు. దాంతో అవి ‘ఫోకస్ద్’గా కనిపిస్తున్నవి. కనుక- ‘అభివృద్ధి’ని నిర్లక్ష్యం చేసి, కొత్తగా ఈ ప్రభుత్వం ‘సంక్షేమం’ అంటూ తలకేత్తుకున్నది ఏమీ లేదు. పాతవి మూసింది ఎన్ని? కొత్తగా తెరిచింది ఎన్ని? అంటే- ఏమీ లేవు.

రచయిత: అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత             

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

1 COMMENT

  1. Amara ati lo bldgs vunnappatiki ie.Real estatecapital e
    so no doubt Abhivruddi Vicadrikana Jaragalsinde

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles