Friday, June 9, 2023

‘దావోస్’లో ఈ రోజు మనం ఎందుకున్నామంటే…

జాన్ సన్ చోరగుడి

ఈ ఆదివారం దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ అధ్యక్షుడు లావూస్ శ్వాబ్ – ఏ.పి. ముఖ్యమంత్రి జగన్ మధ్య జరుగుతున్న- ‘ఫోరం మెంబర్ షిప్’ ఒప్పందానికి దాదాపు ఇరవై ఏళ్ల నేపధ్యం వుంది.

దావోస్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి

ర్ధిక సంస్కరణల అమలుతో ప్రపంచ బ్యాంక్, ‘యునిసెఫ్’ వంటి అంతర్జాతీయ సంస్థల జోక్యంతో గడచిన మూడు దశాబ్దాల్లో (1991-2021) మన కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల- ‘పబ్లిక్ పాలసీ’ల్లో మార్పులు సర్వసాధారణం అయింది. ఆ సంస్థలు నుంచి అందే ఆర్ధిక సహకారంతో పాటుగా, వాటి అమలు మార్గదర్శకాలు కూడా ఇప్పుడు అక్కణ్ణించే మనకు అందుతున్నాయి. దాంతో- ఇక్కడి రాజకీయ పార్టీల- ‘పొలిటికల్ ఫిలాసఫీ’లో-‘సరళీకరణ’ తప్పనిసరి అయింది.

Also read: కొత్త సామాజిక శ్రేణులకు ఊతంగా ఆంధ్రప్రదేశ్

ఆధిపత్య రాజకీయ ధోరణులు అర్థం కావాలంటే…

అయితే, మారిన ఈ ధోరణికి దారితీసిన పరిస్థితుల పరిణామాల క్రమంలో- ఒక నిరంతరత (‘కంటిన్యుటి’) ఉందన్న సత్యం మనకు తెలియాలి. లేకుంటే, మరో పదేళ్ళ తర్వాత- సామాజిక శాస్త్రాల అధ్యయన అనుభవంతో, ఆర్ధిక సంస్కరణల కాలాన్ని చూసిన తరం మన మధ్య ఉండదు. కొత్తగా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో తొలి దశాబ్దిలోనే, ఇప్పుడు మనం చూస్తున్న పరస్పర వైరుధ్య శిబిరాలుగా మారిన ఆధిపత్య రాజకీయ నాయకత్వాల ధోరణులు, వాటి వెనక ఉన్న లక్ష్యాల మర్మాలు- అప్పుడు మనకు అర్ధం కావు.

స్టిట్జర్లండ్ లోని తెలుగువారితో తెలంగాణ మంత్రి తారకరామారావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

అస్సలు మొదటినుంచి ఈ సమస్య అంతా మనం దీన్ని- ‘ఐదేళ్ళ చట్రం’లో చూడ్డానికి అలవాటుపడడం వల్ల వచ్చింది. మన- ‘మీడియా’ ప్రజల్ని ఆ స్థాయికి కుదించింది, అందుకోసం దాన్ని వినియోగించుకుంటున్న ఆధిపత్య వర్గాలకు- ‘అర్ధజ్ఞాన’ (అరకొర జ్ఞాన) సమాజం కావాలి! కనీసం వామపక్షాల నాయకత్వాలు అయినా, సందర్భం వచ్చినప్పుడు అయినా ఈ ధోరణి ఒక రుగ్మతగా గుర్తించి, ఆర్ధిక సంస్కరణల కాలచారిత్రిక పరిణామాలు గురించి ఎక్కడా మాట్లాడ్డం లేదు. అందువల్ల- నిర్మాణ దశలో ఉన్న కొత్త రాష్ట్ర ప్రయోజనాలు దృష్ట్యా, ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి అర్ధం కావడానికి, గడచిన మూడు దశాబ్దాల్లో ప్రభుత్వాల్లో ఇక్కడ జరిగింది ఏమిటి? అని కొంతమేర అయినా వెనక్కి చూడ్డం అవసరం.

Also read: కల్లోల సమయాల్లో..సాంత్వనగీతం-‘ఎబైడ్ విత్ మీ’

తగ్గిన సమాచార దూరం

ప్రపంచీకరణ మొదలయ్యాక, ఇక్కడి ‘పౌరపాలన’లోకి అంతర్జాతీయ సంస్థల జోక్యం చొచ్చుకొచ్చిన కాలంలో జరిగిన కీలకమైన పరిణామం, పరిపాలనలోకి- ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ ప్రవేశం. ప్రభుత్వ కార్యాలయాల ‘కంప్యూటర్ల’కు కొత్తగా- ‘ఇంటర్ నెట్’ అందుబాటులోకి వచ్చింది. దాంతో 2003 నాటికి రాష్ట్ర రాజధానిలోని సెక్రటేరియట్ – జిల్లా కలెక్టర్ కార్యాలయాలు మధ్య నేరుగా- ‘వీడియో కాన్ఫరెన్స్’ సౌకర్యం వచ్చింది. హైదరాబాద్ నుంచి సి.ఎం., మంత్రులు, సి.ఎస్., శాఖాధికారులు, కార్యదర్శులు, కలెక్టర్ ఆఫీస్ లో జిల్లా అధికారులతో ఒకరిని ఒకరు చూస్తూ మాట్లాడేవారు.

Also read: మూడవ ఏట అయినా అక్కడ దృష్టి మారుతుందా?

‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ అధ్యక్షుడు లావూస్ శ్వాబ్

కాలక్రమంలో జరిగిన ‘టెలికమ్యునికేషన్’ సేవల విస్తరణతో, జిల్లా కలెక్టర్ ఒకేసారి జిల్లాలోని అందరు (సుమారు 40-50) మండల అధికారులతో వారానికి రెండుసార్లు- ‘టెలికాన్ఫరెన్స్’ ద్వారా, ఆ వారంలో రాజధాని నుంచి తనకు అందిన ఆదేశాలను చెబుతుంటే, మండల అధికారులు, ఆయా మండలం పరిధిలోని రెవెన్యూ, పంచాయతీ అధికారులు, వాటిని ‘నోట్’ చేసుకుంటూ, తిరిగి క్షేత్రస్థాయి సమస్యలు వాళ్ళు కలెక్టర్లకు చెప్పేవారు. ఇదొక గణనీయమైన పరిపాలనా పరమైన- మార్పు. అలా రాష్ట్ర రాజధాని – గ్రామ పంచాయతీల మధ్య- ‘సమాచార దూరం’ తగ్గింది. జిల్లా కేంద్రంలో జరిగే కలెక్టర్ మీటింగ్ కు పాత జీపుల్లో 70-80 కి.మీ. దూరం నుంచి వెళ్ళే శ్రమ మండలాల్లో ఉండే ఎం.ఆర్వో.లకు, ఎం.పి,డి.వోలకు తగ్గింది.

Also read: రాష్ట్ర విభజన నేపథ్యంలో… వొక దార్శనిక దృష్టిలో నుండి విజయవాడ

విస్మరణకు గురైన అంశాలు

అయితే, ఈ పరిణామాల మధ్య మనం మన దృష్టిని కేంద్రీకరించవలసిన అంశం, బాహాటంగా బయటకు కనిపించకుండా లోపలి లోతుల్లో ఇక్కడే ఎక్కడో అంతర్లీనంగా ఒదిగి ఉంది. మనవంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో- ‘ప్రపంచీకరణ’ కాలంలో విస్మరణకు గురయ్యేది ఏమిటో, అంతర్జాతీయ సంస్థలకు ముందుగానే తెలుసు. అందుకే, ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ అధ్యక్షుడు లావూస్ శ్వాబ్ 10 ఫిబ్రవరి 2004 న హైదరాబాద్ లో జరిగిన సి.ఐ.ఐ. సదస్సులో నేరుగా మనల్ని హెచ్చరించాడు.

ఆయన ఆ సదస్సులో లావూస్ శ్వాబ్ – “ప్రపంచం ముందున్న ప్రధానమైన సమస్య పేదరిక నిర్మూలన. ఇది సమాజాన్ని నిరంతరం విభజిస్తునే ఉంటుంది. సమాజంలో ప్రతి ఒక్కరికీ వికాసం పొందే అవకాశం కల్పిస్తే తప్ప, మనకు ఎంతమాత్రం భద్రత ఉండదు” అన్నారు.

‘టెక్నాలజీ’ విస్తరణ జరిగిన రాష్ట్రాల్లో మనం ముందు ఉన్నామని చెప్పుకున్నాం. కానీ, మనం అనుమతించిన సాంకేతికత- ‘ఎర్త్ వైర్’లోకి ప్రవహించే విద్యుత్తు మాదిరిగా క్రిందికి చివరికంటా ఇప్పటికే చేరిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని- ‘రివర్స్’ చేసి, జనం  అవగాహనా స్థాయిని ఏనాడో 80’ల నాటి ‘వయోజనవిద్యా పధకం’ స్థాయికి కుదించి, మళ్ళీ వాళ్ళను ‘అర్ధజ్ఞాన’ (అరకొర జ్ఞాన) సమాజం చేయాలి అనుకుంటే, అది ఎలా సాధ్యం అవుతుంది? ‘కాలం’తో పాటుగా అన్ని ఆర్ధిక, సామాజిక శ్రేణులు ప్రవాహంలో మనతోనే ఉంటారు, అనేది ఒప్పుకుని తీరాల్సిన సత్యం.

Also read: ఆచార్య ఏ.బి.మాసిలామణి పేరుతో పోస్టల్ కవర్, నవంబర్ 30 న విశాఖపట్టణంలో….

సోషల్ ఇంజనీరింగ్

మన వంటి సమాజం సరళీకరణ చెందే క్రమంలో- ‘రాజ్యం’ లక్ష్యాలను ప్రజలు వద్దకు తీసుకువెళ్ళడానికి ప్రభుత్వాలు రెండు రకాల- ‘కేబుల్స్’ వేయాలి. మొదటి రకం- ఇరవై ఏళ్ల క్రితం రోడ్ మార్జిన్లు తవ్వి, రాష్ట్రమంతా వేసిన- ‘వైర్ కేబుల్స్’. రెండవ రకం- ‘సోషల్ ఇంజినీరింగ్’ పేరుతో అన్ని కులాల అభివృద్దికి- ‘డెవలప్మెంట్ కార్పోరేషన్స్’ పేరుతో ఇప్పటి ప్రభుత్వం వేసిన పైప్ లైన్. అయితే వీటి ద్వారా అందే ప్రయోజనాలు చివరికంటా ప్రవహించడానికి ఇంకా సమయం పడుతుంది. అదొక నిరంతర అభివృద్ధి ప్రక్రియ. అయితే, ఈ రెండింటిలో ఏ అభివృద్ధి నమూనాతో ప్రజలు ‘కనెక్ట్’ అవుతున్నారు అనేది- 2004లో ఉమ్మడి రాష్ట్రం ఇప్పటికే చూసింది. ఆ తర్వాత ఎన్నో మార్పుల మధ్య రాష్ట్ర విభజన జరిగింది. ఇరవై ఏళ్ల తర్వాత మరోసారి అదే పాత దృశ్యం మళ్ళీ ఇప్పుడు పునరావృతం అవుతున్నది.

అభివృద్ధి ప్రణాళికలు వెల్లడించడానికి వేదిక

‘కరోనా’ కాలంలో- ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ సాధన దిశలో గడచిన మూడేళ్ళ ‘సంక్షేమ’ పరిపాలన తర్వాత, అభివృద్ధి దిశలో తన ప్రణాళికలు ఎటువంటివో చెప్పడానికి ఏ.పి. ప్రభుత్వం- ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ వేదికను ఎంచుకుంది. ఆదివారం ఉదయం- ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ అధ్యక్షుడు లావూస్ శ్వాబ్ సమక్షంలో- ‘ఫోరం పార్టనర్’ గా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జన్మోహన్ రెడ్డి సంతకం చేయడం ద్వారా ‘అభివృద్ధి’ దిశలో రాష్ట్రం తదుపరి దశ లక్ష్యంగా కదులుతున్నదని అర్ధమవుతున్నది.

Also read: సమఉజ్జీ ప్రతిపక్షం అవసరతలో… ఏ.పి. ప్రభుత్వం!

(రచయిత: అభివృద్ది -సామాజిక అంశాల వ్యాఖ్యాత)

Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles