Tuesday, September 17, 2024

భద్రతామండలిలో భారత్ కు స్థానం దక్కేనా?

  • ఎంతోకాలం నుంచి సాగుతున్న ప్రయత్నాలు
  • అమెరికా, రష్యా మద్దతు

ఐక్య రాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాలన్నది మనం ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్. అది ఇంకా ఫలవంతం కాలేదు. అంతర్జాతీయంగా మన పరపతి పెరగడానికి ఇది కూడా అవసరం. ప్రస్తుతం భద్రతామండలో శాశ్వత సభ్యత్వం ఉన్న అన్ని దేశాలు ( చైనా తప్ప) మన పట్ల గౌరవ భావంతో ఉన్నాయి. అనేక వివిధ అంతర్జాతీయ సమాజాల్లోనూ వాటిల్లోని కొన్ని దేశాలతో పాటు మనం కూడా సభ్యులుగా ఉన్నాం. ఇటీవల కొంతకాలం నుంచి అమెరికా మనకు ప్రముఖంగా మద్దతు ఇస్తోంది. తాజాగా జరిగిన ఐ రా స సర్వ సభ్య సమావేశంలో మన అంశం చర్చలోకి వచ్చింది. భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాలని రష్యా గట్టిగా వాదించింది. తన సంపూర్ణమైన మద్దతును ప్రకటించింది. సరే మనతో పాటు బ్రెజిల్ కు కూడా ఉండాలని సూచించింది. ఆ సంగతి పక్కనుంచుదాం. మన వరకూ వస్తే, శాశ్వత సభ్యత్వానికి మనకు అన్ని అర్హతలు పరిపూర్ణంగా ఉన్నాయి.

Also read: మన రాజనీతి, యుద్ధనీతి మనవి

ప్రస్తుతం తాత్కాలిక హోదానే

ప్రపంచంలో మూడో ఆర్ధిక సామ్రాజ్యంగా భారత్ అవతరించే కాలం కూడా త్వరలోనే ఆసన్నం కానుందని అంతర్జాతీయ ఆర్ధిక నిపుణులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బహుశా రెండు దశాబ్దాలు పట్టవచ్చు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తే, కాలం కలిసి వస్తే ఇంకా ముందుగానే ఆ స్థాయికి మనం చేరుకోవచ్చు. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలిలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆఫ్రికా, లాటిన్ అమెరికాతో పాటు ఆసియా దేశాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడం ఎంతో ముఖ్యం. మండలిలో తీసుకురావాల్సిన అత్యవసర మార్పులలో భారత్ కు శాశ్వత సభ్యత్వాన్ని కలిగించడం ముఖ్యమని రష్యా కూడా అంటోంది. గతంలో చైనాకు శాశ్వత సభ్యత్వం రావడంలో అప్పటి మన ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు పాత్ర ప్రధానమైంది. ఆసియా నుంచి ఒకరికే అవకాశం వున్న ఆ కాలంలో మన కంటే పెద్దగా ఉన్న చైనాకు ఆ స్థానం కల్పించడం సముచితమని నెహ్రూ భావించారు. హిందీ – చీనీ భాయీ భాయీ అంటూ కొంతకాలం చెట్టాపట్టాలేసుకొని తిరిగాం. తర్వాత బద్ధశత్రువులుగా మారిపోయాం. మధ్య మధ్య కొంత స్నేహం నడుస్తున్నా అనేక అంశాల్లో ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాం. జిన్ పింగ్ వచ్చిన తర్వాత శృతి మించిపోయింది. అతనిలోని సామ్రాజ్య విస్తరణ కాంక్ష, సహజమైన నియంతృత్వ పోకళ్ళను ప్రపంచం చూస్తూనే ఉంది. ఆయన నాయకత్వంపై ప్రస్తుతం చైనాలో ఏదో గందరగోళం నడుస్తోంది. అందులో ఇంకా స్పష్టత రావాల్సివుంది. జిన్ పింగ్ పదవి ఉంటుందా? ఊడుతుందా? ఇంకా తేలాల్సివుంది. జిన్ పింగ్ ఉన్నా, వేర ఎవరైనా ఆ పదవిలోకి వచ్చినా భద్రతామండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు పలుకుతారని విశ్వసించలేం. పైపెచ్చు మనకు వ్యతిరేకంగా ఓటు వేసి చెడగొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం మనం తాత్కాలిక శాశ్వత సభ్య దేశంగా ఉన్నాం. దీని కాలం రెండేళ్లు మాత్రమే ఉంటుంది. ప్రతి రెండేళ్లకొకసారి ఐ రా స సర్వప్రతినిధి సభ ఎన్నుకుంటుంది. ఇదీ ఆచారం. మన దేశానికి ఈ డిసెంబర్ తో గడువు ముగుస్తుంది. ఈలోపు శాశ్వత సభ్యత్వం ఇస్తే అద్భుతం!

Also read: రక్తపోటు నియంత్రణలో భారత్ మేటి!

చైనాతోనే పేచీ

ఐరాస  సర్వ ప్రతినిధి సభలో 190కి పైగా దేశాలు ఉన్నాయి. పెద్దదేశమైన చైనాతో పాటు ఓ 7-8 దేశాలు మాత్రమే మనకు మద్దతు ఇవ్వడం లేదు. మిగిలిన అన్ని దేశాలు మన వైపే ఉన్నాయి. ఇదీ భారత్ తన వ్యక్తిత్వం ద్వారా సాధించుకున్న ఘనత. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైన ఐక్యరాజ్యసమితిలో ఆరు ప్రధాన అంగాలు /సంస్థలు ఉంటాయి. అందులో భద్రతా మండలి కీలకమైంది. అంతర్జాతీయంగా శాంతి, భద్రతల పర్యవేక్షణలో దీని పాత్ర ప్రధానమైంది. శాంతికి భంగం కలిగే పరిస్థితులు వచ్చినప్పుడు అత్యవసర ప్రాతిపదికన చర్యలు తీసుకొనే హక్కులు ఉంటాయి. ప్రతి ఖండం నుంచీ శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీనికి పొరుగు దేశాలే పొగపెడుతున్నాయి. మనకు పెద్దఎత్తున పొగపెడుతున్న దేశం చైనా అని లోకం మొత్తానికి తెలుసు. భద్రతా మండలిలో సంస్కరణలు రావాలనే వాదన ఇరవై ఏళ్ళ పై నుంచే వినపడుతోంది. కానీ కార్యరూపం దాల్చడం లేదు. ఈసారైనా ఆచరణకు నోచుకోవాలని కోరుకుందాం. శాశ్వత సభ్యత్వం వల్ల అనేక అధికారాలు లభిస్తాయి. అందుకే ఈ కాలయాపన జరుగుతోంది. అందులో ఆర్ధిక, రాజకీయ, అధికార స్వార్థం, శత్రుత్వ భావన, పోటీ తత్త్వం ప్రధానమైనవి.వివాదాలపై విచారణ, ఆయుధాల నియంత్రణ, ఆర్ధిక ఆంక్షలు, అతిక్రమణలకు పాల్పడే దేశాలపై సైనిక చర్య ఇటువంటి ఎన్నో అధికారాలు ఉన్నాయి. అయితే, ఒక్క శాశ్వత సభ్య దేశం వీటోతో అడ్డుకున్నా ఈ చర్యలన్నీ ఆగిపోయే అవకాశం కూడా ఉంది. ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నప్పటికీ కేవలం ఐదు శాశ్వత సభ్య దేశాలే పెత్తనం వహిస్తున్నాయనే విమర్శలు కూడా ప్రధానంగా ఉన్నాయి. శాశ్వత సభ్యత్వం వైపు మనతో పాటు పాకిస్థాన్ కూడా పోటీ పడుతోంది. భిన్న ధ్రువాలుగా విడిపోయిన ప్రస్తుత ప్రపంచంలో భారతదేశ పాత్ర చాలా కీలకమైంది. ఐక్యరాజ్యసమితిలో మన స్థాయి పెరగాలని బలంగా కోరుకుందాం. ప్రపంచంలో మన పరపతి, గతి మరింత పెరగాలని అభిలషిద్దాం.

Also read: కండగలిగిన కవిరాయడు గురజాడ

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles