Friday, April 19, 2024

రక్తపోటు నియంత్రణలో భారత్ మేటి!

  • తరచు వైద్య పరీక్షలు అనివార్యం
  • రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే అసలుకే ముప్పు

అవును! రక్తపోటు (బ్లడ్ ప్రెషర్ /బీపీ) నియంత్రణ, నివారణకు చేస్తున్న విశేష కృషికి భారతదేశం ఈ సంవత్సరం ప్రత్యేక పురస్కారాన్ని గెలుచుకుంది. ఐక్య రాజ్య సమితి నుంచి ఈ అవార్డును భారత్ సాధించుకుంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద చేపట్టిన ‘భారత రక్తపోటు నియంత్రణ కార్యక్రమం’ (ఐ హెచ్ సీ ఐ) ద్వారా ప్రాథమిక ఆరోగ్య సేవల వ్యవస్థలో అందిస్తున్న సేవలకు వచ్చిన గుర్తింపు ఇది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న వేళ, రక్తపోటు తీరు తెన్నులను ఓ మారు విహంగవీక్షణం చేద్దాం. ‘ఆయుష్మాన్ భారత్’ నినాదంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతున్న వేళ దేశ ఆరోగ్య పరిస్థితిని, ముఖ్యంగా అవార్డు దక్కించుకున్న వేళ ‘రక్తపోటు’ పై సమీక్ష చేసుకొని మరింత శక్తివంతంగా ముందుకు కదలాల్సిన అవసరం జాతి ముందు, ప్రభుత్వాల ముందు ఉంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం

నలుగురిలో ఒకరికి రక్తపోటు

భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి రక్తపోటు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ యా స్థాయిలలో కొంత వ్యత్యాసం ఉన్నా, రక్తపోటు బారిన పడుతున్న వారి  సంఖ్య పెరుగుతూ ఉండడం క్షేమదాయకం కాదు. వయసు, వాళ్ళు పనిచేస్తున్న రంగాలతో కూడా సంబంధం లేకుండా రక్తపోటుకు గురికావడం ఆలోచనలను రేకెత్తిస్తోంది. నగరవాసులే కాక పల్లెలకు, పిల్లలకు కూడా పాకడం ఇంకా ఆందోళనకరం. వీటన్నిటిని ‘జీవనశైలి’ ( లైఫ్ స్టైల్ ) ఖాతాలోకి వేస్తున్నారు. ఆలోచనా విధానం, ఆహారం, నిద్ర, విశ్రాంతి, పనివేళలు మొదలైన వాటిల్లో ప్రబలుతున్న క్రమశిక్షణా రాహిత్యం, తగినంత వ్యాయామం లేకపోవడం, శరీరాన్ని ఎక్కువ సుఖపెట్టడం వంటివన్నీ కొంపముంచుతున్నాయి. రక్తపోటు వ్యాధి కాదు. జీవవ్యవస్థలో క్రమం తప్పడం ( డిజ్ ఆర్డర్ )గా వైద్యులు చెబుతారు. రక్తపోటు శృతి మించినా, తగ్గినా ప్రమాదమే. రక్తపోటు వున్న చాలా మందిలో ఆ లక్షణాలు కనిపించవు. శరీరానికి ఎంతోకొంత హాని జరిగిన తర్వాత కానీ ఎంతో కొంత అర్థమవదు. ఒక్కొక్కసారి ఆ అవకాశం ఉండదు. ఉన్నపళంగా కుప్పకూలిపోయి మరణించే సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. అందుకే దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. ఒక వయస్సును చేరుకున్నప్పటి నుంచీ తరచూ వైద్య పరీక్షలు చేయించుకోమని నిపుణులు పదే పదే సూచిస్తున్నారు. రక్తపోటు అదుపులో లేకపోతే గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు కూడా ముసురుకుంటాయి. రక్తపోటు పెరుగుదల, తరుగుదల వ్యత్యాసాలలో మనసు పాత్ర కూడా కీలకం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూ హెచ్ ఓ ) కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో 120/80 ఉండడం ఆరోగ్యవంతుల లక్షణంగా చెబుతోంది. ఎగువ సంఖ్య సిస్టాలిక్ – దిగువ సంఖ్య డయాస్టోలిక్ అన్నవి వైద్యశాస్త్ర పరిభాష. వీటి కంటే ఎక్కువ తక్కువలు ఉంటే, దానిని రక్తపోటుగా భావిస్తున్నారు. ఈ సంఖ్యలపై ఇంకా పెద్ద చర్చ జరుగుతోంది, పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.

పరిశోధనపై దృష్టి సారించాలి

ఈ అంశాలను అటుంచగా… రక్తపోటుపై వ్యక్తిగతంగా ఎవరికి వారే శ్రద్ధ పెట్టాలి. వైద్య విద్య,సేవలు, ఔషధాలు,పరిశోధనలు మొదలైన వాటిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, కుటుంబ సంక్షేమ విభాగం, ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసర్చ్, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తవ్వాల్సిన తరుణంలోనే మనం ఉన్నాం. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ ఇందులో కీలకం. ‘నేషనల్ హెల్త్ మిషన్’ మరింత చురుకుగా సాగాల్సి ఉంది. ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యం. వైద్యసేవలను అందుబాటులో ఉంచడం మరింత ముఖ్యం. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వసతులు, సేవలు, నైపుణ్యంలో మెరుగుదల సాధిస్తూ ప్రజలకు విశ్వాసం కల్పించడం చాలా ముఖ్యం. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీని అరికట్టడం, చట్టాలను కఠినంగా అమలుపరచడం అంతే ముఖ్యం. ఆరోగ్యకరమైన వాతావరాణాన్ని ప్రజలకు కల్పించడం, అన్ని రకాల కాలుష్యాన్ని అరికట్టడం మరెంతో ముఖ్యం. వైద్య సేవల విభాగానికి సంబంధించి వికేంద్రీకరణ కూడా ముఖ్యం. పల్లెలు, చిన్న చిన్న పట్టణాలతో పాటు మన్యసీమల్లోనూ వైద్య సేవా వ్యవస్థలు, అవగాహనా సదస్సులను మరింత శక్తివంతంగా మల్చాలి. రక్తపోటును తగ్గించే క్రమంలో సరికొత్త వైద్య విధానాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త విధానాలను రూపొందించారు. రక్తపోటును పెంచే కిడ్నీల నుంచి మెదడుకు సంకేతాలు పంపకుండా మధ్యలో ఉన్న నరాలను నిర్వీర్యం చేస్తూ రక్తపోటును నియంత్రించే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ విధానం వల్ల మూడేళ్ళ పాటు రక్తపోటు అదుపులో ఉందని అక్కడి శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలా అనేక చోట్ల పరిశోధనలు పరిపరి విధంగా సాగుతున్నాయి. శరీరాన్ని, మనసును అదుపులో ఉంచుకుంటే అన్ని రోగాలు అదుపులో ఉంటాయి. మన భారతీయ జీవన విధానం, యోగ సాధన,ధ్యానం,కళలను అర్థం చేసుకొని, ఆస్వాదిస్తూ, సాధన కొనసాగిస్తే రక్తపోటు నియంత్రణలో భారతదేశం ప్రపంచంలో ఎప్పటికీ అగ్రగామిగా నిలుస్తుంది. ఈ యజ్ఞంలో స్వయం క్రమశిక్షణే కీలకం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles