Monday, November 28, 2022

ఇతర దేశాలతో పోల్చితే మనం చాలా నయం!

ప్రపంచవ్యాప్తంగా అశాంతి, ఘర్షణ వాతావరణం అలముకున్న  వేళల్లో ప్రపంచానికి భారత్ ఓ ఆశాదీపంగా మారి, విశ్వాసాన్ని, భరోసాన్ని అందిస్తూ వెలుగులు విరజిమ్ముతోందని మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘యువ శివిర్’ వేదిక సాక్షిగా పలికారు. మంచిమాట. మనిషి కూడా ఆశాజీవి. ఆ ఆశావాదమే ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఇన్నేళ్లు నడిపించింది. మనిషిని జంతువు స్థాయి నుంచి మనీషిని (ప్రతిభామూర్తి) చేసింది. కరోనా  కాలం మొదలైనప్పటి నుంచీ ప్రపంచమానవుడిలో నిరాశావాదం నిటారుగా పెరిగింది, ప్రాణభయం ఉక్కిరిబిక్కిరి చేసింది. పెరిగిన ధరలు,తరిగిన ఉద్యోగఉపాధి అవకాశాలు, కుదేలై కుంటి నడకలు నడుస్తున్న అనేక వ్యవస్థలు, సరిహద్దుల్లో అలజడులు, ఉక్రెయిన్ – రష్యా సాక్షిగా ప్రపంచ దేశాల్లో యుద్ధ భయాలు, శ్రీలంక ,పాకిస్థాన్ లో చేతులు దాటిపోయిన

పాలనావ్యవస్థలు, చైనా,ఆఫ్రికా మొదలు కొన్ని దేశాల్లో మళ్ళీ కరోనా చేస్తున్న మరణమృదంగ ధ్వనులు, సమాంతరంగా ఎన్నికల సమర శంఖానాదాలు భారతీయులను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఎడారిలో ఒయాసిస్సు

ఎడారిలో ఒయాసిస్సు లాగా మధ్య మధ్యలో కరోనా కాస్త శాంతించడం వల్ల కొంత ఊపిరి పీల్చుకున్నాం.  ఈ వైరస్ వేరియంట్స్ ప్రభావం నుంచి ఇంకా బయట పడాల్సి ఉంది. ఒకప్పటి సాధారణ స్థితికి రావడానికి చాలా కష్టపడాల్సిఉంది.

ప్రగతి ప్రయాణంలో చాలా మెట్లు ఎక్కాల్సిఉంది. అనేక విషయాల్లో ఆత్మపరీక్షలు చేసుకోవాల్సిఉంది, కాలపరీక్షలో నిలబడాల్సిఉంది. అంతర్జాతీయ స్థాయిలో భారత ఖ్యాతి పెరుగుతోందనే విశ్వాసం మన ప్రధానిలో ఉంది. పురాతన సంప్రదాయాలను  అనుసరిస్తూ నవీన మార్గాలను ఒడిసిపట్టుకుంటూ నవ భారత నిర్మాణానికి మనం ఎంతో కృషి చేస్తున్నామని నరేంద్రమోదీ అంటున్నారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు, ఔషధాలను అందించిన ఘనత మనదేనని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా గుజరాత్ లోని వడోదరలో ఏర్పాటుచేసిన ‘యువ శివిర్’ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొని చేసిన ప్రసంగంలోని ముఖ్య అంశాలు. కాంగ్రెస్ పార్టీ మొన్న ఉదయ్ పూర్ లో ‘ చింతన్ శివిర్’ నిర్వహించి చాలా హడావిడి చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు గుజరాత్ లో నిర్వహించిన ‘యువ్ శివిర్’ బిజెపి నిర్వహించినది కాదు. కరేలీ బాగ్,కుండల్ ధామ్ లలోని శ్రీ స్వామి నారాయణ్ దేవస్థానాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సంస్థలకు నేరుగా బిజెపితో రాజకీయంగా సంబంధం లేకపోయినా, ప్రధాని నరేంద్రమోదీకి ఎంతో ఇష్టమైన సంస్థలుగా గుజరాత్ లో పేరుంది. త్వరలో గుజరాత్  అసెంబ్లీకి ఎన్నికలు కూడా జరగాల్సివుంది. ఈ సారి కూడా గుజరాత్ లో బిజెపికే పట్టాభిషేకం చేయాలనే పట్టుదలలో బిజెపి ఉంది. అది సహజం కూడా. అది ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం కావడంతో పార్టీకి, మోదీకి గెలుపు ప్రతిష్ఠాత్మకం. జమిలి ఎన్నికల దిశగా నిర్ణయం తీసుకున్నా,  షెడ్యూల్ కంటే ముందుగా ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలు ఉన్నా, సార్వత్రిక ఎన్నికలకు కూడా సమయం ఎక్కువలేదని భావించవచ్చు. కరోనా కష్టాల నుంచి ఇంకా బయటపడని దేశ ప్రజలకు తమ పార్టీ పట్ల, పాలన పట్ల, నాయకత్వం పట్ల విశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం కూడా నరేంద్రమోదీకి ఉంది. యువతలో నైరాశ్యం పెరగకుండా భవిత పట్ల నమ్మకాన్ని,ఆశావాదాన్ని ఇనుమడింపజేయాల్సిన ఆవశ్యకత కూడా దేశ ప్రధానికి ఉంది. దేశ ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా చూడాల్సిన అవసరం కూడా పాలకపార్టీకి ఉంది.సామాజిక సేవ, దేశాభివృద్ధిలో యువతను మరింతగా భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. మిగిలిన మతాలవారిలో నమ్మకాన్ని పోగొట్టకుండా, వారి మనోభావాలు దెబ్బతినకుండా చూస్తూ, మెజారిటీ ప్రజలైన హిందువుల సంప్రదాయ, సంస్కృతులను పరిరక్షిస్తూ, సనాతనతకు పెద్దపీట వేస్తూ, భారతీయఆత్మను కాపాడుతూ ముందుకు సాగాల్సిన విధానమే పాలకులకు ఆదర్శనీయం, శ్రేయస్కరం.

ఆశాదీపాలు వెలిగించాలి

ప్రత్యేకమైన ముద్ర కలిగిన  భారతీయ జనతా పార్టీకి ఈ బాధ్యతలను నిర్వర్తించడం  మరింత బాధ్యతాయుతం. నూత్న విద్యా విధానం ద్వారా భారత్ -ప్రపంచ దేశాల మధ్య వారధిని నిర్మించాలని భారత ప్రభుత్వం చూస్తోంది. యోగ మార్గాలు, ఆయుర్వేద వైద్య విధానాల ద్వారా ప్రపంచానికి భారత్ దిక్సూచి కావాలన్నది ప్రధాని ప్రధాన సంకల్పాలలో ముఖ్యమైనవి. చైనా తర్వాత అత్యంత జనాభా కలిగి,  పెద్ద మార్కెట్ స్థావరమైన మన దేశం పట్ల అన్ని పెద్ద దేశాల చూపులు పడుతున్నాయి. ఈ ప్రత్యేకతను అదునుగా చేసుకొని మన మార్కెట్ ను సద్వినియోగం చేసుకోవడం, సొమ్ముచేసుకోవడం చాలా ముఖ్యం. ఇంచుమించుగా చైనా, భారత్ ఒకేసారి ఆధునిక ఆర్ధిక ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. ఈ రేసులో చైనా ఎన్నోరెట్లు వేగంగా ముందుకు దూసుకెళ్ళింది. ఆ దేశంతో పోల్చుకుంటే మనం వెనకబడే ఉన్నాం. ఈ వెనుకబాటుతనాన్ని అమెరికా,రష్యా మొదలు అనేక దేశాలు అవకాశంగా మలుచుకొని మనల్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది జాతి ప్రగతికి గొడ్డలిపెట్టు. చైనా మనల్ని ఎన్నిరకాలుగా ఇబ్బంది పెడుతుందో చూస్తూనే ఉన్నాం. అమెరికా అవకాశవాద ద్వంద్వనీతి అర్ధమవుతూనే ఉంది. యూరప్ దేశాలు కూడా చేసిది లేక మనతో కాస్త మంచిగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.స్వాతంత్ర అనంతర భారతదేశ ప్రస్థానంలో తీపి గురుతులకంటే చేదు జ్ఞాపకాలే ఎక్కువగా ఉన్నాయి. నవ భారత నిర్మాణం గొప్ప ఆశయం. కాదనలేం. కానీ ఆషామాషీ కాదు. అనేక సవాళ్ళు ఉన్నాయి, కొన్ని దేశాల నుంచి అనేక ప్రమాదాలు ఉన్నాయి. అంతర్గత శాంతి సామరస్యాలను కాపాడుకోవడం కూడా ఎంతో అవసరం. మత తత్వ ఉగ్రవాదులు పెట్రేగి పోతున్నారు. అగ్రదేశాల అధికార దాహం, ఆర్ధిక స్వార్ధాలు, నయా సామ్రాజ్య కాంక్షలు భయపెడుతున్నాయి. ఇన్నింటి మధ్య ఆశావాదంతో, ఆచరణశీలంతో ముందుకు వెళ్ళాలి. ప్రపంచ దేశాల సంగతి ఎట్లా ఉన్నా, మన దేశవాసుల్లో ఆశాదీపాలను మరింతగా వెలిగించాలి.

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles