Wednesday, May 1, 2024

శ్రీమద్విరాటపర్వం-2

మహాభారతం

యజమాని నిర్వహణ (boss management)

Induced power అని వింటూ ఉంటాము. అదేమిటంటే కలెక్టర్ గారికంటే ఆయన బిళ్లబంట్రోతు దర్పమెక్కువ చూపిస్తాడు బయటవారిదగ్గర. అంటే అసలు అధికారికంటే వారి సామీప్యంలో పనిచేసే వారే ఎక్కువ అధికారం చలాయిస్తారు. ఈ విషయాన్ని తిక్కన సోమయాజిగారు ఒక చక్కని పద్యంలో చెప్పారు.

వసుమతీశు పాల వసియించు నేనుంగు | తోడ నైన, దోమతోడనైన వైరమగు తెరంగు వలవదు; తానెంత | పూజ్యుడైన జనులపొందు లెస్స.

అంటే రాజు (boss) దగ్గర మెలిగే ఏనుగుతోనైనా, దోమతోనైనా శత్రుత్వం కలిగే ప్రవర్తన వద్దు. నీవు ఎంత పూజనీయుడవైనా కానీ రాచకొలువుకు సంబంధించిన అతి సామాన్యుడితోగూడా  స్నేహము కలిగి ఉండాలి. మన ఉత్సవాలు మనవేడుకలు రాజుకు(boss) కంటగింపు, ఈర్ష్య కలుగకుండా ఉండాలి. ఇంత వివరంగా ధౌమ్యులవారు పాండవులకు చెప్పారు!

ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ధౌమ్యులవారు కూడా రాచకొలువులో పనిచేస్తున్న వ్యక్తే కదా! పాండవులవద్దనే కదా ఆయన ఆశ్రయం పొందినది. మరి ఆయన ఈ విషయాలన్నీ పాటించేటట్లైతే అసలు ఇన్ని విషయాలు చెప్పే సాహసం చేసేవారా? ఈ అనుమానం పాఠకులకు కలుగుతుందనే తిక్కనసోమయాజి చక్కని పద్యంలో మన సందేహం తీర్చారు.
తల్లియుఁ దండ్రియు దైవము | నెల్ల సుహృజ్జనము మీర; యిట్లు గొలిచి వ ర్తిల్లెడు తెఱంగు లెంతయుఁ | దెల్లము సేసితిరి; బ్రతికితిమి మీ కరుణన్‌. తల్లీ, తండ్రీ, స్నేహితులనబడే వారందరూ కూడా మాకు మీరే…. మీరే అని గౌరవంగా పాండవులు సంబోధించారు. చూశారా!

తల్లి కుంతి, పినతండ్రి విదురులవారి తరువాత ధౌమ్యులవారే! అది పురోహితుడిగా ఆయన సంపాదించుకున్న ధనం.

Boss management (పైఅధికారిని ప్రసన్నం చేసుకొనుట)

peer management (తోటివారిలో తలలో నాలుకలాగ ఉండటం)

subordinate management (క్రింది వారితో దయతో మెలగటం)

ఈ మూడూ సరిగ్గా సమతూకం పాటించగలిగేవాడే ఉద్యోగంలో పైకి ఎదుగుతాడు. వీటిని functional intelligence అని అంటారు. సహజసిద్ధమయిన ఎన్ని తెలివితేటలున్నా(Innate natural intelligence) సరిపోదు. ఈ functional intelligence ఉన్నవాడిదే ఏ సంస్థలోనైనా పైచేయ్యి)

ప్రజ్వరిల్లే అగ్నిజ్వాలను కనబడకుండా దాయగలమా?

శత్రుభీకరమయిన ఆకారాలతో, మహాతేజస్సుతో చూడగనే మహాపురుషులు అని తెలుసుకోగలిగిన దివ్యతేజస్సుతో, అద్భుత వర్ఛస్సుతో అలరారే పాండవులకు వారి ఆయుధాలు దాచడమే ఒక పెద్దసమస్య. భూమి మీద ఆ ఆయుధాలు ఎవరి వద్ద ఉంటే వారే పాండవులు అని జనం గుర్తుపట్టేస్తారు. అవి ఎవరికంటా పడకుండా దాయాలి.

`పెనుబాము చందంబున భీషణమై జనంబుల బెదరగొట్టు గాండీవము!` అంత శత్రు భీకరంగా ఉంటుంది అర్జునుడు ధరించిన  ధనుస్సు. జనం సాధారణంగా తిరుగాడని చోటు శ్మశానం, దానిప్రక్కనే ఆకాశాన్ని అంటుతూ ఉన్నట్లుగా జడలువిరబోసుకొని ఒక మహావృక్షరాజమున్నది. ఆ చెట్టును దూరంనంచి చూస్తే ఒక మహాసర్పము, భయంకరంగా బుసలుకొడుతున్నట్లుగా ఉన్నది.

జనమెవ్వరూ దానిదరిదాపులకు పోవటానికికూడా సాహసించరు. అది ఒక జమ్మిచెట్టు. దానిమీద మూటకట్టి తమతమ ఆయుధాలుంచారు పాండవులు.

ధర్మరాజు అయిదుగురికీ… జయుడు, జయంతుడు, విజయుడు, జయత్సేనుడు, జయద్బలుడు అని రహస్యనామాలు పెట్టాడు.

ధర్మరాజు భక్తిపూర్వకంగా దుర్గాదేవిని స్తుతించాడు. మన దుర్గతులను నాశనం చేసేది దుర్గమ్మ. దుర్గే దుర్గతి నాశినీ. అమ్మ ప్రత్యక్షమై, “విరాటనగరంలో మిమ్ములనెవ్వరూ గుర్తించలేరు, అతి శీఘ్రకాలంలో నీవు శత్రువులను జయించి రాజ్యం పొందుతావు’’ అని ధర్మజుడికి వరప్రదానం చేసింది.

ముందుగా అనుకొన్న ప్రకారం ఒకరొకరుగా విరాటనగర ప్రవేశం చేశారు. విరాట నగర వీధులలో అపురూపసౌందర్యరాశి ఒకతె మాసిన బట్టలు ధరించి అన్నవస్త్రాలు ఇస్తే చాలు ఎవరికయినా సేవచేస్తాను అని అడుక్కుంటూ తిరగుతున్నది. ఆమె సౌందర్యాన్ని, తేజస్సునుచూసి ఎవరికీ నమ్మకం కలగటంలేదు.

ఆమే! …పాంచాల రాజపుత్రి, మహాశక్తివంతుడైన దృపదుడి గారాల కూతురు, శత్రువులు తేరిపార చూడలేని మహాతేజో విరాజితులైన పాండవధర్మపత్ని,  రాజసూయ అవబృధస్నాత, యాజ్ఞసేనికృష్ణ. ద్రౌపదీదేవి.

అంతలో ఆవిడని రాజసౌధం మీదనుండి మహారాణి చూసి పిలిచింది. “నీవాలకం, నీసౌందర్యం చూస్తుంటే నిన్ను మామూలు స్త్రీ అని అనుకోబుద్ధికావటంలేదు. ఎవరు నీవని“ అడిగింది.  

అందుకు ఆ స్త్రీ బదులిస్తూ “నేను పాండవ పట్టమహిషి ద్రౌపదీదేవి వద్ద పనిచేసిన సైరంధ్రిని. మీ అంతఃపురంలో పనిచేయడానికి అనుమతించండి` అని చెప్పింది. మహారాణి సుధేష్ణ అందుకు సరేనన్నది. ద్రౌపదీదేవి తన వేషధారణలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నది.

గమనిక: కష్టాలు మనిషికి రాక మ్రానుకొస్తాయా. ‘‘యది సీతాపి దుఃఖార్తః కాలోహి దురతిక్రమః’’ అని మహర్షి వాల్మీకి అంటారు. సీతమ్మకే కష్టం వచ్చిందటే కాలం ఎంత బలవత్తరమైనదని దాని అర్ధం.

“దాసీత్వము ఉట్టిపడేటట్లు చీర కట్టుకొన్నది ద్రౌపదీదేవని“ తిక్కనగారు చెపుతారు! “పెనుమంచు మీదపడ్డ కమలంలాగ వాడిపోయి ఉన్నదట! ధకారికా వేషంబు కతన మూర్తి అని“ అంటాడు తిక్కనగారు. అంటే పూర్తిగా సైరంధ్రీవేషం( Beautician)ధరించిందట!. ఈ రోజుల్లో కూడా చూడండి beauty clinic కి వెడితే beauticians ఒక typical style లో కనపడతారు!…

కూడు, గుడ్డకోసమే కదా పాండవ పట్టమహిషి పనిమనిషిగా చేరినది. చిన్నచిన్న కష్టాలకు క్రుంగిపోయి ప్రాణాలు వదిలేసే కధలెన్నో వింటున్న రోజులివి. భారత, రామాయణాలను పారాయణంచేస్తే మనకు ఒక స్ఫూర్తి వస్తుంది. నిజానికి మనకు వచ్చే కష్డాలు పెద్దలెక్కలోనివికావు అనే భావం మన మనస్సులో చొరబడితే ఒక ప్రశాంతత ఆవరిస్తుంది. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణ పండితులంటారు! A study of classics gives us a sense of serenity! అని…

Also read: శ్రీమద్విరాటపర్వం-1

(సశేషం)

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles