Tuesday, September 10, 2024

బాయ్ కాట్ …?!

అర్థరాత్రి దాటుతోంది. కీచురాళ్ళు సైతం తమ ఆలాపనకు శుభం పలికిన మలిజామువేళ అది. చాలాకాలము నుండి మూడో నంబరు రైల్వే ప్లాట్ ఫారంపై ఆగి ఓ బోగి ఉన్నది.   అది పైన కనిపించే నల్లటి మబ్బుల చీర అంచులో నక్కిన చందమామ కేసి తొంగి చూస్తోంది.  అందరు బాయకట్టు అంటారు నన్ను అన్నది ఓ స్వరం కదలని చీకటిని చీలుస్తూ ఆ బోగిలో నుంచి… ఈ రైలు కట్ట దాటి ఓ ఇరవై మైళ్ళు నడిచెల్లాల నేనుండే గుడిసె కాడికి పోనీకి అన్నది అదే గొంతు. నీకి నిఖా చేసుకుంటా అన్నది మళ్లీ అదే గొంతు. కాసేపు మౌనం తాండవించింది అక్కడ …అప్పటి వరకు ఆ మాటలు విన్న మరో ఆకారం  చీకట్లో భోగి నుండి కిందికి దిగి అక్కడి నుండి కదలి పొబోతుంది. అదే గొంతు నీకి నమ్మకం లేదా నాపై  అంటోంది భోగి దిగి వెళుతున్న ఆకారము కేసి చూస్తూ. వెళుతున్న ఆకారం తాను ముందుకు వేసే అడుగు అపి ఇలా అంది. ‘‘సూడు బాయ్య ఈ సీకటిపై అన ….! ఆ ఎన్నెలమ్మ నిన్ను సూసుకుంటాను సల్లంగా అంటే ఈ సీకటమ్మవొగ్గేస్తాదా సెప్పు!?. నాది ఈ సీకటి బతుకేగాదెటి, మెతుకు మెతుక్కి నా బతుకులో యాతనే. ఆకలికై సీకటి యాతనే’’ అని అంది అదే గొంతు. బోగీలో నుండి ఒక ఆకారం నెమ్మదిగా కదలి వచ్చి నీకి నాది హామీ అని చేతిలో చేయి వేసి పలకింది.

ఒకటో నంబరు ప్లాట్ ఫారంపై రైలు ఆగివుంది. తన నెత్తిపై బేసిన్ లో శెనక్కాయలు బుగ్గాలు పెట్టుకుని జనానికి అమ్మడానికి చూస్తూ ఉన్నది చెంచమ్మ. రైలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది.   రైలు ఎక్కే దిగే   హడావిడిలో ఉన్నారు జనం. ఎవ్వరూ చెంచమ్మ వంక చూడటం లేదు. తన డొక్కలో పేగు పెట్టె ఆకలి అరుపును అణచడానికి  కొళాయిలో నీళ్లు పట్టుకుని తాగింది చెంచమ్మ.. ‘‘బోణి అయ్యిందా చెంచి’’ అని అడిగాడు రైల్వే కూలి శీను. శీను ప్రశ్నకి ‘చీకటి పడితే బోణి అయిపోతాదిలే శీనన్న’ అంటాడు స్టేషన్ లో టి అమ్మే గోపి వెటకారంగా నవ్వుతూ. తన బేసిన్ పై వాలే ఈగల్నితన వోణి కొంగుతో  తోలుకుంటూ చెంచమ్మ శీను వైపు విసుగ్గా చూస్తుంది. రైలు కదిలింది. క్షణాల్లో ప్లాట్ ఫారం  నిర్మానుష్యం అయిపోయింది.

చీకటి పడింది. చెంచమ్మ కండ్లలో నీళ్లుసుడులు తిరుగుతున్నాయి. మారు బేరానికి తెచ్చిన సరుకు  అమ్మగా  మిగిలింది  బేడా.. కాణి.. అని లెక్కించి తన లంగాకు   వేళ్ళాడుతున్న చిత్తిలో వేసుకుంటుంది చెంచమ్మ. చిత్తిలో నుంచి పొగాకు కాడని తీసి నలిపి బుగ్గన పెట్టుకు ని ఓ బల్లపై కూర్చుంటుంది. గోపి గాడి మాటల్ని గుర్తు చేసుకుని  నిరుత్సాహంగా నవ్వుకున్నది తనలో తాను చెంచమ్మ. కాసేపటికి తాను కూర్చున్న బల్లపైననే పడుకుని నిద్రలోకి జారుకున్నది చెంచమ్మ.

ఎవరో పిలిచినట్టుగా చెంచమ్మ ఉలిక్కిపడి లేచింది. చీకట్లో కలిసిపోతు గాబరాగా అడుగులు వేస్తూ పట్టాలు దాటుకుంటూ వెళ్లి ఒక చోట ఆగింది చెంచమ్మ. అక్కడ చీకట్లో ఒక భోగి దగ్గర ఓ నల్లని ఆకారము నిలబడి చేయి ఊపింది చెంచమ్మ కేసి చూస్తూ… తన కేసి ఊపుతున్న చేయితో తన చేయి కలిపి ఆ చీకట్లో… రైళ్ల రాకపోకలు లేని ఆ రైలు కట్టపై తన అడుగులు వేస్తుంది. ఆ చేయి అందించిన భోజనాన్ని ఆరగించింది చెంచమ్మ. ఆలా తెల్లారే దాకా ఆ ఆకారంతో కలసి కబుర్ల పూలను పూయించింది చెంచమ్మ. 

పొద్దున్నే లేచి తన ఇంటి ముందే మంచంపై బిషానా ప్రారంభించింది చెంచమ్మ. ఇస్కూలు కెళ్లే పిల్లలకు పిప్పరమెట్లు అమ్ముతూ ఉండగా ‘‘ఓ చెంచో ఇటురాయె’’ అంటూ మిద్దె గళ్ళ లచ్చి పిలిచింది  చెంచమ్మను. ‘ఎండాకాలం కదా  కాస్త నీళ్లు తెచ్చి పెట్టవే’ అని అడుగింది  చెంచమ్మను లచ్చమ్మ. ‘అట్టాగే అమ్మగోరూ’ అంటూ కడవలతో నీళ్లు మోసి లచ్చమ్మకు సాయం చేసింది చెంచమ్మ. లచ్చమ్మ పెట్టిన చద్దెన్నం తిన్నది.

ఒకనాడు చెంచమ్మ శెనక్కాయలు అమ్ముతూ రైలు దిగుతున్నది. అదే రైలులో ఇంతలో ఒకడు తనను ఎవరో వెనక నుంచి తరుముతున్నట్లు పరుగెత్తుకుంటూ పారిపోతూ ఉన్నాడు. ఆ సమయములో  అతడు అనుకోకుండా చెంచమ్మను గుద్దుతాడు. దీనివల్ల చెంచమ్మ రైలు దిగుతూ తూలి నేలపై పడిపోతుంది. చెంచమ్మ తలకు పెద్ద గాయం అయి రక్తం కారుతుంది. అతడు తిరిగి చూసి చెంచమ్మకు ఐన గాయానికి  తానె కారణమని తలచి  బాధపడతాడు. చెంచమ్మను అతడు హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స చేయిస్తాడు. చెంచమ్మకు చికిత్స చేయిస్తున్నప్పుడు ఆమెకు వెనక ముందు ఎవరూ లేని ఒంటరి అని తెలుసుకుంటాడు అతడు.

నాటి నుంచి  అతను స్టేషనులో కనిపించినప్పుడల్లా పలకరించేవాడు. చెంచమ్మకు అప్పుడప్పుడు తనకు తోచిన బహుమతులనుకూడా  అందించేవాడు. ఒక్కోసారి చెంచమ్మను దూరం నుంచే చూస్తూ తన భవిష్యత్తును తన ఊహలలో కలలు కనసాగాడు.  ఓనాడు చెంచమ్మ స్టేషనులో ఒక బల్లపై కూర్చుని ఉన్నది.. తన  ఎదురుగ్గా ఉన్న ప్లాట్ ఫారంపై  రైలు వచ్చి ఆగి ఉంది. ఎక్కడి నుంచో అతను పరుగెత్తుకుంటూ వచ్చి చెంచమ్మను ఆ రైలు బండి ఎనక్కి చేయి పట్టి తీసుకుని వెళ్లి రైలు బండి ఎనక తానూ రాసినది చూపిస్తాడు చెంచమ్మకు. చెంచమ్మ మౌనంగా అక్కడి నుండి చదవకుండా వెళ్ళిపోతుంది.

చెంచమ్మ ఆలా ఎందుకు వెళ్లిందో అర్థం కాదు అతనికి ఆ క్షణం. ఓ సాయంత్రం తన  మనసులో ఉన్న తన ప్రేమను చెబుతూ ఓ ఉత్తరం రాసి చెంచమ్మకు ఇస్తాడు అతడు. ఉత్తరం తెరచి చూసి తిరిగి ఇచ్చేస్తుంది అతనికే చెంచమ్మ. అతని కేసి చూస్తూ కన్నీళ్లతో నేను చదువుకోలేదు అని చెప్పి వెళ్లిపోతుంది.

కొంత కాలానికి బాయ్ కాట్ చెంచమ్మను నిఖా చేసుకుంటాడు. ‘‘నాకీ మొదటి బేగం జబ్బుచేసి మర్గయితి. అభితక్ నాకి నిఖా ఆలోచించలేదు నీకి చూసే వరకు‘‘ అని చెబుతాడు బాయికాట్ చెంచమ్మతో. ‘‘నా పేరును నేను మరచి పోయి చాన్నాళ్లయింది. అయినా నీకు నిఖా చేసుకున్న నీకి నా బేగం. ఖుబ్ సూరత్‘‘ అంటూ ఆరాత్రి పాటలు పాడుతాడు బాయికాట్ తన గుడిసెలో చెంచమ్మను చూస్తూ. ‘‘అయినా నాది చీకటి పనే నా పేరుతో ఈ దునియాకు పనిలేదులే‘‘ అంటూ చెంచితో కబుర్లు చెబుతాడు తనతో గడిపే ఆ మొదటి వెన్నల రేయి. ‘‘నేను రైళ్లలో దొంగతనాలు చేస్తా .. ఇదిగో నీకి నెక్ లెస్సు‘‘ అంటూ బాయ్ కాట్ చెంచమ్మకు అలంకరిస్తాడు. ఆ రోజు ఇది కొట్టేసి పోతూనే నీకి ప్రేమలో పడిపోయా అని నవ్వుతాడు బాయ్ కాట్ చెంచమ్మతోచెప్పి. 

సాయంత్రం నాలుగు గంటలు పోలీసోళ్ళు తలుపులు బాదుతున్నారు. చెంచమ్మ తన ఇంటి  తలుపులు తెరచింది. లోపలికెళ్ళి పడుకుని ఉన్న బాయ్ కాట్ ని పట్టుకుని లాక్కెళ్లి పొలీసు వాను ఎక్కించారు కానిస్టేబుళ్లు. ‘‘పొలీసు బాయ్య ఒగ్గేయ్యండి ఈ తూలికి ఇంట్లో గింజలు నిండుకున్నాయి. నా ముగ్గురు పిల్లల కడుపు కాల్తాది. ఆకలికి దయ చూపించండని‘‘ అని పోలీసోల్ల కాళ్లావేళ్లా పడింది చెంచమ్మ. ‘‘ఈడి దోపిడీకి జనాలు చస్తున్నారు అక్కడ. అయినా ఇదేమైనా మొదటి పాలే… ఈడీకి నీకు చల్‘‘ అంటూ చెంచమ్మను విదిల్చుకున్నారు కానిస్టేబుళ్లు. ‘‘వ్యానులో నుంచి ఈ సాలె దానికి ఎన్ని మార్లు బొల్కే బాద్  బి బుద్ది లేదు. నేను జైలు నుండి రాని ఫిర్ దేఖేంగే ఉస్కో‘‘ అంటాడు  బాయికాట్. పొలిసువాను అక్కడి నుండి కదిలి వెళ్ళిపోతుంది. 

బాయ్ కాట్ కు అతను చేసిన దోపిడీకి న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష వేస్తుంది. బాయ్ కాటు జైలు శిక్ష ముగించుకుని బయటకు వస్తాడు. తన సావాసగాళ్లు చెంచమ్మచేసే చీకటి పనులను గురించి చెబుతారు బాయ్ కాట్ తో.. బాయ్ కాట్ ఆమాటలు విని బాధ పడతాడు. తన గుడిసెకు వస్తూ దారిలో కల్లు తాగి వస్తాడు బాయ్ కాట్. గుడిసెలో ఉన్న చెంచమ్మను చితకబాదుతాడు బాయ్ కాట్. ‘‘నీ దోస్తులు చెప్పేవి నమ్మొద్దని‘‘ బతిమాలాడుతుంది బాయ్ కాట్ ని చెంచమ్మ. ‘‘నేను దొంగనే కానీ నీకి పై ప్రేమ ఉంది. నాకి నీతి ఉంది‘‘ అంటూ బాయ్ కాట్ రోదించాడు. ‘‘నా పిల్లలకి చుస్కో సరిగ్గా. నీకి ఇలాంటి చీకటి పనులు మానుకో, మానుకోకుంటే లెక్కలు వేరే‘‘ అని బాయ్ కాట్ బెదిరిస్తాడు చెంచమ్మను. 

తన స్థితిని తలచి బాయ్ కాట్ తన ఇద్దరు కూతుళ్ళకు కష్టపడి వాళ్లకు నిఖా చేస్తాడు. తరవాత కొద్దీ కాలానికి ఓ రోజు ఊరి పెద్ద బస్టాండులో తన దోస్తు మస్తానును కలసి బాయ్ కాట్ ఇలా చెబుతాడు. ‘‘నీకి మొత్తం తెలుసు నాగురించి. నేను దొంగనే. నాకి ఏ పని రాదు. చిన్నప్పటి నుండి ఇదే అలవాటైంది. నా మూడో కూతురుకు నీ కొడుకు ఫిరోజ్ తో నిఖా షురూ చేయమని‘‘ ప్రాధేయపడతాడు. మస్తాను ఫిరోజ్ తో  నిఖాకి ఒప్పుకుంటాడు.  బాయ్ కాట్ నిఖా ఖర్చులకోసం మళ్లీ దారి దోపిడీ చేస్తాడు. ప్రమాదవశాత్తు దోపిడీకి గురి అయిన వారులో ఒకరు మరణిస్తాడు. ఆ నేరం కింద న్యాయస్థానం బాయ్ కాట్ కి పద్నాలుగు సంత్సరాలు జైలు శిక్షను విధించింది.

చెంచమ్మ తన బ్రతుకును వెళ్లదీయడానికి పూర్వం తాను చేసే పనులనే మళ్లీ చేసుకుని బ్రతకసాగింది. కొన్ని ఏళ్లకు బాయ్ కాట్ కు శిక్షాకాలం తగ్గించి విడుదల చేసింది న్యాయస్థానం. బాయ్ కాట్  నేరుగా తన గుడిసె దగ్గరకు వచ్చాడు  జైలు నుండి. ఇంట్లో చెంచమ్మ కనబడదు. తన దోస్తు గతంలో తనకు చెప్పిన మాటలు బాయ్ కాట్ కు గుర్తుకు వస్తాయి. బాయ్ కాట్ సారా తెచ్చుకుని తన గుడిసె ముందు అరుగుపై పడుకుని ఉంటాడు. చెంచమ్మ అర్ధరాత్రికి గుడిసెకు వస్తుంది. వాకిట్లో ఉన్న బాయ్ కాట్ ను చూసి చెంచమ్మ పలకరించింది. ‘‘బాయ్యా, ఇదిగో బిర్యానీ తెచ్చా‘‘ అంటూ బాయ్ కాట్ కు తాను తెచ్చిన అన్నాన్ని ఇస్తుంది చెంచమ్మ. బాయ్ కాట్ ఏమి మాట్లాడడు. బాయ్ కాట్ మౌనానికి  చెంచమ్మ భయపడింది.

నెమ్మదిగా గుడిసెలోకెళ్ళి మళ్లీ గుడిసె బయటకు వస్తుంది చెంచమ్మ. గుడిసెలో నుండి తెచ్చిన ఎలుకల మందును చెంచమ్మ బాయ్ కాట్ కు తాను పెట్టిన బిరియానీలో అతడికి తెలియకుండా కలిపింది. తరవాత చెంచమ్మ గుడిసెలోపలకు వెళ్లి తలుపు వేసుకుని పడుకుంటుంది. ఉదయాన్నే బాయ్ కట్టన్నలే అంటూ అరుగుమీద పడుకుని ఉన్న బాయ్ కాట్ ని అతడి దోస్తు వలి పిలుస్తుంటాడు. బాయ్ కాట్ ఎంతకీ లేవకపోవడంతో ‘‘ఓ చెంచక్క అన్న పలకట్లేదు‘‘ అని చెంచమ్మను వలి తలుపు కొట్టి పిలుస్తాడు. చెంచమ్మ వచ్చి ‘‘బాయ్యా అని పిలచి నన్నొగ్గేసినవే… నా బతుకు చీకటి బుగ్గి చేస్తివే‘‘ అని బాయ్ కాట్ శవం పై పడి సోకండాలు పెడుతుంది. ‘‘నా ఆకలికి దిక్కు నువ్వని నమ్మి నీతో అడుగులేస్తి. నిన్ను పోలీసోళ్ళు ఎత్తుకెళ్తే నాది మునుపుటి  చీకటి బతుకాయే. విడుదల ఐన ప్రతి సారి నువ్వు నా వొళ్ళు హూనమయ్యేటట్లు కొడితివి. ప్రతి రేయి నా బతుకులో వచ్చే వారు వెన్నెల కురిపించారు ఒక్క నువ్వు తప్ప. నీ అరాచాకాలకు సమాజం ఏనాడో నిన్ను బాయికాట్ చేసింది. నీ లెక్క ఉండే పెనిమిటిని నేను బాయ్ కాట్ చేస్తా‘‘ అని చెంచమ్మ తన సోకండాల మాటునఎవరికీ కనబడని తన హృదయ ఆక్రోశాన్ని బాయికాటుకు చెబుతుంది.

Radhika Phani Vangara
Radhika Phani Vangara
అమెరికాలో కేటీ నగరంలో నివాసం. వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. గార్డెనింగ్, కథానికలు రాయడం ఇష్టం. రేడియోకోసం ప్రముఖులను ఇంటర్వ్యూలు చేస్తుంటారు. పిల్లలు అంటే ఇష్టం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles