Thursday, November 30, 2023

భారత్-అమెరికా సంబంధాల బాట మార్చిన మోదీ పర్యటన

ఫొటో రైటప్: అమెరికా పర్యటనలో జెల్లీబైడెన్, బైడెన్ లతో మోదీ

ఇదివరకటి భయసందేహాలు లేవు

ఆసియా చైనా ఏకఛద్రాధిపత్యానికి అడ్డుకట్ట

అట్లాగని చైనాతో వైరం పెంచుకునే ఉద్దేశం లేదు

భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన చరిత్రాత్మకమైనది. ఇదివరకు ఎన్నడూ అమెరికా, ఇండియాలు నడవని సరికొత్త మార్గంలో ఈ సారి ఈ రెండు దేశాలూ నడవడం ప్రారంభించాయి. ఏడేళ్ళ కిందట జూన్ మాసంలోనే అమెరికా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించినప్పుడు మోదీ ‘‘అమెరికాతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడానికి ఇండియాకు ఉన్న భయసందేహాలు ఇక ఏ మాత్రం లేవు’’ అని ప్రకటించారు. అప్పటి నుంచి మోదీ ప్రభుత్వం అమెరికాను ప్రముఖ వాణిజ్య భాగస్వామిగా పరిగణించి వ్యాపార లావాదేవీలను విశేషంగా విస్తరించింది. ఇప్పుడు 191 బిలియన్అమెరికా డాలర్ల మేరకు రెండు దేశాల మధ్య వాణిజ్యం జరుగుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో కశ్మీర్ విషయాన్ని ప్రస్తావించకుండా పాకిస్తాన్, చైనాలను అమెరికా అడ్డుకున్నది. 2020లో కోవిద్ మహమ్మారితో ప్రపంచం తలబడిన సమయంలో లద్దాఖ్ లో చైనా సైనికులు దురాక్రమణకు దిగినప్పుడు అమెరికా ఇండియాకు అండగా నిలిచింది.

ఈ పరిణామాలు సానుకూలంగా సంభవించినప్పటికీ భారత్ ఎందుకనో అమెరికాతో సన్నిహిత రక్షణ సంబంధాలు పెట్టుకోవడానికి సుముఖంగా లేదు. రష్యాతోనే అంటకాగాలని భారత నాయకత్వం తలబోసింది. బుష్ దగ్గర నుంచి అమెరికా అధ్యక్షులందరూ భారత్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలని కోరుకున్నవారే. కానీ భారత్ నాయకత్వం సుముఖంగా లేదు. అయితే, ఇప్పుడు రష్యా, చైనా సన్నిహితం కావడంతో, 2017లో ధోక్లాం, 2020లో లద్దాఖ్ లలో చైనా దురాక్రమణకు దిగడంతో భారత అధికార, రాజకీయ ప్రముఖుల వైఖరిలో మార్పు వచ్చింది. ఇప్పుడు మోదీ అమెరికా పర్యటనలో ఈ సందేహాలకు స్వస్తి చెప్పి భారత్ ను ఆసియా రక్షణ వ్యవస్థలో ప్రధాన పాత్రధారిగా తయారు చేసేందుకు ఉద్దేశించిన ఒప్పందాలపైన సంతకాలు చేశారు. సాంకేతిక రంగంలోనూ, రక్షణ రంగంలోనూ రెండు దేశాల మధ్య మునుపెన్నడూ లేని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. యుద్ధంలో ఉపయోగించే జెట్  విమానాల ఇంజన్ల తయారీ నుంచి సెమీకండక్లర్ రంగానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే వరకూ ఒప్పందాలు జరగడం విశేషం. ‘‘భారత్, అమెరికాలు ప్రభాతసంధ్యలో కలసికట్టుగా నిలిచి ఉన్నాయి. ఇది రెండు దేశాలకే కాదు యావత్ ప్రపంచానికే శుభసూచకం’’ అని ప్రధాని మోదీ అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు)ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అన్న మాటలు విలువైనవి. ఆశాజనకమైనవి.

ఇండియా-అమెరికా మైత్రి చైనాకు వ్యతిరేకంగా కాదని తెలుసుకోవాలి. చైనాను కట్టడి చేయడం ఇండియా వల్ల కాదు. ఇండియా కంటే ఆర్థికంగా అయిదు రెట్లు బలోపేతమైన చైనాను ఎదుర్కోవడం ఇండియాకు సాధ్యం కాదు. కానీ ఆసియా భవితవ్యాన్ని చైనా ఒక్కటే నిర్దేశించగలదనే అభిప్రాయాన్ని మార్చడానికి మోదీ అమెరికా పర్యటన ఉపయోగపడుతుంది. ఇండియా రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా భారత సరిహద్దులను చైనా దురాక్రమణ నుంచి  కాపాడటమే కాకుండా ఆసియాలో పరస్పరం గౌరవించే విధంగా వివిధ దేశాల మధ్య సంబంధాలు ఉండాలన్నది మోదీ, బైడెన్ ల ఉద్దేశం. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? ఆసియాలో చైనా ఆధిక్యాన్నిసవాలు చేసే వ్యవస్థ ఏర్పడినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. అందుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ తో కలిసి ఒక కూటమినీ, ఇండో-పెసిఫిక్ దేశాలతో కలిసి మరో కూటమిని అమెరికా ఏర్పాటు చేసింది. జపాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలను కూడా దగ్గరికి తీసుకున్నది. ఇప్పుడు భారత్ కూడా రక్షణరంగంలో ఒక శక్తిగా ఎదుగుతే ఆసియాలో చైనా ఏకఛద్రాధిపత్యం నడవదు. చైనా మాత్రమే కాకుండా ఇండియా, జపాన్ వంటి దేశాల ప్రమేయం కూడా ఉంటుంది. అమెరికా, ఇండియాల మధ్య సాన్నిహిత్యం పెరగడానికి ప్రధాన కారకుడు చైనా అధినేత షీజిన్ పింగ్ కావడం శోచనీయం. ఆయన దాష్టీకం, పెత్తనం, ఆధిపత్య ధోరణి, భారత భూభాగంపైన కన్ను లేకపోతే, రష్యాకు మరింత దగ్గరై దానిని భారత్ నుంచి దూరం చేయకపోతే, అమెరికా, భారత్ ఇదివరకటి వలెనే పరస్పర అనుమానాలతో, సందేహాలతో కొనసాగి ఉండేవి. చైనా దురాక్రమణ, ఆధిక్య ధోరణి కారణంగా భారత్ అమెరికా పరిష్వంగంలోకి వెళ్ళింది. ఇది ఒక రకంగా  శుభపరిణామమే. అయితే, చైనాకు వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించే దిశగా భారత్ ను అమెరికా నెట్టకుండా చూసుకోవాలి. సప్తసముద్రాల అవతల ఉన్న అమెరికా స్నేహహస్తంపైన ఆధారపడి పక్కనే ఉన్న చైనాతో విరోధం పెంచుకోవడం అవివేకం అవుతుంది.

మోదీ, ఆయన సలహాదారులు సైతం గమనించే ఉంటారు. మోదీ అమెరికా పర్యటన సందర్భంగా మోదీ అప్రజాస్వామిక ధోరణులపైన అమెరికా రాజకీయ నాయకులూ, మీడియా కూడా అభ్యంతరాలు తెలిపాయి. ముఖ్యంగా మైనారిటీల పట్ల మోదీ ప్రభుత్వ వైఖరిపైన మోదీ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. అమెరికా పూర్వాధ్యక్షుడు బరాక్ ఒబామా అయితే ‘‘నేనే కనుక మోదీతో చర్చలు జరపవలసి వస్తే భారత్ లో ముస్లింలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పేవాడిని’’ అంటూ వ్యాఖ్యానించారు. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ లలో, వాక్స్ అనే వెబ్ సైట్ లో మోదీని నిశితంగా విమర్శిస్తూ అనేక వ్యాసాలు ప్రచురించారు. మోదీకి అసౌకర్యం కలుగుతుంది కనుక ఈ విషయాలను ప్రస్తావించదలచలేదని అమెరికా అధ్యక్ష భనవం ప్రతినిధి అన్నారు. మొత్తం మీద ఈ చర్చను కూడా దృష్టిలో పెట్టుకొని మోదీ తన విధానాలనూ, వైఖరినీ సవరించుకుంటే ఇండియా నిజంగానే ఆయన చెప్పుకున్నట్టు ‘మదర్ ఆఫ్ డెమాక్రసీ’ అవుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles