Saturday, April 27, 2024

మన  కళ్ళ ముందే కూలిపోతున్న ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్యం?

భారత ప్రజాస్వామ్యంపైన నరేంద్రమోదీ చేస్తున్న దాడిని వివరిస్తానంటూ అమెరికా జర్నలిస్టు జాక్ బ్యూచాంప్ సుదీర్ఘమైన వ్యాసాన్ని ‘వాక్స్ డాట్ కామ్’ లో 21 జూన్ 2023న రాశాడు. ‘వాక్స్’ లో జాక్ బ్యూచాంప్ సీనియర్ జర్నలిస్టు. అమెరికాలోపలా, బయటా భావజాలానికీ, ప్రజాస్వామ్యానికీ విపత్తు కలిగిందని తాను భావించినప్పుడు కలం దూస్తాడు. 2014లో ‘వాక్స్’ వెబ్ సైట్ లో చేరడానికి ముందు ‘టీపీ ఐడియాస్’ అనే రాజకీయ ప్రపంచంలో ఆలోచనలు పంచుకునే వెబ్ సైట్ లో పని చేసేవాడు.

అమెరికా రాజధాని వాషింగ్టన్ లో అధ్యక్షుడు బైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్ తో కలిసి రాత్రిపూట భోజనం (డిన్నర్) ఆరగించడం అంటే తమాషా కాదు. బైడెన్ అధ్యక్ష భవనమైన శ్వేతభవనంలో (వైట్ హౌస్)లో ప్రవేశించిన తర్వాత ప్రాన్స్, దక్షిన కొరియా అధ్యక్షులకు మాత్రమే ఈ గౌరవం ఇచ్చారు. వాతావరణం గురించి, ఇండో-పెసిఫిక్ పరిస్థితి (చైనా) గురించీ, ఇంకా చాలా విషయాల గురించి బైడెన్, నరేంద్రమోదీ మాట్లాడుకొని ఉంటారు. కానీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటారని కానీ మాట్లాడుకున్నారని కానీ శ్వేతభవనం ప్రతినిధి చెప్పలేదు.

నరేంద్రమోదీ 2014లో ప్రధాని అయినప్పటి నుంచీ, ప్రధానంగా 2019లో రెండోసారి గెలిచినప్పటి నుంచీ, భారత ప్రజాస్వామ్య వ్యవస్థపైన ఒత్తిడి ఎక్కువయింది. మోదీ ప్రభుత్వం ఎన్నికల పర్యవేక్షణ వ్యవస్థను బలహీనపరిచింది. తనకు అనుకూలంగా తీర్పులు ఇచ్చే విధంగా న్యాయమూర్తులను సుముఖం చేసుకున్నది. చట్టాన్ని అమలు చేసే సంస్థలను ప్రత్యర్థులపైన ప్రయోగించడం నేర్చుకున్నది.  భారత మీడియా వ్యవస్థపైన అదుపు సాధించింది.

కడచిన ఒక్క సంవత్సరంలోనే నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ కింద పేర్కొన్న పనులు చేసింది:

  • ప్రధానిపైన ఏదో సరదాగా జోక్ చేసినందుకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి రెండేళ్ళు జైలు శిక్ష విధించి, పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయించింది.
  • కుయుక్తులలో నిష్ణాతుడైన బడాపారిశ్రామికవేత్త (అదానీ) చేత అంతవరకూ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నటీవీ చానల్ (ఎన్ డీటీవీ)ని కొనుగోలు చేయించింది.
  • ప్రభుత్వాన్ని విమర్శించే పోస్టింగులను సోషల్ మీడియా నుంచి తొలగించేందుకై ఒక నిఘా సంఘాన్నినియమించింది.
  • ఢిల్లీ, ముంబయ్ లలో బీబీసీ కార్యాలయాలపై చట్టాలను అమలు చేసే సంస్థల చేత దాడులు చేయించారు. మోదీని విమర్శిస్తూ డాక్యుమెంటరీ నిర్మించి ప్రదర్శించినందుకు బీబీసీపైన కక్ష తీసుకోవడానికే దాడులు జరిగాయని ప్రజలు చెప్పుకున్నారు.

అధికారంలో ఉండడం వల్ల మోదీ శక్తి పెరిగింది. ఎన్నికలలో విజయాలను ప్రత్యర్థుల నోళ్ళు మూయించేందుకు వినియోగించుకోవడంలో భారతీయ జనతా పార్టీ ప్రావీణ్యం సంపాదించింది.  2024లో జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో కూడా గెలుపు ప్రతిపక్షాలకు అసాధ్యమయ్యే విధంగా పావులు కదిపుతోంది. భారత ప్రజాస్వామ్యానికి ప్రాణభిక్ష పెట్టే ఓటు ఏమి చేస్తుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

‘‘ప్రతి పెద్ద ఎన్నికలలో ఓటమితో  ప్రతిపక్షానికి కిటికీ మూసుకుపోతున్నది’’ అని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో రాజకీయశాస్త్రజ్ఞుడు పవిత్ర సూర్యనారాయణ వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యంపైన పడుతున్న ప్రహారం భావజాలపరమైనది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ఎన్నికల విభాగం బీజేపీ. ఆర్ఎస్ఎస్ హిందూత్వవాదాన్ని అమలు చేయాలని గట్టిగా కోరుకుంటున్న సంస్థ. మోదీ ఎనిమిదేళ్ళ వయస్సులోనే ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా చేరారని ప్రాన్స్ కు చెందిన రాజకీయశాస్త్ర ఆచార్యుడు క్రిస్టోఫే జెఫ్రెలాట్ నాకు చెప్పారు.

హంగరీలో ప్రజాస్వామ్య వ్యవస్థ కుంగిపోయినప్పుడు అంతర్జాతీయంగా చేసిన హడావుడి కంటే అధికంగా ఇండియా వంటి పెద్ద దేశంలో (జనాభా ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద దేశం) ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినప్పుడు హాహాకారాలు వినిపించాలి. కానీ ఇండియా భౌగోళికంగా ఉన్న పరిస్థితుల కారణంగా ఆ దేశంపైన ప్రపంచ ప్రజాస్వామిక దేశాలు విమర్శలు అంతగా చేయడం లేదు. ఎదుగుతున్న చైనాను అదుపు చేయడానికి ఇండియాను ఉపయోగించుకోవాలన్న లక్ష్యంతో అమెరికా, పెసిఫిక్ సముద్ర తీర దేశాలు చూసీచూడనట్టు నటిస్తున్నాయి.

ఇండియాలో ప్రజాస్వామ్య వ్యవస్థకు జరుగుతున్న అపకారాన్ని గురించి మాట్లాడటం మోదీకి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది కనుక మాట్లాడకుండా ఉండటమే మేలని అమెరికన్ ఎంటర్ ప్రైజ్ ఇన్ స్టిట్యూట్ లో సీనియర్ ఫెలోగా పని చేస్తున్న సదానంద్ ధూమే వ్యాఖ్యానించారు.

గుజరాత్ లో 2002లో ముస్లింలపైన జరిగిన దాడులను ప్రోత్సహించారన్న అభిప్రాయంతో నరేంద్రమోదీ అమెరికాలో అడుగు పెట్టటాన్ని 2005లో నిషేధించారు. ఇప్పుడు ఆయన అమెరికాలో అత్యంత విలువైన అతిధి.

భారత ప్రజాస్వామ్యంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్నిఅర్థం చేసుకోవాలంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకోవాలి. ఒకప్పుడు గాంధీ నాయకత్వంలో దేశ స్వాతంత్ర్యంకోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కుదురుకున్న రాజకీయ పార్టీ బీజేపీ. దాని వెనుకదన్ను సిద్ధాంతబలం కలిగిన ఆర్ఎస్ఎస్. కాంగ్రెస్ ఉదారవాద లౌకిక వ్యవస్థను కోరుకుంటే ఆర్ఎస్ఎస్ హిందూమతవాదాన్ని అనుసరించే భారత దేశాన్ని అపేక్షిస్తున్నది. హిందువుల కోసం, హిందువులు పాలించే ‘హిందూరాష్ట్ర’ కావాలని ఆర్ఎస్ఎస్ అభిప్రాయం.

గొల్వాల్కర్

ఆర్ఎస్ఎస్ నాయకుడు ఎంఎస్ గోల్వాల్కర్ ‘మన జాతీయతా నిర్వచనం (అవర్ నేషన్ హుడ్ డిఫైన్డ్)’’ అనే పుస్తకాన్ని 1939లో రాశారు. ‘‘హిందుస్థాన్ లో ఉన్న విదేశీ జాతులు హిందూ జాతిలో విలీనం కావాలి. ప్రత్యేక ప్రతిపత్తి వాటికి ఉండదు. సాధారణ పౌరులకు ఉండే అధికారాలు కూడా లేకుండా ద్వితీయ శ్రేణి పౌరులుగా వారు బతకాలి’’ అని రాశారు. ఈ పుస్తకాన్ని ఆర్ఎస్ఎస్ బైబిల్ (పవిత్రగ్రంథం) గా పిలుస్తారు. జర్మనీలో రెండో  ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు ప్రవర్తించిన తీరును గోల్వాల్కర్ ప్రశంసించారు. విభిన్న జాతులు కలిసిమెలసి జీవించడం అసాధ్యమని జర్మన్ అనుభవం స్పష్టం చేస్తున్నదనీ, భారతీయులు జర్మనీ అనుభవం నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలనీ గోల్వాల్కర్ సందేశం ఇచ్చారు.

వలస పాలన నుంచి విముక్తి పొందిన భారత దేశంలో అటువంటి ఆలోచన చేసేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. దేశానికి 1949లో అందజేసిన రాజ్యాంగం లౌకికవాదానికి పెద్దపీట వేసింది. మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా రాజ్యం పౌరుల పట్ల వివక్ష ప్రదర్శిచదు అని రాజ్యాంగం హామీ ఇచ్చింది.

ఈ రాజకీయ అవగాహనను భ్రష్టు పట్టించేందుకు ఆర్ఎస్ఎస్ అవిశ్రాంతంగా పని చేసింది. 1948లో నాథూరామ్ గాడ్సే గాంధీని హత్య చేశాడు. ఇందుకు ప్రేరణ వచ్చింది హిందూత్వ సంస్థ నుంచేనని గాడ్సేనే స్వయంగా చెప్పాడు. భారత ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ను ఒక సంవత్సరం బహిష్కరించింది. ఈ నీడలో నుంచి ఆర్ఎస్ఎస్ బయటకు వచ్చిన  తర్వాత కూడా చాలా సంవత్సరాలు కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగింది. 1977 వరకూ దేశంలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్ గెలుపొందింది (తమిళనాడులో మినహా. ఆ రాష్ట్రంలో డిఎంకె కాంగ్రెస్ ను 1967లో ఓడించింది). ఆర్ఎస్ఎస్ రాజకీయ అంగమైన బీజేపీ ఓటు శాతం పది దాటలేదు.

జనసంఘ్ అవతారం చాలించి జనతాపార్టీలో విలీనమైన అనంతరం జనతా చీలినప్పుడు పాత జనసంఘ్ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)గా కొత్త అవతారం ఎత్తింది. విష్ణువు ఏడవ అవతారమైన రాముడి గుడి బాబరీ మసీదు కింద ఉన్నదంటూ బీజేపీ హడావిడి చేసి ప్రజల దృష్టిని ఆకర్షించింది. అప్పుడున్న కాంగ్రెస్ వ్యవస్థ హిందువుల కంటే ముస్లింలకు ప్రాధాన్యం ఇస్తున్నదని ప్రచారం చేయడానికి బాబరీ మసీదు వివాదాన్ని వినియోగించుకోవచ్చునని బీజేపీ నిర్ణయించుకున్నది. ఈ విభజన ప్రచారం పని చేసింది. 1984లో లోక్ సభలో కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ 1989నాటికి మొత్తం 543 లోక్ సభ స్థానాలలో 85 స్థానాలను కైవసం చేసుకున్నది.

బీజేపీ1998లో తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి బీజేపీ నాయకత్వంలోని నేషనల్ డెమాక్రాటిక్ అలయెన్స్ (ఎన్ డీఏ) ప్రభుత్వం వాజపేయి నేతృత్వంలో సజావుగా నడిచింది. భారత దేశం వంటి భిన్నత్వం కలిగిన పెద్ద దేశాన్ని పాలించాలంటే ఏ పార్టీ అయినా ఉదారంగా వ్యవహరించాల్సి ఉంటుందని అనుకున్నారని బ్రౌన్ విశ్వవిద్యాలయానికి చెందిన అశుతోష్ వర్షణే అన్నారు.

ప్రభుత్వాలు మధ్యస్థంగానే (సెంట్రిస్) ఉండాలనడానికి రెండు కారణాలను అశుతోష్ చెప్పారు. ఇండియా బహువైవిధ్యభరితమైన దేశం అన్నది మొదటి కారణం. ఈ దేశంలో 22 అధికార భాషలు ఉన్నాయి. 705 జాతులు అధికారికంగా గుర్తింపు పొందినవి ఉన్నాయి. ఆరు పెద్ద మైనారిటీ మతాలు ఉన్నాయి. వేల వర్గాలుగా సమాజాన్ని చీల్చగల కులవ్యవస్థ ఉండనే ఉన్నది. ఇటువంటి విభజనలతో కూడిన సమాజాన్ని పరిపాలించాలంటే చాలా విషయాలలో రాజీ పడక తప్పదు. రెండవ కారణం ఏమంటే అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమిపైన అనేక విధాలైన నియంత్రణలు ఉంటాయి. ప్రభుత్వాలు యధేచ్ఛగా పని చేయడానికీ, నిర్ణయాలు అమలు చేయడానికీ వీలు లేదు. భారత ప్రభుత్వ స్వభావాన్ని మార్చడం కరుడుకట్టిన బీజేపీ ప్రభుత్వం వల్ల కూడా కాదు.

అయితే, బీజేపీ నాయకులూ, కార్యకర్తలూ హిందూత్వ భావజాలాన్ని ప్రేమిస్తారని మరచిపోరాదు. గోల్వాల్కర్ రాసిన విషయాలతో ఏకీభవించబోమని ఆర్ఎస్ఎస్ 2006లో ప్రకటన చేసినప్పటికీ ఆయన అభిలషించిన హిందూరాష్ట్ర సిద్ధాంతమే ఆర్ఎస్ఎస్ ప్రతిపాదిస్తున్నది. ‘‘భావజాలం మారలేదు. హిందువులు అధికులనే భావనలో వారున్నారు. ఇతరులను హీనంగా చూడడం వారి అభిమతం’’ అని జెఫ్రెలాట్ వ్యాఖ్యానించారు.

2014లో విజయోత్సవంలో నరేంద్రమోదీ

ఇటువంటి విశ్వాసం ఉన్నవారిలో నరేంద్రమోదీ అగ్రగణ్యుడు.

నరేంద్రమోదీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నకాలంలో 2002లో ముస్లిం జనాభా  ఎక్కువగా నివసించే గోధ్రా ప్రాంతంలో సబర్మతీ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు తగలబడి 59 మంది మరణించారు. దానికి ముస్లింలు కారణమని నిందించారు. గుజరాత్ రాష్ట్రం అంతటా హిందువులు ముస్లింలపైన దాడులు చేశారు. (రైలు తగలబడింది ప్రమావశాత్తు అని భారత ప్రభుత్వం జరిపించిన పరిశోధనలో తర్వాత తేలింది). గుజరాత్ మతకలహాలలో కనీసం రెండు వేల మంది చనిపోయి ఉంటారని మానవహక్కుల నేతల అంచనా. ఈ హింసాకాండలో భాగంగా 250 నుంచి 330 మంది ముస్లిం బాలికలనూ, మహిళలనూ మానభంగం చేసి హింసించారనీ, అనంతరం చంపివేశారనీ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక పేర్కొన్నది.

ముస్లింలపైన దాడులు చేస్తున్నవారికి అనుకూలంగా మోదీ జోక్యం చేసుకున్నారనేది ఆరోపణ. ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాలలో హిందూ మూకలను స్వైరవిహారం చేయడానికి అనుమతించాలని పోలీసులతో చెప్పారని అభియోగం. ‘మతపరమైన స్వేచ్ఛను ఉల్లంఘించారు’’ కనుక మోదీకి అమెరికా వీసా ఇవ్వరాదని అమెరికా ప్రభుత్వం 2005లో నిర్ణయించింది. జనాకర్షణ కలిగిన మోదీ రాహుల్ నాయకత్వంలోని అవినీతి భరితమైన, అసమర్థమైన కాంగ్రెస్ పార్టీని 2014లో ఓడించి అధికారంలోకి వచ్చారు. మోదీ ప్రధాని అయిన తర్వాత వీసా నిషేధాన్ని అమెరికా ప్రభుత్వం ఎత్తివేసింది.

ప్రధాని అయిన తర్వాత మోదీకి మౌలికమైన సవాలు కట్టెదుట నిలిచింది. మధ్యేమార్గంగా ప్రభుత్వం వ్యవహరించే విధంగా పరిమితులు ఉన్నప్పుడు తన హిందూత్వ అజెండాను ఎట్లా అమలు చేయాలన్నది ప్రశ్న. ఆ  పరిమితులను తొలగించడం ఒక్కటే మార్గం. ఆయన ఎంచుకున్న వ్యూహం భారత ప్రజాస్వామ్య హృదయాన్ని గాయపరుస్తుంది.

లౌకికవాదానికి అపకారం

భారత లౌకికవాదాన్నీ, ప్రజాస్వామ్యాన్ని మోదీ కాలరాశారు.

మోదీ ఇండియాలో ఏమి చేశారో అర్థం చేసుకోవాలంటే రెండు అజెండాలను కలిపి అమలు జరిపితే ఏమి అవుతుందో ఊహిస్తే చాలు. ఒక అజెండా మరో అజెండాకు శక్తి ప్రసాదిస్తుంది.

మొదటి అజెండా ఏమంటే ప్రధాన మంత్రిగా హిందూత్వ సిద్దాంతాన్ని ప్రచారం చేసి హిందువులు – ముస్లింలుగా సమాజాన్నీ, ఓటర్లనూ విభజించడం. న్యాయవ్యవస్థ, పర్యవేక్షక సంస్థలు, స్వేచ్ఛాయుతమైన మీడియా, ప్రతిపక్షాలను బలహీనపరిచే విధంగా తన చేతుల్లో సర్వశక్తులనూ కేంద్రీకృతం చేసుకోవడం రెండో అజెండా.

హిందువులలో ఎంత మంది తన హిందూత్వ వాదాన్ని ఆమోదిస్తారో మోదీ ప్రాబల్యం అంతగా పెరుగుతుంది. ఫలితంగా న్యాయమూర్తులపైనా, ఉన్నతాధికారులపైనా, విలేఖరులపైన యధేచ్ఛగా దాడులు కొనసాగడానికి అవసరమైన శక్తిసామర్థ్యాలు సమకూరుతాయి. ప్రభుత్వాధికారాలనూ, మీడియాను తన గుప్పెటలోఎంత గట్టిగా బంధిస్తే అంత తేలికగా హిందూత్వ వాదనను ప్రచారం చేయవచ్చు.

ఈ అజెండాల అమలు ఫలితంగా ప్రభుత్వాలు మధ్యస్థంగా వ్యవహరించాలనే నియమం నీరుగారి పోతుంది. అధికారపార్టీకి అనుకూలమైన వ్యవస్థలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అధికార పార్టీ గెలుస్తూ ఉంటుంది. ప్రతిపక్షం నిర్వీర్యం అవుతూ వస్తుంది.

మోదీ ఎదుగుదలకు ముందు బీజేపీ ఎన్నికల విజయాలు పరిమితమైనవి. సమాజంలో సంపన్నులూ, కాషాయపార్టీ ఆర్థిక విధానాలనూ, సామాజిక ధోరణులనూ సమర్థించేవారు మాత్రమే బీజేపీకి ఓటు చేసేవారు. విద్యాసంస్థలలోనూ, ప్రభుత్వ ఉద్యోగాలలోనూ రిజర్వేషన్లు అమలు చేసి చారిత్రకంగా పీడనకు గురైనవర్గాల సంక్షేమం కోసం కొనసాగుతున్న ప్రయత్నాలను సహించని అగ్రవర్ణాలవారిలో కొందరు బీజేపీ సమర్థకులలో ఉన్నారు. కులవ్యవస్థను రూపుమాపడానికి జరిగే ప్రయత్నాలనూ, రిజర్వేషన్లనూ బీజేపీ వ్యతిరేకిస్తుంది.

మోదీ హయాంలో బీజేపీ పేద, నిమ్నవర్గాల హిందువులలో కొంతవరకూ వేళ్ళూనింది. కానీ దాని అసలు పునాది అయిన అగ్రవర్ణాలను వదులుకోలేదు.   2019 నాటికి పేద హిందువులు కూడా సంపన్న హిందువులతో పాటు బీజేపీ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు.

మోదీ అధికారంలోకి వచ్చిన అనంతరం హిందూత్వ భావజాలాన్నివ్యాప్తి చేయడంలో సాధించిన విజయం కీలకమైనది. ఇది కాక ఇతర విషయాలు కూడా ముఖ్యమైనవి ఉన్నాయి. మోదీ, రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులూ హిందూత్వ సిద్ధాంతాన్ని తమ ఉపన్యాసాలలో పదేపదే ఉటంకిస్తున్నారు. ముస్లింల హక్కులకు కావాలనే భంగం కలిగిస్తున్నారు. పొరుగున ఉన్న ముస్లింలు ఏమి చేస్తారోనన్న ఆందోళన హిందువులలో పెరిగే విధంగా మాట్లాడటం, చేయడం బీజేపీ నాయకుల వ్యూహం.

మోదీ, అమిత్ షా, జమ్మూ-కశ్మీర్-లద్దాఖ్

‘‘ఇంతవరకూ బీజేపీ సాధించిన విజయాలు భావజాలానికి సంబంధించినవే. పౌరసత్వ సవరణ చట్టం, కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించే చట్టం, పాఠ్యాంశాలలో భారత చరిత్రలో ముస్లింల పాత్రను తగ్గించడం లేదా ఎత్తివేయడం- అన్నీ బీజేపీ సైద్ధాంతిక పోకడలకు నిదర్శనాలు. (ఇరుగుపోరుగు దేశాలలో నివసిస్తున్న ముస్లిమేతరులకు భారతకు వలసరావడం సులువు చేయడం పౌరసత్వ సవరణ చట్టం ఉద్దేశం.) జమ్మూ-కశ్మీర్ ఒక్కటే ముస్లింలు మెజారిటీ ఉన్న రాష్ట్రం. పాకిస్తాన్ తో వివాదం ఉన్న రాష్ట్రం కూడా అదే. 2019లో మోదీ రద్దు చేసేవరకూ జమ్మూ-కశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి ఉండేది.

వాస్తవానికి హిందువులలో విభేదాల పరిష్కారం చేయడం కంటే కూడా ప్రధానమైనది ముస్లింలతో హిందువులకు ఉన్న విభేదాలనే విషయాన్ని ప్రచారం చేయడంలో బీజేపీ రాజ్యశక్తిని వినియోగించింది. ఇటువంటి ప్రచారానికి ‘లవ్ జిహాద్’ ఒక ఉదాహరణ. హిందువుల అమ్మాయిలను ప్రేమ పేరుతో వంచించి, పెళ్ళి చేసుకొని వారిని ఇస్లాంలోకి మార్చడం ద్వారా దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులను మైనారిటీలుగా మార్చాలనే కుట్ర లవ్ జిహాద్ అని ప్రచారం. ఈ కారణంగా కొందరు ముస్లిం యువకులను అరెస్టు కూడా చేశారు. ఇదే ఇతివృత్తంతో వచ్చిన సినిమాను (కేరళ స్టోరీ) హిందూత్వవాదులూ, బీజేపీ ప్రభుత్వాలూ ప్రోత్సహించాయి.

ముస్లిం వ్యతిరేకతను ప్రచారం చేయడం వల్ల ప్రజల వైఖరిలో మార్పు వచ్చినట్టు అధ్యయనాలు తెలుపుతున్నాయి. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలను లాగికొట్టి చంపే (లించింగ్) ఘటనల సంఖ్య పెరిగిందని వర్షణే తయారు చేసిన 2022 పరిశోధనాపత్రం స్పష్టం చేసింది. ‘‘తమ పైన రాజ్యం చర్య తీసుకోదనే భరోసా నిందితులకు ఉన్నప్పుడే ముస్లింలను కొట్టి చంపడం సాధ్యం అవుతుంది’’ అని వర్షణే అంటారు.

ముస్లిం వ్యతిరేకత రగిలించడం

ముస్లిం వ్యతిరేకత రాజేయడం రాజకీయంగా లాభదాయకం. ముస్లింలను చాలా అప్రతిష్ఠాత్మకంగా చిత్రించారు.  ఇటీవల కాలంలో మోదీకి ఆమోదం రేటు 75 శాతం వరకూ వెళ్ళింది. హిందువులలో మద్దతు సంపాదించేందుకు భయపూరితమైన వాతావరణాన్ని సృష్టించడంలో మోదీ సఫలికృతుడైనారు.

‘‘వివిధ రంగాలలో, అన్ని రాష్ట్రాలలో ముస్లింలను చాలా చెడ్డగా చిత్రించడం బీజేపీ చేసిన ముఖ్యమైన నిర్వాకం. లౌకికవాదాన్ని వారు సంపూర్ణంగా విధ్వసం చేయగలిగారు. మళ్ళీ లౌకికవాదాన్ని నిర్మించడం దాదాపు అసాధ్యం’’ అని జెఫ్రెలాట్ అన్నారు.

మోదీ అజెండా ఉదారమైనది కాదనడంలో ఏ మాత్రం సందేహం అక్కరలేదు. ముస్లింలూ, ఇతర మైనారిటీలను కాదని హిందువుల హక్కులనే అత్యధికంగా గౌరవించడం ఇందులో భాగమే.  ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇండియా తల్లివంటిదనే విశ్వాసాన్ని వమ్ము చేయడం లేదనీ, మెజారిటీ హిందువులకోసం వాదిస్తున్నట్టు కేవలం నటిస్తున్నానని నమ్మించడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు.

కానీ ఆయన సుదీర్ఘమైన అప్రజాస్వామిక ప్రయాణం ఇందుకు విరుద్ధంగా కనిపిస్తున్నది.

తెలివితేటలు ప్రదర్శిస్తూ చట్టాలు చేయడం మోదీ వ్యూహాలలో ఒకటి. ఎలక్టొరల్ బాండ్లు కొనుగోలు చేయడం ద్వారా పార్టీలకు రహస్యంగా ఎంత విరాళమైనా ఇవ్వవచ్చు. అంటే అధికారపార్టీకి ఎంత విరాళం లభించిందో రహస్యం. ఇతర పార్టీలకు ఎంత విరాళం అందిందో అధికారపార్టీకి తెలిసిపోతుంది.

ఉన్నత పదవులలో నియమించడానికి ప్రభుత్వానికి కలిగిన అధికారాలను వినియోగించడం మరో  ఎత్తుగడ. తాను ఆమోదించిన వ్యక్తులను న్యాయమూర్తులుగా నియమించడానికి నిరాకరించడం ద్వారా తనకు అనుకూలమైన సుప్రీంకోర్టు కొలీజియం మోదీకి లభించింది. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లను నియమించడం లేదు. సమాచారం అడిగి పుచ్చుకునే వ్యవస్థ నీరుగారి పోయింది. ఆ విధంగా సమాచార హక్కు చట్టానికి గండి కొట్టారు.

మరో వ్యూహం ఏమంటే ప్రభుత్వం తన అధికారాన్ని బాహాటంగా, నిస్సిగ్గుగా వినియోగించి ప్రత్యర్థులను భయపెట్టడం. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ- ఇది అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఐతో సమానం)ను అధికారంలో ఉన్న రాజకీయవాదులు దుర్వినియోగం చేస్తున్నారనే అపప్రథ ఉన్నది. ఆ దుర్వినియోగం 2014 తర్వాత మితిమీరింది. ఇదివరకటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీబీఐ విచారణ ఎదుర్కొన్నవారిలో 60 శాతంమంది ప్రతిపక్షాలకు చెందినవారుండేవారు. మోదీ హయాంలో ఈ శాతం 95కి పెరిగింది.

ఇటీవల రాహుల్ కి గుజరాత్ కోర్టు పరువు నష్టం కేసులో రెండేళ్ళు శిక్ష విధించడం, తత్ఫలితంగా ఆయన లోక్ సభ సభ్యత్వం రద్దు కావడం గమనిస్తే చట్టసభలనూ, న్యాయవ్యవస్థనూ మోదీ ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగపర్చుతున్నదో గమనించవచ్చు.

పన్నులకు సంబంధించిన శాఖలు (ఎన్ ఫోర్స్ మెంటె డైరెక్టొరేట్-ఈడీ, ఇన్ కం టాక్స్-ఐటీ) కూడా అదే పాత్ర పోషిస్తున్నాయి.  2019లో మోదీ ద్వేషభరితంగా మాట్లాడినందుకు నోటీసు పంపిన ఎన్నికల సంఘం అధికారిపైన, ఆయన భార్య, సోదరి, కుమారుడిపైన పన్ను దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహించాయి. గుజరాత్ లో 2002 లో జరిగిన అల్లర్లలో మోదీ పాత్రకు సంబంధించి డాక్యుమెంటరీ ప్రదర్శించిన బీబీసీపైన పన్ను సంస్థలు దాడి చేయడం తెలిసిందే.

బీబీసీపైన దాడులు ప్రజాస్వామ్యం నీరుగారుతోందనడానికి మరో ఉదాహరణ. సోషల్ మీడియాలో పోస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే వాటిని తొలగించేందుకు ఒక కమిటీని నియమించారు. జర్నలిస్టులనూ, మానవ హక్కుల సంస్థల ప్రతినిధులనూ పీడిస్తున్నారు. మీడియా అణచివేత పరోక్షంగా కూడా జరుగుతోంది. మోదీకి సన్నిహితులైన అతిసంపన్నులైన గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ వంటివారు మీడియా సంస్థలను కొనుగోలు చేయడం అందుకు ఒక మార్గం.

మోదీని అదుపు చేసే వ్యవస్థలు బలహీనమైన కొద్దీ హిందూత్వ విధానాలను ప్రభుత్వం అంత అధికంగా అమలు చేయగలుగుతుంది. ఎన్నికల ద్వారా మోదీనీ, బీజేపీనీ ఓడించడం ప్రతిపక్షాలకు అంత కష్టతరం అవుతుంది.

ఎమర్జెన్సీ ప్రకటించినప్పటి ఇందిరాగాంధీ

భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించడం సాధ్యమా?

భారత ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడటం ఇదే మొదటిసారి కాదు.

అంతర్యుద్ధం పోకడలు స్పష్టంగా కనిపిస్తున్న దశలో మోదీలాగానే ప్రజలలో ప్రాబల్యం కలిగిన కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాందీ ఆత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ)ని 1975 జూన్ లో ప్రకటించారు. అన్ని ప్రాథమిక హక్కులనూ, స్వేచ్ఛలనూ హరించారు.  దాదాపు రెండేళ్ళపాటు భారత నియంతృత్వ పాలనలో మగ్గింది. ఆర్ఎస్ఎస్ నాయకులతో సహా ఇందిరాగాంధీ రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేసి జైల్లో కుక్కించారు.

మార్చి  1977లో ఆత్యయిక పరిస్థితిని అకస్మాత్తుగా ఎత్తివేశారు.  ఇందిరాగాంధీ ఎన్నికలు ప్రకటించారు. కాంగ్రెస్ ఓడిపోయింది. ఐచ్ఛికంగానే ఇందిర అధికారం నుంచి తప్పుకున్నారు. (తర్వాత జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించి మళ్ళీ అధికారంలోకి వచ్చారు.)అప్పటి నుంచి కాంగ్రెస్ ఆధిక్యం గల వ్యవస్థ పోయి ఆరోగ్యకరమైన బహుపార్టీల వ్యవస్థ అమలులోకి వచ్చింది.

మోదీ కూడా అంతే ఆకస్మికంగా, అంతే ఆశ్చర్యకరంగా అధికారం కోల్పోవచ్చునని అనుకోవచ్చునా? నేను మాట్లాడిన ప్రవీణులు ఇతమిత్థంగా చెప్పలేకపోయారు. తక్షణ సమస్యలకు స్పందిస్తూ ఆత్యయిక పరిస్థితిని ఇందిరాగాంధీ విధించారు. ఇందుకు భిన్నంగా మోదీ అనేక సంవత్సరాలుగా వ్యవస్థలను భ్రష్టుపట్టించి ఒక పద్ధతి ప్రకారం అప్రకటిత నియంతృత్వాన్ని ప్రవేశపెట్టారు.

‘‘వారు సమాచారాన్ని నియంత్రించే విధానం, నిధులను అమితంగా సేకరించగల శక్తి, అందుకు విరాళాల సేకరణ పద్ధతులను సవరించిన విధానం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది’’ అని అంతర్జాతీయ శాంతి కోసం కార్నిజీ ఎండోమెంట్ దక్షిణాసియా కార్యక్రమం సంచాలకులు మిలన్ వైష్ణవ్ అన్నారు.

ప్రస్తుత పరిస్థితిని ఆత్యయిక పరిస్థితితో పోల్చడం సరైనదో కాదో చెప్పలేము కానీ భారత ప్రజాస్వామ్య ఇంకా చచ్చిపోలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ట్రంప్ లాగానే, బ్రెజిల్ కు చెందిన జాయిర్ బోల్సోనారో లాగానే మోదీ కూడా పరాజయం పొందవచ్చు.

బీజేపీని ఓడించవచ్చునని ఇటీవల పశ్చిమబెంగాల్ లోనూ, కర్ణాటకలోనూ ప్రజలు నిరూపించారు. భారత సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలకు బలం ఉంటుంది. జాతీయ స్థాయిలో సైతం ప్రజలకు సందేశం పంపించగల శక్తి ప్రతిపక్షాలకు లేకపోలేదు.

‘భారత్ జోడో’ పేరుతో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 2,200 మైళ్ళు పాదయాత్ర చేశారు. సమాజాన్నిమతంతో విభజించే మోదీ రాజకీయాల పట్ల నిరసనగా ఈ పాదయాత్రను రూపొందించారు. పాదయాత్ర అన్నది భారతీయుల జీవితంలో ఇష్టమైన భాగం. కాంగ్రెస్ పార్టీనీ, ముఖ్యంగా రాహుల్ గాంధీని పునఃప్రతిష్ఠించడంలో ఆ పాదయాత్ర విజయం సాధించినట్టు కనిపిస్తోంది.

‘‘పాదయాత్రలో ఆయన జీవించిన విధానం వల్ల, ప్రజలతో అనుబంధం పెంచుకోవడంలో సఫలమైనందువల్ల రాహుల్ కి జనాకర్షణ శక్తి పెరిగింది. కులం ఒక బలమైన అంశంగా పాతుకుపోయిన సమాజంలో దారిలో పోయేవారందరితో కరచాలనం చేయడానికి అతడికి అభ్యంతరం లేదు’’ అని జెఫ్రెలాట్ అన్నారు.

కనుక 2024 ఎన్నికలు భారత భవిష్యత్తుకు కీలకం కాబోతున్నాయి. అమెరికా ప్రభుత్వం బయటికి ఏమంటున్నదో అనవసరం. ‘‘నా ప్రభుత్వ విదేశాంగ విధానానికి మానవ హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్యాలు నిజంగా ప్రజలకు మేలు చేస్తున్నాయనే చింతన ప్రధానం’’ అని బైడెన్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో అన్నారు.  కానీ భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు తన విదేశాంగ విధానంలో ప్రధానమైన అంశాన్నివిస్మరించారు. మోదీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలనూ, నిర్ణయాలనూ ప్రశ్నించడానికి బదులు చైనాకు వ్యతిరేకంగా తన వెంట జతగా ఉండేందుకు మోదీని మంచి చేసుకోవడానికే బైడెన్ ప్రాధాన్యం ఇచ్చారు.

‘‘ఇండియా ఉన్నతమైన ప్రజాస్వామ్య ప్రమాణాలకు కట్టుబడి ఉండేట్టు చూడాలనే తాపత్రయం బైడెన్ ప్రభుత్వంలో కనిపించడం లేదు’’ అని వైష్ణవ్ వ్యాఖ్యానించారు.

‘‘బహుశా ఆంతరంగిక సంభాషణల్లో ఉన్నత అధికారులు  మోదీతో ఈ విషయాలు ప్రస్తావిస్తారు’’ అని శ్వేతభవనం ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘ఈ సమావేశాలలో మేము పరస్పరం గౌరవించుకుంటూ విధానపరమైన భేదాలను ప్రస్తావించి, చర్చిస్తాం‘‘ అని ఆ ప్రతినిధి అన్నారు.

అణ్వాస్త్రాలు కలిగిన పాకిస్తాన్ తో ఘర్షణ కొనసాగుతుండగా హిందూ జాతీయ వాదానికి బారత దేశం దిగజారడం అమెరికా ప్రయోజనాలకు అనుగుణం కాజాలదు. పరిస్థితులను తీవ్రమైన స్థాయికి తీసుకొని పోతే నష్టబోతారని మోదీకి అమెరికా ప్రభుత్వ అధికారులు చెప్పగలిగితే భారత ప్రధాని వైఖరి ఏ మాత్రమైనా మారుతుందేమో. అయితే,  భారత దేశం అనుసరించే విధానాలను మార్చగలిగే శక్తి అమెరికాకు లేదు. 2024లోనూ, ఆ తర్వాతా భారతీయులు ఏమి చేస్తారన్నదానిపైన ఇండియాలో ఏమి జరుగుతుందో ఆధారపడి ఉంటుంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే ప్రపంచానికి మంచిది. పెరుగుతున్న ప్రాబల్యంతో ప్రజాస్వామ్య భారత్ ప్రపంచంలో సకారాత్మక పాత్ర పోషించవచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles