Friday, September 29, 2023

చైనాపై అమెరికా ఆంక్షల కొరడా

  • ఆంక్షల చట్రంలో చైనా
  • ట్రంప్ నిర్ణయాలతో ఇరకాటంలో బైడెన్

వాషింగ్టన్ : అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేందుకు ససేమిరా అంటున్న ట్రంప్ తన పదవీకాలం ముగిసేలోపు చైనాకు చుక్కలు చూపిస్తారని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ ఓడిపోయారన్న వార్త తెలియగానే చైనా ఊపిరిపీల్చుకుంది. ఆ ఆనందం చైనాకు ఎంతో కాలం నిలవలేదు. ట్రంప్ కు మరో 70 రోజుల పాటు అధ్యక్షుడి గా కొనసాగే అధికారం ఉంది. ఈ లోపు చైనాను ఆంక్షల పేరుతో  తీవ్ర ఇబ్బందులకు గురిచేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఏ అమెరికా అధ్యక్షుడూ చైనా పట్ల ఇంత దూకుడుగా వ్యవహరించిన దాఖలాలు లేవు. ట్రంప్ అధికారం చేపట్టాక అమెరికా-చైనా సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. అధికారం చేపట్టాక వాణిజ్య యుద్ధానికి తెరలేపిన ట్రంప్, దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్యాన్ని సవాల్ చేశారు. కరోనా వైరస్ కు పుట్టిల్లు చైనానే అంటూ ఏకంగా చైనా వైరస్ గా నామకరణం చేసిన ట్రంప్ అంతర్జాతీయంగా చైనా పరువు తీశారు. వీగర్ ముస్లింలపై చైనా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆ దేశానికి చెందిన ఉన్నతాధికారుల వీసాలను ట్రంప్ సర్కార్ రద్దు చేసింది. సరిహద్దు దేశాలతో కయ్యానికి దిగుతున్న చైనాను ఇరుకున పెట్టేందుకు తైవాన్ కు ఆయుధాల విక్రయానికి సై అన్నారు. ఇలా ట్రంప్ తీసుకున్న ప్రతీ నిర్ణయంతో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతినటమే కాకుండా దౌత్య సంబంధాలు క్షీణ దశకు చేరుకున్నాయి.

చైనా టెలికాం కంపెనీలపై ఆంక్షలు

తాజాగా ట్రంప్  చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీతో సంబంధాలున్నట్లు తేలిన కొన్ని కంపెనీలపై ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించింది. తాజాగా ఈ జాబితాలో మరో 31 కంపెనీలను చేర్చింది. ఇవన్నీ పీఎల్ఏ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయని అమెరికా రక్షణ విభాగం ఆరోపణలు చేసింది. నిషేధిత కంపెనీలలో అమెరికన్ సంస్థలు పెట్టుబడులు పెట్టడాన్ని, వాటాలు కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తూ వైట్ హౌస్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంక్షల అమలుకు మరో రెండు నెలలు:

అమెరికా ఆంక్షలు విధించిన కంపెనీలలో చైనా టెలికాం కార్పొరేషన్ లిమిటెడ్, చైనా మొబైల్ లిమిటెడ్, హిక్ విజన్ వంటి ప్రముఖ టెలికాం కంపెనీలు ఉన్నాయి. అయితే, ఈ ఆంక్షలు జనవరి 11, 2021 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే నిషేధిత కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన అమెరికన్ సంస్థలు పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన లావాదేవీలను పూర్తి చేయడానికి మరో ఏడాది గడువునిచ్చారు.

బైడెన్ ను ఇరుకున పెట్టేందుకే ఆంక్షలు

చైనా తన సైనిక, నిఘా సహా ఇతర రక్షణ వ్యవస్థలను ఆధునీకరించుకునేందుకు అమెరికా పెట్టుబడుల్ని దుర్వినియోగం చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తరువాత ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయం ఇదే. మిగిలిన కొన్ని రోజుల పదవీకాలంలో చైనాపై ట్రంప్ మరిన్ని కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న నిపుణుల విశ్లేషణల నేపథ్యంలో ట్రంప్ పాలక వర్గం నుంచి ఈ నిర్ణయం వెలువడటం ప్రాథాన్యత సంతరించుకుంది. మరోవైపు ట్రంప్ నిర్ణయాలు కొత్తగా అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ కి మరిన్ని చిక్కులు తెచ్చిపెడతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరు దేశాల మధ్య దారుణంగా దెబ్బతిన్న సంబంధాలను బైడెన్ ఎలా చక్కదిద్దుతారోనని ఆసక్తిగా నెలకొంది.

ట్రంప్ నిర్ణయాలపై బైడెన్ విమర్శలు

ట్రంప్ విదేశీ విధానాన్ని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ తీసుకుంటున్న వివాదస్పద నిర్ణయాలతో అమెరికా పరువు మంటగలుస్తోందంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ట్రంప్ సర్కార్ నుంచి అధికారాల బదలాయింపు పూర్తయిన తరువాత గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles