Thursday, May 2, 2024

డిగ్రీలు లేని ప్రిన్సిపాలూ, మరో పరిశోధకుడు

కనీస విద్యార్హత లేకుండానే అధ్యాపకుడూ, ప్రిన్సిపాలూ కావొచ్చా? మాస్టర్స్ డిగ్రీ లేకుండానే రీసర్చ్ ప్రారంభించవచ్చా? – అంటే వీలు కాదు. కానీ, కొందరు ఆ పరిధులు దాటుకుని, దీక్షతో నిరంతర కృషితో వాటిని సాధించగలుగుతారు. ఉదాహరణగా ఒకరిద్దరి జీవిత విశేషాలు తెలుసుకుందాం! అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోగలవారు కొందరు ఉంటారని తెలుసుకోగలుగుతాం! స్వశక్తితో మేధావులయినవారు సామాన్యంగా మనకు ఎక్కడా కనబడరు. ఉన్నా చాలా చాలా అరుదు. అలాంటి అరుదైన జీవితం-వ్యక్తిత్వం గలవాడు మన తెలుగువారిలోనే ఒకరున్నారు. నాలుగో తరగతితో చదువు ఆపేసి, స్వయంకృషితో ఉన్నత విద్యావంతుడయ్యారు. ఒక జర్నలిజం స్కూలుకు చాలాకాలం ప్రిన్సిపాల్ గా కొనసాగారు. ఆయనే రాంభట్ల కృష్ణమూర్తి (24 మార్చి 1920-7డిసెంబర్ 2001). 24 మార్చి 2020కి ఆయన శతజయంతి పూర్తయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రముఖ జర్నలిస్ట్ లకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గురువు – లేదా గురుతుల్యులు. ప్రగతిశీల సాహిత్యోద్యమ పునాది నిర్మాణానికి ఆయన ఒక్కొక్క రాయి పేర్చిన అభ్యుదయ కాముకుడు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తాలూకా అనాతవరం గ్రామంలో జన్మించిన రాంభట్ల స్వయంగా ఇంగ్లీషు, ఉరుదూ, తెలుగు, సంస్కృత భాషలు నేర్చుకున్నారు. ఆయా భాషల్లోని అనేకానేక గ్రంథాలు అధ్యయనం చేశారు. ముఖ్యంగా ఒక వైపు సంప్రదాయ గ్రంథాలమీద, మరోవైపు ఆధునిక సాహిత్య ధోరణుల మీద సమానంగా పట్టు సాధించారు. చిన్న చిన్న పనులు చేస్తూ, స్వంత వ్యాపారాలు ప్రారంభించి ధనవంతులైనవారిని మనం చాలామందిని చూడగలం. కానీ స్వయం కృషితో ఇంత పెద్ద ఎత్తున విద్యాధనమార్జించిన పండితుల్ని చూడలేం. వేదాల్ని, ఉపనిషత్తుల్ని, దర్శనాల్ని క్షుణ్ణంగా చదివి, వాటి ప్రభావంలో పడి, ఒక ఛాందసవాదిగా మారిపోకుండా నిలదొక్కుకుని, అభ్యుదయవాదిగా నిలబడగలగడం చాలా గొప్ప విషయం. 1943లో హైదరాబాద్ లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయానికి కార్యదర్శి అయి, అదే సమయంలో ఒక ఐదేళ్ళపాటు మీజాన్ పత్రికలో పని చేశారు రాంభట్ల! 1946లో తొలితరం జర్నలిస్టుల జీతాల పెంపుకోసం సంఘర్షించారు. 1948లో మద్రాసులోను, విజయవాడలోనూ పలు పత్రికల్లో పని చేశారు. 1952లో విశాలాంధ్ర పత్రికకు సబ్ఎడిటర్ అయ్యారు. ఆ రోజుల్లోనే కార్టూన్లు వేయడం, కార్టూన్ కవితలు రాయడం ప్రారంభించారు. తెలుగు జర్నలిజంలో అవే తొలిప్రయత్నాలు.

Also read: వేద గణితం అబద్ధం: సున్నాను కనుగొంది బౌద్ధులే!

కవిరాక్షస, అగ్నిమిత్ర, కృష్ణ – పేర్లతో ఆ రోజుల్లో కనిపించిన రచనలన్నీ రాంభట్ల కృష్ణమూర్తివే! అవన్నీ ఆయన కలం పేర్లు. జర్నలిస్ట్ గనక పత్రికలకు రాయడం మామూలుగా జరిగేదే. కానీ, అంతకు మించి అనేక విషయాలమీద ఆయన ఎన్నో గ్రంథాలు ప్రకటించారు.  జనకథ, వేల్పుల కథ,  సొంత కథ, శశవిషానం, పాదుటాకులు వంటి గ్రంథాలు చాలా ప్రకటించారు. ఉరుదూ కవి మగ్దూమ్ మొహియుద్దీన్ కవిత్వానికి ఆకర్షితులై ఆయన కవిత్వాన్ని తెలుగులోకి అనువదించారు. అలాగే కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సాంగ్ ను అదే బాణిలో – పాడుకోవడానికి అనువుగా అనువదించారు. ఇవన్నీ చేస్తూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘానికి మార్గదర్శిగా నిలిచారు. 1973 గుంటూరులో 1977 హైదరాబాద్ లో జరిగిన అరసం రాష్ట్ర మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నాటి యువతీయువకుల మెదళ్ళలో అభ్యుదయ బీజాలు నాటి, వారిని రచనా రంగంవైపు నడిపించారు. ఆయన పరిశీలనల్లో, పరిశోధనల్లో ఎప్పుడూ కొత్త చూపు ఉండేది. కొత్త దారులు వేయడంలో ఆయనకు ఆయనే సాటి. చేసే కృషి ఏ రంగంలోదైనా, అన్నింటా మార్క్సిస్టు దృష్టికోణాన్ని నిలుపుకోవడం ఆయన ప్రత్యేకత! ఈ విషయాలన్నిటినీ పొందుపరిచి ‘దారిదీపం’ మాసపత్రిక సంపాదకులు డివివిఎస్ వర్మ – రాంభట్ల కృష్ణమూర్తి శతజయంతి విశేష సంచికను వెలువరించారు. దానికి ఆర్వీ రామారావు గౌరవ సంపాదకులుగా వ్యవహరించారు.

తొలితరం జర్నలిస్టుగా, తొలి కార్టూనిస్ట్ గా, మార్క్సిస్టు మేధావిగా గుర్తింపబడ్డ రాంభట్ల ఏ రాశారోనని ఆయన రచనలను జాగ్రత్తగా పరిశీలించాను. అప్పుడు తెలిసింది ఆయన నిజంగానే విషయ పరిజ్ఞానం గలవారని! ‘వేదాలు సృష్టి మొదలైనప్పుడే ఉన్నాయని, ఆ భగవంతుడే స్వయంగా మానవుడికి అందించాడని’-ఊదరగొట్టేవారికి రాంభట్ల వాక్యాలు కొన్ని చూపించదలిచాను. ఆయన ఇలా రాశారు-‘‘మన వేద సమాజంలో జర్మన్ సమాజ ఛాయలు గోచరిస్తాయని, వేదకాలం కన్నా ముందే ఈ దేశంలో వర్థిల్లిన హరప్పా మొహంజోదారో సమాజాల్లో ప్రాచ్యసమాజలక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని’’- జనకథలో ఒక చోట చెప్పారు. ఇవి ఆధునిక పరిశోధనలు ధృవపరిచిన విషయాల్ని రాంభట్ల కృష్ణమూర్తి ఆ రోజుల్లోనే గ్రహించగలిగారు.

Also read: జీవిత సమస్యల్లోంచి బయట పడడం ఎలా?

ఇంకా ఇలా రాశారు. ‘‘మొహంజోదారో సమాజ సంస్కృతుల ప్రభావం వేదాల మీద పడినట్లు వేదాల్లో యెన్నో ఆధారాలు కనిపిస్తాయి. ఇప్పుడు రామాయణం చదువుతూ ఉంటే – మెసపటోనియా మొహంజోదారో సమాజం ప్రభావం రామయణంలో చాలా కనిపిస్తోంది. జుడీషియల్ బ్లయిండ్ నెస్ తొలగిపోయిన తర్వాత మన సమాజం కొత్త కాంతులతో కొత్త తేజస్సుతో కనిపిస్తోంది. అందుచేత మార్క్సిజం వెలుగులో మన చరిత్రను తిరిగి చూద్దాం. మన సమాజాన్ని తిరిగి అర్థం చేసుకుందాం. మన కూకటి వేళ్ళను –రూట్స్ ను- తిరగి పట్టుకుందాం!’’ ఇది రాంభట్ల కృష్ణమూర్తి భావితరాలకు ఇచ్చిన సందేశంగా మనం పరిగణించాల్సి ఉంటుంది!

…..

అలాగే విద్యార్హతలు లేని మరో పరిశోధకుడు ఇప్పుడు మన ఎదుటే ఉన్నాడు. ఆయన పేరు శివశంకర్. వృత్తిరీత్యా ముఠాకూలీ అయిన ఒక వ్యక్తి, ప్రవృత్తిరీత్యా చరిత్ర అన్వేషణకు పూనుకున్నాడు. గుంటూరు జిల్లాలో ఐదు వందల అదృశ్య గ్రామాలను గుర్తించి, వాటి గురించిన సమాచారం గ్రంథస్థం చేశాడు. మణిమేల శివశంకర్ అతి సాధారణ ముఠా కార్మకుడు. అదే జీవన భృతి. అయినా, అతని మనసు మరొక విషయం కోసం తపిస్తూ ఉంటుంది. తీరిక దొరికినప్పుడల్లా లేదా తీరిక చేసుకున్నప్పుడల్లా అతను శాసనాలు వెతుకుతుంటాడు. వాటి సారాన్ని క్రోడీకరిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఇప్పటికి ఎన్నో అదృశ్య గ్రామాల చరిత్రను వెలికితీశాడు. ఇంకా తీస్తూనే ఉన్నాడు. అతను ఉన్నత చదువులు చదివినవాడు కాదు. ఏ విశ్వవిద్యాలయం నుండి ఏ డిగ్రీ తీసుకున్నవాడు కూడా కాదు. అతి కష్టంమీద అయిదో తరగతి మాత్రం చదివినవాడు. అయితే నేం? అతను తెలుగు చరిత్ర పరిశోధకుల జాబితాలో చేరిపోయాడు.

నిరుపేద కుటుంబంలో పుట్టిన మణిమేల శివశంకర్ కు చదువుకునే అవకాశం రాలేదు. జీవనోపాధి కోసం తప్పనిసరైన పరిస్థితుల్లో ముఠాకార్మికుడిగా మారాల్సివచ్చింది. అతని స్వగ్రామం పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామం. ఉన్న ఊళ్ళో బతుకుదెరువు లేక జిల్లా కేంద్రం గుంటూరుకు వెళ్ళి అక్కడ స్థిరపడాల్సి వచ్చింది.

Also read: అంబేడ్కర్ : బౌద్ధ ప్రమాణాలు

బాల్యంతో శివశంకర్ ను పెద్దవాళ్ళు ఆలయాలకు తీసుకువెళ్ళినప్పుడు, ఆ బాలుడి దృష్టి దైవ విగ్రహం మీద ఉండేది కాదు.  చుట్టుపక్కల వాతావరణం మీద, శిల్పాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టేవాడు. అలాగే అక్కడి స్థానికులను అడిగి స్థలవిశేషాలు ఆసక్తిగా తెలుసుకుంటూ ఉండేవాడు. దగ్గరలో ఏవైనా శాసనాలు కనబడితే వాటిని మెల్లమెల్లగా చదవాడినికి ప్రయత్నించేవాడు. క్రమంగా అది అతని ప్రవృత్తిగా మారింది. వయసు పెరిగిన కొద్దీ బాధ్యత మీదపడుతుంది గనక – ప్రవృత్తి తిండి పెట్టదు గనక – చదువు పెద్దగా లేదు గనక – మరో మార్గం లేక ముఠా కార్మికుడిగా జీవనోపాధి చూసుకున్నాడు. అయితే వృత్తిధర్మం పూర్తి కాగానే ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోకుండా శాసనాల వెంట పడేవాడు.

పరిశోధన మీద ఆసక్తి పెరుగుతూ ఉండడంతో ఆర్కియాలజీ విభాగం అందుబాటులోకి తెచ్చిన శాసనాలు అధ్యయనం చేయడం ప్రారంభించాడు. పురాతన తెలుగు శాసనాలు చదవడంలో క్రమంగా పట్టు సాధించాడు. సంస్కృత శాసనాలు  చదవడానికి, అర్థం చేసుకోవడానికి ఇతర పెద్దలపై ఆధారపడేవాడు. ఇతనిలోని ఉత్సుకతను గమనించి వారు ఇతనికి సహకరిస్తూ ఉండేవారు. పైగా, మరింతగా ప్రోత్సహించేవారు.  ఆ విధంగా మణిమేల శివశంకర్ లో తెలియకుండానే ఒక పరిశోధకుడు ఎదుగుతూ వచ్చాడు. ఆ రకంగా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి, అక్కడి పెద్దల్ని, విద్యావంతుల్ని పలకరించేవాడు. ఊళ్ళ మధ్య గల ఖాళీ ప్రదేశాల్ని, సమీపంలో ఉన్న చిన్నచిన్న అడవుల్ని తరచి తరచి చూసేవాడు. ఆనవాళ్ళు, ఆధారాలు ఏవైనా దొరుకుతామేమనని శోధించేవాడు. ఆ ప్రయత్నంలో స్థానిక రికార్డుల్ని, కల్నల్ మెకంజీ రాతల్నీ వెతికి పట్టుకుని అధ్యయనం చేశాడు.

Also read: వాల్మీకి రామాయణంలో రాముడు దేవుడు కాదు

గుంటూరు జిల్లాలో అదృశ్యమైపోయిన సుమారు ఐదు వందల గ్రామాలకు సంబంధించిన ఆధారాలు దొరకబట్టుకుని, వాటి గురించి రాయడం ప్రారంభించాడు. ఫలితంగానే ‘‘గుంటూరు జిల్లా అదృశ్య గ్రామాలు’’ పేరుతో మణిమేల శివశంకర్ రచన పుస్తకంగా వెలువడింది. మన జాతీయ పతాకానికి రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య పూర్వీకులకు – అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన్నకు, నేటి సినీకవి పింగళి నాగేంద్రరావులకు – వారి వారి పూర్వీకులకు సంబంధించిన ఇతివృత్తమంతా  మణిమేలల శివశంకర్ వెలికితీశారు.

రెంటాల బ్రహ్మీ శాసనంలో ప్రస్తావించిన ‘నిడిగల్లు’ గ్రామం సాధారణ శకం మూడవ శతాబ్దం నాటి ఇక్ష్వాకుల రాజధానిగా ఉన్న నాగార్జునికోట విజయపురిలో ఉన్నదనడానికి ఆధారం ఇచ్చాడు. అలాగే, దుర్గి మండలంలో అదృశ్యమైపోయిన ‘దద్దనాలపాడు’ ఒకప్పుడు రాజకుంటుంబాలలోని స్త్రీలు సతీసహగమనం చేసిన ప్రదేశమని శివశంకర్ ఆధారాలు చూపాడు. తెనాలి రామకృష్ణ కవి స్వగ్రామం తెనాలి మండలంలోని కొలకలూరుకు సమీపంలో అదృశ్యమై పోయిన ‘గార్లపాడు’ అని ఈ పరిశోధకుడు నిరూపించాడు.  ఇతని కృషికి ఆ మధ్య ‘‘అయ్యంకి వెలగా పురస్కారం’’ లభించింది.

ఇలాంటివారు ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటారు.తాము చేయదలచుకున్న పని నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతారు. వివేకవంతులు దయతో ఇలాంటి వారిని వెలికి తీసి, సభ్యసమాజానికి పరిచయం చేస్తూ ఉండాలి. ఇలాంటి పరిచయాలు మరి కొందరికి స్ఫూర్తి నిస్తూ ఉండాలి. గొప్ప పదవుల్లో ఉండి కూడా – చేసింది ఏమీ లేకపోయినా, సిగ్గులేకుండా అంతర్జాతీయ అవార్డులకోసం ప్రయత్నాలు చేసుకునే హీనమనస్కులు, మీడియా పిచ్చోళ్ళూ ఉన్న ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా, ఎవరినీ పట్టించుకోకుండా సత్యాన్ని అన్వేషించే దిశగా నిరంతరం కృషి చేస్తున్నవారిని మనం తప్పకుండా గుర్తించాలి! గుర్తుంచుకోవాలి!! గౌరవించుకోవాలి!!!

Also read: నాస్తికోద్యమ విప్లవ వీరుడు-పెరియార్

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త – మెల్బోర్న్ నుంచి)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles