Monday, April 29, 2024

జీవిత సమస్యల్లోంచి బయట పడడం ఎలా?

 ‘‘జ్ఞానాన్ని అందించే మాటలు ఆభరణాలకంటే గొప్పవి’’-బేగం హజరత్ మహల్ (బ్రిటిష్ ఇండియా కంపెపై తిరుగుబాటు చేసిన అవథ్ రాణి).

జీవితం గురించి సహజంగా అందరికీ కొన్ని ప్రశ్నలుంటాయి. వాటికి సమాధానాలు మనకు మనమే వెతుక్కోవాలి. బుద్ధుడి దగ్గరి నుండి తర్వాత వచ్చిన తాత్త్వికులు, ఆలోచనాపరులు, మేధావులు చెప్పిన విషయాల్లోంచి మనం కొన్నికొన్ని విషయాలు సంగ్రహించుకోవాలి. మనకు మనం స్పష్టంగా అర్థం కావాలంటే ఈ పని చేయక తప్పదు. కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇలా ఉంటాయి. వాటిని మనకు మనమే విశ్లేషించుకుని జీర్ణించుకోవాలి!

ప్రశ్న: దేనికీ అస్సలు సమయం దొరకడం లేదు. రోజులు ఎందుకింత తీరిక లేకుండా గడుస్తున్నాయ్?

జవాబు: ఒక ధ్యేయమంటూ లేని కార్యక్రమాలతో తీరిక దొరకదు. నువ్వు సాదించాల్సిన ధ్యేయం మీద మనసు పెడితే, సమయం దొరుకుతుంది!

Also read: ఇంగితం లేని పండిత ప్రకాండులు

ప్రశ్న: జీవితం ఎందుకిం సంక్లిష్టమైపోతోంది?

జవాబు: జీవితంలోని ప్రతి విషయాన్ని మనసు మీదికి తీసుకుని, అతిగా ఆలోచించి, కంగారుపడకు. హాయిగా, సాఫీగా జీవించడం నేర్చుకో!

ప్రశ్న: జీవితం ఎందుకింత బాధతో, దు:ఖంతో సంతోషమనేది లేకుండా గడిచిపోతూ ఉంది?

జవాబు: మదన పడడం, ఆందోళన పడడం, అతిగా స్పందించడం అలవాటైపోయినప్పుడు – సంతోషం సహజంగా దూరమై, బాధ మాత్రమే మిగులుతుంది.

ప్రశ్న: మంచి వాళ్ళకే ఎందుకు ఎక్కువ బాధలు ఉంటాయ్?

జవాబు: సానపెట్టనిదే వజ్రం మెరవదు. నిప్పులో కరిగించనిదే బంగారానికి వన్నె పెరగదు – కావల్సినాకారం రాదు! మంచివాళ్ళకు బాధలూ, అనుభవాలూ తప్పవు. వాటిని ఎదుర్కుని నిలబడినప్పుడే వారి జీవితం సుఖమయం అవుతుంది. వారి జీవితం విలువైనదవుతుంది.

ప్రశ్న: అంటే – అలాంటి అనుభవాల వల్ల, బాధల వల్ల ఉపయోగం ఉంటుందా?

జవాబు: అనుభవం ఒక క్రమశిక్షణ గల ఉపాధ్యాయుడి వంటిది. అయితే ఇక్కడ పాఠం చెప్పి, పరీక్ష పెట్టడం ఉండదు. ఈ అనుభవం ముందు పరీక్ష పెట్టి, ఆ తర్వాతే పాఠం చెబుతుంది. దానికి మనం సిద్ధపడి ఉండాలి!

Also read: చదువురాని అవివేకులు పాలకులైతే?

ప్రశ్న: సమస్యలన్నీ చుట్టు ముట్టినపుడు, అసలు మన జీవితం ఎటుపోతోందన్న ప్రశ్నమొదలవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలీ?

జవాబు: చాలా మంది బాహ్యప్రపంచంలోకి చూసి బెంబేలు పడుతుంటారు. కళ్ళకు బాహ్యప్రపంచాన్ని చూడగలిగే దృష్టి ఉంటుంది. కాని, హృదయానికి లేదా మనసుకు – అంతర్లోకాలను దర్శించగలిగే జ్ఞానం ఉంటుంది. ఎటు పోవాలి? ఏం చేయాలి? అతే దానికి, అది దారి చూపుతుంది. కళ్ళ చూపు పరిమితం. మనసు చూపు అపరిమితం.

ప్రశ్న: అపజయం మనిషి విచక్షణా జ్ఞానాన్ని దెబ్బతీసి, సరైన దారిలో పోకుండా అడ్డకుంటుందా?

జవాబు: నీ విజయం – అనేది ఇతరులు నిర్ణయిస్తారు. నీకు సంతృప్తి కలిగిందా? లేదా అనేది మాత్ర నీకు నువ్వే నిర్ణయించుకునేది. ఇతరుల నిర్ణయానికి విలువనిచ్చి నీలోనువ్వే  అహంకారం పెంచుకుంటే, నువ్వు దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. అద నీ సంతృప్తికి ప్రాధాన్యత ఇచ్చినపుడు అది నన్ను  సరైన  మార్గంలో నడిపిస్తుంది. నీకు సంతృప్తి నిచ్చే విజయం కోసం తపిస్తూ ఉండు. అంతే! అప్పుడు అపజయమైనా నీ విచక్షణా జ్ఞానాన్ని దెబ్బతీయదు.

ప్రశ్న: గడ్డుకాలంలో సైతం చైతన్యవంతంగా ముందుకు పోవడం, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉండడం సాధ్యమా?

జవాబు: సాధ్యమే! సాధించింది చూసుకుని సంతృప్తిగా, ధైర్యంగా నిలబడడం అవసరం. అంతేగాని, ఇతరులతో పోల్చుకొని, ఇంకా ఇంకా ఏమో చేయలేక పోయామనే అసంతృప్తిని పెంచుకుంటే సాదించిన దానికి కూడా విలువలేకుండా పోతుంది. మందుకు పోవాలన్న ఆశ ఉండాలి! సాధ్యమైనంతవరకు ప్రయత్నిస్తూనే ఉండాలి!! అంతే గాని, అత్యాశతో, అసహనంతో,  శక్తికి మించిన ప్రణాళికలు వేసుకొని, అభాసుపాలు కాకూడదు. ప్రతి ఒక్కరికి కొన్నిసాధ్యాసాధ్యలుంటాయి. అలాగే, మన ప్రమేయం లేకుండానే రాజకీయ, ఆర్థిక, సామాజికపరమైన అడ్డంకులు ఎదురౌత ఉంటాయి. వాటన్నిటినీ ఎదుర్కొంటూ సాధించింది ఏదైనా ఉంటే – దాన్ని తక్కువ చేసి తీసిపారేసుకోగూడదు. మనం జీవిస్తున్న సమాజం యొక్క ప్రభావం మన  జీవితాలపై తప్పకుండా ఉంటుందన్న వాస్తవాన్ని జీర్ణించుకోవడం మంచిది.

ప్రశ్న: ఈ సమస్యలన్నీ –ఈతిబాధలన్నీ తమకే ఎందుకూ? అని కొందరు బాధపడుతుంటారు కదా? అలా ఎందుకూ?

జవాబు:  నిజమే! ఈ సమస్యలన్నీ తమకే  ఎందుకూ? అని అనుకునేవారు ఒక విషయం ఆలోచించరు. వారు సుఖసంతోషాలతో సంతోషకరమైన జీవితం గడుపుతున్నప్పుడు మాత్రం – ఇంత మంచి జీవితం తమకే ఎందుకు లభించిందీ – అని  ఏ మాత్రం ఆలోచించరు. తమను తాము ప్రశ్నించుకోరు. అదే మానవ ప్రవృత్తి! ప్రతి దానికీ కారణముంది. ఆ కారణాన్ని అర్థం చేసుకుంటే వేదనలు, సంవేదనలు ఉండవు.

ప్రశ్న:  మా జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడం ఎలా?

జవాబు: గత జీవితం పట్ల విచారం వద్దు.సమకాలీన జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. భవిష్యత్ జీవితం గడపడానికి బయపడకుండా సిద్ధపడాలి. అంతే!! జీవించడం ఎలాగో తెలుసుకుంటే చాలు. జీవితం అత్యంత అద్భుతంగా ఉంటుంది.అది తెలుసుకోవడానికే ఈ ప్రపంచంలో ఎంతో మంది మహానుభావులు ప్రయత్నిస్తూ వచ్చారు. ప్రయత్నిస్తూ ఉన్నారు కూడా! ఆత్మల మీద ధ్యాస పెట్టకుండా ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా సంతృప్తిగా జీవించగలిగితే – ఆ జీవితమే ఉత్తమమైనది!

Also read: అంబేడ్కర్ : బౌద్ధ ప్రమాణాలు

ప్రశ్న: జీవితంలో బంధాలు తెగిపోతే ఎలా? ఏం చేయాలీ?

జవాబు: తప్పు.బంధాలు ఎప్పుడూ తెగిపోవు! అవి కుటుంబ సంబంధాలైనా, సామాజిక సంబంధాలైనా – బంధాలు ఎప్పుడూ తెగిపోవు. మాటల్లో తెగిపోతే, కళ్ళలో ఉండిపోతాయ్.కళ్ళలో తెగిపోతే జ్ఞాపకాల్లో ఉండిపోతాయి. అయితే, వాటిని ఎక్కడిదాకా ఎలా నిలుపుకోవాలన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే – ‘జిన్హే హం భూల్ నా చాహే – ఓ అక్సర్ యాద్ ఆతే హై’- మరచి పోవాలని అకునేవారు మళ్ళీమళ్ళీ గుర్తుకొస్తుంటారు.

ప్రశ్న: జీవితం ఒక్కోసారి ఒక్కోరకంగా అర్థమవుతూ ఉంటుంది. మన జీవితం ఒక్కటే అయినప్పుడు, అది ఎప్పుడూ ఒకేలా ఉండొచ్చుకదా? వ్యత్యాసాలెందుకూ?

జవాబు: ఉండదు. ఉండదనే విషయం తెలుసుకునే మసలుకోవాలి! మానవ ప్రవృత్తి ఒక్క రకంగా ఉండదు. చుట్టూ ఉన్న పరిస్థితులూ ఒకే రకంగా ఉండవు. అందుకే మనజీవితంలో ఒక్కోసారి ఒక్కోరకంగా అనిపిస్తుంది! ఉదాహరణకు కొన్ని కొన్ని సందర్భాలు చూద్దాం –

  • మనం ఒక పావుగంట ఒక తాగుబోతుని గమనిస్తే – జీవిత చాలా సింపుల్ కదా? అని అనిపిస్తుంది. బాధ్యతలూ, పరిసరాలూ అన్నీ మరచిపోయి, తన లోకంలో తను ఉంటాడు. అన్నీ వదిలేస్తే ఏముంది? జీవితం సులభమైపోతుంది.
  • అదే మన ఉపాధ్యాయుల మందు, గురుతుల్యుల ముందు కూర్చుంటే – మళ్ళీ మన విద్యార్థులమై పోయినట్టు అనిపిస్తుంది!
  • ఒకవేళ ఎప్పుడైనా మహాశాస్త్రవేత్తల దగ్గర కూర్చుని, వారి కృషిని వారి మాటల్లో వింటే – మనం ఎంత అజ్ఞానంగా బతుకుతున్నామో అర్థమౌతుంది.
  • సైనికుల మందు కూర్చుంటే – వారి త్యాగం ముందు వారు దేశానికి అందిస్తున్న సేవల ముందు మనం  ఎందుకూ పనికిరామని అనిపిస్తుంది!
  • రైతుల మందు, కార్మికుల ముందు కూర్చుంటే- వారు పడుతున్న కష్టం మనం పడడం లేదే- మన కెంత సుఖవంతమైన జీవితం లభిస్తోందీ అని అనిపిస్తుంది. వారు తిండి పెట్టకపోతే, వస్తువులు తయారు చేసి ఇవ్వకపోతే అసలు మనం ఎలా జీవించేవాళ్ళం? ప్రాణం ఉంటేనే కదా జీవితముండేదీ?
  • వ్యాపారుల మధ్య కూర్చుని వారి మాటలు వింటుంటే – మనం, మన సంపాదన ఎంత తక్కువో అర్థమవుతుంది. మన సంపాదన దేనికీ సరిపోవడం లేదో తెలిసొస్తుంది! సంపాదించడానికి ఎన్నెన్ని అవకాశాలుడి కూడా మనమేమీ చేయడం లేదేమన్న న్యూనతాభావం కలుగుతుంది.
  • రాజకీయ నాయకుడి హోదా, ఆర్భాటం చూస్తే చాలు – అనవసరంగా మనం ఉన్నత విద్యనార్జించి జీవిత కాలం వృథా చేసుకున్నామే – అని అనిపిస్తుంది. ఆరో తరగతిలో చదువు మానేసినవాడు రాష్ట్రాన్నీ, దేశాన్నీ పరిపాలిస్తున్నప్పుడు అసలు చదువుకేమైనా విలువ ఉందా? అన్న అనుమానం వస్తుంది.
  • జీవిత బీమా చేసే ఏజెంటు ఇంటికొచ్చి ఆసక్తికరమైన పాలసీలు, వాటి ద్వారా పొందబోయే పెద్దమొత్తం డబ్బు వివరాలూ చెప్తుంటే – ఏమయితే అది అయ్యింది. తక్షణం చస్తే మంచిదేమో – అని అనిపిస్తుంది. ఛస్తూ, ఛస్తూ బతికేకన్నా చచ్చి కుటుంబ సభ్యుల్ని బతికించడం మేలు కదా?- అనిపిస్తుంది!
  • ఓ పది నిమిషాలు భార్య ముందు కూర్చుంటే- జీవితంలో దొరికిన ప్రేమ,అనురాగం గుర్తొచ్చి కన్న పిల్లల మీద ఇంకెంత బాధ్యతగా ఉండాలో కూడా పథకం వేసుకోవాలనిపిస్తుంది! జీవితాన్ని స్వర్గం చేసుకోవాలనిపిస్తుంది!!
  • ఓ మంచి ప్రాణస్నేహితుడి ముందు కూర్చుంటే – జీవితంలోని తీపి, మధురిమ ప్రశాంతంగా నవ్వుకోవడంలోని ఆనందం దొరికాయనిపిస్తుంది. అతనితో కలిసి ప్రగతి పథంలోకి దారులెలా వేయాలో ఆలోచించాలనిపిస్తుంది!

జీవితమంటేనే వైవిధ్యభరితమైందని అర్థం!!

Also read: వాల్మీకి రామాయణంలో రాముడు దేవుడు కాదు

(రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత జీవశాస్త్రవేత్త. మెల్బోర్న్ నుంచి…)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles