Sunday, April 28, 2024

భారత్ తొలి ఓటమికి కారణాలు ఎన్నెన్నో!

  • టెస్ట్ క్రికెట్లో టీ-20 వ్యూహాలతో ఎదురుదెబ్బ
  • రోహిత్, విరాట్,రహానేల వైఫల్యం
  • ప్రభావం చూపని ఇశాంత్, బుమ్రా

ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లోని తొలిటెస్టులో ఆతిథ్య భారత్ ఘోరపరాజయం పై క్రికెట్ వర్గాలలో ఎడతెగని చర్చ కొనసాగుతోంది. ఓవైపు రవి శాస్త్రి నేతృత్వంలోని భారత్ టీమ్ మేనేజ్ మెంట్..మరోవైపు క్రికెట్ విశ్లేషకులు, క్రికెట్ పరిజ్ఞానం కాస్తోకూస్తో ఉన్నఅభిమానులు..చెన్నైటెస్టు తొలి ఓటమిపై ఎవరికి తోచిన విధంగా వారు పోస్ట్ మార్టం మొదలు పెట్టారు.

ఎనిమిదేళ్ల తర్వాత ఇంగ్లండ్ తొలిగెలుపు:

Image result for england win 1st test in india icc champian

చెపాక్ టెస్టు గెలుపుతో భారత్ ను భారతగడ్డపై ఇంగ్లండ్ ఎనిమిదేళ్ల తర్వాత ఓడించగలిగింది. భారత్ మాత్రం స్వదేశీ సిరీస్ ల్లో నాలుగేళ్ల తర్వాత తొలి పరాజయం చవిచూడటం ఏకకాలంలో జరిగిపోయాయి. అంతేనా 1999 తర్వాత చెన్నై వేదికగా జరిగిన టెస్టులో భారత్ ఓటమి పొందటం కూడా ఇదే మొదటిసారి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో భారత వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. కర్ణుడు చావుకు కారణాలు బోలెడు అన్నట్లుగా భారత్ ఓటమికీ కారణాలు అన్నే కనిపిస్తున్నాయి.

Also Read: విరాట్ కొహ్లీకి ఏమయ్యింది…?

కూరలో కరివేపాకులా స్పిన్నర్లు:

రవిశాస్త్రి చీఫ్ కోచ్ గా,విరాట్ కొహ్లీ కెప్టెన్ గా జట్టు బాధ్యతలు చేపట్టడంతోనే వ్యూహాలు ఒక్కసారిగా మారిపోయాయి. స్పిన్నర్లను కూరలో కరివేపాకులా వాడే సంస్కృతికి తెరతీశారు. అంతేకాదు ఫాస్ట్ బౌలర్లే మ్యాచ్ విన్నర్లు అన్న భావనను కొహ్లీ టీమ్ మేనేజ్ మెంట్ లో పాదుకొల్పాడు. అయితే..స్వదేశీ పిచ్ లపై భారత్ బలం స్పిన్ బౌలింగే కానీ పేస్ బౌలింగ్ కాదన్న వాస్తవం…చెపాక్ టెస్ట్ ఓటమితో మరోసారి తేటతెల్లమయ్యింది.

జాసూ పటేల్,వినూమన్కడ్, ప్రసన్న, బేడీ, చంద్రశేఖర్, వెంకట్రాఘవన్, కుంబ్లే లాంటి ఎందరో మేటి విశ్వవిఖ్యాత స్పిన్నర్లను అందించిన భారత్ లో ప్రస్తుతం రవిచంద్రన్  అశ్విన్ మినహా మరో నాణ్యమైన స్పిన్నర్ కనిపించకుండా పోయారు. ఈ పాపం..కేవలం భారత టీమ్ మేనేజ్ మెంట్ ది మాత్రమే. విదేశీ స్పిన్నర్లు గ్రీమ్ స్వాన్, మోంటీ పనేసర్, నేథన్ లయన్, ప్రస్తుత ఇంగ్లండ్ జట్టులోని బెస్, లీచ్ లాంటి అనామక స్పిన్నర్లను సైతం ఎదుర్కొనడంలో భారత బ్యాటింగ్ ఘనాపాటీలు దారుణంగా విఫలమవుతున్నారు. దేశవాళీ క్రికెట్లో నాణ్యమైన స్పిన్నర్లు కరువుకావడమే దీనికి ప్రధానకారణంగా చెప్పుకోవాలి.

బెడిసికొట్టిన ఆల్ రౌండర్ల వ్యూహం:

సాంప్రదాయ టెస్టు క్రికెట్ అనగానే ఒకప్పుడు స్పెషలిస్ట్ ఓపెనర్లు, స్పెషలిస్ట్ వికెట్ కీపర్, స్పెషలిస్ట్ స్పిన్నర్లకు ప్రత్యేకస్థానం, గౌరవం ఉండేవి. అయితే విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టులో మాత్రం ఆ స్ఫూర్తిని విడిచిపెట్టారు. కాస్త బౌలింగ్,కొంచెం బ్యాటింగ్, మిడిమిడి వికెట్ కీపింగ్ ప్రతిభ ఉంటే చాలు టెస్టుజట్టులో కీలక ఆటగాళ్లుగా పాదుకోడం ఏమంతకష్టంకాదు.

స్పెషలిస్ట్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్టంపింగ్ లు చేయకున్నా, క్యాచ్ లు పట్టకున్నా బ్యాటుతో పరుగులు చేస్తే చాలు. అలానే వికెట్లు పడగొట్టాల్సిన వాషింగ్టన్ సుందర్ ధారాళంగా పరుగులిచ్చినా బ్యాటుతో మెరిస్తే చాలు. ఎవరు చేయాల్సిన పని వారు చేయకపోతే టెస్టు క్రికెట్లో రాణించలేమని, పరాజయం తప్పదని చెన్నై టెస్ట్ తొలి ఓటమి ద్వారా భారత్ కు అర్ధమయ్యింది.

Also Read: ఐపీఎల్ కు వీవో గుడ్ బై

 నిండాముంచుతున్న ఐపీఎల్:

భారత క్రికెట్ నియంత్రణమండలికి జాతీయ ప్రయోజనాలకంటే ఐపీఎల్ వ్యాపారప్రయోజనాలే ముఖ్యమయ్యాయి. క్రికెటర్లకు సైతం ఐపీఎల్ కన్నతల్లిలా దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ సవతి తల్లిలా మారిపోయింది. ఐపీఎల్ కు పూర్తి ఫిట్ నెస్ తో అందుబాటులో ఉండే భారత స్టార్ బౌలర్లు, కీలక బ్యాట్స్ మన్ సైతం జాతీయజట్టు అంతర్జాతీయ అవసరాలకు వచ్చే సరికి ఫిట్ నెస్ సమస్యలతో జట్టుకు దూరం కావడం విజయావకాశాలను దెబ్బతీస్తోంది. ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులు తమ జాతీయ జట్ల అవసరాలు, ఆటగాళ్ల ప్రయోజనాల మధ్య సమతౌల్యం పాటిస్తూ ఆశించిన ఫలితాలు సాధించగలుగుతున్నాయి. అదే మన బీసీసీఐ మాత్రం ఐపీఎల్లే సర్వస్వం అన్నట్లుగా అసలుకే మోసం కొని తెచ్చుకొంటోంది. మహ్మద్ షమీ,ఉమేశ్ యాదవ్ లాంటి రివర్స్ స్వింగ్ స్పెషలిస్ట్ బౌలర్లు అందుబాటులో ఉండి ఉంటే చెన్నైటెస్టులో భారత్ ఓటమిపాలై ఉండేదికాదు.

సూపర్ స్టార్ల సూపర్ ఫ్లాప్:

భారత బ్యాటింగ్ కు వెన్నెముకలాంటి డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ, ప్రపంచ మేటి ఆటగాడు విరాట్ కొహ్లీ, ప్రభావపూరిత ఆటగాడు అజింక్యా రహానే వ్యక్తిగత ఫామ్, వైఫల్యం సైతం భారత బ్యాటింగ్ ను సాదాసీదాగా మార్చి వేసింది. ఇంగ్లండ్ ద్వితీయశ్రేణి స్పిన్నర్లు బెస్ తొలిఇన్నింగ్స్ లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో లీచ్ 4 వికెట్లు పడగొట్టడం చూస్తే భారత బ్యాటింగ్ ఎంత నాసిగా మారిందీ మరి చెప్పాల్సిన పనిలేదు. టాపార్డర్లో ముగ్గురు….లోయర్ ఆర్డర్లో ముగ్గురు పరుగులు చేసే స్థితిలో లేకపోడం, కేవలం మిగిలిన ఐదుగురు ఆటగాళ్లపైనే పరుగులభారం పడటం కూడా భారతజట్టును ఓటమిపాలు చేసింది.

Also Read: ర్యాంకింగ్స్ లో కొహ్లీని అధిగమించిన రూట్

వెలవెలపోతున్నకొహ్లీ నాయకత్వం:

Image result for kohli captency

కెప్టెన్ గానూ, జట్టు స్టార్ ప్లేయర్ గానూ విరాట్ కొహ్లీ విఫలం కావడం భారత ఓటమికి ప్రధానకారణంగా కనిపిస్తోంది. కొహ్లీ నాయకత్వంలో భారతజట్టు వరుసగా నాలుగో పరాజయం పొందటం కూడా ఆందోళన కలిగించే అంశమే. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ తుదిజట్టులోకి రిజర్వ్ ఆటగాడు షాబాజ్ నదీమ్ ను తీసుకొని…చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ను పక్కన పెట్టడం కూడా ఓటమికి ఓ కారణమనేవారు లేకపోలేదు.

Also Read: ఒక్క ఓటమితో తిరగబడిన భారత అదృష్టం

గాయం నుంచి కోలుకొని ఏడాది తర్వాత భారత తుదిజట్టులో చేరిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ, యార్కర్ల కింగ్ బుమ్రా..జీవంలేని చెపాక్ పిచ్ పై ఆశించినస్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ జట్టు తొలిఇన్నింగ్స్ లో 500కు పైగా స్కోరు సాధించడం, జో రూట్ డబుల్ సెంచరీ సాధించడానికి పేస్ జోడీ వైఫల్యమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏది ఏమైనా జయాపజయాలు ఆటలో భాగం. అయితే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని,లోపాలు సవరించుకొన్న జట్టే అసలుసిసలు విజేత కాగలుగుతుంది.

పోగొట్టుకొన్న చోటే వెతికిపట్టుకోవాలన్న మాటను విరాట్ అండ్ కో గ్రహించి…పరాజయం పొందిన చెపాక్ స్టేడియంలోనే  ఫిబ్రవరి 13న ప్రారంభమయ్యే రెండోటెస్టులో ఇంగ్లండ్ ను విరాట్ సేన దెబ్బకు దెబ్బతీయాలని కోరుకొందాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles