Saturday, September 7, 2024

హనుమ సూచనను సున్నితంగా తిరస్కరించిన సీతమ్మ

రామాయణమ్ 145

‘‘రాముడికి ఇతర దృష్టిలేదనీ నిత్యము శోకముతో ఉన్నాడనీ నీవు చెప్పిన మాటలు విషము కలిపిన అమృతమువలే  ఉన్నవి. దైవము మనిషిని ఐశ్వర్యము వైపునకు గానీ అతిభయంకర దుఃఖదారిద్ర్యములొనికి గానీ మనుజుని తాడు కట్టుకొని లాగుకొని పోవును. మనుష్యుడు నిమిత్తమాత్రుడు.

Also read: రామలక్ష్మణుల యోగక్షేమములు అడిగి తెలుసుకున్న సీత

‘‘ఓ హనుమా, దైవమును దాటగల శక్తి ఎవ్వరికున్నది? మేము మువ్వురమూ ఇంత దుఃఖసాగరములో మునిగితి మన్న అది దైవప్రేరితము గాక మరేమిటి? మా శోకమునకు ఎప్పుడో అంతము? నాకు ఆ దుష్ట రాక్షసుడు ఒక సంవత్సరము మాత్రము గడువొసగినాడు. అందులో పది నెలలు గడచిపోయినవి. ఈ బొందిలో ఇక ప్రాణము నిలుచునది రెండు నెలలే. ఆ లోపుగనే రాముడు ససైన్యముగా ఇచటికి ఏతెంచి రావణుని సంహరించి నా చెర విడిపించవలే.

‘‘విభీషణుడు  రావణుని తమ్ముడు  చెవినిల్లు కట్టుకొని పోరుచున్నాడు నన్ను తిరిగి రాముని వద్దకు చేర్చమని. కానీ రావణుడు ఆ హితమును పెడచెవిని పెట్టుచున్నాడు.

Also read: రాముడిచ్చిన అంగుళీయకము సీతమ్మకు సమర్పించిన హనుమ

‘‘వాడు కాలానికి లొంగి‌నాడు. కాలునికి అతిథిగా వెళ్ళవలెనని ఉవ్విళ్ళూరుచున్నాడు. తెగ ఆరాట పడుచున్నాడు. పోగాలము దాపురించినవాడికి మంచి విషయము తలకెక్కుతుందా? ఈ సంగతులు నాకు విభీషణుడి పెద్దకూతురు  “నల” తన తల్లి పంపగా నా వద్దకు వచ్చి తెలిపినది.

‘‘శచీదేవికి దేవేంద్రుని గురించి తెలిసినట్లు నాకు నా రాముని గురించి బాగుగా తెలియును. రామునిలో ఉత్సాహము, పురుషప్రయత్నము, బలము, క్రూరత్వములేకుండుట, కృతజ్ఞత్వము, పరాక్రమము మొదలైన గుణములు పుష్కలముగా యున్నవి. రామ కోదండ ధనుష్ఠంకారమే శత్రుశిబిరములో హాహాకారములు పుట్టించును.

‘‘హనుమంతుడా,  నా రాముడు ఒంటరిగా యుద్ధము చేసి జ‌నస్థానములో పదునాల్గువేల మంది రాక్షసులను యమ సదనమునకు పంపివేసినాడు.

Also read: సుగ్రీవాజ్ఞ గురించి సీతకు చెప్పిన హనుమ

‘‘ఓయి హనుమంతుడా, నా రాముడు శత్రుభయంకరుడు. నా రాముడు సకల గుణాభిరాముడు. నా రాముడు సర్వలోక మనోహరుడు. నా రాముడు పోతపోసిన ధర్మము. నా రాముడు నా మనోవీధులలో నిత్యసంచారి.’’

‘‘అమ్మా ! దుఃఖమేల? ఈ బాధ ఏల? ఇప్పుడే ఈ శోకము నుండి విముక్తను చేసెదను. నా వీపుపై కూర్చొనుము. రాముని వద్దకు మరుక్షణమే నిన్ను చేర్చెదను. సముద్రమును చిటికెలో దాటివేస్తాను. రాముని చెంత నిన్ను చేరుస్తాను.  రావణసహితముగా లంకను పెళ్ళగించుకొని పోగల శక్తి నాకు స్వంతము. నా గమనవేగమును అందుకొన గల శక్తి ఏ దైత్యునకూ లేదు.’’

Also read: రాముడి గుణగణాలను వర్ణించిన హనుమ

అని అతి చిన్న రూపముతో ఉన్న హనుమంతుడు పలుకగా ఆశ్చర్యముతో ఆయనను చూసి సంతోషించినదై సీతామాత ఈ విధముగా పలికెను.

ఓయి వానరుడా, నీ రూపమేమి? నీవేమి? నీ వానరబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. అంత దూరము నన్ను మోసుకొని పోగలవనియేనా?’’ అని అన్న రామపత్నిని చూశాడు హనుమ స్వామి.

ఒక అవమానము.  ఒక కొత్త అవమానము నేడు జరిగినది. సీతమ్మ తనను ఇంత తక్కువచేసి మాటలాడటము సహించలేకపోయాడు వాయునందనుడు.

వెంటనే తాను కూర్చొని ఉన్న కొమ్మమీదనుండి క్రిందకు దుమికి తన శరీరమును పెంచసాగాడు.

అప్పటి వరకు ఆయనకు నీడనిచ్చిన ఆ మహా వృక్షము ఆయన పాదములమీద మొలచిన వెంట్రుకవలె మారిపోయింది!

Also read: సీతమ్మతో హనుమ సంభాషణ

అమ్మా,  పర్వతములు, దుర్గములు, వనములు, సకలదైత్యసైన్యములు, రావణుని ఆతని సింహాసనముతో సహా లంకమొత్తాన్ని మోసుకొని పోగలను. అవి అన్నియు నా అరచేతిలోనికి ఇమిడిపోగలవు. సందేహము విడిచిపెట్టి నా వీపుమీద ఎక్కుతల్లీ! ఈ క్షణమే నీకు రామసందర్శనభాగ్యము కలుగ గలదు’’ అని పలికిన మహాకాయుడైన హనుమంతునితో సీతమ్మ ఇలా అన్నది.

మహాభయంకరమైన అలలతో కూడి అతి విస్తారమైన సముద్రాన్ని దాటి రాగలిగిన వారు సామాన్యులా? కాదు!!

నీ సామర్ధ్యము నేను ఎరుగుదు‌ను. నీ గమన శక్తి నాకు తెలుసు.

కానీ, మొదట ఇది రామకార్యము. రామ కార్యము చెడిపోకుండా జరగవలెను.

వాయువేగమనోవేగాలతో నీవు వెడుతున్నప్పుడు ఆ వేగతీవ్రత తట్టుకొనలేక

నేను కంగారు పడవచ్చును. కళ్ళుతిరిగి క్రింద పడిపోవచ్చును. అప్పుడు సముద్రజంతువులకు ఆహారమై పోయెదను.

ఇంకొక మాట. నీవు నన్ను తీసుకువెళ్ళుట చూసి రాక్షసులూరకుందురా?

నన్ను కాపాడుకొనుచూ నీవు వారితోయుద్ధము చేయవలసి రావచ్చును. అది నీకు చాలా క్లిష్టముగా పరిగణించును. ఆ యుద్ధములో వారు నన్ను సంహరింపవచ్చును. లేదా తిరిగి బందీగా పట్టుబడవచ్చును

అదియును గాక, నేను పరపురుషుని పొరపాటున కూడా స్పృశించను…….

NB

“పరపురుషుని స్పృశించను” అని అమ్మ అన్న ఈ మాట మొన్నమొన్నటి వరకు అందరికీ ఆదర్శము. నేడేలనో దానిని ఎవరూ పాటించుటలేదు . పరపురుషుడి “పాణిగ్రహణము” అదే “SHAKE HAND” చాలా సాధారణమై పోయింది…..

Also read: సీతమ్మ కంటబడిన హనుమ

వూటుకూరు జానకిరామారావు

.

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles