Friday, September 29, 2023

సీతమ్మ కంటబడిన హనుమ

రామాయణమ్139

సీతమ్మ ఎడమకన్ను, ఎడమభుజము అదురుతున్నవి. అవి ఏవో రాబోయే శుభములకు సూచన అని ఒక పక్షి వృక్ష శాఖమీద కూర్చుండి రాముడు రాబోతున్నాడమ్మా అన్నట్లుగా కూయసాగింది.

కంటికి మంటికి ఏకధారగా ఏడ్చి ఏడ్చి హృదయం బరువెక్కి ఇక జీవించుట దుర్లభమని నిశ్చయించుకొని ఒక చెట్టుకొమ్మ వద్దకు వెళ్లి పొడవైన తన జడనే ఉరిత్రాడుగా మలచుకొని ప్రాణ త్యాగము చేయ సంకల్పించుకొన్నదై సీతమ్మ  అచట నిలిచి యుండెను.

Also read: రాక్షస స్త్రీల మానసిక హింస, త్రిజట కల

అదుగో ఆ కొమ్మ మీదే అమ్మను చూస్తూ మారుతి అతి చిన్న రూపముతో ఆకుల గుబురులలో ఆమె పరిస్థితిని గమనిస్తూ దాగి ఉండెను.

‘‘ఎలా మాట్లాడాలి?  ఎలా ఓదార్చాలి? ఈమె దుఃఖమునకు అంతములేకుండా ఉన్నది. అమ్మతో నేను రాముని దూతను అను విషయము ఎలా చెప్పాలి?’’ అని పరిపరి విధములుగా ఆలోచిస్తున్నారు హనుమ స్వామి.

‘‘ఈమెను చూశాను. ఈమె సందేశమేదీ తీసుకుని వెళ్ళనట్లయితే రామునికి కోపము వచ్చును. కావున సీతమ్మతో మాటలాడి ఆవిడను ఓదార్చి వెళ్ళవలెను. నా సంభాషణ అంతా  రహస్యముగా సాగవలె. వేరెవరికీ అనుమానము కలుగకూడదు. విశేషించి రాక్షస స్త్రీలు గమనించరాదు. మరి నేను ఏ భాషలో ఈవిడతో సంభాషించవలె? బ్రాహ్మణులు మాటలాడు సంస్కృత భాషలో మాటలాడినట్లైన, నన్ను రావణుడు అని అనుమానించుటకు ఆస్కారమున్నది. ఆ అనుమానముతో ఆవిడ కేకలు వేసినట్లయితే ఎదో జరుగుతున్నదని అనుమానించి రాక్షసులు నన్ను చుట్టుముట్టగలరు.

Also read: సీతను దారికి తేవాలని రాక్షసస్త్రీలను ఆదేశించిన రావణుడు

‘‘స్పష్టముగా అర్ధమగు రీతిలో మామూలు మనుజులు మాటలాడుకొను భాషలోనే సీతమ్మతో మాటలాడి కార్యమును పూర్తిచేసుకొందును. మరి నా రూపము ఎటులుండ వలె? నేను ఎ విధము గా ప్రవర్తించినచో నా సముద్ర లంఘనము వ్యర్ధము కాదో ఆ విధముగా  నే చేయవలెను. సంభాషణ ఎలా మొదలు పెట్టవలె? ఈమె మనస్సు రాముని యందె లగ్నమై ఉన్నది కావున ఆమెకు అత్యంత ఇష్టమైన రామ కధా గానముతో ప్రారంభించెదను.’’ అని నిశ్చయించుకొని హనుమస్వామి చెట్టుకొమ్మలలో దాగుండి గొంతు సవరించుకొనెను.

(Process of communication …..sender మరియు ఒక receiver ఉంటారు. వారి మధ్య ఒక medium of expression ఉండాలి. దానిని మనము భాష అంటాము.

When a sender sends some information in a code, (we call it language), the receiver must be in a position to decode that and he must be able  to reciprocate.  Then only we say the communication is complete.

SIMPLICITY, LUCIDITY, EUPHONY  … these three are the characteristic features of effective communication …

See the thought process of Lord Hanuman!! ,

Maharshi Valmeeki had told us the same.)

సీతమ్మకు వినటానికి మధురమైన వాక్యమును వాయునందనుడు సుమధురముగా గానము చేయసాగెను.

Also read: ‘నువ్వు గడ్డిపోచతో సమానం’ అని రావణుడికి స్పష్టం చేసిన సీత

‘‘దశరధమహారాజొకండు ఇక్ష్వాకువంశమందు ప్రసిద్ధుడైన మహారాజు. ఆయన మహదైశ్వర్యవంతుడు. తాను సుఖపడుతూ ఇతరులను సుఖపెట్టుటలో ఆయనంతవారు ఎవరూ లేరు. ఆయన కొమరులు నల్వురు.

‘‘వారిలో జ్యేష్ఠపుత్రుడు శ్రీరాముడన్న ఆయనకు ప్రీతి. ఆ రాముడు సకల గుణాభి రాముడు, హరకోదండవిఖండనుండు, జనకరాజునకు జామాత, జానకీప్రియుడు! ఆయన తండ్రి ఆజ్ఞపాటించుచూ భార్య, తమ్మునితో కలసి అడవికి ప్రవాసము వెళ్ళెను.

‘‘ఆ రాముడు విరాధకాలుడు! ఖరవిధ్వంసి, మారీచుని పీచమణచి వాని ప్రాణములు హరించిన మేటిపోటరి! ఆయన భార్యను రావణుడపహరింపగా ఆమెను వెదుకగా నన్ను పంపెను. నేనంతనబ్దిదాటి నిన్నుకనుగొంటి. నీవు అచ్చము రాముడు చెప్పిన రమణివలె నుంటివి.

Also read: సీతను సుముఖం చేసుకోవడానికి రావణుని ప్రేలాపన

బొడగంటి, కనుగొంటి కనుగొంటి నీవె సీతమ్మవు. రాముని హృదయేశ్వరివి!’’

అని పలుకుచున్న హనుమంతుని మాటలు విని అవి ఎచటనుండి వచ్చుచున్నవో అని మోమెత్తిచూసింది జనని జానకమ్మ.

ఎచటనో కొమ్మలలో ఒక మెరుపులప్రోవు ఆమె కంటపడింది.

Also read: భీతిల్లే లేడికూన సీత

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles