Saturday, July 13, 2024

ద్వేషాలు వదిలేయడం శాంతికి దారి

మాడభూషి శ్రీధర్ – తిరుప్పావై –27

కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై
ప్పాడి పఱైకొండు యామ్ పెరుసమ్మానమ్
నాడు పుగళుం పరిశినాళ్ నన్ఱాక
శూడగమే తోళ్ వళైయే తోడే శెవి పువ్వే
పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్
ఆడైయుడుప్పోం అదన్ పిన్నే పాల్ శోఱు
మూడనెయ్ పెయ్దు ముళగైవళివార
కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్

తెలుగు భావార్థ గీతిక

ఒల్లని మనసులైన గెల్చెడి గోవింద బిరుదాంకితా

నీ వైభవమ్ము కీర్తించి పఱైనడగ వచ్చినాము, లేక

జగమెల్ల మెచ్చురీతి పెద్దసన్మానమును కోరినాము

బంగారు మణి కంకణములు, కై దండలు కొన్ని

గున్నాలు చెవిపూలు, కాలికై వెండికడియాలు

మేలి వస్త్రములు ఆపైన, మోజేతిదాక నేయి కారెడు

పాలపాయసాన్నములు  నీ చెంత కూర్చుని ఆరగించ

మాకు నీ నిత్య సాంగత్య దివ్యసౌభాగ్య సాకేతమిమ్ము

This image has an empty alt attribute; its file name is image-36-658x1024.png

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై

తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః

ఒకరినొకరు కాపాడుకుందాం, సంపదను అందరం కలిసి అనుభవిద్దాం.  సాహసాలూ కలిసే చేద్దాం, తేజోవంతులమవుదాం, ద్వేషాలు వదిలేయడం శాంతికి దారి.

Also read: శ్రీకృష్ణుడుఇంద్రనీలమణి, మణివణ్ణా, భక్తులకు కొంగుబంగారం

భగవంతుని అందడం, ఆయన కళ్యాణ గుణాలను అనుభవించడమే వ్రత ఫలం.

అర్థం
గోపికలు నిన్నటి పాశురంలో అడిగిన వస్తువులు భౌతికమైనవి కావు. సామాన్యమైనవి కావు. సాక్షాత్తూ వాసుదేవుడు ధరించే శంఖ చక్రాలు అంటే శంఖ చక్రధరుడైన వాసుదేవునే వారు కోరుతున్నారని అర్థమైంది. లేకపోతే శంఖ చక్రాలతో పాటు, గరుడ ధ్వజం,పారతంత్ర్యమనే పఱై కోరుతూ మంగళాశాసనాలు చేసేవారు, మహాలక్ష్మి వంటి మంగళదీపాన్ని కావాలంటున్నారు. చాందినీ, ఆసనం, పడక అని రకరకాలుగా అమరే ఆదిశేషుని కోరుకుంటున్నారు. ఇవి సామాన్యులకు అమరేవికావు. అమరులకు కూడా దొరకవు. అంటే అవన్నీ నిరంతరం కలిగి ఉండే వాసుదేవుడే వారికి కావాలని అర్థం. వాసుదేవుడే దుర్లభుడు. వారి అంతరంగం తననే కోరుకుంటున్నదని వాసుదేవుడు గమనించాడు. సరే మీ వ్రతఫలమేమని మీరు అనుకుంటున్నారు అని ఈ పాశురంలో వాసుదేవుడు సూచించడం, వారు వివరించడం తరువాతి పాశురాలలో జరుగుతుంది.

కూడారై = తనను కూడని వారిని సైతం, వెల్లుమ్= జయించే: శీర్= కళ్యాణగుణసమన్వితుడైన: గోవిందా = గోవింద నామధేయుడా, ఉన్ఱనై= నిన్ను, ప్పాడి = కీర్తించి, పఱైకొండు =పర అనే వాయిద్యాన్ని కోరి, యామ్= మేము,పెరు=  పెద్ద లేదా పొందెడి, శమ్మానమ్=సన్మానమును,నాడు=లోకమంతయు, పుగళం పరిశినాళ్ = మెచ్చుకునే రీతిలో, నన్ఱాకబ శూడగమే= చేతికి ఆభరణాలు, తోళ్ వళైయే= భుజకీర్తులు, తోడే= కర్ణాభరణాలైన దుద్దులు, శెవి ప్పూవే= చెవికి ధరించే పూవులు, పాడకమే = పాదాభారణాలు, యెన్ఱనైయ = అని పిలువ బడే, పల్కలనుమ్=అనేక రకాల ఆభరణాలను, యామ్ = మేము, అణివోమ్= ధరింతుముగాక,ఆడై= వస్త్రములను, ఉడుప్పోం = ధరింతుముగాక, అదన్ పిన్నే= దాని తరువాత, పాల్ శోఱు= పాలతోచేసిన అన్నము, పరమాన్నము, మూడ =నెయ్ పెయ్దు = నేయి పోసి, ముళంగై = మోచేతినుండి, వళివార=కారునట్లుగా, కూడి ఇరుందు= నీతో కలిసియుండి, కుళిరుంద= ఆరగించడమే-ఏలోర్ ఎంబావాయ్= మావ్రతము.


కలిసి రాని శత్రువులను జయించడమనే కళ్యాణగుణ సంపద గల గోవిందుడా నిను కీర్తించి, ఈ తిరుప్పావై వ్రత సాధనమైన పఱై అనే వాయిద్యమును పొందిన, పొందదలిచిన, ఘనసన్మానము లోకులంతా మెచ్చుకునేట్టు ఉంటుంది. చేతులకు గాజులు, భుజాలకు కడియాలు, చెవికింద దుద్దులు, పైన చెవిపూలు, కాలికి అందెలు, వంటి అనేకాభరణాలు ధరించాలి. పిదప మంచి చీరలు కట్టుకోవాలి. తరువాత పాలు అన్నము మునిగేట్టు నేయి పోయాలి. ఆ తీపి పరమాన్నాన్ని మోచేతి వెంట కారునట్టుగా దోసిట్లో పోసుకుని జుర్రుకోవాలి అదీ నీతో కూచుని హాయిగా భుజించాలి, ఇదే మా వ్రతఫలం గోవిందా అంటున్నది గోదమ్మ.

Also read: గుండెలో కంసుని ద్వేషమనెడు నిప్పు
భగవంతుని అందడం, ఆయన కళ్యాణ గుణాలను అనుభవించడమే వ్రత ఫలం. పరమాన్నాన్ని పరమాత్ముడితో కలిసి అనుభవించడమే పరమానందం. పరమానందమే మోక్షం. అదే కూడారై.

యామునాచార్యులుప్రార్థన

‘నావంటి అధముడు, తప్పులు చేసిన వాడు, అపవిత్రుడు నీ పరిజనంలో ఉండాలని కోరుకోవడం అందుకు నేను తగిన వాడనా’ అని యామునాచార్యులు ప్రార్థించారట. తమ తక్కువతనము చూపి భగవంతుని స్పర్శలేనిదే బతకలేమని చెప్పి దివ్యమంగళ విగ్రహ సౌందర్యారాధన చేయాలి. తనపై అలిగిన ప్రేయసులను, గోపికలను, తాత్కాలికంగా విముఖులైన వారిని కూడా దారికి తెచ్చుకుంటాడు కృష్ణుడు. ద్వేషముచేత విముఖులైన వారిని పరాక్రమంతో జయిస్తాడు. ఉదాసీనంగా విముఖులైన వారిని కూడా అనుసరించి తన సౌందర్యముచేత ఆకర్షిస్తాడు. నీతో ఉండతగమని విముఖులయ్యే వారు, ప్రణయకోపంచేత విముఖులయ్యే వారు అలిగే వారు, స్నేహమూలేక ద్వేషమూ లేక విముఖులయ్యేవారు, ద్వేషము చేత విముఖులయ్యే వారు అందరినీ ఏదో మార్గం ద్వారా జయిస్తాడు.


గోపికలను ఏంకావాలని ఆయన అడుగుతాడు. అప్పడికే వారు శ్రీకృష్ణుని పరివారానికి చెందిన మహాలక్ష్మిని కోరారు, అనంత గరుడులను, ఆళ్వార్లను, శంఖమును తమవైపు తిప్పుకున్నారట. ‘‘మావారిని మీవారిగా చేసుకుని మమ్ములను ఓడించారు. మిమ్ము నేనొడిస్తాను’’. అన్నాడట గోవిందుడు. ‘‘మీతో కూడము అన్నవారిని మీరు ఓడించాలి గాని కూడేందుకు వస్తున్న మాకు వశులు కావాలి కదా గోవిందా’’ అన్నారు వారు. ‘‘మా స్త్రీత్వాభిమానాన్ని భంగం చేసి రప్పించుకుని నీవారిగా చేసుకున్న గోవిందా’’ అని సంబోధిస్తున్నారట గోపికలు.


‘నిను కీర్తించి పఱై అనే వాయిద్యాన్ని పొందారు. భగవంతుడితో కలిసి భగవన్నామాన్ని కీర్తించడమే వారి లక్ష్యం. నారాయణనే నమక్కే = నారాయణుడే మనకే ఫలము ఇస్తాడని మేం నమ్ముతున్నాము. మాకు సన్మానము కావాలి. దశరథుడు సుమంత్రుడి ద్వారా రమ్మని ఆదేశిస్తే సీత ద్వారందాకా వచ్చి మంగళాశాసనం పాడితే, రాముడు తనమెడలో మాల తీసి ఆమె పాదాలను పట్టి ఆపి ఇక ఆగు అని ఆపినాడట. అదే సన్మానము తమకూ కావాలని గోపికలు అడుగుతున్నారు. ప్రేయసి అయిన ప్రణయిని పాదములను పట్టడం ప్రియునికి తప్పు కాదు. అది ప్రేమకు చిహ్నం. అటువంటి ప్రేమ కావాలంటున్నారు.

Also read: పరము వరమునిచ్చిమానోము నిల్పిన వరదునికి జయము


లోకులు మెచ్చే సన్మానం కావాలట. శ్రీకృష్ణ సహవాసాన్ని సమాగమాన్ని మించిన సన్మానమేముంటుంది. కలిసి ఉండడానికే మంచి బట్టలు కట్టుకోవడం, మంచి నగలు పెట్టుకోవడం, కలిసి భోజనం చేయడం కావాలని గోపికలు కోరుకుంటున్నారు. కూచుని ఒకరినొకరుతాకుతూ భోజనం చేయడం ఎంత ఆనందంగా ఉంటుంది?


గోపికలు నిజంగాకోరుకున్నవేమిటి? అంతరార్థాలు పరిశీలిస్తే, చేతి ఆభరణమంటే సమాశ్రయణానికి ముందు ఆచార్యులు కట్టుకున్నముంజేతి కంకణం. భుజాభరణాలంటే భుజాలపైన శంఖ చక్రముద్రలు. చెవిదుద్దులంటే ఎనిమిది రాళ్ల మండలాకార స్వర్ణాభరణము అంటే అష్టాక్షరీ మంత్రము. రెండు చెవిపూలంటే ద్వయమంత్రము, పాదాభరణము అంటే నాలుగు చరణాల ద్వయమంత్రము. అంటే తిరుమంత్రము (ఆత్మజ్ఞానము), ద్వయం (భక్తి), చరమశ్లోకము (వైరాగ్యము) లను ఈ పాశురంలో అనుసంధానం చేస్తున్నారు. శరీరాలంకారానికి వస్త్రం ఎంత ముఖ్యమో ఆత్మాలంకారముగా శేషత్వము అంతే. పాలన్నము అంటే భోగ్యము కైంకర్యము. నేయి పారతంత్ర్యము. కైంకర్యము మునిగేంత పారతంత్ర్యము ఉండాలి. పాలు అంటే భగవంతుని కల్యాణగుణాలు, అన్నము అంటే ఆ భగవత్ తత్త్వము. నేయి అంటే భగవంతుని ఎడబాటు క్షణమైనా సహించలేని స్నేహము. ఆ ప్రీతి పొంగి చేతులనుంచి కారిపోవడం అంటే చేయు కర్మ. అంటే కర్మలుచేయడం ద్వారా భగవంతుని పట్ల మనకున్న ప్రేమను చూపడం. కలిసి భుజించడమే భాగవత గోష్టి.


దీనికి మరొక అర్థం. హస్తాభరణం= అంజలి, భుజకీర్తులు=ఫలాన్ని విడవడం, కర్మనేనే చేశాననే బుద్ధి మరవడం, కర్ణాభరణం= భాగవత ప్రసంగాలు వినడం, చెవిపూలు= ద్వయమంత్రము, పాదాభరణము= భగవత్ భాగవత ఆచార్యసన్నిధికి నడిచి వెళ్లడమే. జిహ్వకు కీర్తన, మనసుకు ధ్యానం, చేతులకు= అర్చన, నేత్రములకు చూచుట, ముక్కునకుతులసీధామాన్ని ఆఘ్రాణించడం. గోపికలకు భోజనం అంటే బ్రహ్మానుభవమే అని ఈ పాశురం ద్వారా గోదాదేవి తెలియజేస్తున్నారు. ఇది గోదా గోవింద కీర్తన.


పెద్దలు చెప్పిన మరొక అంతరార్థం ఇది

పరమాన్నం అంటే? ఈ బియ్యపు కణాలే జీవుడు, దానికి ఉండే పొట్టే శరీరం. జీవుల్ని పండించాలి అని ప్రకృతి అనే క్షేత్రంలో నాటితే మనకీ శరీరం లభించింది. ధాన్యానికి పైన ఎరుపు రంగులో ఉండే పొర మన అనురాగానికి గుర్తు. ధాన్యాన్ని దంపి పైన ఉండే పొట్టుని తీసివేసినట్లే ఈ జీవుడు శరీరంతో సాగించే యాత్రలో సుఖాలు దుఃఖాలు, కామాలు, క్రోధాలు, లాభాలు, అలాభాలు, జయాలు, అపజయాలు, ఐశ్వర్యాలు, అనైశ్వర్యాలు, జ్ఞానం, అజ్ఞానం ఇవన్నీ దంపి మనల్ని పొట్టు వీడేట్టు చేస్తాయి. ఇక అక్కడి నుండి వీడి యాత్ర సాగుతుంది. ఇక ధాన్యాన్ని కడిగి వేయించి ఉడికించినట్లే, జీవుడు ఆచరించిన శరణాగతి ఫలితంగా ముక్తి ఇలా లభిస్తుందని ఉపనిషత్తులు తెలుపుతాయి.

Also read: నిప్పురవ్వలు కురిపించు కంటి కొసచూపులు విసిరి
బియ్యాన్ని నేతిలో వేయించినట్లే అక్కడ స్నేహంతో వేయిస్తారు. భగవంతుడి కళ్యాణగుణాలు పాలవంటివి, స్వచ్చమైనవి. పాలు పశువుల నుండి వస్తాయి, ఉపనిషత్తులని పశువులని అనుకుంటే ఈ కళ్యాణగుణాలనే పాలలో జీవుడు ఉడకాలి. భగవంతుని సేవచేయాలనే రుచి వీడికుండాలి, తన కళ్యాణగుణాలను ఇవ్వాలనే రుచి ఆయనకుండాలి. ఈ రుచి అనేది అంతటా కల్సి ఉండాలి, పరమాన్నంలో వ్యాపించిన తియ్యదనం వలె. ఇందులో జీవుడూ భగవంతుడూ కలిసి ఉన్నారా లేదా అన్నట్లుగా కలిసి ఉంటారు. పరమపదాన్ని పోలిన ఈ పాయసమే పరమాన్నం. పరమాన్నం దీనికి ప్రతీక. ఆ పరమాన్నాన్ని ఆండాళ్ గోపికలు ఈ పాశురంలో కోరుతున్నట్టు వర్ణించారు.

జీవుడు భగవంతుణ్ణి చేరటానికి లభించిన వస్త్రమే శరీరం, ఇది పాంచభౌతిక శరీరం, పరమపదానికి వెళ్ళే ముందు, విరజానదిలో సూక్ష్మ శరీరం తొలగి పంచ ఉపషణ్మయ దివ్య విగ్రహం లభిస్తుంది. “అదన్ పిన్నే” వేరే శరీరం లభించిన తరువాత ఇక మాకు కావల్సింది “పాల్ శోఱు మూడనెయ్ పెయ్దు మురంగైవరివార” పరమాన్నం, అదే పరమ పదం. “కూడి ఇరుందు” అందరు కలిసి గోష్టిగా తినడానికి, “కుళిరుంద్” ఈ కలయికతో మన ఈ సంసార తాపం అంతా తొలగాలన్నది ఈ పాశుర పరమార్థం.

జ్ఞాన వైరాగ్యాలను తిరుమంత్రము, ద్వయమంత్రము చరమ మంత్రము అనే మూడు మార్గాల ద్వారా బోధిస్తారు. తిరుమంత్రము ఆత్మస్వరూపాన్ని తెలియజేస్తే, ద్వయము కైంకర్యమునకు ముందు వాడే భక్తి ప్రధానమైంది. చరమం ద్వారా వైరాగ్యాన్ని బోధిస్తుందీ శాసనం.

Also read: చీమకు, బ్రహ్మకు కూడా అహంకారం ఉండదా?

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles