Tuesday, November 29, 2022

కిష్కింధలో కలకలం

రామాయణమ్94

కిష్కింధాకాండ ప్రారంభము

అది చైత్రము. వసంతుడు కుసుమాంజలి ఘటించి పంపాసరోవర తీరములో రామలక్ష్మణులకు స్వాగతము పలుకుతున్నాడు. ఆ ప్రాంతమంతా ఎటుచూసినా కుసుమించిన తరువులే, వికసించిన పూవులే.  పంచశరుడు విజృంభించి తన శరాలను సంధిస్తున్నాడు. రణరంగములో శత్రుభీకరుడైన రాముడు ఈ మదనకదన రంగములో మాత్రము భీరువైపోయాడు.

Also read: శబరికి మోక్షం

హృదయములో విషాదము ఆవరించింది. ఆయనకు ఎటుచూసినా సీతే కనపడుతున్నది. అడుగడుగునా సీత అణువణువునా సీత. నెమళ్ళక్రేంకారము వింటే సీత. తుమ్మెదల ఝుంకారము వింటే సీత. వికసించిన పూవు చూస్తే సీత కుసుమించిన తరువుచూస్తే సీత. లేడిపిల్ల కన్నులు  చూస్తే సీత కన్నులు గుర్తుకు వస్తున్నాయి. కోకిల కూత వింటే సీత పలుకులు చెవులలో రింగుమంటున్నాయి. తుమ్మెద రెక్కలు చూస్తే సీత ముంగురులే జ్ఞాపకము వస్తున్నాయి. సెలయేటి గలగలలు వింటే కిలకిలమని నవ్వె తన పడతి మోము గుర్తుకు వస్తున్నది.  కలహంస నడకల కలికి గుర్తుకువస్తున్నది హంసల గుంపు చూస్తే. సరోవరాలలో వికసించిన పద్మాలు చూస్తే పద్మిని పద్మగంధి మదినిండా మెదులుతున్నది ఆయనకు.

Also read: రామలక్ష్మణులకు బుుష్యమూక పర్వతానికి దారి చెప్పిన కబంధుడు

అడుగడుగునా సీత అణువణువునా సీత. ఆయనకు జగమంతా సీత తో నిండి పోయింది. విరహము వలన కలిగిన దుఃఖాన్నితట్టుకోలేక తన మనస్సును సోదరుడిముందు పరచి పసిపిల్లవాడిలా రోదించాడు రాఘవుడు. రాముని వేదన అంతా విన్న లక్ష్మణుడు. ‘‘అన్నా, ధైర్యం వహించు. నీ వంటి నిర్మలమైన మనస్సు కలవాడి బుద్ధి  ఇంత మందము కాకూడదు.

‘‘ఆ రావణుడు ముల్లోకాలలో ఎచట దాగినా వానిని హతమార్చుట తథ్యము. వాడు సాక్షాత్తూ సీతతో దితి గర్భములో దాగుకొన్నప్పటికీ వాడికి చావు తప్పదు. ఒక ప్రయోజనమును పోగొట్టుకున్నవాడు దానిని ప్రయత్నము లేకుండగా తిరిగి పొందజాలడు కదా.

ఉత్సాహో బలవానార్య నాస్త్యుత్సాహ త్పరం బలం

సోత్సాహస్య హి లోకేషు న కించిదపి దుర్లభమ్

‘‘ఉత్సాహము చాలా బలము గలది. ఉత్సాహమును మించిన బలము వేరొకటి ప్రపంచమున లేదు. ఉత్సాహవంతునకు లభించనిది ఈ లోకములో ఏదీ లేదు. ఉత్సాహవంతునకు ఓటమి అనేదే లేదు. అందుచేత ఉత్సాహము పెంచుకొని సీతాదేవిని వెదుక ప్రయత్నము చేద్దాము. అన్నా, శోకమును వెనుకకు నెట్టి వేయుము. కామ పరాధీనత్వమును విడిచి వేయుము. నీవు ఎంతగొప్ప వాడవో నీవు గ్రహించలేకున్నావు.’’

Also read: కబంధుని వధ, విమోచన

లక్ష్మణుడి ధైర్య వచనాలు విని రామునిలో శోకము, మోహము పోయి ధైర్యము కలిగింది. ఉత్సాహముగా ముందడుగు వేసాడు.

సుదూరంగా ఉన్న మహా బలవంతులైన రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు.

ఒక్కసారిగా భయపడ్డాడు. భ్రాంతితో నిశ్చేష్టుడయ్యాడు. వాలి పంపిన వీరులేమో అని ఏవేవో ఊహిస్తూ ఉన్నాడు. వానరులలో కలకలము బయలుదేరి అరణ్య మధ్య భాగములోకి పారి పోయారు. శ్రేష్టమైన ఆయుధములు ధరించిన రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భయపడ్డాడు. ఒకచోట నిలవలేక పోయాడు. ఆయన మనస్సులో ధైర్యముకోల్పోయిన వాడయ్యాడు. అదే భయము ముఖములో కనపడుతుండగా తన మంత్రులతో ‘‘వారు వాలి పంపగా వచ్చిన వారే సందేహము లేదు. నారచీరలు ధరించి కపట వేషముతో సంచరిస్తున్నారు’’ అని అన్నాడు.

Also read: కబంధుడి చేతచిక్కిన రామలక్ష్మణులు

వెంటనే అందరూ వేరొక కొండచరియను ఎక్కి సుగ్రీవునికి ధైర్యము చెపుతున్నట్లుగా ఆయన చుట్టూకూర్చున్నారు.

మరల అక్కడకూడా వారి భయము వారిని నిలువనీయలేదు.

నిముషనిముషానికి కొండచరియల మీద దూకుతూ గాభరా పడుతూ పుష్పించిన తరువులను విరుస్తూ ఎక్కడా ఆగకుండా తిరుగుతూ ఉండగా!

 మాటలలో నేర్పరి అయిన హనుమంతుడు సుగ్రీవునితో ఇలా పలికాడు:

ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవమ్ వాక్య కోవిదః …..

NB

ఇక్కడనుండి స్వామి పాత్ర ప్రారంభము. ఆయన పాత్రను ప్రవేశపెడుతూ మహర్షి వాల్మీకి చెప్పినది చూడండి …

ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవమ్ వాక్య కోవిదః …..

మొట్టమొదట ప్రవేశపెడుతూనే ఆయన వాక్యకోవిదుడు అని మనకు తెలియ చేశారు మహర్షి.

వాక్య కోవిదుడట.

స్వామికి శబ్దము మీద అంత సాధికారికమైన పట్టు ఉన్నది ….

అది ఎలా ఉంటుందో,దానితో ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో,ముందు ముందు కధాగమనంలో మనకు అవగత మవుతుంది.

Also read: సీతాపహరణ గాథ తెలిపి మరణించిన జటాయువుకు అంత్యక్రియలు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles