Thursday, March 28, 2024

‘‘సర్వే వేదాః కృష్ణా’’ వేదాలు చెప్పేది కృష్ణుడే

మాడభూషి శ్రీధర్ – తిరుప్పావై 21

ఏట్రకలంగళ్ ఎదిరి పొంగి మీదళిప్ప
మాట్రాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కల్
ఆట్ర ప్పడైత్తాన్ మగనే ! యరివురాయ్
ఊట్రముడై యాయ్ ! పెరియాయ్ ! ఉలగినిల్
తోట్రమాయ్ నిన్ర శుడరే ! తుయిలెళాయ్
మాట్రారునక్కు వలితులైన్దు ఉన్ వా శర్కణ్
ఆట్రాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే
పోట్రియామ్ వన్దోమ్ పుగళ్ న్దు ఏలోరెమ్బావాయ్

తెలుగు భావార్థ గీతిక

ఘటములెల్ల నిండి పొంగి పొరలెడు పాలనిచ్చు

గోమందల పాలక గోవింద నిదుర లేవవయ్య

నినుదెలియ వేదమేదారి, వేదమైన నినుదెలుపలేదు

సహస్ర సూర్యకిరణ సహస్రాక్ష సహస్రపాదుడీవు

సకలచేతనా చక్షువుల ప్రత్యక్ష తేజో రూపమీవు

బలముడిగి శత్రువులు నీ చరణాలు ఆశ్రయించి

నీయింటి వాకిట అన్యథా గతిలేక శరణు వేడుచున్నారు

నీకు మంగళము పాడ మేము కూడ జేరి నిలిచినాము.

వాగర్థారివ దర్శనం

దాశరథి రంగాచార్య ‘‘గత పాశురంలో నీళా కృష్ణులను పేర్కొన్నారు. ఇప్పుడు కిష్టయ్యను మాత్రమే మేల్కొల్పుతున్నారు. తల్లిగత పాశురంలో వాగర్థారివ దర్శనం ఇచ్చారు. ఇప్పుడు మాతృదర్శనం ఇస్తున్నారు.  భార్యభర్త కౌగిట్లో కరుగుతుంటుంది. ఆమె బిడ్డ ఏడుపు వినిపిస్తుంది వెంటనే ఆమెలో మాతృత్వం పొంగుతుంది. భర్తను వదిలి, బిడ్డను చేరుతుంది. వాత్సల్యం ప్రేమను తల దన్నుతుంది’’ అని ఈ పాశురపు సారాంశాన్ని ఆమె మాతృత్వ మహిమ మాధుర్యం వివరించారు. వందే జగన్మాతరం అనే కొత్త నినాదాన్ని ప్రవచించారు దాశరథి.

Also read: ముక్కోటి దేవుళ్లు ముప్పు వచ్చెనంచు విన్నవించకమున్నె

నేపథ్యం

నిన్న తనను మేల్కొల్పిన గోదా గోపికలతో నీళాదేవి కలిసిపోయింది. ‘‘నేనూ మీతోనే ఉంటాను. వెళదాం పదండి, మనందరమూ కలిసి శ్రీకృష్ణుని మేలుకొలుపుదాం’’ అన్నది నీళాదేవి. మొన్నటిదాకా శ్రీకృష్ణుణిని క్షణకాలం విడువకుండా ఆశ్రయించి ఉన్న నీళమ్మవారు ఇప్పుడు ఆశ్రయం కోరే వారితో కలిసినడుస్తూ  వారితోపాటు భగవంతుడి ఆశ్రయం కోరుతున్నారు. స్తుతించేప్పుడు మనతో ఉండి, ఆ స్తోత్రాన్ని స్వీకరించేప్పుడు భగవంతుడితో ఉండే అమ్మవారిని శ్రీః అంటారు. జీవకోటితో కలిసి మన మాట వినిపిస్తుంది. భగవంతుడితో కలిసి మన మాటలు వింటుంది. శృణాతి శృణోతి. పురుషకార భూతురాలు. శ్రీవైష్ణవంలో ఉన్న విశేషం అదే. తల్లి మనతోనూ ఉంటుంది. మనం ఆరాధించి ఆశ్రయించే దేవతా అవుతుంది.

వందే జగన్మాతరం

ఘటకత్వం అంటే జీవులను పరమాత్మతో చేర్చడం. మహాలక్ష్మి ఘటికురాలు. పరమాత్మతో చేర్చిన తరువాత ప్రాప్యమగు శ్రీమన్నారాయణుడితో తానూ చేరి ఉండడం ప్రాప్యం: జీవత్వ, ఘటకత్వ, ప్రాప్యత్వము మూడు లక్షణములు ఉన్న శ్రీ మహాలక్ష్మీ ఘటికురాలని శ్రీ భాష్యం అప్పలాచార్యస్వామి అత్యద్భుతంగా వివరించారు.  తిరుప్పావై శ్రీ తత్వాన్ని తెలుసుకోవాలంటే శ్రీ భాష్యం అప్పలాచార్య స్వామి వారి విస్తృతమైన వాఖ్యానం చదవాల్సిందే.

Also read: సీతారాములు కాదని శూర్పణ రావణులను కోరుతారా

భగవంతుడియందు ప్రీతి ఉంటే వారి గుణాలకు లొంగి వశవర్తులవుతారు. ప్రీతి లేకపోతే బాణములకు లొంగి వశవర్తులు కావలసి వస్తుంది. నేను శ్రీరాముని అభిప్రాయాన్ని బట్టి తమ్ముడిని కాని, గుణములచే దాస్యభావమునొందిన వాడిని అని లక్ష్మణుడు చెప్పుకున్నాడట. గోపికలు కూడా మేమంతా నీ గుణములకు ఓడిపోయి వచ్చాం స్వామి అని విన్నవించుకుంటున్నారీ పాశురంలో.

ప్రతిపదార్థములు:

పాల కుండలు (ఏట్రకలంగళ్) నిండి పైకి పొంగి పొరలి పోయే (ఎదిర్ పొంగి మీదళిప్ప) విధంగా ఎడతెగకుండా పాలు స్రవిస్తున్న (పాల్ శోరియుమ్) ఉదారమైన (వళ్లన్) భారీ ఆవులను (పెరుంబశుక్కళ్) విశేషంగా కలిగిన నందగోప కుమారా కృష్ణా (ఆట్రపడైత్తాన్ మగనే) మేలుకో (అఱిఉఱాయ్), వేదం తెలిపిన (ఊట్రముడైయాయ్) మహాబలశాలీ, వేదం వలన కూడా తెలుసుకోవడం సాధ్యం కాని (పెరియార్) మహామహిమాన్వితుడా, ప్రపంచంలో (ఉలగినిల్) సకల చేతనా చక్షువులకు ప్రత్యక్షంగా నిలిచిన (తోట్రం ఆయన్ నిన్ణ) తేజో రూపా (చుడరే), నిద్రమేలుకో (తుయలెజాయ్) , నీకు శత్రువులు (మాట్రార్) నీ ముందు బలాన్ని కోల్పోయి (ఉనక్కు వలితొలైందు) నీ ఇంటి వాకిట (ఉన్ వాశల్ కళ్) గతిలేక నిలిచి (ఆట్రాదువందు) నీ పాదాలను (ఉన్ అడి) స్తుతించినట్లు (పణియు మాపోలే) మేము (యామ్) నిన్ను స్తుతించి (పుగజున్దు) నీకు మంగళాశాసనం (పోట్రి) చేయడానికి వచ్చినాము (వందోమ్).

Also read: ‘‘వాత్సల్యాది గుణోజ్జ్వలాం వందే జగన్మాతరం’’అలవేలుమంగ

భారత సంస్కృతిలో ఆనాటి కాలంలో ఆర్థిక వ్యవస్థ పశువులు పాల చుట్టూ తిరిగేది. పాడిపంటలు పొంగిపొర్లితే సంపదే సంపద.  పాడిపంటలే అసలు సంపద. ఉత్తరాంధ్రలో పశువులను ఇప్పడికీ సొమ్ములు అంటారు. నందగ్రామంలో పాడిపశువులు చల్లని శ్రీకృష్ణ కరస్పర్శతో పెరిగినాయి. తన వారికోసం ఎన్నో ఉపకారాలు చేస్తూ ఇంకా ఏదైనా చేయాలేమో అనుకుంటూ ఉండే శ్రీకృష్ణుని ఉదార భావం (వళ్లల్) ఆయన చల్లని చేతులు తాకిన ఆ ఆవులకు కూడా వచ్చింది. తనను పెంచుకుంటూ పోషిస్తున్న యజమానులకు ఎన్ని పాలైనా ఇవ్వాలని ఆవులు అనుకుంటూ కుండలు (ఏట్రకలంగళ్) నిండి పొంగి పొర్లినా (ఎదిర్ పొంగి మీదు అళిప్ప) పాలు స్రవింపచేస్తూనే (పాల్ శొరియమ్) ఉన్నాయట. శ్రీ కృష్ణుడు తన కరుణామృత క్షీరధారలను కూడా అదేవిధంగా కురిపిస్తాడు. ఉదారత్వం రావడమే కాకుండా తాను తాకడం వల్ల పాడి పశువులు మరింత బలిష్ఠమైనాయట.

విశేషార్థములు

భగవంతుడితో కలిసి మన మాటలు వింటుంది. శృణాతి శృణోతి. పురుషకార భూతురాలు. శ్రీవైష్ణవంలో ఉన్న విశేషం అదే. తల్లి మనతోనూ ఉంటుంది. మనం ఆరాధించి ఆశ్రయించే దేవతా అవుతుంది.
భగవంతుని గుణ వైభవాన్ని చెప్పే పాశురాలు 21నుంచి మొదలవుతాయి. ఏట్రకలంగళ్ పాశురంలో పరమాత్మ ఔదార్యవైభవాన్ని వివరించింది గోదమ్మ. ‘‘ఉదారసర్వయేవైతే ఆర్తా జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీతు ఆత్మైనాయేవతం’’ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరిస్తాడు. నన్ను ఆశ్రయించే వారు నలుగురు. 1.ఆర్తి, 2.జిజ్ఞాసు, 3.అర్థార్థి,4.జ్ఞాని – బాధలు చెప్పుకుని కాపాడమనే వాడు ఆర్తుడు, ఆత్మతత్వం తెలుసుకోగోరిన వాడు జిజ్ఞాసు, ఇంకా సంపద పదవులు కావాలనుకునే అర్థార్థి, లౌకిక వాంఛలు లేకుండా నా సేవే కావాలనుకునే వాడు జ్ఞాని, ఈ నలుగురూ ఉదారులే, వారిలో జ్ఞాని నాకు ఆత్మతో సమానుడైన వాడు అత్యంత ఆప్తుడు అని గీతలో భగవంతుడి వివరణ. ఆయన జ్ఞానితోపాటు మిగిలిన ముగ్గురూ కూడా ఉదారులనడం ఆయన ఔదార్యం, అన్నింటికన్నా మించిన ఔదార్యం. ఆయన సాహచర్యంచేసిన నందగ్రామంలోని పశువులకు కూడా ఆ ఔదార్యం వచ్చింది. పాలు పిండే పనే లేకుండా కుండలు నింపి పొంగిపొర్లేంతగా పాలు తమంతతామే స్రవిస్తున్నాయి ఆ ఉదారమైన పశువులు. పొదుగుల నిండుదనంవల్ల అక్కడ పాత్రలు లేకపోయినా పాలు ధారగా స్రవిస్తూనే ఉన్నాయట. భగవంతుని ఔదార్యం ఆ విధంగానే ప్రవహిస్తూ ఉంటుంది. నాకిది కావాలని అడగాలా వద్దా అనే సంశయం వస్తుంటుంది. కనీసం పొదుగుకింద కుండైనా పెట్టాలి కదా. భగవానుడికి అభిముఖుడై అడగాలి. గురువును సమీపించి నిలబడి అడగాలి. అవ్యాజముగా అడగకుండానే రక్షించే స్వభావం భగవంతుడికి ఉంది. కాని నీ కుండ నిండలేదని సూచించడానికి కుండ పొదుగుకింద ఉండాలి కదా. భగవదనుభవము కావాలనే కోరిక ఉండాల్సిందే. అది అడగాల్సిందే. నిత్యం విడిచి ఉండలేని లక్ష్మీదేవి కూడా నిన్ను విడిచి ఉండలేనయా అని కోరుతూనే ఉంటుందట. నిత్యసూరులు ‘‘సదా పశ్యన్తి సూరయః’’ ఎప్పుడూ భగవంతుడిని చూడాలని కోరుతూనే ఉంటారట. భగవత్స్వరూప గుణ వైభవమనే పాలను ఆచార్యులు వర్షిస్తుంటారు.

Also read: పరమాత్మను ఇచ్చేది యశోద మంత్రము

అటువంటి (పెరుంబశుక్కళ్) పెద్ద ఆవులెన్నో ఉన్న సంపన్నుడు నందగోపుడి ఇంటిలో మాధవుడిని నిద్రలేపుతున్నారు, ఆండాళ్, నీళాదేవి, గోపికలు. క్షీరాబ్దిలో శేషశాయి అయిన శ్రీవిష్ణువుని కాదు, మాకోసం నందగోప కుమారునిగా జన్మించి మాతో ఉన్న నిన్ను లెమ్మని ప్రార్థిస్తూ ఉంటే మేలుకోవడం లేదేమిటి? నందగోపుని కీర్తించే మాకోసం ఆయన గౌరవం నిలబెట్టడం కోసమైనా మావైపు చూడు. ఆర్తితో పిలిచే మా పిలుపులు వినవా? నీ ఐశ్వర్యం వల్ల మా పిలుపు అందడం లేదా? అని పదేపదే బతిమాలుతున్నా ఆయన కదలడం లేదు. పశుసమృధ్ది ఉన్న వారెందరో ఈ ఊళ్లో ఉన్నారు. నన్నేలేపుతున్నారని ఎందుకనుకోవాలి? అని శ్రీ కృష్ణుడు మౌనంగా ఉన్నాడట. అది గమనించిన గోపికలు శ్రీకృష్ణునికి మాత్రమే పొసగే విశేషణాలతో కీర్తించడం ఆరంభించారు.

నీతండ్రి ద్వారా సంక్రమించిన ఐశ్వర్యము మా ఆర్తి విని తీర్చడానికే గాని మా పిలుపు. వినబడకుండా మదించి నిద్రించడానికి కాదు. అయినా క్షీరాబ్దిని వదిలి, వైకుంఠాన్ని వదిలి, పాలుపితికే మాకులంలో జన్మించింది మమ్మల్ని రక్షించడానికే కదా అంటున్నారు గోపికలు. నందగోపుని గుణాలు అయిదు. 1. వేలాయుధంతో శ్రీకృష్ణుని సేవించడం, 2. నాయకుడు, 3. వస్త్ర, అన్న, జలములను ఉదారముగా ఇచ్చే ధర్మము చేయడం, 4. మదగజాలను ఎదిరించి, సమరంలో వెనుదిరగని వీరత్వం, 5. అవిచ్ఛిన్నముగా పాలు స్రవించే ఉదారములైన గోవులు అనేకం కలిగి ఉండడం. ఆచార్యుని లక్షణాలు కూడా ఇటువంటివే అంటారు శ్రీభాష్యం. 1. భగవంతుడిమీద ఎంత ప్రేమంటే ఆయనను తాను రక్షించాలనుకోవడం, మంగళాశాసనం చేయడం, 2. తాను సాధించిన భగవదనుభవాన్ని అందరికీ అందించాలనుకునే నాయకత్వలక్షణం, 3. దానికి సాధనమైన తిరుమంత్రాన్ని ఇచ్చి, భగవంతుడే ధారకము, పోషకము, భోగ్యముగా ఉండే దశను ఇచ్చే లక్షణం. 4. ఈ అనుభవాన్ని నిరోధించే వారిని జయించే బలం, గజం వంటి పరమాత్మనే వశం చేసుకోగల్గడం, 5. తాననుభవించిన దానిని శిష్యులకు ఉదారంగా ఇచ్చే వాగ్వైభవం కలిగి ఉండడం. అటువంటి వైభవము, ఔదార్యము కల్గిన శిష్యులు ఎంతో మందిని కలిగి ఉండడం. ఇటువంటి ఆచార్యులకు పరమాత్మవిధేయుడై ఉంటాడు. మంచి లక్షణాలలో ముఖ్యమైంది దృఢత్వం. ఆశ్రితులను రక్షించడం తన కార్యమని భావించేవాడు. ప్రాణాలైనా విడుస్తాను, లక్ష్మణుడినైనా విడుస్తాను. నిన్నైనా విడుస్తాను. కాని సీతా, మునులను రుషులను ఆశ్రితులను రక్షిస్తాననే ప్రతిజ్ఞను మాత్రం విడువను, అంటాడు రాముడు.

అహంకారం వదిలేస్తేనే పరమాత్మ ఔదార్యం

వేదాలు ప్రతిపాదించిన (ఊట్రముడయాయ్ వేదంలో చెప్పిన) నారాయణుడే శ్రీ కృష్ణుడు. ప్రమాణ సిద్ధమైన వాడు. సకల వేదాల వలన తెలియదగిన వాణ్ణినేనే అని ప్రకటించాడు. ‘‘సర్వే వేదాః కృష్ణా’’ అంటే అన్ని వేదాలు చెప్పేది కృష్ణుని గురించే. (పెరియార్) ఆ వేదంవలన కూడా తెలుసుకోబడని సమున్నతుడూ, నిరతిశయ బృహత్వముగలవాడు. వాక్కు మనస్సులకు అందని వాడు, వాక్కు మనస్సు చేతనే గ్రహింపదగిన వాడు, (చుడరే) తేజోమూర్తి, జ్యోతిస్వరూపుడు. ప్రత్యక్షప్రమాణాలతో పరమాత్ముడిని తెలుసుకోవడం సాధ్యం కాదు. అనుమాన ఉపమాన ప్రమాణాలకు కూడా అందడు. కేవలం వేదములు/శాస్త్రముల ద్వారా మాత్రమే తెలుసుకోవడం వీలవుతుంది. అవాఙ్మానసగోచరుడైన (వాక్కుకు మనసుకు గోచరించని) పరమాత్మ ఎవరికి తోచినరీతిలో వారికి ప్రపంచమంతటా కనిపిస్తున్నాడు. కంటికి కనిపించే విధంగా ఆలయాల్లో ఉన్నాడు, ఇళ్లల్లో కూడా ఉన్నాడు. తలుపుల మధ్యే కాదు తలపుల్లో కూడా తలిచిన రీతిలో ఉన్నాడు. అన్నమయ్య అన్నట్టు ఎంత మాత్రమున ఎవ్వరు తలిచిన అంతమాత్రముగా ఉంటాడు పరమాత్మ. ఈ మాట అన్ని మతాలకు లోకాలకు వర్తిస్తుంది. ఆయన తనను ఆపేక్షించే వారిని కరుణించడంకోసం ఎదురుచూస్తూ ఉంటాడట.

రాముని ఔదార్యం

తనకు అత్యంత ప్రియమైన సీతను ఎత్తుకుపోయిన శత్రువు రావణుడి సోదరుడు ఈ విభీషణుడనీ, చంపదగిన వాడని హెచ్చరించినా, రావణుడే వచ్చి శరణంటే కూడా ఆదుకొంటానంటూ రాముడు, అతని తమ్మునికి ఆశ్రయం ఇస్తాడు. మనసు మార్చుకుని తనను ఆశ్రయించాలనే ఉద్దేశంతోనే రావణుడిని చంపే అవకాశం ఉన్నా వదిలేసి ఈరోజు వెళ్లి రేపు రా అని యుధ్దభూమినుంచి పంపివేస్తాడు రాముడు. ఆ ఔదార్యాన్నే ఈ పాశురంలో వివరిస్తున్నారు గోదమ్మ. ఇతరులకు ఉపకారం చేస్తున్నానని అనుకోకుండానే అదే తన పని అన్నట్టు ఉపకారం చేస్తున్నాడు. కిష్కింద రాజ్యాన్ని సుగ్రీవుడికి లంకా రాజ్యాన్ని విభీషణుడికి పట్టంగట్టి తన దుఃఖం తీరినట్టు సంతోషించాడట రాముడు. గెలిచిన రాజ్యాలను ఆయన తన రాజ్యంలో కలుపుకోలేదు.

ఒక అసురుడు కాకిమీద ఆవహించి వనవాస కాలంలో సీతాదేవి గుండెలమీద పొడిచాడు. తన ఒడిలో నిదురిస్తున్న శ్రీరామునికి నిద్రాభంగం కాకూడదని సీత కాకి హింసను చాలాసేపు భరించింది. కాని ఎంతో సేపు భరించలేకపోయింది. శ్రీరాముడు నిద్రలేవడం, తీవ్రమైన కోపం రావడం వెంటనే గడ్డిపరకను మంత్రించి బ్రహ్మాస్త్రాన్ని సంధించి ప్రయోగించాడు. ఆ అస్త్రాన్ని తప్పించుకోవడానికి కాకి వెళ్లని లోకం లేదు. ఎక్కడా రక్షణ దొరకలేదు. తిరిగి తిరిగి శ్రీరాముని పాదాలు చేరుకున్నాడు. సీతమ్మ ఆదుకొమ్మని పురుషకారం కట్టుకున్నది. శ్రీరాముడి పరాక్రమ ఔదార్యాలకు ఈ కథ సాక్ష్యం. ఈ కథాంశాన్ని తీసుకుని బాపు గొప్ప బొమ్మ గీసారు. 

తేజోరూపుడు శ్రీకృష్ణుడు

ఉత్తములు అధములు అనే భేదం చూపకుండా అందరినీ ఆదుకోవడం కోసం ఆయన క్షీరాబ్దిని వదిలాడు.గొల్లపిల్లలను కరుణించడం కోసం వ్రేపల్లెకు వచ్చాడు.

తతోఖిల జగత్పద్మ బోధాయాచ్యుత భానునా
దేవకీ పూర్వసంధ్యాయాం ఆవిర్భూతమ్ మహాత్మనా

లోకమనే తామరపుష్పం వికసించడం కోసం అచ్యుతుడనే సూర్యుడు దేవకి గర్భాన ఆవిర్భవించినాడు. శ్రీకృష్ణుడుని తేజో రూపా అంటూ గోదాదేవి ఈ అర్థాన్ని సూచిస్తున్నారు.
శత్రువులు నీ పరాక్రమానికి పరాజితులై వస్తున్నారు. కాని మేము(గోపికలు) నీ గుణాతిశయాలకు పరవశులమై, వశులమై వస్తున్నాము. వారు బలాన్ని విడిచి నీ వాకిట నీ చరణాలను పట్టుకోవడానికి వచ్చారు. మేము కూడా మా స్త్రీత్వ సౌందర్యాహంకారాలను, అలంకారాలను విడిచి మీ వాకిట నిలుచున్నాం. మా వస్త్రాలను దాచి రెండుచేతులెత్తి శరణు వేడినప్పుడు వాటిని తిరిగి ఇచ్చినావు. అప్పుడే మా అహంకారాన్ని విడిచి శరణాగతి చేసాం. మళ్లీ నిన్ను స్తుతించి మంగళాశాసనం చేసేందుకు వచ్చాం. లేచిరావయ్యా కృష్ణా అంటున్నారు గోపికలు, ఆండాళ్, నీళాదేవి. ఔదార్యపు రాశి భగవంతుడిని అహంకారాలను విడిచి నిలిచిన గోపికలు మేలుకొలపడమే ఈ 21వ రోజు పాశురం భావం.

నేను నాది అనే మాటలు వదిలేసి మేము మనము అని ముందడుగు వేస్తే ఆదుకోవడానికి పరమాత్మ ఔదార్యంతో సిద్ధంగా ఉన్నాడని సారాంశం. భగవంతుడి ఔదార్యం ఎంతంటే తనను ఆశ్రయించవచ్చిన వారు ఎంతో ఉదారంతో తనను ఆశ్రయించారని సంతోషిస్తాడు.

Also read: నాయకులకెల్ల నాయకుడు నందగోపుని భవ్యభవన

ఆచార్యుని కరుణ

గోవు వంటి వాడు ఆచార్యుడు. మన మనసులనే కుండలను ముందుంచితే భగవంతుని గుణ వైభవాలనే పాలజ్ఞానధారను ఆచార్యులవారు వర్షిస్తారు. తనకు గురువు చెప్పిన జ్ఞానాన్ని మరొకరికి చెప్పాలనే తపన, తెలియని వారు అడిగితే చెప్పాలి కదా అనే ఆలోచన, రామానుజులవలె ‘వాడెలాతరిస్తాడు, వాడికి జ్ఞాన మార్గం ఇవ్వాలనే’ అనుకుని, అడిగినా అడగకపోయినా, గోపురమెక్కి పిలిచి, అతినిగూఢమైన మహామంత్రాన్ని, మంత్ర అంతరార్థాలను తనంత తానే ఉపదేశించే ఔదార్యం, అర్జునుడు అడగకపోయినా వివరంగా చెప్పి, పోనీ ఈ విధంగా చెబితే అర్థమవుతుందేమోనని, ఒక పద్ధతి ప్రకారం, అన్ని రకాలుగా శ్రీ కృష్ణుడు చెప్పినట్టు, విన్నా వినకపోయినా ప్రబోధించే ఔన్నత్యం గురువులకు ఉంటుంది. చెప్పడం నా ధర్మం, వినడం వారిష్ఠం అని చెప్పేవారు. గోవులంతా గురువులు, గోపాలుడు జగద్గురువు. జ్ఞాన ముద్ర అనే అంకుశంతో మన మనసులను తొలిచే మదములను తొలగించి కరుణించవలసింది గురువే. నందగోపుడు ఆచార్యుడు, గోవులు వేదములు, వేదాంగములు దూడలు, మన వాంఛితములు నెరవేర్చడమే కుండలు నింపడం. మరో కోణంలో గోవులే ఆచార్యులు, శిష్యులంతా కుండలు. కుండను పొదుగుకింద పెట్టడమంటే ఆచార్యుని ఆశ్రయించడం. ఆచార్యుడు చెప్పిన విషయాలను మననం చేసుకుంటూ చేయవలసిన యుక్తులను సుదృఢం చేసుకోవడమే పొంగు. ఇక శత్రువులెవరంటే భక్తులను ద్వేషించే వారే.

శత్రువులు బాణముల దెబ్బకు తాళలేక భయపడి నీ వాకిట చేరారు. మాకు ఆ భయం లేదు. నీ గుణములు మనసుకు తూట్లు పొడిచాయి అందుకని వచ్చాం. నేను నాకు నాది అనేవి వదిలేసి వచ్చాం, నిన్ను స్తుతించడం కోసమే. నిద్రలేచి ఆదరించు అంటున్నారు గోపికలు.శ్రీ భాష్యం వారు అంతే ఔదార్యంతో మనను కరుణించి తిరుప్పావై వివరాలు మనకు అందించారు.

Also read: తప్పును ఒప్పుగాను ఒప్పును తప్పుగానూ చెప్పగల నేర్పరి

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles