Sunday, December 8, 2024

మరోసారి పల్టాయించిన నితీష్ కుమార్

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్  మరో సారి తన సార్థక నామధేయం ‘పల్టూ రామ్’ ని గుర్తు చేస్తూ తొమ్మిదో విడత ఆదివారంనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న నితీష్ తనకు అవసరమైనప్పుడు బీజేపీతోనూ, ఆర్జేడీతోనూ పొత్తుపెట్టుకుంటున్నాడు. మూడు పార్టీల ఆటలో బీహార్ ఏ రెండు పార్టీలు కలిసినా అధికారం హస్తగతం చేసుకోవచ్చు. ఆర్జేడీ, జేడీ(యూ), బీజేపీలలో ఆర్జేడీ, బీజేపీ చేతులు కలిపే పరిస్థితిలేదు. ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్ని అవినీతి కేసులు ఎదుర్కొంటున్నా, ఎన్ని సార్లు జైలుకు వెళ్ళినా, మోదీ ప్రభుత్వం ఎంత వేధించినా లౌకిక రాజకీయాలను కాలదన్ని హిందూత్వ పార్టీ అయిన బీజేపీతో పొత్తు పెట్టుకునే సమస్య లేదు. దేశంలో లాలూ ప్రసాద్ ఒక విలక్షణమైన లౌకికవాద నాయకుడుగా మిగిలిపోయారు. నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం ముఖ్యం కానీ లౌకిక సిద్ధాంతాల విషయంలో అంత పట్టింపు లేదు. తాను మాత్రం లౌకికంగానే ఉంటారు. తన పార్టీని లౌకిక ప్రాతిపదికపైనే నిర్వహిస్తారు. కానీ బీజేపీతో ఎప్పుడు కావాలంటే అప్పుడు  పొత్తు పెట్టుకోవడానికీ, అంటకాగడానికీ ఆయనకు ఇబ్బంది లేదు. అయితే, ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అవినీతి, బంధుప్రీతి వంటి ఆరోపణలు లేకపోవడం విశేషం.

పల్టూరామ్ (విధానాన్ని పల్టాయించేవాడు అని అర్థం. ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేవాడు, ఏ చివర ఉన్నా ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకోకుండా కాపాడుకునేవాడు అని అర్థం)గా ఒక్క నితీష్ కుమార్ ని మాత్రమే నిందించడం సమంజసం కాదు. మహాఘట్ బంధన్ భాగస్వాములైన లాలూప్రసాద్ యాదవ్, వామపక్ష నాయకులూ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పల్టూరామ్ ల కిందికే వస్తారు. ఆయన ఎప్పుడు చంక ఎక్కుతానంటే అప్పుడు ఎత్తుకోవడం సూత్రబద్ధమైన రాజకీయం కాజాలదు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతే ఘట్ బంధన్ పక్షాలు అధికారంలో కొనసాగుతాయి. ఇది కూడా అవకాశవాదమే కదా. అదే విధంగా బీజేపీ నేతలు కూడా పల్టూరామ్ లే. నితీష్ కుమార్ కోసం బీజేపీ తలుపులు ఎప్పటికీ మూసి ఉంటాయి అంటూ గంభీరంగా ప్రకటించిన హోమ్ మంత్రి అమిత్ షా స్వయంగా పార్టీ కార్యాలయంలోనూ, తన నివాసంలోనూ నితీష్ పునరాగమనం గురించి మంతనాలు జరిపారు. అందుకోసం హైదరాబాద్ పర్యటనను వాయిదా వేసుకున్నారు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ నితీష్ రాకను స్వాగతించారు. వీరందరికీ ప్రజాస్వామ్యం పట్ల, నైతికత పట్ల, సూత్రబద్ధమైన విధానాల పట్ల ఏమాత్రం విశ్వాసం లేదని గత పదిహేనేళ్ళుగా నితీష్ కుమార్ నిరూపించారు. సిగ్గుమాలిన, నీతిమాలిన రాజకీయానికి పరాకాష్ఠగా బీహార్ మారింది.

బద్ధశత్రువులైన ఆర్జేడీ, బీజేపీ మధ్య దోబూచులాట అడుతూ తన పబ్బం గడుపుకుంటున్న నితీష్ కుమార్ ను ఆదర్శ రాజకీయ నేత అని అనలేం. ‘ఇండియా’ కూటమికి ప్రధాని అభ్యర్థి అని కూడా అనలేం. అతను ఒక తెలివైన, విలువలు లేని క్రీడాకారుడు. మంచి పాలకుడు కూడా కాదు. రెండు దశాబ్దాలకాలం అధికారంలో ఉన్నప్పటికీ నితీష్ హయాం లో బీహార్ వెనుకబడిన రాష్ట్రంగానే మిగిలిపోయింది. తక్కిన రాష్ట్రాలలో  రాజకీయాలు అంత పరిశుద్ధంగా ఉన్నాయని కాదు. అక్కడ ప్లేటు ఫిరాయింపులు లేవని కాదు. సింధియాలూ, శిండేలూ, కుమారస్వాములూ లేరని కాదు. కానీ ప్లేటు ఫిరాయించడంలో నితీష్ కుమార్ ను మించిన రాజకీయ నాయకుడు మరొకరు భారత దేశంలో లేరు. ఈ తరహా రాజకీయ అవకాశవాదానికి స్వస్తి చెప్పకపోతే ఇది ఎటువైపు దారితీస్తుందో తెలియదు. ప్రజాస్వామ్యం అపహాస్యమైపోతున్నది.

నితీష్ కుమార్, నరేంద్రమోదీ ఎందుకింతగా దిగజారి వ్యవహరిస్తున్నారు? 2019లో బీజేపీ బీహార్ లో ఘనవిజయం సాధించింది. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే మెజారిటీ లోక్ సభ స్థానాలు దక్కవు. నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీ(యూ)తో కలసి పోటీ చేస్తే మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవచ్చు. పోయినసారి బీజేపీ గెలుచుకున్న 330 స్థానాలలో ఈ సారి గండిపడుతుందనీ, గండికొట్టే రాష్ట్రాలలో మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్ ముఖ్యమైనవనీ రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో కుమారస్వామి నాయకత్వంలోని జేడీ(ఎస్)ను కలుపుకొని  ఈ సారి కూడా మెజారిటీ స్థానాలు సాధించడానికి బీజేపీ రంగం సిద్ధం చేసింది. ఇక బీహార్ ఆపరేషన్ లో నితీష్ కుమార్ తో భుజం కలిపితే తప్ప పరాజయం, పరాభవం తప్పవు. నితీష్ కుమార్ కు కూడా గత్యంతరం లేదు. మహాఘట్ బంధన్ లో కొనసాగితే రాబోయే లోక్ సభ ఎన్నికలలో జేడీ(యూ)కి మహా అయితే అయిదు స్థానాలు రావచ్చు. అదే బీజేపీతో పొత్తుపెట్టుకుంటే పది స్థానాలకు మించి రావచ్చు. ఈ సయోధ్య, సత్ఫలితాలు లోక్ సభ ఎన్నికల వరకే పరిమితం. మళ్ళీ శాసనసభ ఎన్నికల నాటికి లాలూ ప్రసాద్ స్నేహం నితీష్ కుమార్ కి అవసరం. వచ్చే శాసనసభ ఎన్నికలలో బీజేపీ చిత్తుగా ఓడిపోతుంది. దాంతో కలిసి జేడీ (యూ) పోటీ చేస్తే దాని పని కూడా కుదేలవుతుంది. మళ్ళీ లోక్ సభ ఎన్నికలు జరిగిన తర్వాత, శాసనసభ ఎన్నికలకు ముందు నితీష్ మరోమారు పల్టాయిస్తారా, అప్పుడు కూడా ఆయనతో జతకట్టడానికి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు సిగ్గులేకుండా సిద్ధంగా ఉంటాయా అన్నది ప్రశ్న.

‘ఇండియా’ కూటమికి నితీష్ పిల్లిమొగ్గల వల్ల చాలా నష్టం. అన్నిప్రతిపక్ష పార్టీలనూ ఏకతాటిపైకి తెచ్చేందుకు పట్నాలో సమావేశం నిర్వహించిన నితీష్ స్వయంగా బీజేపీ పంచన చేరడం, కోల్ కతాలో మమతా, లక్నోలో అఖిలేష్ యాదవ్, ఢిల్లీలో కేజ్రీవాలో ఒంటరిగా పోటీలోకి దిగుతామంటూ హెచ్చరించడం బీజేపీ చెవులకు తియ్యటి సంగీతంలాగా వినిపిస్తూ ఉంటుంది. ‘ఇండియా’ కూటమికి కర్ణకఠోరం. కనీసం 450 స్థానాలలోనైనా బీజేపీ అభ్యర్థులకు పోటీగా మొత్తం ప్రతిపక్షం తరఫున ఒక్కొక్క అభ్యర్థిని నిలబెట్టలేకపోతే బీజేపీకి మూడోసారి విజయం ఖాయం. అందుకు ఎవరిని నిందించినా ఏమి ఫలం?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles