Monday, December 9, 2024

ఫాసిస్టు సందర్భంలో రచన – ఆచరణ

(విరసం 29 వ మహాసభల సందర్భంగా విజయవాడ సిద్దార్థ కాలేజీలో జరిగిన

కార్యక్రమంలో నా ప్రసంగ పాఠం)

“Something is profoundly wrong with the way we live today…our problem is not what to do; it is how to talk about.”

                                   – Tony Judt

“Social reconstruction begins with a doubt raised among citizens.”

                                   – Ivan Illich

ముందుగా విరసం మహా సభలకు విచ్చేసిన అందరకీ అభినందనలు. సాహిత్యంలోని వర్తమాన ధోరణుల గురించిన దార్శనిక సంవాదాన్ని పరిపుష్టం చేయా ల్సిన సందర్భంలో “ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం” అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సభల పట్ల నాకు వ్యక్తిగతంగా భిన్నాభిప్రాయం ఉన్నది. ఐన ప్పటికీ, ఈ చర్చలు అర్ధవంతమైన ఆచరణాత్మక కార్యాచరణకు అవసరమైన కొత్త శక్తిని, దార్శనిక దృష్టినీ ప్రత్యామ్నాయ ప్రజాపక్ష సమూహాలకు అందిస్తాయని ఆకాంక్షిస్తూ కరపత్రంలో మరో పదిమంది తదితరులతో పాటూ నాకు ఇచ్చిన అంశం, ‘ఫాసిస్టు సందర్భంలో మన రచన, ఆచరణ’ గురించి నేను అనుకుంటున్న కొన్ని విష యాల్ని మీ ముందు పెట్టాలని భావిస్తున్నాను!

Also read: థిచ్ నాథ్ హించ్

ముందుగా ఏ సామాజిక కార్యాచరణకైనా రచన, ఆచరణ రెండూ పరస్పర ప్రేరకాలని నా భావన. ప్రజాతంత్ర ఉద్యమాలు, ప్రత్యామ్నాయ ప్రజారాజకీయాలు రెంటినీ కలిపి సమాంతరంగా స్వీకరించాల్సి ఉంది. అలాకాక రచన అనేది ఆచరణ లో భాగం కాదనీ లేదా ఆచరణ అనే దానికి రచనతో సంబంధం లేదనే ఒక రకమైన పొరపాటు అవగాహన కొన్ని శ్రేణుల్లో ఉంది. ఇది సరికాదు. ఏం చేయాలో స్పష్టంగా తెల్సినప్పుడే ఎందుకు, ఎవరికోసం రాస్తున్నామో,  ఒక స్పష్టత ఉంటుంది. అప్పుడే రాసే దానికీ, చేసేదానికి సార్ధకత చేకూరుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అవగాహన అవసరం!

పోతే, అనివార్య కారణాల వల్ల సభకి వచ్చి నప్పటికీ నేను ఆవిష్కరించవలసి ఉన్న మిత్రులు పాణి ‘ద్వేషభక్తి’ పుస్తకం కాలాతీతం కారణంగా కార్యక్రమం అవకుండానే వెను తిరిగాను. కాబట్టి, ఆ అంశాన్ని కూడా మిళితం చేసి ఓ రెండు విషయాలు మీతో పంచు కోవడం సబబనుకుంటాను. విజయవాడ అనగానే నాకు వ్యక్తి గతంగా రచయితలుగా స్పూర్తినిచ్చిన ఇద్దరు యోధుల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి వ్యక్తి ఎన్‌కౌంటర్ దశరథరామ్, రెండు బెజవాడ శరభయ్య. ఒకాయన సోషలిస్టు ప్రభావంతో పత్రిక స్థాపించీ ఆధిపత్య శక్తుల చేతుల్లో హత్యకు గురయితే, రెండో వ్యక్తి కమ్యూనిస్టు మేధావిగా ప్రజలపక్షం వహించినందుకు ఇక్కడే హత్య చేయబడ్డారు!

Also read: త్యాగాల లక్ష్యం ఆశయాల శోధనే!

దశరథరామ్ వాడిన భాష పట్లా, ఆయన భావజాల తీవ్రత పట్లా అనేక భిన్నా భిప్రాయాలు ఉండవచ్చును. ఐనా, ప్రజల పక్షాన ప్రశ్నించి నిలిచిన పాత్రి కేయుడిగా ఆనాడాయన సృష్టించిన సంచలనం చిన్నది కాదు. అలాగే, ‘చరిత్ర గతి మార్చిన పుస్తకాలు’ పేరిట జీవితంలో ఒకేఒక్క రచన చేసినప్పటికీ, అసలు రచనను  ఎవరిపక్షంగా చేయాలో తెలిసిన వ్యక్తి శరభయ్య. అందుకే ఆయన హత్యానంతరం జరిగిన పుస్తక ముద్రణకి ముందు మాట రాస్తూ, “ఈ రచయిత మరణ వార్త పత్రికలో చదివిన రోజునే కొందరు మిత్రులు ఈ గ్రంథాన్ని ఇచ్చి రెండు మాటలను వ్రాయ మన్నారు. రచయితతో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. వారి పేరు కూడా వినటం ఇదే మొదటి సారి. కాని వారి రచన బాగుంది. వారు మరణిం చిన తీరు వారి పట్ల నాకు గౌరవభావం కలిగించింది.” అంటారు ప్రఖ్యాత మార్క్సిస్టు మేధావి ఏటుకూరి బలరామ మూర్తి గారు. సాటి మనిషి కోసం  మరణించ గలగడమే ఆ తీరు. ఎన్ని చెప్పండి ఆ త్యాగానికి ఉన్న విలువ మరి దేనికీ లేదు, రాదు!

కాబట్టి, ఎన్ని విభేదాలు ఉన్న ప్పటికీ ఫాసిస్టు ముష్కర మూకలకి వ్యతిరేకంగా ప్రాణాలొడ్డిన ఇరువురు యోధుల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఫాసిజానికి వ్యతిరేకంగా తలపెట్టిన ఈ యత్నం సఫలం కావాలని కోరుకుంటున్నాను. ముం దుగా ఇంత విస్తృతమైన అక్షరకృషి చేసిన పాణి గారికి అభినందనలు. “పాఠకుల అభిరుచికీ, రచయిత చెప్పదల్చుకున్న సందేశానికీ నిరంతరం జరిగే పోరాటమే ప్రపంచ సాహిత్య చరిత్ర” అంటాడు ఆప్టన్ సింక్లేర్ మామనార్ట్ అనే తన గ్రంథంలో. ప్రగతి శీల భావజాల పతాకను శక్తి మేరకు ఎత్తిపట్టి ఎప్పటిక ప్పుడు ప్రజానీకం ఆలోచనల్ని పీడిత పక్షపాత ధోరణితో శుద్ధి చేసేవారికి  సాహిత్య రచనా వ్యాసంగంలో కూడా పోరాటం అనివార్యం!

ఈ రోజు ఆ పోరాటానికి నిబద్ధతతో కూడిన విశ్లేషణాత్మక కొనసాగింపే ‘ద్వేషభక్తి’ అనే ఈ పుస్తకం. శీర్షిక చూడగానే సమకాలీన స్థితికి అద్దం పట్టే రచన అనే విషయం ఎవరికైనా అర్ధమవుతుంది. మూడు భాగాలుగా 42 వ్యాసాలతో ఫాసిజం కులమత ద్వేషాల ద్వారా, రాజ కీయార్ధిక విధానాల ద్వారా, చివరికి సొంత ప్రజల పై భౌతి కంగా, భౌగోళికంగా చేసే దాడులు ప్రత్యక్ష యుద్ధంగా పరిణ మించడం ద్వారా రాజ్యం కొనసాగించే హింసాత్మక మార్గా ల్ని సమర్ధవంతంగా ఈ పుస్తకం లో వివరించారు. అన్నిటికంటే ముఖ్యంగా, ఫాసిజం కేవల భావ జాలం కాదనీ, దానికి కార్పోరేట్ సామ్రాజ్యవాద మరోముఖం ఎంత వికృతంగా ఉందో విశ్లేషించిన తీరు ఆకట్టుకునేలా ఉంది!

Also read: పునరుద్ధరణవాద ప్రమాదంలో భారతదేశం

“న్యాయ ప్రక్రియల్లోనే కాదు, సామాజిక, భావజాల రంగాల్లో ఏదీ చర్చనీయాంశం కాని ఈ స్థితి కంటే ఫాసిజం ఏముం టుంది?” అంటూ ఫాసిస్టు రాజ్యస్వభావాన్ని జల్లెడపట్టిన రచైత,”మన దేశంలో ఆధ్యాత్మికత, అధికారం ఈ వ్యవస్థ అనే జంతువుకు ఉన్న రెండు వికృతమైన తలలు.” అంటాడు. ఫాసిజం మొదలు రైతాంగ ఉద్యమం వరకూ రిజర్వేషన్ల గురించి, అత్యాచార చట్టాల గురించీ సాగు తున్న దుర్మార్గమైన అగ్రకుల బ్రాహ్మణీయ శక్తుల ఏకపక్ష చర్చను తుత్తునియలు చేస్తూనే పెరుగుతున్న ఫాసిస్టు వ్యూహానికి రోగనిర్ధారణ చేస్తాడు రచయిత. అందుకనే, ప్రగతిశీల అభ్యుదయ రచయితలు, కళాకారుల మీద జరుగుతున్న భౌతికదాడులు, నరేంద్ర దభోల్కర్, గోవింద పన్సారే, కల్బుర్గి, గౌరిలంకేష్ హత్యల వెనుక నిర్మాణాత్మకంగా వ్యవ స్థీకృతం కాబడిన విద్వేషాన్ని పరిణితితో ఎలా ఎదురు కోవాలో చెబుతాడు!

ముస్లింల మీద సాగుతున్న అమానవీయ దాడుల్ని, అవాస్తవ ప్రచారాల్ని ఎలా తిప్పికొట్టాలో చెబుతూ, “మామూలుగా మన సమాజంలో ఏదైనా ఘటన జరిగినపుడు వచ్చే సాధారణ ప్రతిస్పందన ముస్లింల విషయంలో ఉండదు. అది ఎంత తీవ్రమైనదైనా, అన్యాయమైనదైనా సరే పట్టించుకోరు. ఏమీ జరగనట్లు నటించే ఈ సమాజ మౌనంలో లోతైన అర్థం ఉంది. వాళ్ళు ముస్లింలు కావడమే దీనికి కారణం..” అంటారు. అంతేకాదు, రామమందిరం కోసం రాస్తూ, “ఈ నిర్మాణం ఏ విధ్వంసానికి?” అనడం ప్రజాపక్ష రచయితగా పాణి ముందు చూపుకి నిదర్శనం!

విద్వేష సంస్కృతిని విపులీక రించినా, గోల్వార్కర్ లోని డొల్ల తనాన్ని బయట పెట్టినా ఒక స్పష్టమైన ఉద్దేశాన్ని వెల్లడించిన రచయిత, ‘సంఘ్ పరివార్‌ను అన్‌పాపులర్ చేయడమే మన తొలి అడుగు కావాలి’ అంటూ ప్రగతిశీల శక్తుల ఉమ్మడి లక్ష్యం నిర్దేశిస్తాడు. అక్కడితో ఆపడు. కార్పోరేట్‌స్వామ్యం వరకూ అంతెత్తెగసిన హిందూత్వ కప్పుకున్న దేశభక్తి ముసుగు తీసి దాని హింసో న్మాదాల్ని గుడ్డలిప్పి నగ్నంగా మన కళ్ళ ముందుంచుతాడు. విప్లవ ప్రతీఘాత శక్తుల పట్ల జాగరూకత పాటిస్తూనే దళిత బహుజన ఆదివాసీ పీడిత జనులు అనుసరిం చాల్సిన మార్గానికి టార్చ్ లైట్ చూపిస్తాడు.ఆ వెలుతుర్నే తన తాత్వికతగా చేసుకుంటాడు. ఎందుకంటారా? ఒకచోట ఫాసిస్టు రాజ్యాధికార నేతని ఉద్దేశిస్తూ రచయిత అన్న ఈ మాటలు, మొత్తం ప్రగతిశీల రచయిత లందరికి వర్తించేవీ ఫాసిస్టు సందర్భంలో సామా జిక కార్యకర్తలు, ఆలోచనా పరుల రచన, ఆచరణ ఎలా ఉండాలో స్పష్టపరిచేవీ, అవి:

“ఈ దేశ ప్రజలు అన్నంపెట్టి, అక్షరాలు నేర్పితే రచయితను అయినవాడ్ని. నాలుగు వాక్యాలు రాయడం తెలుసుకున్నవాడ్ని. సత్యం మాత్రమే చెప్పమని ప్రజలు నన్ను నిత్యం ఆదేశిస్తుంటారు. కాబట్టి నీ వ్యూహంలో ఎన్నటికీ భాగం కాను.” రచయతకి అభినందనలు!

(నిజానికి కొంత నిడివి ఉపన్యాసంతో రఫ్‌ నోట్స్  ప్రిపేర్ చేసుకున్నాను. కానీ, నా ప్రసంగ సమయానికి నేను లేకపోవడంతో పుస్తకానికి సంబంధించిన ప్రసంగ పరిచ యాన్ని మాత్రమే ఇక్కడ పంచుకున్నాను. హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా వెల్లువలా ఉధృతితో కూడిన ప్రయత్నాలు మరెన్నో రావల్సి ఉందని నా అభిప్రాయం. అందుకోసం అనుభవమూ, విస్తృతీ కలిగిన ఇలాంటి రచైతలు మరిన్ని ప్రభావశీలమైన ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన భావోద్యమ మిత్రులకు ధన్యవాదాలు!)

“How your theory works and what it changes will best tell you what your

theory is.”.     – Paulo Freire

“Rule for the people is merely bene volent slavery, but rule by the people is true freedom.”

                            – Robert Paul Wolff

విప్లవాభినందనలతో…

గౌరవ్

Also read: నిబద్ధతగల కమ్యూనిస్టు కుడిపూడి!

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles