Saturday, February 24, 2024

మనకు మనము సమర్పించు గణతంత్ర రాజ్యాంగం

మరో ప్రపంచం,

మరో ప్రపంచం,

మరో ప్రపంచం పిలిచింది!

పదండి ముందుకు

         అని శ్రీశ్రీ పిలిచినట్టు మనం చేసుకున్నది పీఠిక సామాజిక ఒప్పందం.

దీన్నే అవతారిక అనీ ఇంగ్లీషులో ప్రియాంబుల్ అనీ అన్నారు.

భారత ప్రజలమైన మనము, మన భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్రదీక్షతో తీర్మానించి, మన దేశ పౌరులందరికీ

సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాల్ని;

ఆలోచనా, భావప్రకటనా, మతవిశ్వాస ఆరాధనా స్వేచ్ఛను;

హోదాల్లోనూ  అవకాశాలలోను సమానత్వాన్ని సాధించేందుకు;

వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యత సమగ్రతను కల్పించే సౌభ్రాతృత్వాన్నిపెంపొందించాలని;

మన రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, శాసనీకరించి, ఆమోదించి, మనకు మనము సమర్పించుకుంటున్నాము.

Also read: 3 రాజ్యాంగ పీఠిక, పాట కాదు ఒక పాఠం, ఒక ప్రతిజ్ఞ

మనం అంటే ఎవరు? మనం అంటే డిల్లీలో రాజ్యాంగంలో నిర్మించిన చుట్టూ ఉన్న మనమా? ఈ దేశం మనమా? 1950రోజుల్లో ఉన్న మన కోట్లాది మానవ దేవులా? లేక ఈ రోజు బతుకుని ఉంటూ బ్రతుకుబాట వెతుక్కుంటున్న కూడా మన మామూలు మానవులమా? అంటే అందరమే మనమే. ఇంకో మాట, మనం మనకే ఇస్తున్నాం అని కూడా అర్థం కావాలి మరి.

మొదట్లో భారత్‌ను సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొన్నారు. అయితే 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా ఇది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మారింది.

1776లో అమెరికన్ రాజ్యాంగ పీఠిక అమెరికా స్వతంత్ర ప్రకటనలో కీలకమైన భాగం. రాజ్యాంగానికి పీఠిక గుర్తింపు కార్డు వంటిదని శంకరీ ప్రసాద్ కేసులో (1952) జస్టిస్ హిదయతుల్లా పేర్కొన్నారు.విచిత్రమేమంటే పీఠిక మన రాజ్యాంగంలోని అంతర్భాగమా లేక బయట ఉన్న ఒక పేజీయా అని పేచీ వచ్చింది. ఈ అంశాన్ని బాగా విచారించి, సుదీర్ఘమైన వాదోపవాదాలు విన్న తరువాత న్యాయమూర్తుల ధర్మాసనం కేశవానంద భారతి కేసులో పీఠిక రాజ్యాంగంలోని అంతర్భాగమేనోయీ అని తీర్పుచెప్పింది. అంతకుముందు సుప్రీంకోర్టు వారు పీఠిక అంతర్భాగం కాదన్నారు. విచిత్రమేమంటే పీఠికలో ఉన్న హక్కులకు భంగకరమైన నియమాలు, లక్ష్యాలను అడ్డుకునే నియమాలు కొన్ని మొదటినుంచి ఉండడం, మరెన్నో తరువాత కాలంలో వచ్చి చేరడం జరుగుతుండడం గమనించవలసి ఉంది.

    భారత ప్రజలు చేసుకున్న సామాజిక ఒప్పందమే ఈ పీఠిక. ఇందులో విలువలను కాపాడడానికి మనం దీక్షాబద్దులం కావాలి. పౌరుడిని చైతన్యవంతుడైన సహేతుకమైన, స్వేచ్ఛాయుతుడైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ప్రతిజ్ఞ చేయాలి. మనం ఇంకా కులమతాల చట్రాలలోంచి చట్టాలలోంచి బయటకు రాలేదు. మన ఎన్నికలన్నీ కులమతాలకు చెందిన ఓట్లను ప్రేరేపించడంతోనే మొదలై ముగుస్తున్నాయి. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తరువాత మనం సామాజిక అభివృధ్ధి, ప్రజాస్వామ్యవిలువల వంటి విధానాలు చూడడం లేదు.  తాతల నాటి కట్టడాలు తన ఘన కార్యక్రమం అన్నట్టు చూపి సంస్కృతిని బూచిగా మార్చి, మతాన్ని కులాన్ని నిత్యం వల్లిస్తూ ద్వేషం కురిపిస్తూ, మానవత్వానికి చాలా దూరంగా సాగిపోతూ మత్తిచ్చి డబ్బిచ్చి అబద్దాలు చెప్పి ఓట్లు అడుక్కుంటున్నాం, కొనుక్కుంటున్నాం. అమ్ముకుంటున్నాం, మత్తు పుచ్చుకుని ఇచ్చుకుంటున్నాం.

Also read: సంవిధానం పీఠిక చదివితే నేరమా ఓ విధానమా?

చారిత్రక విభాత సంధ్యల

మానవకథ వికాసమెట్టిది?

ఏ దేశం ఏ కాలంలో

సాధించిన దే పరమార్థం?

ఏ శిల్పం? ఏ సాహిత్యం?

ఏ శాస్త్రం? ఏ గాంధర్వం?

ఏ వెల్గుల కీ ప్రస్థానం?

ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?

శ్రీ శ్రీ చెప్పినట్టు ‘ఈ దేశం ఈ కాలం’మనదే, అదే కావాలి. కాని ఈ దేశం ద్వేషం కాకూడదు, కాదే కాదు, అనేది మన పీఠిక. మనం మంత్రం. మన తంత్రం.

భారతదేశం ‘సంఘం’, విద్వేష ‘కేంద్రం’ కాదు

ద్వేషపు విషాలు విరజిమ్మే నేతలకు రాజ్యాంగ పాఠాలు చెప్పవలసిన అవసరం ఉంది. భారత్ ఒక సంఘం, విద్వేష కేంద్రం కాదు అనేది తొలిపాఠం.

నిజానికి కేంద్రం అన్నమాటే రాజ్యాంగంలో లేదు. ఢిల్లీలో ఉన్న జాతీయ ప్రభుత్వానికి సంఘం అని రాజ్యాంగం అంటుంది. దేశం అంటే సంఘం. సంఘం అంటే కలిసి ఉండడం. మనం విద్వేష విధ్వంస ఉద్వేగ ఉద్రేక వాక్యాలతో జాతిని విభజించి భజనలను ప్రోత్సహిస్తున్న ప్రస్తుత సమయంలో రాజ్యాంగం దేశాన్ని సంఘం అన్నదని తెలుసుకోవలసిన అవసరం చాలా ఉంది. మనం జాతి అంటూ ఉంటాం. నేషనల్ అన్న పదానికి తెలుగులో మనం జాతీయ అని అర్థం చెప్పుకుంటున్నాం. హిందీలో జాతి అంటే కులం. రాష్ట్రీయ ఏకతా అంటే జాతీయ సమైక్యత. ఈ విధంగా మన దేశ భక్తి భావాలను రకరకాల పదాలతో వాడుతూ మన దేశాన్ని గందరగోళంలో పడేస్తున్నాం మనం. మన నాయకుల సంగతి మరీదారుణం. చంపండి నరకండి అని తెలుగు సినిమా ఫాక్షన్ కథల హత్యాకాండ పరిభాషను తలపించే విధ్వంసక భాషను మనవాళ్లు వేదికలమీద వాడుతున్నారు. ఇది నేర భాష. ద్వేష విధానం. ఈ విధంగా మాట్లాడే వారు దేశద్రోహులు. జైళ్లలో ఉండవలసిన వారు మైకుల్లో మాట్లాడుతున్నారు. దురదృష్టం.

వాడుకలో పత్రికల్లో టివీల్లో మనం కేంద్రం అనేమాట వాడుతున్నాం. రాజ్యాంగంలో కేంద్రం అనేమాటే లేదు. ఆ మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తొలి తెలుగుదేశం వ్యవస్థాపకుడు (చంద్రబాబు నాయుడికి ముందు తెలుగుదేశం) ఎన్ టి రామారావు కేంద్రం అనే పదం మిధ్య అనేవారు. రాష్ట్రాలకు లేకపోతే దేశం ఎక్కడ అనే వారు? అన్ని రాష్ట్రాల హద్దులన్నీ కలిపితేనే ఈ దేశం అని కూడా  వాదించే వారు.

మనదేశ రాజ్యాంగం ప్రకారం కేంద్రం గొప్పదా? రాష్ట్రం గొప్పదా?  అందరూ తడుముకోకుండా చెప్పే సమాధానం కేంద్రం గొప్పదని. గొప్పదంటే ఏమిటి? ఎక్కువ అధికారాలున్నాయనా? పెద్దదనా? కాదు. ఎన్నికలద్వారానే ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు, ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా సమానమే కదా? సమానమే కాని కేంద్రం ఎక్కువ సమానం. ఎందుకంటే దేశ రక్షణ, విదేశీ వ్యవహారాల నిర్వహణ, కమ్యూనికేషన్లు, ఇవన్నీ యూనియన్ ప్రభుత్వమే నిర్వహించాలి. ఇందులో రాష్ట్రాలకు ప్రమేయమే లేదు. యూనియన్ లిస్ట్ అని ఏడో షెడ్యూల్ లో కొన్ని అంశాలపైన పాలనాధికారాలను, శాసనాధికారాలను ప్రత్యేకించి యూనియన్ కే పరిమితం చేశారు.

కేంద్రం మిధ్య?

యూనియన్ అంటే సంఘం. సంఘ ప్రభుత్వం డిల్లీలో ఉంటుంది. హిందీలో రాష్ట్రం అంటే దేశం. రాష్ట్రపతి అంటే దేశాధ్యక్షుడని తెలుగులో కూడా ఒప్పుకుంటాం, కాని వాడుకలో రాష్ట్రం అంటే ద్వితీయ స్థాయి పాలనా ప్రదేశం. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటాం. రాజనీతి పరంగా, రాజ్యాంగ వాడుకలో స్టేట్ అంటే వేరే అర్థం ఉంది. స్టేట్ అంటే రాజ్యం అని, దేశ పాలనా వ్యవస్థ అని అర్థం. మార్గదర్శకంగా ఉండే ఆదేశిక సూత్రాలలో స్టేట్ సమానతను సాధించడానికి, పేద ధనిక వ్యత్యాసాలు తగ్గించడానికి కృషి చేయాలని సూత్రం ఒకటి ఉంది. స్టేట్ ను మనం తెలుగులో ఇతర భాషల్లో కూడా ఫలానా రాష్ట్రం అనే అర్థంలో వాడతాం. విచిత్రంగా రాజ్యం రాష్ట్రమైంది. రాష్ట్రం దేశమైంది. దేశం కేంద్రమైంది. రాష్ట్రం కేంద్రం దగ్గర నిలబడి నిధులు అభ్యర్థించే ప్రజా ప్రభుత్వమైంది. రాజ్యాంగంలో మన రాజ్యాంగ నిర్మాతలు రాజనీతి శాస్త్రానికి అనుగుణంగా వాడిన కీలకపదాలను అర్థం చేసుకోకుండా మన వాడుక పదాలతో గందరగోళం సృష్టిస్తూ ఉంటాం. న్యాయపరిభాషలో ఈ పద్ధతి సమస్యలు తెస్తుంది.

Also read: అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాతా? రచయితా?

మాడభూషి శ్రీధర్

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles