Sunday, October 13, 2024

‘జ్ఞానం’- సంపాదించినవారంతా బౌద్ధులే!

 ‘‘బౌద్ధులు ఏ పుస్తకానికో, వ్యక్తికో బానిసలు కారు. బుద్ధుని అనుసరించడమంటే, తమ ఆలోచనా స్వేచ్ఛను వదులుకోవడం కాదు. స్వేచ్ఛగా బుద్ధుని మార్గంలో ఆలోచించి, జ్ఞాన ప్రపూర్ణులై తాము కూడా బుద్ధులు కావచ్చు. బుద్ధులు కాగల సామర్థ్యం అందరిలోనూ ఉంటుంది. ప్రయత్నించి సాధించాలి!’’- అని వాట్ ఈజ్ బుద్ధిజం (WHAT IS BUDDHISM)? గ్రంథంలో నాదమహాథేరో అంటారు.

Also read: ప్రపంచంలోని తొలి భౌతికవాదులు మన చార్వాకులు

బుద్దవచనంలో గౌతమ బుద్ధుడు బోధించిన దశ శీలాలు ఈ విధంగా ఉన్నాయి- 1. హింసను ఆపండి. ఇతర జీవులకు ప్రాణహాని తలపెట్టకుండా నిగ్రహించుకోండి. 2. మీకు ఎవరూ ఇవ్వనిది, మీకు మీరు తీసుకోకుండా నిగ్రహించుకోండి. 3. స్వచ్ఛతతో, నిజాయితీగా బతకండి. ఎల్లప్పుడూ మెలకువతో మెలగండి. 4. అబద్ధాలు చెప్పకుండా నిగ్రహించుకోండి. 5. సత్యం మాట్లాడండి. అదే నమ్మదగింది. అదే ఆధారపడదగింది- అనే విషయం రుజువు చేసుకోండి! కానీ పరస్పరం విరుద్ధమైన మాటలు ఎప్పుడూ మాట్లాడకండి!! 6. ఇతరుల గూర్చి చెడు మాట్లాడకుండా, వారిపై దుష్ప్రచారం చేయకుండా నిగ్రహించుకోండి! 7. మైత్రిని ప్రేమించండి. మైత్రి పెంపొందించే మాటలు మాత్రమే మాట్లాడండి. విద్వేషాలు విడనాడండి. విద్వేషాలు రేకెత్తించే మాటలు మాట్లాడకండి. 8. ఇతరుల మనసులు గాయపరిచే దురుసు మాటలు మాట్లాడకండి. 9. వ్యర్థ సంభాషణలు వదిలేయండి. ఖచ్చితమైన, సున్నితమైన, సభ్యమైన మాటలు మాత్రమే ఎన్నుకుని జాగ్రత్తగా మాట్లాడండి. 10. అర్థవంతమైన, సవివరమైన పద్దతిలో మీ వాదనను స్పష్టంగా వివరించండి.

-గౌతమ బుద్ధుడు

(సుత్తపిటక-దీఘనికాయ – బ్రహ్మజాలసుత్త)

(ఈ దశ శీలాలు ప్రపంచ మానవులందరి కోసం చెప్పినవి. అయితే, ప్రత్యేకించి మన దేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ పదెద్దలు, వారి బీజేపీ పార్టీ ప్రముఖులూ పాటిస్తే-దేశం కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం ఉండేది!)

Also read: భారత్ విశ్వగురువు ఎలా అయ్యింది?

బుద్ధ-ధమ్మ-సంఘం: ఇవి త్రిరత్నాలు. బౌద్ధులయినవారు విధిగా వీటి శరణు పొందాలి. అందుకే వీటిని ‘త్రిశరణాలు’- అని కూడా అన్నారు.

1.బుద్ధ లేక బోధి అని అంటే, Supreme Knowledge- Tree of wisdom. అత్యున్నతమైన జ్ఞానం పొందినవాడు గనుకనే గౌతముడు బుద్ధుడయ్యాడు. తన కంటే ముందు ఇంకా చాలామంది బుద్ధులు ఉన్నారని స్వయంగా బుద్ధుడే చెప్పాడు. బుద్ధుడు వినయశీలి గనక, తన గూర్చి తాను గొప్పగా చెప్పుకోకుండా, తనకంటే ముందే జ్ఞాన సముపార్జన చేసిన వారున్నారని ఆయన చెప్పి ఉంటాడు. బోధి స్థితిని సాధించిన వారందరిలోకీ మహావ్యక్తి బుద్ధుడే- అందువల్ల ఈ జగత్తు ఆయన నొక్కడినే బుద్ధుడిగా గుర్తుపెట్టుకుంది. మానవుల దుఃఖ విముక్తికి దారి చూపిన వాడు గనక, ఈ ప్రపంచం దృష్టిలో ఆయనొక్కడే బుద్ధుడయ్యాడు.

2. ధమ్మ అంటే, ప్రకృతి నియమానికే ధమ్మ (ధర్మం) – అని అర్థం. ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అది అధర్మం అవుతుంది. ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తిసే అది అధర్మం అవుతుంది.  తథాగతుడు- ఏది ఎలా ఉంటే అలా దాని ప్రకారం నడుచుకునేవాడు అని అర్థం. ప్రకృతి నియమాల ప్రకారం నడుచుకునేవాడు గనక బుద్ధుడికి ‘తథా..గతుడు’ అని పేరు.  శాక్య వంశానికి చెందినవాడు గనక, ముఖ్యంగా మునిలాగా జీవించినవాడు గనక, ఆయనను ‘శాక్యముని’ అని కూడా పిలుచుకున్నారు.

Also read: ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?

3. సంఘం:  మనిషి సంఘజీవి. బౌద్ధమార్గాన్ని అనుసరిస్తూ, మనసుని నిర్మలంగా ఉంచుకుంటూ, అంకిత భావంతో, నిబద్ధతతో సమాజానికి మేలు చేసే పనులలో నిమగ్నం కావాలి!

వ్యక్తిగతంగా తన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తన బోధనల పట్ల మాత్రమే శ్రద్ద వహించాలన్నాడు బుద్ధుడు. బోధి స్థితికి చేరాలన్నా, నిర్వాణ దశకు చేరాలన్నా ఎవరికి వారు కృషి చేయాల్సిందేనని కూడా చెప్పాడు. జీవితంలో తను ఆచరించిన అంశాలే బుద్ధుడు ఇతరులకు బోధించాడు. స్వీయ పరిశీలనలో తాను తెలుసుకున్న విషయాలు, గ్రహించిన అంశాలు మాత్రమే తన శిష్యులకూ, అనుచరులకూ బోధించాడు. దుఃఖం అనే తిమిరం నుండి ‘నిబ్దాణం’ (నిర్వాణం) అనే వెలుగు వైపు నడిచే మార్గాన్ని బుద్ధుడు ప్రబోధించాడు. తను కేవలం దారి చూపగలవాడినే కానీ, మోక్షదాతను కాదన్న వాస్తవాన్ని స్పష్టం చేశాడు.

బుద్ధుణ్ణి ‘భగవాన్ బుద్ధ’- అని కొందరు పిలుస్తుంటారు. మానవ మాత్రుడైన వాణ్ణి భగవాన్ అని పిలవడమేమిటీ? అని కొందరికి అనుమానం రావొచ్చు. భగవాన్ – అంటే అసలైన అర్థం రాగద్వేషాల్ని, మోహాల్నీ భగ్నంచేసుకున్నవాడు- అని! భగవాన్ – అనేది బుద్ధుడికి ఉన్న బిరుదు.

వైదిక-బ్రాహ్మణ-హిందూ ధర్మం చెప్పే భగవాన్ కు, బౌద్ధం చెప్పే భగవాన్ కు చాలా వ్యత్యాసం ఉంది. ముందు మనం దాన్నిఅర్థం చేసుకోవాలి. వైదిక ధర్మం ప్రకారం భగవంతుడు సర్వశక్తిసంపన్నుడు. ఆదీ అంతం లేనివాడు. ఈ సృష్టి రచన చేసినవాడు. జగద్రక్షకుడు. మహిమలు గలవాడు. పాపపుణ్యాలు లెక్కగట్టుకునేవాడు. ఎప్పుడూ ఎక్కడా కనబడనివాడు. మనిషి మెదడులో సృజించబడ్డవాడు- ఇలా ఎన్నో అర్థాలున్నాయి! కానీ, బుద్ధుడు అలా కాదు. వాస్తవంగా ఈ ప్రపంచంలో పుట్టిన వ్యక్తి. రాజ్యాన్ని, సర్వసుఖాల్ని త్యజించి, సత్యాన్వేషణకు అడవుల్లో గడిపిన వాడు. ప్రకృతి పరిశీలనలో కొన్ని జీవన సత్యాల్ని గ్రహించినవాడు. తాను గ్రహించిన మానవీయ విలువల్ని, జీవన సత్యాల్ని తన శిష్యులకు, అనుయాయులకు బోధిస్తూ – ఈ దేశం నాలుగు చెరగులా తిరిగినవాడు. వైదికుల భగవంతుడు కల్పితం! బౌద్ధుల భగవాన్ యదార్థం! రెంటికీ చాలా తేడా ఉంది. ఎవరైతే సాధన చేసి, మానసిక వికారాలు పూర్తిగా తొలగించుకుంటారో వారే ‘భగవాన్’ అవుతారు. అందుకు విపశ్యన ధ్యానం సాధన చేయాలని బౌద్ధం చెపుతుంది.

Also read: ఏ మనిషినీ సున్నా కింద తీసిపారవేయలేం!

భధంత- అంటే భిక్షువు/భిక్కు/భగవాన్ అనే అర్థాలున్నాయి. భంతే భగవంత అనే పదాలకు కూడా అర్థం అదే – పెద్దవారినీ,, గౌరవనీయులనూ భంతే అని పిలవాలనీ, చిన్నవారినీ, సమఉజ్జీలయిన స్నేహితుల్ని ‘అవుసో’ అని పిలవాలనీ ‘మహా పరినిబ్బాన సూత్రం’లొ స్వయంగా బుద్ధుడే చెప్పాడు. భిక్కు సంఘంలోకి బుద్ధుడు ప్రత్యేకించి ఎవరినీ ఆహ్వానించలేదు. బౌద్ధ భిక్కు కావడమన్నది ఎవరికి వారు తీసుకోవాల్సిన నిర్ణయం. శ్రమించకుండా బతుకు వెళ్ళదీయడానికి భిక్కు కావద్దనీ, సమాజానికి సేవలు అందించే  విధంగా దృఢసంకల్పంలో ఉన్నవారే ధర్మశీలం ఆచరిస్తూ దానిని బోధించేవారు అయితేనే, భిక్కు సంఘంలో చేరాలనీ ఆయన సూచించాడు. ఎవరో లోకరక్షకుడు ఉన్నాడన్న భ్రమలో యజ్ఞాలూ, యాగాలూ చేస్తూ, తమను తాము మోసం చేసుకుంటూ లోకానికి తప్పుదోవ చూపెవాడు బౌద్ధభిక్షువు కాకపోవమే మంచిదన్నాడు. ప్రశాంత వదనంతో సత్యాన్ని సత్యంగా, కరుణ, ప్రేమ, మైత్రితో ప్రజలకు ‘‘జ్ఞానం’’ అందించేవారు మాత్రమే బౌద్ధులవుతారనీ చెప్పాడు. నీటిలో పుట్టిపెరిగిన తామరపువ్వు, నీటిలోని మురికి అంటించుకోకుండా పైకి తేలి ఎలా నిలబడుతుందో బౌద్ధులు కూడా అదే విధంగా లౌకిక ప్రపంచపు మురికిని అంటించుకోకుండా స్వచ్ఛంగా ఉండాలనీ బుద్ధుడు చెప్పాడు. (అంగుత్తర నికాయ 11-38) బుద్ధడు చెప్పిన నైతిక విషయాలు బుద్ధుడి కంటే ముందే మరికొందరు చెప్పి ఉంటారు. కానీ, అంతవరకూ ఎవ్వరూ చెప్పని అంశం – ‘శాస్త్రీయతని’ జోడించి, బుద్ధుడు సంఘాన్ని నిర్మించాడు.

సోదర సమానత్వ  భావనల జ్ఞానాన్ని తొలిసారి మనుషులలో కలిగించిన తాత్త్వికుడు- బుద్ధుడు.  అతీత శక్తులేవీ ఉండవని స్పష్టం చేసిన భౌతికవాది. శ్రద్ధ, ఏకాగ్రత, సమర్పణ భావనల గురించి చెప్పిన ఉపాధ్యాయుడు.

జ్ఞానమే పునాదిగా గలది – బౌద్ధం!

మానసిక ఉన్నతిని సాధించడం – బౌద్ధం!!

దయ, కరుణ, నిస్వార్థం, సత్ప్రవర్తనల గూర్చి బోధించిన బుద్ధుడు, అహింసా పద్ధతుల్ని, యుద్ధవ్యతిరేకతని ప్రపంచానికి అందించాడు. ఒక దార్శనికునిగా తను జీవించిన కాలానికి అతీతంగా ఆలోచించి, శీలాన్ని, ప్రగతిశీల ఆలోచనా ధోరణిని ప్రపంచానికి చాటి చెప్పిన నాగరికుడు. బుద్ధుడిని మించి శాంతిమార్గం చూపిన ప్రపంచ శాంతి కాముకుడు మరొకరు లేరు.

Also read: భౌతికవాదాన్ని తవ్వితీసిన దేవీప్రసాద్ ఛట్టోపాధ్యాయ

పన్నెండవ శిలాశాసనంపై అశోకుడు ఒక చక్కని మాట చెక్కించాడు. ‘‘ఎవరైతే తాము నమ్మిన ధర్మాన్ని వ్యాప్తి చేయాలని ఇతరులను కించపరుస్తూ మాట్లాడుతారో, వారు నిజానికి తమ ధర్మానికే నష్టం కలిగిస్తారు’’- అని! బౌద్ధ బహుజన చక్రవర్తి అశోకుడు బ్రాహ్మణులకు, జైనులకు,  అజీవకులకు ఎంతో ఉదారంగా దానధర్మాలు చేశాడు. అశోకుడు గానీ, అతని తర్వాత వచ్చిన ఇతర బౌద్ధ చక్రవర్తులు గానీ  ఇతర మతాలను, ఇతర ధర్మాలను ద్వేషించలేదు. వాటిని నాశనం చేయాలని ప్రయత్నించలేదు. కానీ,బ్రాహ్మణ పాలకుడు పుష్యమిత్ర శృంగుడు, అతని వారసులు బౌద్ధ భిక్షులను చంపించారు. బౌద్ధారామాలను ధ్వంసం చేయించారు. ఆ తర్వాత ఆదిశంకరుడు, రామానుజుడు అనే వైదిక మతగురువులు వారి వారి కాలాలలో హిందూ తీవ్రవాదులుగా ప్రవర్తించారు. బౌద్ధ, జైన ఆరామాల్ని హిందూ దేవాలయాలుగా మార్చడంలో ఆరితేరారు. బౌద్ధాన్ని నాశనం చేయడంలో వీరూ వీరి అనుచరులు తమని తాము విజయులుగా భావించుకుని ఉంటారు. కానీ, చరిత్రలో దోషులుగా మిగిలిపోయారు. ఆ విషయాలు అలా ఉంచితే, 14 అక్టోబర్ 1956 – అశోక విజయదశమి రోజున ప్రపంచమేధావి డా. బి.ఆర్. అంబేడ్కర్, తన తాడిత, పీడిత సోదరసోదరిమణుల్ని-సుమారు మూడు లక్షల అరవై అయిదు వేల మందిని తీసుకుని – నాగపూర్ లో బౌద్ధం స్వీకరించారు. మనుషులుగా గుర్తించని హిందూ మతంపై తిరుగుబాటు చేశారు. తరువాతి తరాలవారికి సైతం, ఒక జీవన విధానాన్ని చూపించారు!

Also read: నేను అంటే ఎవరు?: ఒక వైజ్ఞానిక వివరణ

(రచయిత కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles