Friday, April 26, 2024

భారత్ విశ్వగురువు ఎలా అయ్యింది?

భారత దేశంలోని కొందరు చక్రవర్తులు తమ మంత్రులుగా, సేనాపతులుగా ఎవరిని ఎంచుకున్నారో,ఎవరిని నియమించుకున్నారో గమనించండి. వ్యక్తిగత అభిప్రాయాలు ఏవి ఉన్నా, వాటిని ఒక్క క్షణం పక్కన పెట్టి, సమదృష్టితో ఆలోచించి చూడండి. అక్బర్ చక్రవర్తి ముస్లిం రాజు కదా? అతని దగ్గర పని చేసినవారు హిందువులైన తోడర్ మల్, బీర్ బల్, మాన్ సింగ్! ఛత్రపతి శివాజీ హిందూ రాజు కదా? అతని దళపతిగా పని చేసినవాడు దర్యాసారంగ్. సేనాపతులు ఇబ్రహింఖాన్, దౌలత్ ఖాన్ లు అయినప్పుడు వీరు మతవాదులవుతారా? లౌకికవాదులవుతారా? ఏ కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నవారికైనా విషయం బోధపడుతుంది. ఆ తర్వాత ఔరంగజేబు సర్వసైన్యాధిపతి జయసింగ్. ఇక దక్షిణ భారత దేశంలో టిప్పుసుల్తాన్ దగ్గర ప్రధానిగా ఉన్నది-పూర్ణయ్య. హైదరాబాద్ తానీషా దగ్గర మంత్రులు అక్కన్న, మాదన్నలు. మరి వీరిని లౌకికవాదులందామా? మతవాదులందామా?

Also read: ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?

సరే, ఈ విషయాలు అలా ఉండనిచ్చి – వీరశైవులు, వీరవైష్ణవుల మధ్య – హోరాహోరీగా పోట్లాటలు ఎందుకు జరిగాయి? ఇద్దరూ వైదిక మతాచారాలు పాటించేవారే కదా? మరి వీరిమధ్య మారణహోమాలు ఎందుకు జరిగాయి? వీరిలో మతవాదులెవరు, లౌకికవాదులెవరన్నది ఇప్పుడు ఆలోచించి తేల్చుకోండి! మనువాదులు అఘాయిత్యాలకు, అత్యాచారాలకు పాల్బడి, వారి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి గత కాలపు ముస్లిం పాలకుల్ని, ఈ కాలపు ముస్లిం పౌరుల్ని దుయ్యబడుతుంటారు.  అర్థరహితమైన వాదనలు చేస్తూ అభాసుపాలవుతుంటారు. ఒక క్రమపద్ధతిలో విశ్లేషించుకుంటూ వస్తే, గతంలోనూ, ప్రస్తుతంలోనూ మనువాదులు చేసిన, చేస్తున్నదుర్మార్గాలు స్పష్టంగా కళ్ళముందుంటాయి. ఇలాంటి వాస్తవ స్థితిగతులు నెమరేసుకుంటూ దేశం విశ్వగురువు కాలేదు. వీలైనంత వరకు అభూత కల్పనలు ప్రచారం చేసుకుంటూ, ‘విశ్వగురువు’ అయ్యానని అనుకుంటోంది.

దేశం విశ్వగురువుగా నిలబడాలంటే ఇదిగో ఇలాంటి కట్టుకథలు నమ్ముతూ బతుకుతుండాలి! ఉదాహరణకు కొన్ని చూద్దాం!!

Also read: ఏ మనిషినీ సున్నా కింద తీసిపారవేయలేం!

రాముడు పాయసానికి పుట్టాడు. సీత భూమికి పుట్టింది. వినాయకుడు నలుగుపిండికి, పార్వతి మంచుకొండకు పుట్టారు. శ్రీశుకుడు చిలుకకు, మాండవ్యుడు కప్పకు, శౌనకుడు కుక్కకు, అశ్వద్ధామ గుర్రానికి, విశ్వామిత్రుడు గాడిదకు, వాల్మికి పుట్టకు, రుష్యశృంగుడు జింకకూ పుట్టారు! విష్ణుమూర్తి బొడ్డులోంచి బ్రహ్మ పుడితే, బ్రహ్మమనసులోంచి సరస్వతి పుట్టింది. ఇకపోతే, ఆదిశక్తి గుడ్లు పెట్టగా త్రిమూర్తులు పుట్టారు కదా? మహాలక్ష్మి పాల సముద్రానికి, కర్ణుడు సూర్యుడికి పుట్టారు. కట్టుకథలు కల్పిత పురాణాల్లో జన్మవృత్తాంతాలు చాలా విచిత్రంగా ఉంటాయి. సరే. గొప్ప సృజనాత్మక రచనలంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అవన్నీ నిజం. వాటిని మనస్ఫూర్తిగా విశ్వసించాలి. విశ్వసించి పూజించాలి. పూజించి, మోక్షం సాధించాలి. జన్మ రాహిత్యం సాధించాలి – అని మత పండితులు, మత బోధకులు చెపుతూ ఉండేనే చోద్యంగా ఉంటుంది. వారి అజ్ఞానానికి జాలి కలుగుతుంది. ఒక వైపు ఆధునిక మానవులుగా జీవిస్తూ, మరోవైపు విచక్షణాజ్ఞానం లేని – మానవ జాతి ‘తొలిదశలోని వారిగా’- ఆలోచిస్తూ ఉంటే, బాధ కలుగుతుంది! వీరెప్పుడు ఆధునికుడి ఆలోచనను అందుకోగలరూ? – అని, అనిపిస్తుంది.  వారి మెదడ్లను చుట్టుకుని ఉన్న మూఢత్వాన్ని బద్దలు కొట్టుకుని బయటపడితే గాని వారికి వాస్తవాలు అర్థం కావు. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేశ ప్రజలు బయటపడరు. ఈ దేశ నాయకులు బయట పడనీయరు. బయట పడితే దేశం విశ్వగురువు కాకుండా పోతుందేమోనని… వారికి బెంగ.  బుగులు. తాము ఎలా చచ్చినా ఫరవాలేదు కానీ దేశం మాత్రం మూర్ఖత్వానికి బ్రాండ్ ఎంబాసిడర్ గా నిలబడాలన్నదే వారి కోరిక! ప్రపంచం నవ్విపోతున్నా పట్టించుకోకుండా ‘తామే విశ్వగురువులమని’ చెప్పుకు తిరుగుతుండాలి!

Also read: భౌతికవాదాన్ని తవ్వితీసిన దేవీప్రసాద్ ఛట్టోపాధ్యాయ

‘‘వేదాలు 1.96 కోట్ల సంవత్సరాల పూర్వం వెలువడ్డాయి. ఓం- అనే శబ్దతరంగాలే ప్రపంచంలోని అన్ని శబ్దతరంగాలకు మూలం-స్తబ్దుగా ఉన్న ప్రకృతి ఓం శబ్దంతోనే చైతన్యవంతమవుతుంది. మానవ మస్తిష్క చైతన్యానికి ఓం –శబ్ద తరంగాలే ముఖ్యం!’’- అని చెప్పుకుంటూ ఆత్మద్రోహం చేసుకోవడం తప్పిస్తే – ఏదీ రుజువు కాలేదు. ఇలాంటి మూర్ఖత్వం వ్యాప్తి చేస్తూ పాపం దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలని తాపత్రయ పడుతుంటారు. గత కాలపు పురాణాలే కాదు, వాటి సారాంశాన్ని నేటి వ్యాపార సినిమాలు కూడా తమ శాయశక్తులా ప్రచారం చేస్తున్నాయి. అఖండ, దేవి, నాగదేవత, పాతాళభైరవి, దయ్యం, పిశాచం, ఆత్మ మొదలైన ఫాంటసీ ఫిక్షన్ కు సంబంధించినవి –ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చూపించే సినిమాలన్నీసమకాలీన సమాజాన్ని తప్పుదారి పట్టించేవే. దర్శక, నిర్మాతలు, సినీ హీరోలు నమ్మకాలకు మరింత మూర్ఖత్వాన్ని, మూఢత్వాన్ని జోడించి – ముఖ్యంగా సైన్సును వాడుతూ, సైంటిఫిక్ స్పిరిట్ కు వ్యతిరేకంగా సినిమాలు తీయడం-జనావళిని అంధవిశ్వాసాల్లో ముంచడం క్షమించరాని నేరం! సమాజ ద్రోహం!! బహుశా దేశం విశ్వగురువు కావాలంటే ఇలాంటి అసందర్భమైన, అసంగతమైన అబద్ధాల ప్రచారం కొనసాగాల్సిందేనేమో?

Also read: నేను అంటే ఎవరు?: ఒక వైజ్ఞానిక వివరణ

అనాదిగా స్తవము, సుప్రభాతం, సంకీర్తనం – దేవాలయ గోపురాల మీద, గోడలమీద అంతా శృంగారమే! ప్రపంచంలో ఇంతటి పచ్చి శృంగార భావనలు మరో చోట ఎందుకు లేవూ? ఈ నతాతన/వైదిక/బ్రాహ్మణ సంస్కృతిలో మాత్రమే ఎందుకు ఉన్నాయీ?  ఆలోచించాల్సిన విషయం. దేశం విశ్వగురువు కాలాలంటే ఈ పచ్చి శృంగారం తప్పదా? కన్నతల్లి లాంటి అమ్మవారిని ‘జగడపు చనువుల జాజర’ చేయించిన అన్నమయ్యను ఏమనాలీ? కన్నతల్లిలో కూడా శృంగారం చూసిన అన్నమయ్య, , తరతరాల భక్తులకు కూడా ఆ శృంగారాన్నే చూయించాడు కదా? ఆ మాట అన్న అన్నమయ్యను తప్పుపట్టరు. ఆయనో భాక్తాగ్రేసరుడయిపొయ్యాడు. ఆ మాటలో ఉన్న అసలైన అర్థం ఇదీ – అని చెప్పినవాడిది మాత్రం తప్పవుతుంది? వారెవా సనాతనమా? అయ్యారే ఛాందసమా? మరి దేశం విశ్వగురువు కావడమంటే మాటలా మరి? ఆధునిక నాస్తికోద్యమ నిర్మాత గోరా (15.11. 1902- 26.7.1975) ఏమన్నారో ఒక సారి జాగ్రత్తగా గమనించండి. అంతేకాదు, సీరియస్ గా ఆలోచించండి – ‘‘దేవుడనేది మానవుడు కల్పించిన అబద్ధం! చాలా అబద్ధాల వలెనే గత కాలంలో అది కొంత వరకు ప్రయోజనకరంగా ఉంటే ఉండిందేమో! కానీ, అన్ని అబద్ధాల వలెనే ఇది కూడా రాను రానే జీవితాన్ని కల్మషం చేసింది. కనుక, మానవ సంఘంలో అవినీతి కడిగివేయబడి, నీతి పెరగాలంటే దైవ విశ్వాసం పోవాలి! పోకతప్పదు!! అబద్ధాలతో దేశం విశ్వగురువు ఎన్నటికీ కాలేదన్నది గ్రహించాల్సిన సారాంశం.

Also read: దేశాన్ని సానిటైజ్ చేద్దాం!

భారత్ ‘విశ్వగురువు’ ఎలా అయిందంటే – కొన్ని ఉదాహరణలు చూద్దాం! పేదరికంటే భారత్ నైజీరియాను అధిగమించింది. 2018లో నైజీరియాలో 8.7 కోట్ల కటిక పేదలుంటే భారత్ లో 7.3 కోట్ల కటిక పేదలు మాత్రమే ఉన్నారు. అలాగే, 2022లో నైజీరియా పేదలు ఏడు కోట్లకు తగ్గిపోతే, భారత్ లో కటిక పేదల సంఖ్య విపరీతంగా పెరిగి  8.3 కోట్లకు చేరుకుంది. ఈ దేశ ప్రధాని 18 గంటలు అవిశ్రాతంగా పని చేసి, దేశంలోని దారిద్ర్యాన్ని ఘనంగా పెంచుతున్నారు. తమ హిందుత్వ భావజాలంతో దేశాన్ని విశ్వగురువు చేయాలని తాపత్రయ పడుతున్నారు. డాలర్ లో మన రూపాయి మారకం 2014లో 59గా ఉంటే, 2022లో 80కి చేరింది. రూపాయి విలువ ఎంత పడిపోయిందో, దేశం అంత విశ్వగురువు అవుతుందన్న మాట! వంటగ్యాస్ 2014లో రూ. 410/- ఉంటే  2022 నాటికి అది రూ. 1053/- కు పెరిగింది. సామాన్యుడి జీవితం ఎంత భద్రంగా ఉందో అంచనా వేసుకోవచ్చు.  2014లో ఈ దేశానికి అప్పు 58 లక్షల కోట్లు ఉంటే, 2022లో దాన్ని గణనీయంగా 139 లక్షల కోట్లకు పెంచిన ఘనత బేజేపీ సూపర్ మ్యాన్, కాపలాదారు, చాయ్ వాలా అయిన మోదీదే! ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్ లో జులై 2022 నాటికి ఇంకా కొనసాగుతున్న విషయం ఇది. ఆ రాష్ట్రంలో  పాఠశాలల్లో కులం పేరుతో వివక్ష ఇంకా కొనసాగుతూ ఉంది. అక్కడ నిన్ను జాతుల పిల్లల్ని విడిగా దూరంగా కూర్చోబెడుతున్నారు. హీనంగా చూస్తున్నారు. ‘మేం జంతువులం కాదు గదా. మనుషులమే కదా?’- అని ఆ జాతుల ప్రజలు ఆక్రోశిస్తున్నారు. అయితే, వినేవారే లేరు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పెద్దలు దేశాన్ని విశ్వగురువు చేసే పనిల  తలమునకలై ఉన్నారు.

Also read: చదవడం కాదు, సి.వి. రచనలు జీర్ణించుకోవాలి!

సాధారణ శకం 600 నాడు ధర్మకీర్తి అనే ఒక బౌద్ధదార్శనికుడు ఇలా అన్నాడు – ‘‘కులాన్ని చూసుకుని గర్వపడడం – వేదాలను ప్రమాణంగా భావించడం – స్నానం ద్వారా పుణ్యం సంపాదించడం – ఉపవాసాల ద్వారా శరీరాన్ని బాధించడం.. ఇలాంటివన్నీ బుద్ధిహీనులు చేసే పనులు-’’ దీనికి అనుగుణంగా చార్వాకులు చెప్పిన అంశం గూర్చి కూడా ఆలోచించాలి! ‘‘ప్రతిమా అల్ప బుద్ధీనాం’’- అని అన్నారు వాళ్ళు. అంటే – విగ్రహాలు చేసింది అల్పబుద్ధి గలవారి కోసమే! అని అర్థం! ఈ సారి వర్షాకాలంలో వర్షాలు విపరీతంగా పడ్డాయి. ఫలితంగా భద్రాచలంలో రాముడు మునిగిపోయాడు. పట్టిసీమలో శివుడు కొట్టుకుపోయినంత పనైంది. కానీ, పొంగే గోదాట్లో పడి చిన్న కుక్క పిల్ల ఒకటి ఈదుకుంటూ ఈదుకుంటూ వచ్చి గట్టెక్కింది. బతికి బయటపడ్డానన్న సంతోషంతో నదివైపు గర్వంగా చూసింది. ఆ దేవుళ్ళకు రాని ఈత వచ్చిన ప్రాణి గొప్పదా? కాదా? ఆలోచించాలి కదా? ఏమైనా, జీవుల విలువ, మనుషుల విలువ తెలుసుకుని మసలుకోవడం మంచిది – అని మనం అంటున్నాం! అంతే!!దేశం ప్రపంచ దేశాలలో మానవత్వంతో తలెత్తుకు నిలబడితే చాలు- ‘విశ్వగురువు’ కాలాల్సిన పని లేదు.

Also read: బుద్ధుడు, విష్ణుమూర్తి అవతారాలలో ఒకడు కాదు!

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ విజేత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles