Saturday, April 27, 2024

మోదీపై సై అంటున్న దీదీ

దీదీ వెర్సెస్ మోదీగా సాగిన నిన్నటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరకు గెలుపు మమతా బెనర్జీనే వరించింది. దీనితో విపక్ష నాయకులందరికీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయనే విశ్వాసం పెరిగింది. మోదీని గద్దె దించడం పెద్ద కష్టమేమీ కాదనే నమ్మకం పెరిగింది. దీనికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఊతం  ఇస్తున్నారు. రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్, పీకే ఇప్పటికే పలుమార్లు బేటీ కూడా అయ్యారు. తాజాగా చెలరేగిన పెగాసస్ హ్యాకింగ్ అంశం ప్రతిపక్షాలకు కొత్త ఆయుధాన్ని ఇచ్చింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పార్లమెంటరీ సమావేశాల్లో ఇదే ప్రధాన రచ్చనీయాంశం అయ్యింది. ప్రతిపక్ష నేతలతో పాటు అధికారులు, వ్యాపార దిగ్గజాలు, హక్కుల ఉద్యమనేతలు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు అందరూ హ్యాకింగ్ బారిన పడ్డారనే దుమారం రేగింది.

Also read: కర్ణాటక తెరపై కొత్త ముఖం

విపక్షాల చేతికి ఆయుధం పెగాసస్

దీనితో,విపక్షాల వాదానికి బలం పెరిగింది. ఇదే అదనుగా చూసుకొని పశ్చిమ బెంగాల్ అధినేత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. బిజెపి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో దూకుడు పెంచారు. పెగాసస్ వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకు తమ రాష్ట్ర ప్రభుత్వం నుంచే విచారణ దిశగా అడుగు మొదలుపెట్టి సంచలనం రేపుతున్నారు. వరుసగా ఒక్కొక్కరిని కలుస్తూ విపక్ష నేతలందరినీ ఒకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా  తాజాగా సోనియాగాంధీ, రాహుల్ ను కూడా కలిశారు. వచ్చే ఎన్నికల్లో విపక్షాలన్నీ ఏకమవ్వాలని, దానికి ఎవరు నాయకత్వం వహించినా వారితో నడవడానికి తాను తయ్యారు అంటూ ప్రకటించారు. ఈ  ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యమంటూ శపథాలు చేస్తున్నారు. శాపనార్ధాలు పెడుతున్నారు. కరోనా కష్టాలు, అధిక ధరలు మధ్య విలవిలలాడుతున్న ప్రజలు బిజెపి ప్రభుత్వంపై  వ్యతిరేకంగా ఉన్నారనే భావనలో ప్రతిపక్షాలు ఉన్నాయి. దేశ రాజధాని చెంత  రైతుల ఉద్యమం నిరాఘాటంగా సాగుతూనే ఉంది. బిజెపి అధికారంలో లేని రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు ఎక్కువమంది కేంద్ర ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా ఉన్నారనే అభిప్రాయం మమతా బెనర్జీకి బలంగా ఉంది. కేజ్రీవాల్, స్టాలిన్, ఉద్ధవ్ థాకరే, కెసిఆర్ మొదలైనవారు ఆ జాబితాలో ఉన్నారు.

సోనియాతో మమత భేటీ

జగన్, నవీన్ తటస్థం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఒరిస్సా అధిపతి నవీన్ పట్నాయక్ మాత్రం తటస్థంగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఎలాగూ మమత వెంటే నడుస్తున్నారు. మరి కొన్ని నెలల్లో పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వాటిల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్, గుజరాత్ కూడా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ తరహాలో ఉత్తరప్రదేశ్ లో బిజెపి ఓటమి పాలైతే  తమకు తిరుగే ఉండదనే ఆలోచనలో మమత, అఖిలేష్ ఉన్నారు. ప్రస్తుతం  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యవహారశైలి, విధానాల వల్ల అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీలోనూ వ్యతిరేకత పెరిగిపోయింది. రేపటి ఎన్నికల్లో బిజెపికి నష్టం వాటిల్లే అవకాశం ఉందనే మాటలు వినపడుతున్నాయి. ఈ వ్యతిరేకత క్షేత్రస్థాయిలో వేళ్లూనుకుంటే  సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి పెద్ద నష్టమే జరుగుతుంది. రాహుల్ గాంధీ తరపున పనిచేయడానికి తాను సిద్ధమంటూ పీకే ఇప్పటికే ప్రకటించారు. ప్రధానమంత్రిగా రాహుల్ అభ్యర్థిత్వానికి ఆయన మద్దతు పలుకుతున్నారని అర్ధమవుతోంది. శరద్ పవార్ వృద్ధుడు. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల పైన సమయం ఉంది. మమతా బెనర్జీ కూడా ప్రధానమంత్రి రేసులో ఉన్నారని భావించవచ్చు. రాష్ట్రాన్ని అల్లుడు అభిషేక్ బెనర్జీకి అప్పచెప్పి,తాను జాతీయ రాజకీయాల్లో కాలుమోపాలనే ఆలోచనలో ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. తను ప్రధానమంత్రి కాకపోయినా పర్వాలేదు కానీ నరేంద్రమోదీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని ఆమె బలమైన సంకల్పం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆమె ఆగ్రహం శాంతించడం లేదు. దెబ్బతిన్న పులిలా  వేటకు నడుంకడుతున్నారు. విపక్షాల బలాన్ని కూడాగట్టేందుకు, ప్రజల్లో మోదీ పాలనపై వ్యతిరేకత పెంచేందుకు శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు. మమతా బెనర్జీ శపథం నెగ్గేనా? ఎన్నికల తెరపై చూద్దాం.

Also read: మనిషి ఆయుర్దాయం 150 ఏళ్ళు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles