Friday, April 19, 2024

కర్ణాటక తెరపై కొత్త ముఖం

గత కొన్నాళ్ళుగా అనుకుంటున్నట్లుగానే  కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం మారింది. యడియూరప్పకు కావలసినవాడు,  మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఆర్ బొమ్మై వారసుడు 61ఏళ్ళ బసవరాజు బొమ్మైని కొత్త ముఖ్యమంత్రిగా బిజెపి అధిష్టానం కుర్చీలో కూర్చోపెట్టింది. దీనితో 80ఏళ్లకు దగ్గరబడుతున్న యడియూరప్ప శకం ముగిసిందనే చెప్పాలి. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిరోహించి, జనసంఘ్ కాలం నుంచి వివిధ హోదాల్లో సేవలందించి, బిజెపితో దశాబ్దాల అనుబంధాన్ని పెనవేసుకున్న కాకలుతీరిన నాయకుడు యడియూరప్ప. దక్షిణాదిలో మొట్టమొదటిగా బిజెపిని అధికారంలో కూర్చోపెట్టిన ఘనత కూడా ఆయనదే. పార్టీలో అసమ్మతులు,పాలనా వైఫల్యాలు, వివిధ ఆరోపణలు, పలు విమర్శలు మొదలైన ప్రతికూల అంశాల ప్రభావంతో ముఖ్యమంత్రి పీఠాన్ని యడియూరప్ప వీడక తప్పలేదు.

Also read: మనిషి ఆయుర్దాయం 150 ఏళ్ళు

వాజపేయి, అడ్వానీ తరం నాయకుడు

వాజ్ పెయి, అడ్వానీ తరం అగ్రనాయకుల్లో ఒక్కొక్కరికీ ఉద్వాసనల పర్వం ప్రారంభమైందనే క్రమంలో,  యడియూరప్పకు వీడ్కోలు పలికారనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి.

మరికొన్ని నెలల్లో అసెంబ్లీ, ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొన్న అధిష్టానం పార్టీని బలోపేతం చేసే పనిలో పడింది. అందులో భాగంగా కొత్త తరం నాయకులకు స్వాగతం పలుకుతోంది. వారిలో కొందరికి పెద్దపీట వేస్తోంది. పాతనాయకుల పీటలు లాగేస్తోంది. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణ దానికి బలమైన ఉదాహరణ. ముఖ్యమంత్రుల మార్పు కూడా అందులోనిదేనని చెప్పాలి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఎంతవరకు పూర్తికాలం పదవిలో ఉంటారో చెప్పలేం. ఈ పరిణామాలన్నింటినీ చూస్తూ వుంటే  ఒకప్పటి కాంగ్రెస్ మార్క్ సంస్కృతిని నేటి బిజెపి  అవలంబిస్తోందని అర్ధమవుతోంది. కర్ణాటక అసెంబ్లీకి 2023 మే లో ఎన్నికలు జరుగనున్నాయి. కర్ణాటకలో పార్టీ పట్టును నిలబెట్టుకోవడం అత్యంత కీలకం. మొదటి నుంచి పార్టీకి దన్నుగా ఉన్న బలమైన లింగాయుత్ సామాజిక వర్గానికి చెందిన బసవరాజును ఎంపిక చేయడంలో రహస్యం కూడా అదే. ఆ సామాజిక వర్గంలో యడియూరప్పకు  వీరాభిమానులు ఎక్కువే. తమ ఆరాధ్యనాయకుడిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారనే కోపం శ్రేణుల్లో రాకుండా ఉండడం కోసం  యడియూరప్పకు దగ్గరవాడిగా పిలుచుకొనే బసవరాజును  ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారు. అది కూడా వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. ఆ విధంగా, యడియూరప్పను  శాంతపరచి, పార్టీకి నష్టం జరగకుండా చూసుకోవాలని దిల్లీ పెద్దల ఆలోచనగా భావించాలి. యడియూరప్ప కుమారుడు 45ఏళ్ళ విజయేంద్ర ప్రస్తుతం బిజెపిలో రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. కొడుకును తన వారసుడుగా నిలబెట్టాలనే కోరిక ఆయనకు బలంగా ఉంది. తండ్రి వలె విజయేంద్ర కూడా చాలా చురుకైనవాడు, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనలు బలంగా ఉన్నవాడు. ఈ అంశంలో  పార్టీ అధిష్టానం కొత్త ముఖ్యమంత్రి సహాయసహకారాలు ఎలా ఉండబోతాయో చూడాలి.

Also read: రామప్ప ఆలయానికి విశ్వవిఖ్యాతి

విజయేంద్ర కీలక భూమిక

గతంలో తండ్రిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోపెట్టడంలో విజయేంద్ర కీలక భూమిక పోషించారనే కథనాలు వెల్లువెత్తాయి. యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యాక,తనయుడు సూపర్ సీఎంగా వ్యవహరించాడనే విమర్శలు పెద్దఎత్తున వచ్చాయన్నది తెలిసిందే. అసమ్మతి పెరగడానికి ఇదొక ప్రధాన కారణమని కర్ణాటకలో చెప్పుకుంటున్నారు. వీటన్నింటి మధ్య బసవరాజు బొమ్మై కొత్త ముఖ్యమంత్రిగా తెరపైకి వచ్చారు. యడియూరప్ప బృందంలో ఆయన కీలకమైన హోమ్ శాఖకు మంత్రిగా పనిచేశారు. తండ్రి ఎస్ ఆర్ బొమ్మై నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. మరో ముఖ్యమంత్రి జె హెచ్ పఠేల్ దగ్గర కొంత కాలం ప్రధానకార్యదర్శిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా, మంత్రిగా రాష్ట్రంలో అందరికీ సుపరిచితుడే. జెడీయూ నుంచి రాజకీయ రంగప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2008లో బిజెపిలో చేరినప్పటి నుంచి ఆయన ప్రతిష్ఠ మరింత పెరిగింది. యడియూరప్పకు అత్యంత సన్నిహితుడుగానూ పేరు తెచ్చుకున్నారు. పార్టీలో చేరిన 13 సంవత్సరాల కాలంలోనే  ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. సౌమ్యుడుగానే పేరుంది. కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తొలిరోజే, రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, తనకున్న కేవలం 22నెలల  కాలవ్యవధిలో తనదైన ముద్ర వేసుకోవడం ఆషామాషీ కాదు. కర్ణాటకలో 1983లో బిజెపికి ఉన్న శాసనసభ్యుల సంఖ్య కేవలం రెండే రెండు. ఆ దశ నుంచి ఏకంగా నాలుగుసార్లు అధికార అందాలన్ని ఎక్కించిన ఘనత యడియూరప్పదే. అటువంటి జనాకర్షణ నేత పక్కకు ఒరగడం పార్టీకి పెద్ద లోటే. ఆ భర్తీని పూడించడం అంత తేలిక కాదు. కరోనా సంక్షోభంతో పాటు పాలనాపరంగా అనేక సవాళ్లు ఉన్నాయి. వచ్చే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని గెలుపుబాట పట్టించాల్సిన బాధ్యత కూడా కొత్త అధినేతకు ఉంది. జనాకర్షక నేతగా అవతరిస్తేనే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.

Also read: కవికోకిల జాషువా

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles