Monday, November 11, 2024

ఫేక్ న్యూస్ గాళ్ళు లార్డ్ మెకాలేను కూడా వదలరా?

ప్రస్తుతం మనం ఫేక్ న్యూస్ వింటూ, చూస్తూ, చదువుతూ బతకాల్సివస్తోంది. పర్యావరణ కాలుష్యం లాగా, ఆహారపు కల్తీలాగా, కల్తీ వార్తలు, కల్తీ చరిత్ర, కల్తీ సైన్సు, కల్తీ జ్ఞానం…తెలుసుకోవాల్సివస్తోంది. అది కొందరు తమ స్వార్థ ప్రయోజనాలకోసం పనిగట్టుకుని, అబద్ధపు వార్తల్ని సృష్టించి ప్రపంచంమీదికి వదులుతున్నారు. ఫేక్ న్యూస్ అంటే అమాయకంగా తప్పులు దొర్లడం కాదు, కావాలనే తప్పుగా ప్రచారం చేసే వార్తలు. అలాంటివారికి భజన చేసే పత్రికలు, టెలివిజన్ ఛానళ్ళు, సోషల్ మీడియా వేదికలు ఎక్కువగానే ఉన్నాయి.  వారి ప్రకటనలకు, కార్యకలాపాలకు ప్రాముఖ్యమిచ్చి ఊదరగొడుతున్నాయి.

Also read: మాస్ హిస్టీరియాకు గురిచేస్తున్న తెలుగు ఛానళ్ళు!

ఏదిసత్యం, ఏదసత్యం?

మన చుట్టూ ఉన్నవారిలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మగూడదో – ఏది తినాలో, ఏది తినగూడదో అని అనుమానపడుతున్నట్లే .. ఇప్పుడు ఏ వార్త నమ్మాలో, ఏది నమ్మగూడదో తెలుకోవడం చాలా కష్టమైపోయింది. సమకాలీన జీవితంలోని సంఘటనల గురించే కాదు, గతంలోని విషయాల్ని కూడా మార్చి ప్రచారం చేస్తున్నారు. అది భారత తొలి ప్రదాని పండిట్ నెహ్రూ గురించి కావచ్చు. బ్రిటిష్ కాలం గురించి కావచ్చు, మొఘల్ పాలకుల గురించి కావొచ్చు, అంతకు ముందు అశోకుడి గురించి కావొచ్చు. లేదా అంతకంటే ముందు బుద్ధుడి కాలం గురించే కావొచ్చు – చెప్పలేం. వెయ్యేళ్ళ క్రితం వెలువడ్డ రచనలు నాలుగువేల ఏళ్ళ క్రితంవి అని ప్రచారం చేయొచ్చు. రెండు వేల ఏళ్ళ క్రితం వాటిని …సృష్టి ప్రారంభ కాలం నాటివి అని కూడా చెప్పొచ్చు. ఒక నిబద్ధత లేనివారు, నైతికంగా దిగజారినవారు ఏది ఎలాగైనా చెప్పొచ్చు. అలాంటప్పుడు మరి ఎలా? అంటే సామాన్యులే అన్ని విషయాల్లో చైతన్యవంతులు కావాలి. ఆరోగ్యం కాపాడుకోవడానికి సరైన ఆహారం వండుకున్నట్లు – నీరు కాచుకుని తాగినట్లు – మనం తెలసుకుంటున్న విషయాల్ని కూడా జనం తమ వివేకం లోంచి వాటిని వడబోసుకుంటూ ఉండాలి. చెత్తా, చెదారం, మడ్డి తీసేసుకోగలగాలి. ఎవడో కల్పించి ప్రచారం చేసిన అబద్దాల్ని ఏరి పారేస్తూ ఉండాలి. అది ఎలా సాధ్యం? అంటే – విజ్ఞతతో సాధ్యం. ఇంగిత జ్ఞానంతో సాధ్యం. హేతుబద్ధంగా ఆలోచించడంతో సాధ్యం.

Also read: పరలోకంలో జిఎస్ టి అప్లయ్ అవుతుందా?

ఇటీవల చారిత్రకాంశాల మీద ఎంత రభస  జరిగిందో మనకు తెలుసు. చిత్తూరు రాణి పద్మిని గురించి, హల్దీఘాట్ యుద్ధం గురించీ, భగత్ సింగ్ ఫిబ్రవరి 14న ఉరితీయబడడం గురించి ఎన్ని అబద్ధాలు మనం వినలేదూ? వీటిని మనం ‘ప్రత్యామ్నాయ సత్యాలు’ అని అందాం. సత్యానికి ప్రత్యామ్నాయాలుంటా? అని ఆశ్చర్యపోవద్దు. మన దేశభక్తుల ఫ్యాక్టరీ ఉంది కదా? అది దేన్నయినా సృష్టిస్తుంది. లార్డ్ మెకాలే ఉపన్యాసం చలామణి అయిన ఒక చిన్న భాగం చూడండి. ఇవి భారత దేశాన్ని ఉద్దేశించి చెప్పిన మాటలు:

        ‘‘ఈ దేశం నలుమూలలా నేను విస్తృతంగా పర్యటించాను. ఎక్కడా నాకు ఒక్క బిచ్చగాడు కూడా కనిపించలేదు. ఒక్క దొంగ కూడా తారసపడలేదు. అంతటి మహోన్నతమైన, నైతిక విలువలు గల సమృద్ధిగల దేశం ఇది. ఇక్కడ ప్రజలు ఆ స్థాయి గలవారు. అయితే ఈ జాతి వెన్నెముక అయిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఘనవారసత్వాన్ని విరగ్గొడితే తప్ప, వీరి ప్రాచీన విద్యావిధానాన్ని మార్చితే తప్ప మనం ఇక్కడ జయించలేం. విదేశీ జ్ఞానం, ఇంగ్లీషు భాష తమ వాటికన్నా గొప్పవి అనే అభిప్రాయం వీరిలో కలిగించితే తప్ప, వీరి ఆత్మవిశ్వాసాన్ని బలంగా దెబ్బ కొడితే తప్ప, ఈ దేశం మనకు స్వాధీనం కాదు. వీరి ప్రాంతీయ సంస్కృతులను దెబ్బతీసి, మనం కోరుకున్నట్లుగా, మార్చుకుంటే గానీ – మనకు వీరిపై ఆధిపత్యం సాధించడం కుదరదు.’’

-బ్రిటిష్ పార్లమెంటులో లార్ఢ్ మెకాలే ఉపన్యాసం, 2 ఫిబ్రవరి 1935.

Also read: విద్యావంతులు సరే, వివేకవంతులు ఎక్కడా?

ఆ తేదీన మెకాలే కలకత్తాలో ఉన్నాడు, బ్రిటిష్ పార్లమెంటులో కాదు

థామస్ బేబింగ్టన్ మెకాలే (26 అక్టోబర్ 1800 – 28 డిసెంబర్ 1859) ఉపన్యాసంగా ప్రచారమైన ఇంగ్లీషు ప్రసంగానికి నేను చేసిన సరళమైన అనువాదం ఇది. ఈ మెకాలే మాటల్ని ఎల్.కె. అడ్వానీ, ఎపిజె అబ్దుల్ కలాం వారి వారి ఉపన్యాసాల్లో ఉటంకించారు. టెలివిజన్ ఛానళ్ళలో చాలామంది ప్రముఖులు దీన్ని ‘కోట్’ చేస్తుంటారు. ఇది మెకాలే వ్యక్తిగతంగా ఎవరితోనో మాట్లాడింది కాదు. కాబట్టి, బ్రిటన్ పార్లమెంటు రికార్డుల్లో తప్పకుండా ఉండాలి. దీన్ని చరిత్రకారులు, భాషాపండితులు లోతుగా అధ్యయనం చేశారు. పూర్వాపరాలు చర్చించారు. చివరకు తేల్చిన విషయేమేమంటే అది కల్పించిన ఉపన్యాసం మాత్రమే అని! అందులో యాదార్థం ఎంతమాత్రమూ లేదని! అందుకు కారణాలు ఇవి – 1. బ్రిటన్ పార్లమెంట్ లో మాట్లాడేవాడు ఇండియా గురించి మాట్లాడితే ఆ దేశం, ఆ ప్రజలు అని అంటాడు. అందుకు భిన్నంగా అందులో ఈ దేశం, ఈ ప్రజలు అని ఉంది. అంటే ఇక్కడివాడే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కల్పించిరాసినట్టు ఉంది. 2. థామస్ పిన్నే సంపాదకత్వంలో మెకాలే ఉత్తరాలు, ఉపన్యాసాలు కొన్ని సంపుటాలుగా వెలువడ్డాయి. వాటిని కేంబ్రిడ్జి యూనివర్శిటీ ప్రెస్ ప్రచురించింది. అయితే ఆ సంపుటాల్లో ఎందులోనూ ఈ ఉపన్యాసం లేదు. 3. ఈ ఉపన్యాసంలో ఉన్న భాష ఆధునికంగా ఉంది. మెకాలే కాలం నాటిది కాదు. 4. అందులో కొన్ని పదాలు చౌకబారుగా ఉన్నాయి (తెలుగు అనువాదంలో అవి కనబడవు). తప్పకుండా వాటిని ఆయన ఉపయోగించి ఉండడు. ఎందుకంటే టి.బి. మెకాలే ఒక సాహితీ దిగ్గజం. 5. మరొక ముఖ్యమైన విషయమేమంటే 2 ఫిబ్రవరి 1835న లార్డ్ మెకాలే భారత దేశంలోని కలకత్తాలో ఉన్నాడు. ఆ రోజుల్లో బ్రిటిష్ ఇండియాకు కలకత్తా రాజధానిగా ఉండేది. అందువల్ల ఆ కాలంలో ఆయన కలకత్తాలోఉన్నాడు. బ్రిటిష్ పార్లమెంటులో ప్రసంగించే అవకాశం లేదు. 6. ఆయన పేరుతో ఎవరో ఈ కాలం వారు కల్పించి రాశారని తేలింది. 7. అది కూడా 1835 నాటి భారత దేశపు స్థితిగతులను గూర్చి అవగాహన చేసుకోకుండా ఆ ఉపన్యాసం అల్లారు. అలా ఎందుకు అనాల్సి వస్తోందంటే – దేశం నలువైపులా విస్తృతంగా పర్యటించానని చెప్పుకునేవాడికి – దేశం నిండా ఉన్న పేద సాధువులు, సన్యాసులు. ఫకీర్లు కనబడకుండా ఎలా ఉన్నారూ? బిచ్చగాళ్ళు కనబడలేదనడం అబద్ధం. 8. ఆ కాలానికి అటుఇటుగా థగ్గులు దేశాన్ని దోచుకుపోవడం ఆయన దృష్టికి ఎందుకు రాలేదూ? దొంగలు లేరనడం అబద్ధమే కదా? ఉత్తర – మధ్య భారత దేశపు ప్రాంతాలన్నీ థగ్గులతో బాగా దెబ్బతిన్నాయి. పైగా  ఈ దేశ  సంపదని బ్రిటీష్ వారు కూడా తరలించడం అప్పుడే ప్రారంభించారు. మరి దోపిళ్ళు, దొంగతనాలు లేవనడం సరైనది కాదు. 9. ఆ ఉపన్యాసం కల్పించి రాసినవాడికి మెకాలే గురించి ఏమీ తెలియదు అని అనుకోవాలి. ఎందుకంటే, ‘‘సంస్కృతి-నాగరితక అనేవి యూరోప్ లో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేవు’’- అనే గట్టి అభిప్రాయంతో ఉన్నవాడు మెకాలే! అలాంటివాడు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రశంసిస్తూ మాట్లాడతాడా? విషయం హాస్యాస్పదంగా లేదూ?

Also read చారిత్రాత్మక అవార్డు వాపసీకి అయిదేళ్ళు!

మెకాలే యూరోపియన్ సాహిత్యాన్ని ప్రశంసించినవాడు

‘‘యూరప్ దేశాల మహోన్నత సాహిత్య స్థాయిని ఇక్కడి సంస్కృతం, అరబ్బీ కవిత్వాలతో పోల్చి గుణగణాలను ఎత్తి చూపిన భాషాపండితుల్నినేనెవరినీ కలవలేదు. కానీ, నాకు తెలిసినంతవరకు ఉచ్ఛస్థితికి చేరిన యూరోప్ దేశాల కవిత్వం, అందులోని ఊహాశక్తి, శైలి ముమ్మాటికీ ఎంతో ఉన్నతంగా ఉంటుంది. సందేహం లేదు. అందువల్ల నేను సేకరించిన భారత చరిత్ర ఆధారాలను బట్టి, ఇక్కడి సంస్కృత గ్రంథాల అనవాదాలను బట్టి చూస్తే – ఇవి ఇంగ్లాండ్ లోని ప్రాథమిక పాఠశాలల స్థాయిని మించవు. ఇందులో  అతిశయోక్తి లేదు’’- అని ఘంటాపథంగా చెప్పిన మెకాలేనే, తన స్వంత అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతాడు? భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ఎందుకు పొగుడుతాడు? ఎవరికి భయపడి, ఎవరిని మెప్పించడానికి మాట్లాడుతాడూ? అది అయ్యేపని కాదు. ఆయన ఉపన్యసించినట్టు ఓ కట్టు ఉపన్యాసం అల్లుకొని, ఆత్మద్రోహం చేసుకుంటూ, తమ తెలివితక్కువ తనాన్ని జనానికి కూడా అంటగట్టాలని చేసిన వ్యర్థ ప్రయత్నం అది! పైగా ఆయన తన కింది అధికారులకు ఇలా ఆదేశాలిచ్చాడు – ‘‘మనం భారతీయులకు వారివారి మాతృభాషల్లో పూర్తిగా విద్యనందించలేం. వారికి తప్పకుండా ఒక విదేశీ భాష నేర్పించాలి. ముఖ్యంగా ఇంగ్లీషు నేర్పించాలి. ఇంగ్లీషు నేర్చిన భారతీయులుంటేనే మనమిక్కడ వ్యవహారాలు చక్కదిద్దగలం. భాష ఒక అడ్డుగోడ కాగూడద. అందుకే, సత్వరం మనం ఇంగ్లీషు ప్రవేశపెట్టాలి’’- అని! లార్డ్ బెంటింగ్, డేవిడ్ హారెల వలె కాకుండా మెకాలే ఆలోచనలు భిన్నంగా ఉండేవి. ఇతను కూడా బ్రిటిష్ వాడినన్న పొగరు ఉన్నవాడే కానీ యూరప్ పరిజ్ఞానం భారతీయులకు అందాలని తహతహలాడినవాడు. ఇంగ్లీషు, సైన్సు, లెక్కలు, సాంఘిక, సామాన్య శాస్త్రాలు, మాతృభాష వంటి విషయాలు మొదటిసారి భారతీయ విద్యావిధానంలో చేర్చినవాడు .. అందుకే చూడండి భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న మహానుభావులంతా ఇంగ్లీషు విద్యను అభ్యసించినవారే. ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ లయ్యి వచ్చినవారే. దేశంలోఇంగ్లీషు బోధన ఉండడం వల్లే, స్వాతంత్ర్యం రాకపూర్వమే ఒకరు సాహిత్యంలో, మరొకరు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతులు సాధించారు.

Also read: ఆలోచనా విధానం మారితే మనోభావాలు దెబ్బతినవు

సెక్యులర్ విద్యావిధానం

మెకాలే సెక్యులర్ విద్యాబోధన ప్రవేశపెట్టడంతోపాటు – హిందువుల మనుస్మృతిని,  ముస్లింల షరియా చట్టాన్ని పక్కకు పెట్టి – భారత శిక్షాస్మృతి (ఐపిసి)ని అమలు చేసింది కూడా ఆయనే! ఈ రోజు ప్రపంచ పౌరులతో సమానంగా ప్రతి భారతీయుడు స్వతంత్రంగా తలెత్తుకుని ఆత్మగౌరవంతో నిలబడగలుగుతున్నాడంటే అందుకు మెకాలే కారణం. లేకపోతే ఈ దేశంలో హిందువుల వేదపాఠశాలలు, మిషనరీ కాన్వెంట్లు, ముస్లిం మదరసాలు మాత్రమే ఉండేవి. అవి ఆయా మతాల సారాంశాం బోధిస్తూ ఉండేవి. విద్యకు, చట్టానికి సంబంధించిన మార్పులు ఆనాడు మెకాలే చేసి ఉండకపోతే, ఇప్పటికీ భారతీయులు ఎంతటి దుర్భరమైన స్థితిలో ఉండేవారో ఊహించుకోవడానికే భయంగా ఉంటుంది. భారతీయ విద్యావిధానాన్ని ధ్వంసం చేసినవాడనీ, తెల్లవారి కింద క్లర్కులుగా పని చేయడానికి మాత్రమే భారతీయుల్ని తయారు చేశాడనీ విమర్శించారు. నిజమే! అతణ్ణి ఒక దుర్మార్గుడిగా చిత్రించి తర్వాత తరాలకు పరిచయం చేశారు. నిజమే! కానీ, కాస్త వివేకంతో ఆలోచిస్తే నిజానిజాలు అవగతమౌతాయి. ఆ ఇంగ్లీషూ, ఆ ఐపీసీ లేకపోతే మనకు ఒక అంబేడ్కర్ ఎలా ఉద్భవించేవాడూ? బహుజనులు, స్త్రీలూ ఎలా చైతన్యవంతులయ్యేవారూ? భారతీయులు ప్రపంచంలో అత్యున్నత స్థానాలకు ఎలా చేరుకునేవారూ? విజ్ఞతతో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది! మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ – అని బీజగణితంలో ఒక సూత్రం ఉంది. తప్పుడు కథనాలు ప్రచారం చేసి, మనువాదాన్ని మళ్ళీ వెలుగులోకి తేవాలని ప్రయత్నం చేసేవారి ఆగడాలు అడ్డుకోక తప్పదు!

Also read: ఆలోచనా విధానం మారితే మనోభావాలు దెబ్బతినవు

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles