Tuesday, April 23, 2024

మాస్ హిస్టీరియాకు గురిచేస్తున్న తెలుగు ఛానళ్ళు!

 ‘‘ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులు – అన్నట్టుగా కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసే ఈ టెలివిజన్ సీరియళ్ళ వల్ల లాభమేమిటీ? వీటివల్ల సమాజంలో నైతిక విలువలు పతనమౌతున్నాయి. నిత్యం టి.వి.లకు అతుక్కుపోవడం వల్ల శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. విలువైన సమయం వృథా అవుతోంది. చెడు ఆలోచనలతో మెదడు పాడవుతూ ఉంది. సీరియళ్ళు చూడడం ఒక వ్యసనంగా మార్చుకున్నవారు బయట పడటానికి వేరే ఇతర వ్యాపకాల్లో  తీరిక లేకుండా ఉండడం మేలు!’’

Also read: పరలోకంలో జిఎస్ టి అప్లయ్ అవుతుందా?

-కె. శాంతిలక్ష్మి, ఎల్.ఐ.సి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్.

జీవిత బీమాకు సంబంధించిన అధికారి ఆలోచనల్లో నిజాయితీ ఉంది. తెలుగు సీరియళ్ళు తీరుతెన్నులు క్షుణ్ణంగా గమనించిన తర్వాతే, ఆవిడ అలా వ్యాఖ్యానించి ఉంటారు. ఉదాహరణకు కన్న కూతుర్ని ఎలా నాశనం చేయాలో ఒక పువ్వు సీరియల్ చూపింది. భర్త నుండి భార్యను ఎలా విడదీయవచ్చో ఒక దీపం సీరియల్ చూపింది.  పనిమనిషి కోడలయితే ఎలా ఏడిపించాలో ఒక రాజకుమారి సీరియల్ చూపింది. తండ్రి నుంచి కూతురును ఎలా విడదీయవచ్చునో ఒక లమ్మ సీరియల్ చూపింది. అత్తగారు కోడల్ని ఎలా చంపుతుందీ అంటే ఓ కళ్యాణం సీరియల్ చూపింది. ఇంటి ఆడబడుచుని ఎలా కష్టపెట్టొచ్చో మరో సీరియల్ చూపింది. అన్నకోసం భర్తని ఎలా జైలుకు పంపాలో ఓ సాక్షి సీరియల్ చూపింది. సరే, ఇవికాక సీరియళ్ళ ద్వారా కూడా మతప్రచారం జరుగుతోంది. అవసరమున్నా లేకున్నా విగ్రహాల ముందు పటాల ముందు పెద్ద ఎత్తున పూజలు, నేపథ్యంలో సినిమా పాటలు. అయితే, దాదాపు అన్ని సీరియళ్ళు అక్రమ సంబంధాల చుట్టు రంజుగా నడిపించే తెలుగు టివిలు ఉండగా ఇంకా వేరే మత్తుమందలెందుకూ? రోజురోజుకూ మానసిక రోగులుగా మారి…ఇంత బిర్యానీ తిని, కోక్ తాగి, ముడుచుకు పడుకోక ఇంకా వేరే వేరే ఆలోచనలెందుకూ? ‘మనల్ని మనమే ఉద్ధరించుకోలేని మనం ఇక దేశం గురించి, ప్రపంచం గురించి ఏమాలోచిస్తాం?’- అని పైకి చెప్పరు గానీ, కొందరలా భావిస్తూ ఉంటారు.

సుందరి సీరియల్ లో నటీమణులు

అదరగొడుతున్న ఆడవిలన్లు

ఒకప్పటి మగ విలన్లను తలదన్నే విధంగా కుట్రలు, కుతంత్రాలతో ఆడవిలన్లు కథలో చక్రం తిప్పుతుంటారు. పెద్ద బంగళా ముందు లాన్లో కూర్చుని ఇంట్లో వాళ్ళని, బయటివాళ్ళని గడగడలాడించడం, రోల్డుగోల్డు నగలు దిగేసుకుని ఆర్డర్లు వేస్తూ ఉడడం జరుగుతుంటుంది. ‘అంతేగ, అంతేగ’ అంటూ భర్తలు ఆ ఆడ విలన్లయిన భార్యల వెనక పిల్లులవుతుంటారు. మంచీ, మన్ననా లేక, ఒక మంచి సందేశమూ లేక ద్వేషాల చుట్టూ, పగల చుట్టూ తిరిగే తెలుగు సీరియళ్ళు – ‘ఎంత బాగుంటాయీ?’’ ఎంత రక్తికట్టిస్తాయీ? ఒక కొడుకు తల్లిని ద్వేషిస్తాడు. మరోచోట ఒక కూతురు తల్లిపై పగతీర్చుకోవాలనుకుంటుంది.  అక్రమ సంబంధాలూ-వాటి పర్యవసానాలు అన్ని సీరియళ్ళలో ప్రత్యేక ఆకర్షణ! ‘‘మనిషి ఆకారంలో తిరిగే క్రూర జంతువులతో కాకుండా కాస్త, సీరియళ్ళు మనుషులతో తీయండిరా బాబూ!’ – అని కొందరు పిచ్చివాళ్ళు గగ్గోలు పెడుతుంటారు – అది మళ్ళీ వేరే విషయం!

Also read: విద్యావంతులు సరే, వివేకవంతులు ఎక్కడా?

ఇక రియాల్టీ షోల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఆడామగా తేడా ఉండదు. ఆపకుండా తెగవాగేవాళ్ళే గొప్ప యాంకర్లవుతారట – మెదడ్లు ఎంత ఖాళీగా ఉంటేనో కదా – అంతగా వాగుతుంటారు? పిచ్చి వాగుడుకు, పచ్చి జోకులకు వాళ్ళే పగలబడి నవ్వుతుంటారు. పైగా వాళ్ళకు వాళ్ళే సెలబ్రిటీలమని ప్రకటించుకోవడం తెలుగుప్రేక్షకుల దౌర్భాగ్యమా? అదృష్టమా? తెలుగు టెలివిజన్ యాంకర్ల వాగుడు భరించలేక వినికిడి శక్తి కోల్పోతున్నవారు ఏటా ఎంతమంది ఉంటున్నారో ఎవరైనా పరిశోధన చెయ్యొచ్చు. ఇలా రీసర్చ్ చేయగల అంశాల్ని తెలుగు ఛానళ్ళు ప్రసాదిస్తున్నట్టే కదా?

Also read: ఆలోచనా విధానం మారితే మనోభావాలు దెబ్బతినవు

ఈ కార్యక్రమాల వల్ల ఎవరికి ప్రయోజనం?

ఇక వేర్వేరు రంగాలకు చెందిన ఓ పదిహేను మందిని ఓ వంద రోజులు ఓ ఇంట్లో బంధించి, వారి సొల్లు కబుర్లు, గిల్లికజ్జాలు, కొట్లాటలు, నిద్రమొహాలు, పాచిపళ్ళు, అర్ధనగ్న శరీరాలు టివిలో ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల ఎవరికి ఉపయోగం కలుగుతుందీ? ఆరోగ్యవంతుల మెదళ్ళను మొద్దుబారించడం తప్ప – బద్ధకస్తుల సంఖ్య గణనీయంగా పెంచడం తప్ప – ఏమిటి? ఏమిటి లాభం? విశ్రాంతి ఎక్కువగా దొరికేవారికి ఏదో … కాలక్షేపం తప్ప – ఎవరికి లాభం? విజ్ఞత లేని వాళ్ళ జాతర లైవ్ లో చూపించడమే బిగ్ షోనా? ఎయిత్ సెన్స్, మొగుడు పెళ్ళాలు వంటి కార్యక్రమాలన్నీ హడావుడికి తప్ప, దేనికి పనికొచ్చేవి? దేశవ్యాప్తంగా ఉన్న తెలివైన విద్యార్థులను ఒక చోట చేర్చి వారి సృజనాత్మకతను ప్రోత్సహించి చూడండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లేదా వందమంది యువ ఇంజనీర్లను ఒక చోట చేర్చి ఒకటి రెండు నెలల్లో కొత్త ఉత్పత్తులకు రూపకల్పన చేయమనండి. అదీ కాకపోతే ఓ పదిమంది రైతులను గుర్తించి, వారికి అన్ని సౌకర్యాలు, పరికరాలూ అందించి కొత్త పద్ధతుల ద్వారా పంటలు పండించమనండి. పండించి చూపుతారు. దేశంలో దేనికీ కొదువ లేదు. అందించాల్సిన వారికి అందించగల ఆదరణే కొరవడింది. పనికిరాని వాటికి ప్రాముఖ్యమిస్తూ, పనికొచ్చేవి పక్కన పడేయడం మూలాన దేశ పరిస్థితి నానాటికీ దిగజారిపోతూ ఉంది.

ముద్ద మందారంలో మహిళా విలన్లు

అది చర్చా, రచ్చా తేల్చుకోండి

ఇక తెలుగు టెలివిజన్ వార్తా ఛానళ్ళలో ‘చర్చ’ పేరుతో వాదనలు జరగుతుంటాయి. చర్చ వేరు. వాదన వేరు. రెండూ ఒకటే అని అనుకుంటూరు చాలామంది. రెండింటికీ చాలా తేడా ఉంది. వాదనకు దిగడమంటే బురద పూసుకుని ఉన్న వ్యక్తతో కుస్తీకి దిగడం లాంటిది. వాదన లౌక్యం తెలియనివారి లేదా మొండివారి సాధనం. వాదనలో అహంకారం వ్యక్తమౌతుంది. ఆవేశాన్ని సృష్టిస్తుంది. ఒక్కోసారి వాదనలో విషయం ఉన్నా – అది వ్యక్తీకరించే పద్ధతి వల్ల ఎదుటివారికి అంగీకారం కాదు. ఎందుకంటే ఎదుటివారికి ఏమీ తెలియదన్నట్టు, అంతా తమకే తెలుసునన్నట్టు…ఒకరకమైన అజ్ఞానంతో కొనసాగేదే వాదులాట. అసహనానికి చిహ్నంగా, అసహ్యంతో విదిలించుకున్నట్టు ఉండేదే వాదన! చర్చ అనేది వేరు. అది జ్ఞానాన్ని పంచుకోవడం లాంటిది. అది మానసిక పరిణతి ఉన్నవారి మధ్య సాగేది. ఎదుటివారి భావనల్లో, ఆలోచనల్లో ఉన్న లోపాల్ని, పొరపాట్లను సున్నితంగా ఎత్తిచూపడం – ఒక సూచన చేయడం చర్చలో జరుగుతుంది. తర్కబద్ధంగా చర్చ జరిగినప్పుడు ఒకరిపట్ల ఒకరికి గౌరవం పెరుగుతుంది. అసహ్యంగా విదిలించుకోవడం కాదు. అతిథికి ఆతిథ్యం ఇవ్వడం లాంటిది చర్చ. ఇక్కడ మన తెలుగు ఛానళ్ళలో చర్చ పేరుతో వాదనకు దింపుతారు యాంకర్లు. వారిక్కూడా వాదులాటే ఇష్టం! దాన్ని చర్చ అనాలో, రచ్చ అనాలో తేల్చుకాల్సింది ప్రేక్షకులే!

Also read: ఒక అద్భుతం!

పాలసీ చెప్పమంటే చచ్చినా చెప్పరు

సమాజాన్ని బాగుపరచడం కోసమే మేమున్నామని డబ్బా కొట్టుకునే తెలుగు టివి వార్తా ఛనళ్ళు – వారి పాలసీ ఏమిటో చెప్పరు గాక, చెప్పరు. వైజ్ఞానిక విషయాల మీద ఒక శాస్త్రజ్ఞుణ్ణి పిలిచి వివరాలు చెప్పిస్తారు. మళ్ళీ ఆ పక్కనే ఓ పూజారిని , ఓ జ్యోతిష్యుణ్ణి కూర్చొబెట్టి మాట్లాడిస్తారు.  అన్ని రకాల అభిప్రాయాలకు మేం వేదిక కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. అదిసరే కానీ – మీ చానల్ పాలసీ ఏమిటీ? ‘చేటలో తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టడమేనా? క్షమించాలి! ఎవరినో తక్కువ చేయడానికి ఇక్కడ ఈ సామెత చెప్పలేదు. ఒక దృక్ఫథమంటూ లేని ఛానల్ నిర్వాహకుల ఇంగిత జ్ఞానాన్ని ప్రశ్నించడం కోసమే చెప్పాను. వాస్తవ జగత్తులో అన్ని అభిప్రాయాలూ, ధోరణులూ ఉన్నాయి. కానీ, బాధ్యత గలవాళ్ళు ఏం చేయాలి? అవసరమైంది మాత్రమే జనానికి అందించాలి. వారి విజ్ఞత కనిపిచేది అక్కడే – సమాజ ఉద్ధరణకు పని చేసే ఛానల్ ఏం చేయాలో వారికే తెలిసి ఉండాలి కదా?

Also read: చారిత్రాత్మక అవార్డు వాపసీకి అయిదేళ్ళు!

మత ప్రచారానికి టివి ఛానళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఏ మతానికి సంబంధించిన ఛానళ్ళు ఆ మతానికి ఉన్నాయి. వాటి పనే  అది.  అవి కాకుండా మామూలు ఛానళ్ళలో కూడా సుప్రభాతాలు, జ్యోతిష్యవాణులు, ఆలయదర్శనాలు వగైరా… ప్రార్థనాస్థలాల్లో జరిగే కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు…ఖాళీ బుర్రలవారికి యమగిరాకీ. ఆధ్యాత్మిక వేషాలతో కెమెరాల ముందు కూర్చుని ‘స్పిర్చువల్ ఎనర్జీ,’ ‘కాస్మిక్ ఎనర్జీ,’ ‘పాజిటీవ్ ఎనర్జీ’ లాంటి మాటలు మార్చిమార్చి చెపుతుంటారు. ఉట్టి మాటలు కాదు, ఆ ‘స్పిర్చువల్ ఎనర్జీ’ని ప్రయోగాత్మకంగా చూపించాలి. లేదా నోరు మూసుకుని  ఓ చోట కూర్చోవాలి. అయినా అనాల్సింది వాళ్ళను కాదు, సదరు సరుకును తెచ్చి జనంమీద రుద్దుతున్న ఛానల్ యాజమాన్యాలను అనాలి. గతంలో బుద్ధిలేని మగవాళ్ళు మతబోధనలు, ప్రవచనాలు చెపుతుండేవారు. ఇప్పుడు మేమేం తక్కువా?  అని ఆడ ప్రవచనకారులూ, ఆడమతబోధకులూ తయారయ్యారు. పైగా అన్ని భాషలలో విస్తరించారు.

Also read: నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి!

తెలుగు ప్రేక్షకులారా, జాగ్రత్త!

తెలుగు ప్రేక్షకులారా జాగ్రత!! మీరు ఇంగ్లీషు హిందీ వంటి ఇతర భాషలు వచ్చినా ఇర జాతీయ అంతర్జాతీయ ఛానళ్ళవైపు కన్నెత్తి కూడా చూడకండి. డిస్కవరీ సైన్స్, నేషనల్ జియోగ్రఫీ, సోని-బిబిసి ఎర్త్, ఎనిమల్ ప్లానెట్, హిస్టరీ టివి వంటి ఛానళ్ళలో మొహం పెట్టారో జాగ్రత్త! మీ మెదడు వాచిపోతుంది. అనవసరంగా ప్రకృతి రహస్యాలు, వైజ్ఞానిక విశేషాలు, ప్రపంచ జ్ఞానం అబ్బుతుంది. కనీసం ఆ ట్రావెల్ ఎక్స్ పో, గుడ్ టైం వైపు చూశారంటే వాళ్ళు మిమ్మల్ని దేశదేశాలు తప్పి చూపెడతారు. ఏ దేశం ఎలా ఉంది? అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో చెపుతారు. దాని వల్ల అనవసరంగా మీకు జనరల్ నాలెడ్జ్ పెరిగే అవకాశముంది. మరి మీ ఇష్టం! బిబిసి వరల్డ్, సిఎన్నెన్, అల్ జజీర్, ఫ్రాన్స్, రష్యా టివి లాంటివి చూస్తే – ప్రపంచ వార్తలతో మీ మొహం వాచిపోతుంది. అవన్నీ మనకు అవసరమా? తెలుగు ఛానళ్ళకే పరిమితమై పోతే మంచిది. ఎంత అజ్ఞానంలో ఉంటే, ఎంత మూఢత్వంలో ఉంటే బతుకు అంత సుఖంగా ఉంటుందని ఓ ‘టివి బాబా’నే చెప్పాడు.

Also read: శాస్త్రీయ అవగాహన పెంచిన కొడవటిగంటి వ్యాసాలు

ఈ ఛానళ్ళకు ప్రజలు పట్టరు. జీవితపు విలువలునిలబెట్టాలని ఉండదు. అన్ని రకాలుగా చచ్చిపోతున్న మనిషిని ఎలా బతికించుకుందామన్న ధ్యాస ఉండదు! తపన ఉండదు!! వ్యాపార ప్రకటనలతో డబ్బు సంపాదించుకుంటూ, రేటింగ్ పెంచుకోవాలి. అంతే! ఒక వైపురాజకీయ నాయకులు, మరోవైపు ఛానళ్ళు నరుక్కుంటూ వస్తుంటాయి. తప్పించుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోలేక బలి అయ్యేది సగటు ప్రేక్షకులు. మనిషికి మెదడు చాలా ముఖ్యమైనది. దాన్ని సరైన దారిలో పెట్టి, మానవ జీవితాన్ని వివేకవంతం చేసుకుందామన్న ఆలోచన ఎవరికీ ఉండడం లేదు. చానాళ్ల క్రితిమే వచ్చిన ‘ఈడియట్ బాక్స్’ అనే బిరుదును టెలివిజన్ వదులుకోవడానికి ఇష్టపడుతుందా?

Also read: ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా!

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles